కిల్లర్ క్వీన్స్
గ్లామర్ పాయింట్
ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎలా ఉంటుంది? సున్నితంగా, సుకుమారంగా ఉంటుంది. మిగతా పాత్రలన్నింటినీ తన మంచితనంతో, ప్రేమాభిమానాలతో ఆకట్టుకుంటుంది. కానీ ఈ హీరోయిన్లు మాత్రం కొన్ని సినిమాల్లో అలా చేయలేదు. భయపెట్టారు. కత్తి పట్టి హడలెత్తించారు. సీరియల్ కిల్లర్‌సగా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టారు.
వెరైటీ పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రియాంక. ‘సాత్ ఖూన్ మాఫ్’ చిత్రంలో కూడా ఓ వైవిధ్యభరితమైన పాత్ర చేసిందామె. వరుసగా ఏడుగురు పురుషులను పెళ్లాడుతుంది. వారిలో ఆరుగురిని చంపేస్తుంది. ఒక రకమైన మానసిక రుగ్మతతో హత్యలకు పాల్పడే ఆ పాత్రలో ఆమె నటన అమోఘం.
ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో ప్రేమకు ప్రతిరూపంలా కనిపించే ప్రియురాలిగా నటించింది కాజోల్. కానీ ‘గుప్త్’ సినిమాలో మాత్రం ఇలాంటి ప్రేయసి ఉండకూడదురా బాబూ అనిపించే పాత్ర చేసింది. అందులో ఆమె హీరోని ప్రేమిస్తుంది. వాళ్ల పెళ్లికి ఒప్పు కోలేదని హీరో తండ్రిని చంపే స్తుంది. అక్కడ్నుంచి తనకు అడ్డొచ్చిన వాళ్లందరినీ మట్టు బెడుతూ పోతుంది. చివరికి పోలీసుల చేతిలో చనిపోతుంది. ఎప్పుడూ సెంటిమెంటుని పండించే ఆమెని సీరియల్ కిల్లర్‌గా చూసి బాగా ఎంజాయ్ చేశారు కాజోల్ ఫ్యాన్స్.
తన అందంతో బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఊర్మిళ... ‘కౌన్’ సినిమాలో కిల్లర్‌గా నటించి భయపెట్టింది. మొదట బాధితురాలిలా అనిపించినా, చివరికి హంతకి రూపంలో కనిపించి ఖంగు తినిపిస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన ఆ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఊర్మిళ పెర్‌ఫార్మెన్స్ సూపర్బ్‌గా ఉంటుంది. అందంతోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకోగలదని నిరూపించింది.
‘అతనొక్కడే’ సినిమాలో మొదట అమాయకంగా కనిపిస్తుంది సింధు తులానీ. కానీ హఠాత్తుగా ఆమెలోని మరో మనిషి బయటికొస్తుంది. తన కుటుంబాన్ని తనకు దూరం చేసినవాళ్ల మీద పగబట్టి, ప్లాన్ చేసి వాళ్లను చంపేస్తూ ఉంటుంది. కూల్‌గా కనిపిస్తూనే అప్పుడప్పుడూ క్రూరంగా మారే పాత్రలో ఆమె చక్కగా నటించింది.