గుడ్‌నైట్ ఆలివ్ | Goodnight Olive | Sakshi
Sakshi News home page

గుడ్‌నైట్ ఆలివ్

Published Sun, Oct 18 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

గుడ్‌నైట్ ఆలివ్

గుడ్‌నైట్ ఆలివ్

మిస్టరీ
* అనుకోకుండా మరణించింది.
* ఆత్మగా మారి సంచరిస్తోంది.
* ఎవరామె? ఎక్కడుంది?
 న్యూ ఆమ్‌స్టర్‌డామ్ థియేటర్...
 కాలిఫోర్నియా...
 ‘‘త్వరగా కానివ్వండి. టైమవుతోంది. ఇంత మెల్లగా చేస్తే ఎలా?’’... శ్యామ్సన్ అరుపులతో థియేటర్ మారుమోగుతోంది.

 ‘‘ఏంటీ గోల... ఎందుకలా అరుస్తాడు?’’ అంటూ గొణిగింది లూసీ.
 ‘‘అంతే. వాడేదో పనిమంతుడైనట్టు, మిగతా వాళ్లంతా బద్ధకస్తులన్నట్టు మాట్లాడుతుంటాడు. మేనేజర్ విని వాడినో పెద్ద తురుము అనుకోవాలని వాడి ఉద్దేశం’’ అంది సారా. అంతలో వాళ్ల దగ్గరకు వచ్చాడు శ్యామ్సన్. ‘‘ఏంటి కబుర్లు? మేకప్ పూర్తయ్యిందా?’’
 మూతి తిప్పింది లూసీ. ఫక్కున నవ్వబోయి ఆపుకుంది సారా. ‘‘మేం రెడీ, మీదే లేటు’’ అంది. ‘‘సరే. హాల్ నిండిపోతోంది. మరో పదిహేను నిమిషాల్లో స్టార్ట్ చేయాలి’’ అనేసి వెళ్లిపోయాడు శ్యామ్సన్.
  ‘‘వీడు... వీడి ఓవరాక్షన్’’ అంది సారా పళ్లు కొరుకుతూ.
 
‘‘ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాడా’’ అడిగింది లూసీ.
 ‘‘ఆ... ఎప్పుడూ ఇంతే. ఇంతకు ముందు వేరే థియేటర్లో సూపర్ వైజర్‌గా ఉండేవాడు. అక్కడ నాకు బాగా అలవాటు. ఈ మధ్యనే ఈ థియేటర్‌లో చేరాడు. నా ఖర్మ కాలి నేను కూడా ఇక్కడికే వచ్చాను. వాడికీ నాకూ ఇక్కడ ఇదే ఫస్ట్ షో’’... చెప్పింది సారా.
 ‘‘ఓహ్... నాకే అనుకున్నాను. మీకూ ఇక్కడ ఇదే ఫస్ట్ షో అన్నమాట’’ అంటూ వ్యానిటీ బాక్స్ తెరిచింది లూసీ. వెంటనే ఆమె ముఖం చిన్నబోయింది. ‘‘సారా... నా వ్యానిటీ బ్యాక్స్ ఖాళీగా ఉందేంటి? కాస్మొటిక్స్ నువ్వేమైనా తీశావా?’’ అంది.
 
‘‘నేనెందుకు తీస్తాను? అయినా తీస్తే గీస్తే ఒక లిప్‌స్టిక్కో, ఫౌండేషన్ క్రీమో తీసుకుంటాను గానీ అన్నీ ఎందుకు తీస్తాను?’’ అంది సారా.
 అదీ నిజమే కదా అనిపించింది లూసీకి. మరి తన కాస్మొటిక్స్ ఏమైనట్టు! లేచి అంతా వెతికింది. ఎక్కడా ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ షోలో వాళ్లిద్దరే ఫిమేల్ ఆర్టిస్టులు. కాబట్టి వేరే వాళ్లెవరూ తీసే చాన్స్ లేదు. మరి అవన్నీ ఎక్కడికి పోయాయి!
 
ఆమె ఆలోచిస్తూ ఉండగానే సారా పిలిచింది. ‘‘ఏంటి’’ అంటూ వెళ్లిన లూసీ... సారా చేతిలో ఉన్న వ్యానిటీ బాక్స్‌ను చూసి అవాక్కయ్యింది. ‘‘అది... ఆ బాక్స్..’’ అంది అయోమయంగా.
 ‘‘నీదే మేడమ్. అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా! మరి నన్నెందుకు అడిగినట్టు?’’ అంది సారా కళ్లెగరేస్తూ.
 
విస్తుపోయింది లూసీ. వెళ్లి బాక్స్‌ను చెక్ చేసింది. అది తనదే. తన కాస్మొటిక్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. అప్పుడేమయ్యాయి? ఇప్పుడెలా వచ్చాయి?
 ఆమె ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండగానే బెల్ మోగింది. వెంటనే టచప్ చేసుకుని గబగబా స్టేజివైపు నడిచింది.
   
‘‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. ప్రేమంటే నీవే అనుకున్నాను. కానీ నీకసలు ప్రేమంటేనే అర్థం తెలియదని ఇప్పటికి అర్థం చేసుకున్నాను. ఈ వంచనకు నేను తల వంచలేను. ఈ ప్రేమ రాహిత్యాన్ని నేను సహించలేను. భగ్న ప్రేమికురాలిగా బతుకు సాగించలేను. నీ కళ్లముందే నన్ను నేను అంతం చేసుకుంటాను. నీ పాదాల దగ్గరే నా ప్రాణాలు విడుస్తాను’’... ఎమోషనల్‌గా డైలాగ్స్ చెప్పుకుంటూ పోతోంది లూసీ. ప్రేక్షకులంతా ముగ్ధులవుతున్నారు. చెమర్చిన కళ్లతో తన్మయం చెందుతున్నారు. ఊపిరి బిగబట్టి నాటకాన్ని తిలకిస్తున్నారు.
 
అంతలో... ఢామ్మంటూ ఓ శబ్దం. అందరూ ఉలిక్కిపడ్డారు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. అంతటా అంధకారం అలముకుంది. హాహాకారాలు మొదలయ్యాయి. లైట్స్ ఆన్ చేయండి అంటూ కొందరు అరుస్తున్నారు. తెర వెనుక ఉన్న శ్యామ్సన్ కంగారు పడిపోయాడు. ‘‘రేయ్... లెట్లైందుకు ఆరిపోయాయి?’’ అరిచాడు.
 ‘‘ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది సర్’’... చెప్పాడు అసిస్టెంట్.
 ‘‘జెనరేటర్ ఆన్ చెయ్యి. త్వరగా!’’
 
‘‘ఆన్ కావడం లేదు సర్. డీజిల్ ఉంది. వేరే ఏ సమస్య కూడా లేదు. అయినా ఆన్ కావడం లేదు.’’
 కోపం తారస్థాయికి చేరింది శ్యామ్సన్‌కి. ‘‘అన్నీ ముందే చూసుకోవద్దా! మేనేజర్ అడిగితే ఏం చెప్పాలి?’’
 అంతలోనే మేనేజర్ రానే వచ్చాడు. తత్తరపడ్డాడు శ్యామ్సన్. ‘‘సారీ సర్... అదీ... మరీ..’’ అంటూ నసిగాడు.

 ‘‘ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు శ్యామ్సన్’’ అంటూ స్టేజి మీదికి వెళ్లాడు. ‘‘అంతరాయానికి చింతిస్తున్నాం. కాసేపట్లో షో మళ్లీ ప్రారంభమవుతుంది’’ అని ప్రకటించాడు. తన ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఉపయోగించి వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నుంచి మనుషుల్ని రప్పించాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ను పది నిమిషాల్లో బాగు చేయించాడు. మళ్లీ షో మొదలైంది.
 ‘‘ఇంత రిచ్ ఏరియాలో, ఇంత ఆధునిక థియేటర్లో ఇలాంటి సమస్య రావడమేంటి సర్?’’ అన్నాడు శ్యామ్సన్.
 
