కనిపిస్తే ఉన్నట్లేనా !
దెయ్యాలు లేవన్నది నిజమైతే... మనిషికి ఇంకా వాటిపట్ల భయమెందుకుంది? దెయ్యాలు ఉండేది నిజమే అయితే... వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగానే ఎందుకుంది? వీటికి కచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ... దెయ్యాలు ఉన్నాయనడానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అందుకే లలోరీ హౌస్‌లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది ఇప్పటికీ తేలలేదు. ఇంతకీ లలోరీ హౌస్ ఎక్కడుంది? దాని వెనుక ఉన్న కథేంటి?
న్యూ ఆర్లియన్స్, అమెరికా.
టెన్షన్‌గా ఉన్నాడు డేవిస్. కోపంగా కూడా ఉన్నాడు. రోజూ రాత్రి తన ఫర్నిచర్ షాపు కట్టేసి వెళ్లిపోగానే ఎవరో లోపల దూరుతున్నారు. రోజుకో వస్తువు చెల్లాచెదురు చేస్తున్నారు. మొదట ఏదో దొంగలముఠా పని అయి ఉంటుందనుకున్నాడు. కానీ ఏ వస్తువూ పోవడం లేదు. పైగా వెళ్లేటప్పుడు తాళం పెట్టి పోతున్నారు. అంటే కచ్చితంగా తన షాపులో పని చేసేవాళ్ల పనే అయి ఉంటారని అర్థమైంది.
ఎలాగైనా ఆరోజు వారి ఆట కట్టించాలని నిర్ణయించుకున్నాడు డేవిస్. రాత్రయ్యాక అందరినీ పంపించేశాడు. తర్వాత తన ఇంట్లో పనిచేసే వాళ్లను రమ్మని చెప్పి, తనని లోపలుంచి బయట తాళం పెట్టి, ఎక్కడైనా కనబడకుండా నిలబడమన్నాడు. విజిల్ ఊదుతానని, అప్పుడు వచ్చి వాళ్లని పట్టుకోవాలని చెప్పాడు. వాళ్లు సరేనని చెప్పి, తాళం పెట్టిపోయారు,లైట్లన్నీ ఆర్పేసి, తలుపు పక్కన ఉన్న చిన్న బెడ్‌లైట్ లాంటిది మాత్రం వేసి, ఓ మూలన నక్కాడు డేవిస్. క్షణాలు... నిమిషాలు... గంటలు గడిచాయి. సమయం పన్నెండు గంటలయ్యింది. తలుపు దగ్గర ఏదో చప్పుడు. వచ్చేది ఎవరా అని తలుపు వైపే చూస్తున్నాడు డేవిస్.
ఓ వ్యక్తి లోనికి ప్రవేశించాడు. అతణ్ని చూస్తూనే కెవ్వున కేక పెట్టబోయి తమాయించుకున్నాడు డేవిస్. ఎందుకంటే, అతడికి రెండు చేతులూ లేవు. అంతలోనే ఓ స్త్రీ వచ్చింది. ఆమెను చూడగానే అదిరిపడ్డాడు. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుందా స్త్రీ. ముఖం తెల్లగా పిండి పూసినట్టుగా ఉంది. కళ్లు ఎర్రగా రక్తమోడుతున్నట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. అతడికసలు తలే లేదు. మొండెమే నడచుకుంటూ వస్తోంది. వాళ్లంతా తలుపు తీసుకుని రావడం లేదు. తలుపులోంచి దూసుకొస్తున్నారు. పై ప్రాణాలు పైనే పోయాయి డేవిస్‌కి. వణుకుతున్న చేతులతో విజిల్‌ని నోటిలో పెట్టుకున్నాడు. దాన్ని ఊదుతూనే కళ్లు తిరిగి పడిపోయాడు.
