'లోక' కల్యాణం! | Good Heart of Young Couples! | Sakshi
Sakshi News home page

'లోక' కల్యాణం!

Published Sat, Jul 30 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

'లోక' కల్యాణం!

'లోక' కల్యాణం!

ఆదర్శం
పెళ్లి  ఆడంబరాలకు అయ్యే ఖర్చును... మంచి పనులకు వినియోగిస్తే ఇంతకుమించి లోకకల్యాణం ఏముంటుంది!
 
‘మన తాహతుకు తగ్గట్టు పెళ్లి ఘనంగా జరగాలి’ అంటుంటారు. ఈ ‘ఘనంగా జరగడం’ అనేది ఇప్పుడు తాహతును దాటిపోయింది. ‘ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే  పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు’ అనే అపోహ ఏర్పడింది. ఖర్చు కోసమే ఖర్చు ఎక్కువైపోయింది.
 పెళ్లి ఖర్చును నియంత్రిస్తే, పెళ్లిని నిరాడంబరంగా జరుపుకుంటే... లోకహితమైన పనులు చేయవచ్చని నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్రకు చెందిన అభయ్, ప్రీతి దంపతులు.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్‌గా నియమితుడైన అభయ్‌కి శిక్షణకాలంలో నిర్వహించే ఫీల్డ్‌విజిట్‌లో  భాగంగా సహోద్యోగులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకునే అవకాశం వచ్చింది. ‘‘సామాజిక-రాజకీయమార్పులకు మీరు ప్రతినిధులు కావాలి’’ అంటూ తన ఉపన్యాసంలో యువ అధికారులను ఉత్తేజపరచారు ప్రణబ్. రాష్ట్రపతి మాటలు అభయ్‌పై బలంగా ప్రభావం చూపాయి.
 
సమాజం కోసం తనవంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ సమయంలోనే మనదేశంలో పెళ్లి ఖర్చుల గురించిన ఒక నివేదిక అభయ్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మన దేశంలో ప్రతి ఏటా పెళ్లిళ్ల కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది!
 ‘‘మనలాంటి పేదదేశంలో ఇది భారీ ఖర్చు’’ అనుకున్నాడు అభయ్.
 
ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు అభయ్‌ని కదిలించాయి. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆర్థిక శాఖ కేటయించిన మొత్తం రూ.36 వేల కోట్లు. దేశంలో ఏటా జరిగే పెళ్లిళ్ల బడ్జెట్‌లో ఇది సగం కూడా కాదు! తనను ఆశ్చర్యపరిచిన సర్వేలో... పెళ్లి ఖర్చుల కోసం ఎలా అప్పు చేస్తున్నారో, పొదుపు మొత్తాలను ఎలా ఖర్చు చేస్తున్నారో... వీటికి సంబంధించిన వివరాలను చదివాడు అభయ్.
 అభయ్ తండ్రి కూడా రైతే. ఆయనకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండెకరాలను కూతురు పెళ్లి కోసం అమ్మాడు. నివేదిక చదువుతున్న సమయంలో గతం గుర్తుకు వచ్చింది అభయ్‌కి.
 
పుణేలో యూపీఎస్సీ కోసం ప్రిపేరవుతున్న ప్పుడు బీటెక్ పూర్తయిన ప్రీతి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.  రెండు నెలల క్రితం అమరావతి జిల్లా కేంద్రంలోని అభియంత భవన్‌లో అభయ్, ప్రీతిల వివాహం జరిగింది. ఈ పెళ్లితోనే తమ సేవాపథానికి తొలి అడుగు పడాలనుకున్నాడు అభయ్. పెళ్లికి అయ్యే ఖర్చుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నట్లు అభయ్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఆమోదించారు.
 
‘‘పెళ్లికయ్యే ఖర్చును పేదరైతుల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాం అని నా కొడుకు, కోడలు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది’’ అంటాడు అభయ్ తండ్రి సిద్ధార్థ.
 అభయ్-ప్రీతి పెళ్లిలో పదిమంది పేద రైతులకు ఒక్కొక్కరికి ఇరవైవేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు అయిదు గ్రంథాలయాలకు రూ. 52 వేల విలువ చేసే పుస్తకాలు అందించారు. ఈ డబ్బంతా తమ పొదుపు మొత్తాల్లో నుంచి వాడిందే.

అభయ్, ప్రీతిల రిజిస్టర్డ్ మ్యారేజ్ నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి సభలో మధు, రవీంద్ర ముంద్రే, ఆశిష్, రమేష్ కట్కే, అర్జున్ తోసారే... మొదలైన సామాజిక కార్యకర్తలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చారు. మామూలుగానైతే... పెళ్లివేడుకలో పూలదండలు, రకరకాల డెకరేషన్ లైట్లు కనిపిస్తాయి. అభయ్-ప్రీతి పెళ్లిలో మాత్రం స్ఫూర్తిదాయకమైన పోస్టర్లు, బ్యానర్లు  కనిపించాయి.
 
విశేషమేమిటంటే, తమ తొలి వివాహ వార్షికోత్సవానికి ఎలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించాలనే విషయం గురించి ఇప్పుడే ఒక ప్రణాళిక వేసుకున్నారు.
 అమరావతి జిల్లాకు చెందిన దీపక్ దేశ్‌ముఖ్ అనే రైతు కూతురు తమ కుటుంబం ఎదుర్కొంటున్న గడ్డు పేదరికాన్ని తట్టుకోలేక  ఆత్మహత్య చేసుకుంది. ఒక నెల తరువాత అప్పులను తీర్చడానికి దీపక్ కూడా మూడెకరాల భూమిని అమ్మి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో అభయ్‌ని కదిలించాయి. అందుకే...
 
‘‘మా పెళ్లితోనే ఇది ఆగిపోవాలనుకోవడం లేదు. మరింత మందిని ప్రేరేపించి, పెళ్లి ఖర్చును పేదరైతులకు అందించాలను కుంటున్నాం’’ అంటున్నారు నవదంపతులు అభయ్-ప్రీతిలు. వారి ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement