గోరు గిల్లుకోకుండా చేశారు! :
ఆవిష్కరణం
చాలామందికి ఇప్పటికీ గోళ్లు గిల్లుకునే అలవాటు ఉంటుంది. పాపం నెయిల్ కటర్ వచ్చాక వారి పనిని తప్పుపట్టే వారు పెరిగారు. అంతకముందయితే గోళ్లు కత్తిరించుకోవడానికి అదో మార్గం. ఆ తర్వాత అది ఓ చెడ్డ అలవాటు తప్ప ఇంకేం కాదని తేలిపోయింది.
నెయిల్ కటర్ కనిపెట్టడంతో బ్లేడుతో అతి జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సిన బాధ పోయింది. చాలా సింపుల్‌గా ఒక్క నిమిషంలో గోళ్లన్నీ తీసేసుకునే సౌలభ్యం కలిగింది. మనిషి నాగరికత నేర్చి ఇప్పటికి నాలుగువేల సంవత్సరాలు దాటింది. అప్పట్లోనే గోళ్లు తీసుకునే అలవాటు ఉండేది. చిన్న పదునైన కత్తితో వారు గోళ్లు తీసుకునేవారు. చిత్రమేంటంటే... దాదాపు వందేళ్ల క్రితం వరకు కూడా దానికోసం మనవాళ్లు ఏమీ కనిపెట్టలేకపోయారు. 18వ శతాబ్దంలో నెయిల్ కటర్ ఆవిష్కరణ జరిగింది. దీన్ని ఎవరు కనిపెట్టారన్నది సరిగ్గా తెలియదు గాని... తొలి పేటెంట్ మాత్రం 1875లో వేలంటైన్ ఫర్గెటీ అనే ఓ అమెరికన్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న మార్పులతో దాదాపు ఒక యాభై పేటెంట్లు దాకా వేర్వేరు వ్యక్తులు పొందారు. 1947లో విలియం ఇ బాసెట్... కాస్త సౌకర్యవంతంగా దాన్ని రూపొందించారు. ఇదే ఇపుడు అందుబాటులో ఉన్నది.
నెయిల్ కటర్‌లు రెండు రకాలు... మనమే కట్ చేసుకునేవి, ఎక్కువగా ఇళ్లలో వాడే చిన్నవి. ఇంకోటి వైర్ కటర్‌లాగా ఉండేది. ఇది బార్బర్ షాపుల్లో కనిపిస్తుంటుంది. ఇవి కాస్త ఎక్కువ మన్నికగా ఉంటాయి. నెయిల్ కటర్‌తో పాటు వచ్చే నెయిల్ క్లీనర్, నెయిల్ రబ్బర్ కూడా యాభై-అరవై ఏళ్ల క్రితం జతపరిచినవే.