మెలకువ వచ్చేసరికి తన ఇంట్లో ఉన్నాడు డేవిస్. అందరూ తనవైపే విచిత్రంగా ఉండటం చూసి ఏమైందో అర్థం కాలేదతడికి. రాత్రి విజిల్ వినిపించి తలుపు తీసుకుని లోనికి వచ్చామని, స్పృహ తప్పిన తనని ఇంటికి తీసుకొచ్చామని పనివాళ్లు చెప్పాడు. అప్పుడుగానీ రాత్రి జరిగింది గుర్తు రాలేదు. భయంతో గుండె దడదడలాడింది. అంతే... వారం తిరిగేలోపు షాపుని అమ్మేశాడు. అసలు డేవిస్ చూసింది ఎవరిని? ఆ వింత రూపాలు అక్కడికెలా వచ్చాయి? వీటికి సమాధానాలు తెలియాలంటే 1832వ సంవత్సరానికి వెళ్లాలి.
లలోరీ హౌస్... అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో ఉన్న ఈ భవనం గురించి తెలియనివాళ్లు లేరు. 1832లో ఓ రోజు... డాక్టర్ లూయిస్ లలోరీ తన భార్య డెల్ఫైన్‌ని, పిల్లల్ని తీసుకుని క్రియోల్‌లోని ఓ మ్యాన్షన్‌కి వచ్చాడు. అప్పట్నుంచీ అందరూ దాన్ని లలోరీ హౌస్ అని పిలవడం మొదలుపెట్టారు. డాక్టర్ లూయిస్ నెమ్మదస్తుడు. తన పనేంటో తాను చేసుకుపోయేవాడు. అయితే అతడి భార్య డెల్ఫైన్ అలా కాదు. ఎప్పుడూ సందడిగా ఉండేది. అందరినీ పలకరిస్తూ, సరదాగా ఉండేది. అందుకే అందరూ ఆమె పరిచయం కోసం ఉవ్విళ్లూరేవారు. అంతగా ఆమె ఫేమస్ అయిపోయింది. అయితే డెల్ఫైన్‌లో మరో మనిషి ఉందని ఎవరికీ తెలియదు. ఆ మరో మనిషి ఎలాంటిదో తెలిశాక... ప్రపంచమంతా నివ్వెరపోయింది.
ఓ రోజు లలోరీ హౌస్‌కి పక్క భవనంలో నివాసముంటోన్న ఓ మహిళ... తన ఇంటి మేడ మెట్లెక్కుతోంది. అంతలో లలోరీ హౌస్ నుంచి చిన్నపిల్ల ఆర్తనాదం వినిపించింది. కంగారు పడిన ఆ మహిళ అటు చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. డెల్ఫైన్ ఓ పిల్లని తరుముతోంది. తను ఏడుస్తూ పరిగెత్తుతోంది. పరుగెత్తి పరుగెత్తి మేడమీదికి చేరింది. ఇక ఎటు పోవాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడింది. ఆ పిల్ల దగ్గరకు వచ్చింది డెల్ఫైన్. వికృతంగా నవ్వి, పాపను మేడమీది నుంచి తోసేసింది.
తర్వాత పనివాళ్లు ఆ పిల్ల శవాన్ని ఇంటి వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లి కాల్చేయడం చూసి నిలువెల్లా వణికిపోయిందామె. తన ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. కన్ను మూసి తెరిచేలోగా విషయం అంతటా పాకిపోయింది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నారు. అంతలోనే ఓ రోజు లలోరీ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగది నుంచి మంటలు చెలరేగడంతో హాహాకారాలు మొదలయ్యాయి. ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్లంతా ఇంటిముందు గుమిగూడారు. పోలీసులు సైతం చేరుకున్నారు. మెయిన్ గేటు మూసి ఉండటంతో తీయమంటూ కేకలు వేశారు. కానీ లోపలి నుంచి ఎవరూ రాలేదు. కాసేపటి తర్వాత ఓ నల్లటి వాహనం లోపలి నుంచి దూసుకొచ్చింది. గేటు విరిగిపడేంత వాయువేగంతో వెళ్లిపోయింది. క్షణాల్లో కనుమరుగయ్యింది.
పోలీసులు లోనికెళ్లారు. ఎవరైనా ఉంటే పట్టుకోవాలని వెతికారు. లోపల చాలామంది ఉన్నారు. అయితే వాళ్లు లలోరీ కుటుంబానికి చెందినవారు కాదు. వారి చేతుల్లో చిత్రహింసలకు గురై, చావలేక బతకలేక మిగిలున్న జీవచ్ఛవాలు. కొందరికీ కాళ్లూ చేతులూ లేవు. కొందరికి కళ్లు లేవు. కొందరికి నాలుకలు, ఇంకొందరికి మర్మాంగాలు కోసేశారు. గోళ్లు పీకేశారు. ఒంటి నిండా వాతలు పెట్టారు. ఓ మహిళ పరిస్థితి చూసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. అతి చిన్న చెక్కపెట్టెలో బలవంతంగా ఆమె శరీరాన్ని కుక్కారు. దాంతో ఆమె ఎముకలు ఫెళఫెళ విరిగిపోయాయి. చాలాకాలం పాటు కదలకుండా అలానే ఉండటంటే... విరిగినవి విరిగినట్టుగానే అతక్కుపోయి ఆమె శరీరం విచిత్రంగా తయారయ్యింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారక్కడ.
కొందరు మాట్లాడలేకపోతున్నారు. కొందరు మాట్లాడటమే మర్చిపోయారు. కాస్తో కూస్తో నోరు మెదపినవారు చెప్పిన వివరాలు విని అందరికీ ఒళ్లు జలదరించింది. డెల్ఫైన్ ఒక నరరూప రాక్షసి. పనికి మనుషుల్ని రప్పించుకునేది. బానిసల్ని చేసి బంధించేది. చిన్న తప్పు చేసినా పెద్ద పెద్ద శిక్షలు వేసేది. తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే ఇంటి వెనుక పూడ్చిపెట్టేది. లేదంటే కాల్చి బూడిద చేసేది. దాంతో కడుపు మండిన ఓ పనివాడు వంటగదిలో కావాలని నిప్పుపెట్టాడు. అతడు చేసిన ఆ పని... డెల్ఫైన్ దారుణాలను బయటపెట్టింది.
పోలీసులు లలోరీ హౌస్‌కు తాళం పెట్టారు. ఆ కుటుంబం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. కొన్నాళ్ల తరువాత ఆ ఇల్లు వారి బంధువుల చేతికి వెళ్లింది. వాళ్లు దానిలో నివసించే ధైర్యం చేయకపోవడంతో చాన్నాళ్లు ఖాళీగానే ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత దాన్ని ఓ కుటుంబం కొనుక్కుంది. కానీ అక్కడ నివసించడం గగనమయ్యింది. రాత్రి అయితే చాలు... అరుపులు, కేకలు, ఏడుపులు, విచిత్ర ధ్వనులు, అడుగుల చప్పుళ్లు, ఆర్తనాదాలు... భయంతో అల్లాడిపోయారు. ఇంట్లో రకరకాల ఆకారాలు కనిపిస్తుంటే... ప్రాణాలు చిక్కబట్టుకుని గడిపారు. చివరకు ఆ ఇంటిని అమ్మేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత లలోరీ హౌస్ చాలామంది చేతికి వెళ్లింది. ఎవరూ అందులో నివసించలేకపోయారు. అందుకే డేవిస్ ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటానంటే అమ్మేశారు. కానీ జడుసుకున్న డేవిస్ కూడా దాన్ని మరొకరికి అమ్మి ఊరొదిలిపోయాడు.
ఇప్పుడు లలోరీ హౌస్‌ను అత్యాధునికమైన అపార్ట్‌మెంట్‌గా తీర్చిదిద్దారు. పలువురు నివసిస్తున్నారు. కానీ డెల్ఫైన్ చేతిలో చనిపోయినవారి ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతున్నాయనే అంటున్నారు. అదే నిజమైతే... అక్కడ ఎలా నివసించగలుగుతున్నారు? దెయ్యాలు వారినేమీ చేయవని ధైర్యమా? లేక అసలు ఏమీ లేకపోయినా ఉన్నాయని ఫీలవుతున్నారా? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక!
- సమీర నేలపూడి
డెల్ఫైన్ అద్భుతమైన
సౌందర్యరాశి. ఆమె కూతుళ్లు కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నారేమో... వారిని చూసిన కళ్లు రెప్ప వేయడం మర్చిపోయేవి. వాళ్లు ఏదైనా ఫంక్షన్‌కు వస్తే... ఇక అందరి కళ్లూ వాళ్ల మీదే.