ఇతరులకు చేస్తే దేవుడికి చేసినట్టే!
మేం ముంబైలో ‘మౌంట్ మేరీ స్టెప్స్’ చర్చికి సమీపంలో ఉండేవాళ్లం. తరచూ చర్చికి వెళ్లేవాళ్లం. గోవా వెళ్లిన తర్వాత అక్కడి చర్చిలకు వెళ్లేవాళ్లం. మనసు బాగా లేనప్పుడల్లా ప్రేయర్ చేస్తాన్నేను. మానసిక ప్రశాంతత కోసం ఉదయం ఆరు గంటలకే చర్చికి వెళ్లేదాన్ని. మాస్ ప్రేయర్‌కి వెళ్లిన ప్రతిసారీ నా సందేహానికి తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అందుకే మానసిక స్థయిర్యం కోల్పోయిన ప్రతిసారీ చర్చికి వెళతాను. కానీ, ఎప్పుడూ దేవుడి ముందు ఏడ్వలేదు. నా సంఘర్షణను ఆయనకు చెప్పుకుంటానంతే. చర్చికి వెళ్లి ఒక కార్నర్‌లో కూర్చుని ప్రార్థిస్తే నాకు ధ్యానం చేసినట్లుగా ఉంటుంది.
నేను బైబిల్ చదువుతాను. ‘నర హత్య చేయకూడదు’ అనే వాక్యం నాకు బాగా నచ్చుతుంది. హత్య అంటే ఒక మనిషిని శారీరకంగా చంపడం అని మాత్రమే కాదు. మానసికంగా బాధపెట్టడం కూడా హత్య కిందకే వస్తుంది. అందుకే, వీలైనంత వరకూ నేనెవర్నీ బాధపెట్టను. ఎవరైనా నచ్చకపోతే వాళ్లకు దూరంగా ఉంటాను. అలాగే ‘పరుల సొమ్ము ఆశించరాదు’ అన్న మాట ఇష్టం. నిజమే. మనది కానిది దక్కించుకోవాలనుకోవడం మహా పాపం. ఆయాచితంగా వచ్చే సొమ్ము కన్నా కష్టపడి సంపాదించిన డబ్బే ఆత్మసంతృప్తినిస్తుంది. అలాగే ఇతరులకు సహాయం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. అందుకే నా వంతుగా ఏదో ఒకటి చేస్తుంటాను.
ఇక క్రిస్మస్ అంటే మహా ఇష్టం. డిసెంబర్ మొదలవగానే క్రిస్మస్ ట్రీ పెట్టడం అలవాటు. క్రిస్మస్ ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ట్రీ దగ్గరికెళ్లి, శాంటాక్లాజ్ ఏమైనా గిఫ్ట్స్ పెట్టాడేమో అని చూసేదాన్ని. చెట్టుకి అలంకరించిన రంగు రంగుల బంతుల్లో ఉండే చాక్లెట్స్ తినడానికి ఆరాటపడేదాన్ని. క్రిస్మస్ రోజు ఉదయం త్వరగా నిద్రలేచి, ట్రీకి ఉన్న చాక్లెట్స్ తీసుకునేదాన్ని. ఆ రోజులను ఎప్పుడు తలచుకున్నా చాలా ఆనందంగా ఉంటుంది.
- ఇలియానా