మేనేజర్ చిన్నగా నవ్వాడు. ‘‘ఇదే కాదు. ఇంకా చాలా సమస్యలు వస్తుంటాయి. సడెన్‌గా వస్తువులు మాయమవుతాయి. మళ్లీ ప్రత్యక్షమవుతాయి. ఫ్యాన్లు తిరగడం ఆగిపోతాయి. ఆపేసినా వాటంతటవి తిరుగుతాయి. ఇదంతా ఆలివ్ థామస్ పని’’ అన్నాడు కూల్‌గా.
 ‘‘ఆలివ్ థామసా? తనెవరు?’’ అన్నాడు శ్యామ్సన్ అయోమయంగా.
 ‘‘ఒకప్పుడు నటి. ఇప్పుడు ఆత్మ’’ అనే వెళ్లిపోతోన్న మేనేజర్ వైపు నోరి తెరిచి చూస్తూండిపోయాడు శ్యామ్సన్.
 
మనిషి అన్ని విధాలుగానూ అభివృద్ధి పథంలో పయనిస్తోన్న ఈ రోజుల్లో... ఆత్మలు, దెయ్యాల ఉనికి అందరికీ ప్రశ్నార్థకమే. అయితే అవి లేవని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే తాము ఉన్నామంటూ అవి ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాయి. దానికి ఉదాహరణే ఆలివ్ థామస్ ఆత్మ. ఇంతకీ ఎవరీ ఆలివ్?
   
1894లో పెన్సిల్వేనియాలో జన్మించింది ఆలివ్. నటి కావాలన్నది ఆమె కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి అతి చిన్న వయసులోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే అంతలోనే మనసు, రెక్కలు కట్టుకుపోయి ప్రేమ సామ్రాజ్యంలో వాలింది. పదిహేనేళ్ల వయసులోనే బెర్నార్డ్ థామస్ అనే వ్యక్తికి ఆమె భార్య అయ్యింది. కొత్త ఆనందాలతో కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. కానీ మెల్లగా బంధం బీటలు వారింది. చివరికి ముక్కలై ఇద్దరినీ వేరు చేసింది.
   
దాంతో మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది ఆలివ్. అదృష్టం కలిసి వచ్చింది. మొదట మోడలింగ్‌లో పాదం మోపింది. తర్వాత నాటకాల్లో అవకాశాలు సంపాదించింది. ఆపైన మూకీ సినిమాల్లో చాన్సులు కొట్టేసింది. అప్పుడే నటుడు జాక్ పిక్‌ఫోర్డ్‌తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమకు దారితీసి, వాళ్లిద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. ఓ పక్క వ్యక్తిగత జీవితంలోని ఆనందం... మరోపక్క కెరీర్ ఊపందుకుంటున్న సమయం... ప్రపంచం అందంగా కనిపించసాగింది ఆలివ్‌కి.

కానీ అతి త్వరలో తాను ఈ ప్రపంచానికే దూరంగా వెళ్లిపోతానన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది.
 1920, సెప్టెంబర్ నెల. భర్త జాక్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లింది ఆలివ్. ఓ హోటల్లో బస చేశారు. ఆ రాత్రి ఉన్నట్టుండి రిసెప్షన్‌కి ఫోన్ చేశాడు జాక్. తన భార్య పరిస్థితి బాలేదని చెప్పాడు. అంబులెన్స్ వచ్చింది. ఆలివ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఐదు రోజుల పాటు ఆలివ్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.
 
అసలా రాత్రి ఏమైందని అడిగితే... నిద్రలో ఆలివ్ అరుపులు వినిపిస్తే లేచానని, ఆలివ్ గట్టిగా అరిచి సొమ్మసిల్లి పడిపోయిందని చెప్పాడు జాక్. పోస్ట్‌మార్టమ్‌లో ఆలివ్ కడుపులో మెర్క్యురీ బైక్లోరైడ్  లిక్విడ్ ఉన్నట్టు తేలింది. సిఫిలిస్ వ్యాధితో బాధపడుతోన్న జాక్ ఆ మందు వాడతాడు. దాన్ని ఎక్కువ మోతాదులో తాగడం వల్లే ఆలివ్ మరణించిందని నిర్ధారించారు వైద్యులు. అయితే ఆమె ఎందుకు తాగిందన్న విషయం మాత్రం తెలియలేదు.

ఆత్మహత్య చేసుకుందా అంటే... ఆ అవకాశం ఉందనిపించలేదు. పోనీ జాక్ ఆమెతో బలవంతంగా తాగించాడా అంటే దానికీ సాక్ష్యం లేదు. దాంతో ఆలివ్ మృతి ఒక అనుమానాస్పద మరణంగానే మిగిలిపోయింది. అయితే ఆమెను ఈ ప్రపంచం మర్చిపోలేకపోయింది. దానికి కారణం... ఆమె ఆత్మ!
 న్యూ ఆమ్‌స్టర్‌డామ్ థియేటర్‌లో ప్రదర్శించిన ఎన్నో నాటకాల్లో నటించింది ఆలివ్. ఒక రకంగా చెప్పాలంటే ఆ థియేటర్‌లో ఆమె గడిపిన కాలం చాలా ఎక్కువ. అందుకనో ఏమో... దాన్ని వదిలి వెళ్లలేకపోయింది.

అక్కడక్కడే తిరుగుతూ ఉండేది. గోడకి వేళ్లాడుతున్నట్టు, ఎగురుతున్నట్టు, కుర్చీలో కూర్చున్నట్టు ఎందరికో కనిపిస్తూ ఉండేది. అయితే కనిపించి మాయమయ్యేది తప్ప ఎవరికీ కీడు చేసేది కాదు. కానీ అల్లరి పనులు చేసేది. లైట్లు ఆర్పేసేది. బ్యానర్లవీ లాగి పారేసేది. మేకప్ సామాన్లు, ఇతరత్రా చిన్న చిన్న వస్తువులు కనిపించకుండా చేసి తిప్పలు పెట్టేది. స్వతహాగా ఆలివ్ చాలా తుంటరిది. ఎప్పుడూ సందడి చేస్తూ, అందరినీ ఆట పట్టిస్తూ ఉండేది.

చనిపోయిన తర్వాత కూడా అలాగే చేస్తోందని అనుకున్నారంతా. అయితే ఎవ్వరూ ఎప్పుడూ ఆలివ్‌ని ద్వేషించలేదు. దానికి కారణం... ఆమె అంటే ఉన్న అభిమానం, పాతికేళ్ల చిన్న వయసులోనే అకారణంగా చనిపోయిందన్న జాలి.
 ఇప్పటికీ ఆలివ్ ఆత్మ ఆమ్‌స్టర్‌డామ్ థియేటర్లోనే ఉందని అంటూ ఉంటారు. ఆత్మగా మారి అక్కడే సంచరిస్తోందంటే... ఆలివ్ అసంతృప్తితో ఉందా? అంటే, ఆమె మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? ఏమో... అది ఆలివ్‌కే తెలియాలి!
 
ఆలివ్ థామస్
ఆలివ్ ఆత్మ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తప్ప, చెప్పుకోదగ్గ కష్టనష్టాలు ఎప్పుడూ కలగలేదని థియేటర్ నిర్వాహకులు చెబుతుంటారు. అయితే ప్రేమకథలను ప్రదర్శించినప్పుడు... స్త్రీ పాత్ర కనుక వంచనకు గురై, ఆవేదనతో డైలాగ్స్ చెబుతుంటే... ఆలివ్ ఎక్కువ రియాక్ట్ అయ్యేదట. ఎలాగోలా నాటకాన్ని డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నించేదట. కానీ  ఇంతకు ముందులా ఇప్పుడు ఆలివ్ ఎవరినీ డిస్టర్బ్ చేయడం లేదని కూడా అంటున్నారు. దానికి కారణం... థియేటర్లో ఒకచోట ఆమె ఫొటోను పెట్టారు. ప్రతిరోజూ అక్కడ ప్రార్థన చేస్తారు. రాత్రి వెళ్లేముందు ప్రతి ఒక్కరూ ‘గుట్ నైట్ ఆలివ్’ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అందువల్లే ఆమె తమ జోలికి రావడం లేదట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement