నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈమధ్య ‘ప్రెగ్నెన్సీ గ్లో’ అనే మాట విన్నాను. దీని గురించి తెలియజేయగలరు. నాకు కవలపిల్లలు అంటే చాలా ఇష్టం. కవలపిల్లలను కనడానికి మార్గాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయగలరు. – కె.మనస్వి, నాయుడుపేట
ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగా చర్మంలోని గ్రంథులు ఎక్కువగా ఆయిల్‌ను స్రవించడం వల్ల చర్మం మెరుస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో రక్త ప్రసరణ పెరగడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, చర్మానికి రక్తనాళాలు విస్తరించడం వల్ల వ్యాకోచించి చర్మం మెరిసినట్లుగా ఉంటుంది. దీనినే ప్రెగ్నెన్సీ గ్లో అంటారు. సాధారణంగా గర్భం దాల్చాలంటే ఒక శుక్రకణం ఒక అండంతో కలవడం వల్ల ఏర్పడాలి. కవల పిల్లలు కనడానికి గర్భాశయం నుంచి రెండు అండాలు విడుదలై, అవి ఫలదీకరణ చెందాలి లేదా పిండం ఆరంభ దశలోనే రెండుగా విభజన చెంది కవలలుగా పెరగడం జరుగుతుంది. కొందరిలో పిల్లల కోసం చికిత్స తీసుకోవడం వల్ల అండాలు ఎక్కువగా తయారై కవల పిల్లలు ఏర్పడతారు. కొందరిలో వారి ఫ్యామిలీలో కవలలు ఉన్నప్పుడు జన్యుపరంగా కవలలు పుట్టవచ్చు. కొందరిలో సాధారణంగానే అవవచ్చు. కవల పిల్లలు కావాలనుకుని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమీ లేదు. అండాలు ఎక్కువగా తయారై, విడుదలవడానికి నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడవలసి ఉంటుంది. అలాగని కచ్చితంగా కవలలు పుడతారనేమీ లేదు. ఒక్కోసారి ట్రిప్లెట్స్ కూడా పుట్టవచ్చు. కవలలు ఏర్పడినా, అందులో ఉండే సమస్యలు ఒక శిశువు పుట్టేదాని కంటే ఎక్కువగా ఉంటాయి.
నాకు ఈమధ్య వైట్ డిశ్చార్జి ఎక్కువ అవుతోంది. దుర్వాసన వస్తోంది. దీనికి కారణం మరియు నివారణ గురించి వివరంగా తెలియజేయగలరు. – సీఆర్, కదిరి
మీ వయసు రాయలేదు. వివాహం అయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అనేది రాయలేదు. ఆడవారిలో వైట్ డిశ్చార్జి అంటే తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి: ఏ సమస్యా లేకుండా గర్భాశయ ముఖద్వారం, యోనిలో ఉండే గ్రంథుల నుంచి స్రవించే మ్యూకస్ ద్రవాల వల్ల వచ్చే వైట్ డిశ్చార్జిని ల్యూకేరియా అంటారు. ఇందులో వాసన, దురద ఉండవు. నీరులాగ జిగటగా వస్తుంది. ఇది పీరియడ్ వచ్చే ముందు, పీరియడ్‌లో, అండం విడుదలయ్యే సమయంలో, కలయికలో ప్రేరణకు గురైనప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండవది: బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జి. వీటిలో తెల్లబట్ట కొద్దిగా పచ్చగా, పెరుగులాగ దురద, మంట, వాసనతో కూడుకుని ఉంటుంది. కొందరిలో గర్భాశయ ముఖద్వారం వద్ద పుండ్లు, గడ్డల వల్ల కూడా తెల్లబట్ట రావచ్చు. ఇలాంటి వాటిని అశ్రద్ధ చేయకూడదు. నీకు వచ్చే తెల్లబట్టతో పాటు దురద కూడా ఉంది కాబట్టి గైనకాలజిస్టును సంప్రదించి లోకల్ ఎగ్జామినేషన్, వివాహిత అయితే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, అవసరమైతే వెజైనల్ స్వాబ్ కల్చర్ పరీక్ష, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది. యోని ఇన్‌ఫెక్షన్లు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, మలద్వారం నుంచి క్రిముల వల్ల, కలయిక వల్ల, లైంగిక సంబంధాల వల్ల, ఇంకా ఇతర కారణాల వల్ల రావచ్చు. నివారణ చర్యల్లో భాగంగా శారీరక శుభ్రతను, జననేంద్రియాల శుభ్రతను పాటించాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, రోజుకు కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు శుభ్రపరచుకోవడం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
నాకు మెనోపాజ్ గురించి అవగాహన ఉంది. ‘పెరీ మెనోపాజ్’ అంటే ఏమిటి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేగలరు. – రమ్య, వినుకొండ
పెరీ మెనోపాజ్ అంటే మెనోపాజ్ దశకు చేరే ముందు ఉండే దశ. దీనిలో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరే ముందు అండాశయాల నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మన్ మూడు నుంచి ఐదేళ్ల ముందు నుంచే కొద్ది కొద్దిగా తగ్గుతూ విడుదలవడం జరుగుతుంది. ఈ సమయంలో జరిగే శారీరక, మానసిక మార్పులకు చెందిన దశను పెరీ మెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు చేరువలో ఉండే దశ అన్నమాట. ఇది సాధారణంగా నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాతి నుంచి మొదలవుతుంది. ఇందులోని లక్షణాల్లో భాగంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల ఒంట్లో వేడి ఆవిర్లు (హాట్ ఫ్లషెస్), చెమటలు పట్టడం, పీరియడ్స్‌లో మార్పులు, మూత్ర సమస్యలు, కలయికలో ఇబ్బంది, నొప్పి, మంట, లైంగిక కోరికలు తగ్గడం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఈ లక్షణాలు మెనోపాజ్‌కు ముందు మూడు–ఐదేళ్ల నుంచి మూడు నెలల లోపల ఎప్పుడైనా ఉండవచ్చు. కొందరిలో ఏ లక్షణాలూ లేకుండా ఉన్నట్లుండి పీరియడ్స్ ఆగిపోయి (పన్నెండు నెలలు పీరియడ్స్ రాకుండా ఉండటం) మెనోపాజ్ దశకు చేరవచ్చు. పెరీ మెనోపాజ్‌లోని ఈస్ట్రోజన్ మార్పులను మనం మార్చలేం. కాకపోతే లక్షణాల తీవ్రతను తగ్గించుకోవడానికి చల్లగా ఉండే ప్రదేశాలలో ఉండటం, ఫ్యాను లేదా ఏసీ కింద ఉండటం, మెడిటేషన్, యోగా, వ్యాయామాలు చేయడం, వదులుగా పలచగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరీ అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుని, ఈస్ట్రోజన్‌లా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే సోయాబీన్స్, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఆహారంలో తీసుకుంటూ, ఐసోఫ్లావోన్ సప్లిమెంట్లు మాత్రల రూపంలో తీసుకోవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment