పుట్టేశాం... ఇక బతికి సాధించాలి!
పాటతత్వం
పూరి జగన్నాథ్ తో నాకది రెండో సినిమా. మా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్ర మణ్యం’లో నేను రాసిన రెండు పాటలూ సూపర్‌హిట్. ‘ఇడియట్’లో మళ్లీ అవకాశ మిచ్చారు. మొత్తం మూడు పాటలు. మూడు వేరియేషన్లు. చక్రితో నాకు అయిదో సినిమా ‘ఇడియట్’. రవితేజను పక్కింటి అబ్బాయిలా తనదైన స్టయిల్లో చూపించడానికి పూరి రెడీ అవుతున్నారు. అసలే రవితేజ రియల్ లైఫ్‌లో హైపర్ యాక్టివ్. ఇక సినిమాలో అతని పాత్ర కూడా అంతే. ఏదీ మనసులో ఉంచుకోడు. సూటిగా సుత్తి లేకుండా ఎదరెవరున్నా సరే దూసుకెళ్లిపోవడం అతని తత్వం.
అలాంటి హీరోకి పరిచయ గీతం. క్లిష్టతరమైన పదాలకు దూరంగా, ఎవరికైనా కనెక్ట్ అయ్యేలా ఇన్ స్పిరేషనల్‌గా రాయమన్నారు పూరి. అంద మైన పదాలతో ఓ పాటను పొదగడం ఎంత కష్టమో, సులువుగా అర్థమ య్యేలా రాయడం అంతకన్నా కష్టం. రోజూ చదివే భగవద్గీత, బైబిల్ మననం చేసుకుంటూ ఈ పాట రాశా. ఏకంగా మూడు రోజులు పట్టింది. చివరికి సక్సెస్.
సై సర సర సై -సై చిరు చిందైయ్ -వెయ్ వెయ్ వెయ్/సర సర వెయ్ వెయ్ వెయ్/ నింగిలోని తార నీ చేతిలోకి రాదా/తలదిండు తీసిలేరా దునియాను దున్నుకోరా/నవ్వే నువ్వై నిప్పు రవ్వై/కదం తొక్కేయ్‌రా
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్నారు. చాలా మంది కలలు కంటారు, అలా కంటూనే ఉంటారు. కానీ వాటిని సాకారం చేసుకోరు. అలా కాకుండా ముందడుగెయ్యాలి. చేసేది తప్పా... ఒప్పా అని చూడకూడదు. ముందు అనుకున్న పనిని మొదలుపెట్టాలి. ఎలాంటి కష్టమొచ్చినా ముఖాన చిరునవ్వు చిందిస్తూ బరిలో సాగిపోవాలి.
చేసేదేదైనా చెప్పేదేదైనా/చేసేయ్ జంకూ బొంకూ లేకుండా/పిండై బండైనా ఎక్కేయ్ ఎవరెస్టయినా/సాహసంతో సావాసం చేసేయ్‌రా... మనం చేసే పని రైట్ అనుకున్నప్పుడు ఎవరికీ భయపడకూడదు. ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడాలి. అది ఎలాంటిదైనా సాహసమే శ్వాసగా సాగిపోవాలి. అప్పుడే మనకు అనుకున్న విజయాలు దక్కుతాయి. విపణి వీధి నిండా ఎగరెయ్ ప్రేమజెండా/ చిరాకు నీకు వస్తే అమ్మేయ్‌రా గోలుకొండ
అందరి హృదయాలను ప్రేమతో గెలిచి, ఈ సమాజాన్ని ప్రేమతో నింపేసేయ్. ఒక పనిలో మనకు నష్టం వచ్చింది. అది మనకు రాదు అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్లకూడదు. నిన్న తప్పు తెలుసుకుని ఫీలు కాకురా/తప్పు వల్ల కొత్త నిజం తెలుసు కోరా/చాన్సు ఉంటే మళ్లీ తప్పు చేసి చూడరా/చేసిన ఆ తప్పే మళ్లీ చేయమాకు చేయమాకు నాకు మొదటి నుంచి ఓషో ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన భావజాలాన్ని కూడా ఇందులోకి జొప్పించాను. తప్పులు చేస్తేనే నిజాలు తెలు స్తాయి. అసలు తప్పులు చేయనివాడు మనిషే కాడు.
