సమాజ అభ్యున్నతి కోసం...
పంచామృతం
సెలబ్రిటీలకు ఇమేజ్ ఉంటుంది. గ్లామర్ ఉంటుంది. స్టార్‌డమ్ ఉంటుంది. కానీ వాళ్లకు కాసింత బాధ్యత, కూసింత ఆలోచన, కొంత మేథ ఉంటే ఎంత బావుటుంది? సమాజంలో వివిధ వర్గాల వారి సమస్యల గురించి పట్టించుకొని, వారి తరపున తమ వాయిస్‌ను వినిపిస్తూ, సమాజాభ్యున్నతికి కృషి చేస్తే ఎంత బావుంటుంది? లేదా కృషి చేస్తున్న వారికి అండగా నిలబడితే ఎలా ఉంటుంది. అలా సమాజంలోని
సమస్యలను గుర్తించి వాటి ని పరిష్కరించే బాధ్యత ఎరిగిన ప్రముఖుల్లో కొందరు వీరు...
విద్యాబాలన్...
తాగునీటి పారిశద్ధ్యం విషయంలో కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా ఉంది విద్యాబాలన్. ప్రభుత్వం ఈ విషయంలో చేపడుతున్న ప్రజావగాహన కార్యక్రమాల్లో విద్య స్వయంగా పాల్గొంటోంది. ఈ విధంగా డర్టీపిక్చర్‌హీరోయిన్ ఒక క్లీన్ కాజ్ విషయంలో ప్రభుత్వానికి చేయూతగా నిలుస్తోంది.
షకీరా... ప్రత్యేకించి చిన్నపిల్లలు అంటే షకీరాకు ఎంతో మమకారం. వారి కోసం అనునిత్యం ఏదో ఒక సేవాకార్యక్రమం చేపడుతుండటమే అందుకు రుజువు. పేద పిల్లల చదువు కోసం నిధుల సమీకరిస్తూ, తను కూడా దాతృత్వాన్ని చాటుకొంటూ ఉంటుంది ఈ పాప్ సింగర్. అంతేగాక పిల్లల హక్కుల కోసం, వారికి మంచి బాల్యాన్ని అందించడం కోసం వివిధ దేశాల చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామి కావడంతో పాటు అవసరమైన సందర్భాల్లో పిల్లల తరపున ప్రభుత్వాలతో పోరాడుతూ తన సామాజికస్పృహను చాటుకొంటోంది.
శిల్పాషెట్టి... బిగ్‌బ్రదర్ రియాలిటీ షో విజేతగా శిల్పాషెట్టికి కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వచ్చిందని అందరికీ తెలుసు. అయితే ఆమె ఆ సొమ్మును ఎయిడ్స్ అవేర్‌నెస్ క్యాంపెయినింగ్ కోసం విరాళంగా ఇచ్చేసిందని చాలా మందికి తెలీదు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన నింపడానికి శిల్ప తన వంతు సహకారం అందిస్తోంది. అంతేగాక పెటా వంటి సంస్థల్లో సభ్యురాలు. ఎద్దులతో బరువులను లాగించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘యాంటీ బుల్లింగ్’ చారిటీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది శిల్ప.
రాహుల్‌బోస్... కులం, మతం, రంగు అనేవి మనుషుల మధ్య వివక్షకు కారణం కాకూడనేది రాహుల్‌బోస్ ఆకాంక్ష. అలాంటి వివిక్షలేని సమాజం కోసం పాటుపడుతున్న ఎవరికోసం అయినా సరే బోస్ తన సహకారం అందిస్తాడు. ‘వివక్ష రహిత సమాజం’ కోసం పాటు పడే అనేక స్వచ్ఛంద సంస్థలకు సహయకారిగా ఉన్నాడు బోస్. అలాగే అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజల పునరావసం కోసం పాటుపడుతున్న వారికి కూడా బోస్ సన్నిహితుడే. ఆయా సంస్థలకు ఫండింగ్ విషయాల్లో, ప్రచారం విషయాల్లో బోస్ సహకారం అందిస్తూ ఉంటాడు.
దియామీర్జా...
ఈ మాజీ మిస్ ఆసియా-పసిపిక్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ క్యాంపెయినర్. కొంతమంది యువతీయువకులతో కలిసి పచ్చదనం, పరిశుభ్రతలను కాపాడటం గురించి ఆన్‌లైన్‌క్యాంపెయినింగ్‌తో పాటు ప్రత్యక్షంగా కూడా పాల్గొంటూ తన సేవానిరతిని చాటుకొంటోంది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లో ఎయిడ్స్ నివారణ అవగాహన నింపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కూడా దియా తన భాగస్వామి అయ్యింది.