దేశభక్తిని నాటండి
దేశభక్తిని ఇలా వ్యక్తీకరించండి...
‘దేశమును ప్రేమించుమన్నా...’ అన్న మహాకవి అక్కడితో ఆగిపోలేదు. మంచి అన్నది పెంచమన్నాడు. వొట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టమన్నాడు. అందుకే మన దేశభక్తి మాటలకే పరిమితం కాకూ డదు. అది ఆచరణగా వికసించి నలుగురికి ఉపయోగపడాలి. మన దేశభక్తిని ఇలా కూడా వ్యక్తీకరించుకోవచ్చు... రక్తదానం అవయవదానం మొక్కలు నాటడం, వాటి సంరక్షణ క్యూలో పద్ధతి పాటించడం శబ్ధకాలుష్యాన్ని సృష్టించకుండా ఉండడం రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్న అంధులకు సహాయ పడడం వాహనాలను మితిమీరిన వేగంతో నడపకపోవడం పక్షులు, జంతువులను హింసించకపోవడం
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం
ప్రకృతి విలయాలు ఏర్పడినప్పుడు... సంబంధిత ప్రాంతాలకు వెళ్లి మన వంతుగా సహాయ పడడం... ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు మీ దేశభక్తిని ఎలా వ్యక్తీకరించుకుంటారో నిర్ణయించుకోండి.
మిలే సుర్ మేరా తుమ్హారా...
‘మిలే సుర్ మేరా తుమ్హారా’... దేశంలోని భాషా వైవిధ్యానికి మచ్చుతునక ఈ పాట. పద్దెనిమిదేళ్ల కిందట స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పాట మొట్టమొదటిసారిగా ‘దూరదర్శన్’లో ప్రసారమైంది. జాతీయ సమైక్యతను చాటేలా వైవిధ్యభరితమైన చిత్రీకరణతో రూపొందించిన ఈ పాటను ‘దూరదర్శన్’ అప్పట్లో చాలా తరచుగా ప్రసారం చేసేది. అద్భుతమైన స్వరకల్పనతో రూపొందించిన ఈ పాట ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పట్లో... అంటే 1988 నాటికి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరచిన పద్నాలుగు భాషలతో ఈ పాటను రూపొందించారు. పీయూష్ పాండే రచించిన ఈ పాటకు అశోక్ పాట్కీ స్వరకల్పన చేశారు. హిందీతో మొదలయ్యే ఈ పాటలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, మలయాళం, మరాఠీ, మార్వాడీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళ, తెలుగు, ఉర్దూ భాషలు వినిపిస్తాయి. పండిట్ భీమ్‌సేన్ జోషి, లతా మంగేష్కర్, బాలమురళీకృష్ణ వంటి సంగీత దిగ్గజాల గళమాధుర్యం ఈ పాటను అజరామరంగా నిలిపింది.
గ్రామ స్వరాజ్యానికి ఊతం...
గ్రామ రాజ్యం ద్వారా... రామరాజ్యం ఏర్పాటు చేయాలనే జాతిపిత కన్న కలకు ఆచరణ రూపం పంచాయతీరాజ్ వ్యవస్థ. గాంధీజీ దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం అభివృద్ధి చెందాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటు పడే వీలు కలిగింది. గ్రామ పంచాయితీకి ఎక్కువ అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చింది. వనరుల పంపిణీని మెరుగు పరచడానికి, ప్రభుత్వ పనుల్లో గ్రామ ప్రజలు పాల్గొనేలా చేయడానికి, స్థానికంగా ఎక్కువమందికి ఉపాధి కలిగించడానికి, పేదరిక నిర్మూలనకు ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందింది.
నేను సైతం...
సామాజిక విషయాలపై మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరింత పర్ఫెక్ట్‌గా ఉంటారు. ప్రభుత్వ టూరిజమ్ క్యాంపెయిన్ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. కాలేజీ గ్రాడ్యుయేట్లు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ‘టెక్ ఇండియా’ ప్రచారం, ఓటు హక్కు విలువ తెలియజేయడానికి ‘నేషనల్ ఓటర్ మోటివేషన్’ క్యాంపెయిన్ నిర్వహించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘అతిథి దేవోభవ’ ప్రచారాన్ని నిర్వహించారు. పోషకాహార లోపంపై ‘మాల్ న్యూట్రిషన్ క్విట్ ఇండియా’ ప్రచారాన్ని నిర్వహించారు. సినిమా ప్రమోషన్ తప్ప దేశం గురించి పట్టని నటులకు అమీర్‌ఖాన్ కచ్చితంగా ఒక ఆదర్శ నమూనా.