తప్పులు చేస్తూ ఉండాలి. అందులోంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. ప్రపంచంలోని ఆవిష్కరణలకు మూలం ఇలాంటి తప్పులే. కానీ చేసిన తప్పే మళ్లీ చేయడం మాత్రం మూర్ఖత్వమే. బిల్ గే ట్సే గొప్ప కాదురా/నీకు నువ్వే కింగు సోదరా... పోలిక పెడితే ఎంతటివాడైనా నిరాశలో కుంగిపోవడం ఖాయం. అందరూ బిల్ గే ట్స్, టాటా, బిర్లా, అంబానీలే గొప్పనుకుంటారు. కానీ ఎవరి టాలెంట్ వారిది. కొంతమంది పాటలు బాగా పాడితే, ఇంకొంత మంది బాగా చదువుతారు. ఇంకొద్ది మందికి చదవడమంటే చాలా ఇష్టం. ఎవడి జీవితానికి వాడే హీరో. కింగు కూడా.
పుట్టాకెవడైనా బతకాలి ఏమైనా/వేసే ముందడగు ఇకనైనా/వద్దు కొండైనా చాలు రవ్వైనా/తోసేయ్ నచ్చకుంటే దేన్నైనా... పుట్టుక, చావుల మధ్య ఊగిసలాడే చిన్న దారమే ఈ జీవితం. కష్టమొచ్చిందా... భరించు, దు:ఖ మొచ్చిందా సహించు. సంతోషమొచ్చిందా ఎగిరి గంతేయ్. మళ్లీ కష్టాలొస్తాయి. చిరు నవ్వుతో సాగిపో. మనకు చావు వచ్చేదాకా బతకాలి. ఏదైనా చేసి బతకాలి అంతే. అలాగని నచ్చని పని చేయకూడదు. రాజీపడి బతక్కూ డదు. మనకంటూ ఆటిట్యూడ్, ఇండివిడ్యు వాలిటీ ఉండాలి. నడిచే దారి కరెక్ట్ అయితే చాలు. ముళ్లున్నా, పూవులున్నా, ఎవరు అడ్డొచ్చినా వెళ్లిపోవాలంతే.
చేయగలను కానీ అనే మాటలొద్దురా/ గుండెలోన దమ్ములుంటే చేసిచూపరా/నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా/సత్తువుంటే కొత్త బాట వేసిచూపు చేసిచూపు... ఈ పని నేను చేయగలను కానీ... అంటూ కొందరు సాకులు చెబుతారు. పని తెలిసినవాడు సాధిస్తాడు. చేయలేనివాడు సాకులు వెతుక్కుంటాడు. మనకే గనక దమ్ముంటే చేసి చూపించి మన సత్తా నిరూపించుకోవాలి. ఏ పని చేసినా కొత్తగా చేయాలి. ఇలానే చేయాలి అనే రూల్స్ అన్ని చోట్లా ఉంటాయి. కానీ ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తేనే గొప్పవాళ్లవుతారు. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు.
లిరిక్స్ విన్నవెంటనే పూరి బాగా మెచ్చుకున్నారు. సింగిల్ వెర్షన్‌లో ఓకే. ఇప్పటివరకూ నేను ఆయనకు రాసిన పాటలన్నీ సింగిల్ వెర్షన్‌లో ఓకే చేసినవే. తను రాసే మాటలెంత సూటిగా ఉంటాయో, పాటలు కూడా అదే స్టయిల్లోనే ఉండాలంటారు పూరి. అందుకే ఆయన సినిమాకి పాటలు రాయడమంటే ఓ కిక్కు ఉంటుంది!
- కందికొండ, గీత రచయిత