మిలియనర్స్
మే 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే
‘‘ఈమధ్య మీరెందుకు రాయడం లేదు’’ అని ఎవరో అడిగితే - ‘మోడ్రన్ నర్సింగ్’కు మార్గదర్శి అయిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఇలా చెప్పారు... ‘నా అందమైన ఊహలను అక్షరాల్లో బంధించడం నాకు ఇష్టం లేదు. వాటిని ఆచరణలోకి తీసుకువెళ్లడమే నాకు ఇష్టం’! అవును నిజమే. కళ్లలో కరుణ నిండిన దేవదూతల్లా ధవళ వస్త్రాల్లో కనిపించే నర్స్‌లు దేన్నీ మాటల్లో చెప్పరు. ఆచరించి చూపిస్తారు. ఆ ఆచరణ రోగుల కన్నీటిని తుడుస్తుంది.
నిలువెత్తు ధైర్యవచనం అవుతుంది. ఒక్కరిని బతికించినవాడు హీరో అవుతాడు. మరి వందమందిని బతికించిన వ్యక్తి ఏమవుతారు? నర్స్ అవుతారు! నర్సింగ్ కెరీర్‌లోకి వెళ్లడం అంటే సేవాపథంలో చిత్తశుద్ధితో చేసే ప్రయాణంలాంటిది. ఇదొక కోణం అయితే మరో కోణం కూడా ఉంది. కెరీర్ పరంగా నర్సింగ్ ఎంతో లాభదాయకంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగావకాశాల్ని కల్పిస్తోంది. మంచి ఆదాయాన్ని, సౌకర్యాలను, సమాజంలో గౌరవప్రదమైన స్థాయిని ఇస్తోంది. పలు దేశాల్లో నర్సుల ఆదాయంపై ఓ సర్వే వెల్లడించిన సమగ్రమైన రిపోర్ట్ ఇది...
నర్సులకు యూఎస్‌లో అద్భుతమైన అవకాశాలు ఉంటున్నాయి. అక్కడ జీతాన్ని గంటల చొప్పున లెక్కపెడుతుంటారు. ఓవర్‌టైమ్ చేస్తే గంటకింత అని పే చేసేస్తారు. వాటితో పాటు అలవెన్సులు, ఇన్స్యూరెన్స్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటున్నాయి. దాంతో అమెరికాలో అవకాశాల కోసం నర్సింగ్ చేసినవాళ్లు క్యూ కడుతున్నారు. బ్రిటన్ కూడా నర్సులకు సాదరంగా ఆహ్వానం చెబుతోంది. గత సంవత్సరం 8,500 మంది విదేశీయుల్ని ఆ దేశపు హాస్పిటళ్లు నర్సులుగా చేర్చుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ సంఖ్య రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. యూకేలో పనిచేసే నర్సుల్లో మన దేశీయుల సంఖ్య ఎక్కువేనట. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా నర్సులకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. జీతాలతో పాటు యేటా బోనస్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. వసతి, భోజన సౌకర్యాలు వంటివి కల్పించి తమ దేశంలో పనిచేసేవారికి సౌకర్యవంతమైన జీవితాన్ని కల్పిస్తున్నాయి.
అయితే హాస్పిటళ్లలో పనిచేసే నర్సుల కంటే బెడ్ రిడెన్ పేషెంట్లకు కేర్ టేకర్లుగా ఇళ్లలో పనిచేసే నర్సులకు ఎక్కువ వేతనం లభిస్తోందని తెలుస్తోంది. అలాగే ల్యాబ్స్‌లో పని చేసేవాళ్లు, ఆపరేషన్ థియేటర్లలో పనిచేసే నర్సుల జీతాలు మామూలు నర్సుల కంటే కాస్త అధికంగానే ఉంటున్నాయట. వివిధ దేశాల్లో నర్సుల జీతాలను మన కరెన్సీలో లెక్క వేస్తే పై నివేదిక తయారైంది!
అమెరికా
గంటకు - రూ.1,383 - రూ.2,561
ఓవర్ టైమ్ (గంటకు) - రూ.948 - రూ.3,845
దక్షిణాఫ్రికా
ఏడాది జీతం - రూ.4,96,697 - రూ.11,59,526
బోనస్ - రూ.11,4,287 - రూ.1,70,815
సౌదీ అరేబియా
ఏడాది జీతం- రూ.4,34,881 - రూ.38,21,535
బోనస్ - రూ.3,47,131
సింగపూర్
ఏడాది జీతం- రూ.10,69,144 - రూ.30,83,908
బోనస్ - రూ.4,91,385
ఆస్ట్రేలియా
గంటకు- రూ. 1,226 - రూ.1,963
ఓవర్ టైమ్ (గంటకు) - రూ.157 - రూ.3,129
న్యూజిలాండ్
గంటకు-రూ.1,027 - రూ.1,449
ఓవర్ టైమ్ (గంటకు) - రూ.67- రూ.2,257
యూకే
ఏడాది జీతం- రూ.17,21,685 - రూ.30,17,938
బోనస్ - రూ.1,95,324
కెనడా
గంటకు- రూ.1,317 - రూ.2,192
ఓవర్ టైం (గంటకు) - రూ.161- రూ.4,045