ఐటీ రంగంలో స్వదేశీ మాగస్ | IT sector In the Domestic magas | Sakshi
Sakshi News home page

ఐటీ రంగంలో స్వదేశీ మాగస్

Published Sat, Sep 10 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

ఐటీ రంగంలో స్వదేశీ మాగస్

ఐటీ రంగంలో స్వదేశీ మాగస్

మన దిగ్గజాలు
సన్నిహితులు ఆయనను ముద్దుగా ‘మాగస్’ అని పిలుస్తారు. పర్షియన్ భాషలో ‘మాగస్’ అంటే మాంత్రికుడు అనే అర్థం ఉంది. ఔను! ఐటీ రంగంలో ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేసిన మాంత్రికుడే. అంతేనా..? సొంత కంపెనీని సాంకేతిక పురోగతితో లాభాల బాట పట్టించిన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల కోసం నిధులు విరాళంగా ఇవ్వడం కోసం కంపెనీలో తన వాటాలు, తన కుటుంబ సభ్యుల వాటాలలో సింహభాగాన్ని తెగనమ్ముకున్న వదాన్యుడు కూడా. ఆయనే హెచ్‌సీఎల్ కంపెనీ వ్యవస్థాపకుడు శివ నాడార్. నాలుగు దశాబ్దాల కిందటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి కంప్యూటర్‌ను అందించిన ఘనత శివ నాడార్ స్థాపించిన హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) కంపెనీకే దక్కుతుంది.
 
సాధారణ నేపథ్యం
శివనాడార్ 1945 జూలై 14న తమిళనాడులోని తూతుకూడి జిల్లా తిరుచెందూరు సమీపంలోని మూలైపొళి గ్రామంలో జన్మించారు. కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత 1967లో వాల్‌చంద్ గ్రూప్‌లోని కూపర్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగపర్వం ప్రారంభించారు. సొంతగా ఏదైనా చేయాలి, స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతిక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ఆలోచన ఆయనను ఉద్యోగంలో ఎంతోకాలం ఉండనివ్వలేదు.

కొద్దికాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి, సన్నిహితులతో కలసి మైక్రోక్యాంప్ అనే కంపెనీని ఏర్పాటు చేసి, డిజిటల్ కాలిక్యులేటర్ల తయారీ ప్రారంభించారు. అయితే, స్వదేశీ పరిజ్ఞానంతో పర్సనల్ కంప్యూటర్లు తయారు చేయాలనేదే ఆయన లక్ష్యం. మైక్రోక్యాంప్ ద్వారా ఆశించిన లాభాలు సమకూరిన తర్వాత ఆశయ సాధన దిశగా ముందడుగు వేశారు.
 
హెచ్‌సీఎల్‌తో మొదలైన చరిత్ర
ఆయన వేసిన ముందడుగే హెచ్‌సీఎల్ స్థాపన. శివ నాడార్ కేవలం రూ.1.87 లక్షల పెట్టుబడితో 1976లో హెచ్‌సీఎల్ కంపెనీని ప్రారంభించారు. స్వదేశీ కంపెనీలకు కాలం కలిసొచ్చి 1977లో కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనతా సర్కారు విధానాల దెబ్బకు కోకాకోలా, ఐబీఎం వంటి బహుళజాతి సంస్థలు భారత్ నుంచి మూటాముల్లె సర్దేసుకున్నాయి. ఐబీఎం దేశాన్ని వీడటంతో కంప్యూటర్ల రంగంలో ఏర్పడిన ఖాళీని హెచ్‌సీఎల్ విజయవంతంగా భర్తీ చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి కంప్యూటర్‌ను 1978లో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

దాంతో నాడార్ కల నెరవేరింది. చరిత్ర మొదలైంది. మరో రెండేళ్లకే హెచ్‌సీఎల్ అంతర్జాతీయ విపణిలోకి అడుగుపెట్టింది. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల విక్రయం కోసం సింగపూర్‌లో ఫార్‌ఈస్ట్ అనే అనుబంధ సంస్థను ప్రారంభించింది. తొలి ఏడాదిలోనే ‘ఫార్‌ఈస్ట్’ రూ.10 లక్షల టర్నోవర్ సాధించడంతో హెచ్‌సీఎల్ ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే లేకుండాపోయింది. కంప్యూటర్ల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, సాఫ్ట్‌వేర్ సేవలు, ఐటీ కన్సల్టన్సీ, రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, బీపీవో వంటి పలు రంగాలకు విస్తరించింది. విద్య, వైద్య, వైమానిక, రక్షణ, విద్యుత్, ఆర్థిక సేవలు వంటి కీలక రంగాల్లో సేవలందిస్తోంది. హెచ్‌సీఎల్ వ్యాపార సామ్రాజ్యం ఇప్పటికి 34 దేశాల్లో వేళ్లూనుకుంది. ప్రస్తుతం హెచ్‌సీఎల్ నికర విలువ దాదాపు 22.1 బిలియన్ డాలర్లు (రూ.1.48 లక్షల కోట్లు).
 
సేవాదక్షత
శివ నాడార్ వ్యాపార దక్షతలోనే కాదు, సేవాదక్షతలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన తండ్రి పేరిట చెన్నైలో ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను స్థాపించారు. ఎస్‌ఎస్‌ఎన్ ట్రస్టును ఏర్పాటు చేసి, దీని ద్వారా యాభై జిల్లాల్లో విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ సముదాయ్’పేరిట వంద గ్రామాలను దత్తత తీసుకుని, ఆ గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తోంది. ‘ఫోర్బ్’ మ్యాగజీన్ 2009లో ప్రకటించిన 48 మంది దానశీలత గల వ్యాపారవేత్తల జాబితాలో శివనాడార్ చోటు సంపాదించుకున్నారంటే, ఆయన వదాన్యత ఏ స్థాయిదో అర్ధం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం 2008లో శివ నాడార్‌ను ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది.
- దండేల కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement