
హాలీవుడ్‌లో మనవాళ్లు..!
పంచామృతం: అమెరికా కేంద్రంగా ఉండే హాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ప్రపంచంలోని అనేక దేశాల నటీనటులు, దర్శకులు తమదైన ప్రభావాన్ని చూపుతున్నారు. మరి హాలీవుడ్‌పై భారతీయుల ప్రభావం ఎంత? హాలీవుడ్ సినిమాలను అమితంగా ఆదరించే భారతీయుల్లో ఎంతమంది అక్కడ ప్రముఖ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు అంటే అలాంటి వారి సంఖ్య స్వల్పమేనని చెప్పాలి. అలా హాలీవుడ్ సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న భారతీయుల్లో ముఖ్యమైన వాళ్లు...
ఏఆర్ రెహమాన్
‘ఇండియాస్ ఫస్ట్ డబుల్-ఆస్కార్ విన్నర్’ గుర్తింపు ఉన్న ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు ముందు, తర్వాత కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. ‘ఎలిజబెత్: ది గోల్డెన్‌ఏజ్’తో రెహమాన్ హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనేక సినిమాలకు నేపథ్య సంగీతాన్ని, స్వరాలను సమకూర్చారు. ఆస్కార్ అవార్డులను కూడా అందుకుని హాలీవుడ్‌పై భారతీయ ముద్రను వేశారు.
ఇర్ఫాన్ ఖాన్
హాలీవుడ్ సినిమాల్లో నటుడిగా భారతదేశం ఆవల మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఇర్ఫాన్‌ఖాన్. ప్రత్యేకించి భారతనేపథ్యంలో నడిచే హాలీవుడ్ సినిమాల్లో ఇర్ఫాన్‌ఖాన్ తప్పనిసరి పాత్రధారి. అకాడమీ అవార్డులు పొందిన స్లమ్‌డాగ్‌మిలియనీర్, లైఫ్ ఆఫ్ పైలలో ఈ నటుడు కీలక పాత్రలు వేశారు. ఇంకా ‘ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
అనిల్ కపూర్
బాలీవుడ్‌లో అనిల్ కపూర్‌కు హీరోగా కాలం చెల్లిపోయిందేమో కానీ... హాలీవుడ్‌లో మాత్రం ఈ హీరోగారి ప్రభ క్రమంగా పెరుగుతోంది. స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో అనిల్ కపూర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా అనిల్‌కు ప్రముఖపాత్రలు దక్కుతున్నాయి. టామ్‌క్రూజ్‌తో కలిసి ‘మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్’ సినిమాలో అనిల్ కపూర్ నటించారు.
అశోక్ అమృత్‌రాజ్
హాలీవుడ్‌లో దాదాపు వంద సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు అశోక్‌అమృత్‌రాజ్. ఒకనాడు భారతదేశం తరపున వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లలో పాల్గొన్న ఈ టెన్నిస్ ఆటగాడు ఆ తర్వాత హాలీవుడ్ సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. అనేక హిట్స్‌ను సాధించారు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఘోస్ట్‌రైడర్’ వంటి సినిమాలు ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి.
ఎమ్.నైట్ శ్యామలన్
స్క్రీన్‌రైటర్, డెరైక్టర్, ప్రొడ్యూసర్‌గా హాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు. హాలీవుడ్‌లో ‘ద సిక్త్‌సెన్స్’ ‘అన్‌బ్రేకబుల్’ ‘లేడీ ఇన్ ద వాటర్’ ‘ఆఫ్టర్ ఎర్త్’వంటి సినిమాలతో శ్యామలన్ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు.