ఉత్తరం: నష్టం గొడవ వల్ల కాదు...
నవ వధువు... ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానాలు పురాణాలు వేరుగా చెబుతాయి. సమాజం ఒకలా చెబుతుంది. ఆధునికులు ఇంకోలా చెబుతారు. బయటి వారు ఎన్నైనా చెబుతారు. పాటించేవారే వాటిని క్రోడీకరించుకోవాలి. ఎందుకంటే పాత్ర కొత్త.. మనిషి పాత. ప్రతిఒక్కరికి కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటాయి. అందుకే మన సహజ లక్షణాలు ఎలా ఉన్నా కొత్త చోట, కొత్త వ్యక్తులతో ఉన్నపుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇంకొన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా నవ వధువు పాత్ర జీవితంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను రేకెత్తించే పాత్ర. ‘ఇష్టానుసారం’ అన్నది ఏ రూపంలో అయినా కనిపిస్తుంది గానీ క్రమశిక్షణ ఒకే రూపంలో ఉంటుంది అన్న స్పష్టత ఉంటే పరిస్థితులు నెగ్గుకు రావడం చాలా సులువు. క్రమశిక్షణ అంటే అణగిమణిగి ఉండటం కాదు. పద్ధతిగా ఉండటం. జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుకునే ఓ మార్గం.
ప్రతి భర్త తన భార్యకు హీరోలానే కనిపించాలనుకుంటాడు. ఆమె నుంచి తన సమర్థతకు సంబంధించిన ప్రతికూల వ్యాఖ్యలను భరించలేడు. ఆ విషయం ఇద్దరిలో ఇగోలను, ఫ్రస్ట్రేషన్‌ను పెంచుతుంది. కాబట్టి అలాంటి కామెంట్లకు దూరంగా ఉండడం మంచిది. ఒకరి బంధువులపై మరొకరి కామెంట్లు చాలా ఈజీ గోయింగ్ ఉన్న వారికి తప్ప అస్సలు పనికిరావు. ఇలాంటి జంటలు చాలా తక్కువ. పైగా ఇటీవలి కాలంలో వీటిని సరదాగా తీసుకోవడం తగ్గిపోయింది. ఇవి మొత్తం జీవితాన్నే డిజప్పాయింట్ చేస్తాయి. సాధారణంగా గొడవలన్నీ పరిష్కరించుకోగలిగినవే ఉంటాయి... కానీ వాటిలోకి కోపంతో ఇతర విషయాల ప్రస్తావన తేవడం వల్ల గొడవ పడిన కారణం చిన్నదయినా గొడవ పెద్దది అవుతుంది. అసలు... కాపురాన్ని చెడగొడితే... కొసరు... కాపురాన్ని కూలుస్తుంది. కాపురంలో గొడవలు చాలా సాధారణం... కానీ అవి దారితప్పడం వల్లే విషమిస్తాయి. జీవితాలను శాసించే స్థాయికి తీసుకెళ్తాయి. గొడవపడండి కానీ... వాటిని ఆ గొడవకే పరిమితం చేయండి. ఎంత ఫ్రస్ట్రేషన్లోనూ అనవసర విషయాలను గొడవల్లోకి తేకండి. మీ భాగస్వామి అలా తెస్తే స్పష్టంగా హెచ్చరించండి. వీలైతే మౌనంగా ఉండండి. కొన్ని సార్లు మౌనం కూడా శాంతిని ఇస్తుంది.
రోగం కాదు... కానీ ఇబ్బంది!
పౌష్టికాహారం అసలైన రోగ నివారణి. ఇది 99 శాతం మాత్రమే నిజం. స్వచ్ఛమైన పాలు కూడా కాలవ్యవధి మించిన తర్వాత విషపూరితమే. పౌష్టికాహారం అన్నది ఎంత అత్యవసరమో దాన్ని సమయానికి తీసుకోవడం అంతే అవసరం. ఎందుకంటే మిగతా ఏ అనారోగ్యమూ కలిగించని అసౌకర్యాన్ని కలిగించేది గ్యాస్‌ట్రబుల్. దీనికి అతిపెద్ద కారణం...సమయానికి ఆహారం తీసుకోకపోవడం. ఇది ఎవరికీ మంచిది కాదు, స్త్రీలకు అసలు మంచిది కాదు. సమయానికి తినకపోతే మన శరీరం విడుదల చేసే కొన్ని జీర్ణవాయువులు కడుపులో ఆహారం వున్నా లేకున్నా తమ పని అవిచేసుకుంటూ పోతాయి. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే గ్యాస్‌ట్రబుల్‌గా పరిణమిస్తుంది. ఇప్పటికే మీకు ఈ సమస్య వచ్చి అది ప్రాథమిక దశలో ఉంటే...ఇప్పటినుంచి అయినా సమయానికి భోజనం చేయడం ద్వారా అదుపులో ఉంచవచ్చు. ఉదయం లేస్తూనే రెండు గ్లాసుల నీళ్లు తాగండి. రోజులో ఏదో సమయంలో జామ పళ్లు, బొప్పాయి, మజ్జిగ తీసుకోండి. దీంతో కొంతకాలానికి మీ సమస్య బాగా తగ్గుతుంది.