కృష్ణాతీరంలో నౌకావిహారం! | New fleet of boats on Krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణాతీరంలో నౌకావిహారం!

Published Sun, Aug 7 2016 12:34 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

కృష్ణాతీరంలో నౌకావిహారం! - Sakshi

కృష్ణాతీరంలో నౌకావిహారం!

నౌకావిహారం... అదొక అందమైన అనుభూతి... త్యాగరాజంతటి మహానుభావుడు తన కీర్తనలలో ‘ఓడను నడిపే ముచ్చట గనరే’ అంటూ నౌకావిహారం గురించి కీర్తించాడు. శిశువుల నుంచి వృద్ధుల వరకు పడవ ప్రయాణాన్ని ఆనందించనివారు లేరు. ఒకప్పుడు చిన్నచిన్న గ్రామాలకు వెళ్లాలంటే మార్గంలో నది లేదా కాలువ ఉంటే, బల్లకట్టు దాటి వెళ్లేవారు.

వారికి నీటి మీద ప్రయాణం నిత్యకృత్యం.రానురాను నీటి మీద వంతెనలు వచ్చాయి. దాంతో నీటిలో ప్రయాణించి ఆనందించే సౌకర్యం పూర్తిగా కనుమరుైగె పోయింది.ఈ గజిబిజి హడావుడి జీవితంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి అందరూ నీళ్లలో విహరించాలనుకుంటున్నారు.
 
మాయాబజార్ చిత్రంలో సాక్షాత్తు రేవతి బలరాములు, రుక్మిణీ శ్రీకృష్ణులు, శశిరేఖా అభిమన్యులు నౌకావిహారం చేసి, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ గానామృతంలో ఓలలాడినట్లు చిత్రీకరించారు.


కృష్ణాతీరంలోని నౌకావిహార ప్రదేశాలు...
కృష్ణానదీ తీరంలో కనకదుర్గమ్మ కొలువుతీరిన విజయవాడ ప్రకాశం బ్యారే జీ దగ్గరలో ఉంది భవానీ ద్వీపం. ఇక్కడి అమ్మవారు భవాని కనుక, ఈ ద్వీపానికి భవానీ ద్వీపం అని పేరుపెట్టారు. విజయవాడ నగరంలో వినోదస్థలాలు చాలా తక్కువ. వినోదయాత్రలు చేయాలనుకునేవారికి ఇదొక వరం. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
 
ప్రముఖ కంపెనీలు భవానీద్వీపం దగ్గర కృష్ణానదిలో బోటింగ్‌లో సమావేశాలను నిర్వహిస్తూ సిబ్బందికి కొత్తకొత్త అనుభూతుల్ని కలిగిస్తున్నాయి. కృష్ణానది గర్భంలో సుమారు 133 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలోని ఈ ద్వీపంలో ప్రస్తుతం 25 ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నారు. నీటి మధ్య, పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ ఉన్న నాలుగు ట్రీ కాటేజ్‌లు భవానీద్వీపం ప్రత్యేకత.
 
చెట్ల పైఅంచులను తాకుతూ ఉండటం ఈ కాటేజ్‌ల ప్రత్యేకత. ఇంకా...  పర్యాటకుల కోసం 24 డీలక్స్ ఏసీ కాటేజ్‌లు, రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉన్నాయి. విజయవాడలో కృష్ణాతీరంలో బరంపార్కును ఏపీటీడీసీ నిర్వహిస్తోంది. ఇందులో ఏసీ సౌకర్యంతో ఉన్న రూమ్‌లు, ఏసీ రెస్టారెంట్, ఫాస్ట్‌పుడ్ సెంటర్ ఉన్నాయి.

సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, గోవా బీచ్‌లకు దీటుగా భవానీద్వీపంలో పర్యాటకుల సాహసానికి పరీక్ష అన్నట్లు అనేక రకాల అడ్వంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి. వీటిని బెంగుళూరు ప్రీకోర్ట్ కంపెనీ ఏర్పాటు చేసింది. క్లైంబింగ్ వాల్, వాటర్ రోలర్, లో రోప్ కోర్సు, వైన్ ట్రావెర్స్, రైఫిల్ షూటింగ్ వంటి గేమ్స్ ఉన్నాయి. గోవా బీచ్‌లో ఉన్నట్లు వాటర్ స్పోర్ట్స్, ప్యారాషూట్ , స్పీడ్ బోట్, బిగ్ బోట్లు... చాంపియన్ యాచ్ క్లబ్ ఏర్పాటు చేసింది.
 
కృష్ణానదిలో బోటింగ్
బరంపార్కుతో పాటు దుర్గాఘాట్, గుంటూరు జిల్లా లోటస్ హోటల్ నుంచి భవానీద్వీపానికి వెళ్లేందుకు బోటింగ్ సౌకర్యం ఉంది. నదిలో ఉత్సాహంగా బోటింగ్ చేసే వారి కోసం జెట్ స్కై బోట్లు, నదిలో సరదాగా కొద్దిసేపు విహరించే వారి కోసం బోధిసిరి ఏసీ బోట్లు ఉన్నాయి. ఇందులో కనీసం యాభైమంది ఒక సముదాయంగా ఉండాలి. అనేక కార్పొరేట్ కంపెనీలు బోధిసిరి బోట్లలో తమ కంపెనీ కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తూ ఉంటాయి. కేవలం ఒక కుటుంబం మాత్రమే ఆహ్లాదంగా నదిలో విహరించాలనుకుంటే, అలాంటి వారికి స్పీడ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. సరదాగా భవానీద్వీపం చూసి వద్దామనుకునేవారి కోసం భవాని, అమెరికన్ ప్యాంట్యూన్ బోట్లు అందుబాటులో ఉన్నాయి.
 
కృష్ణానదిలో విహరించడానికి బోటింగ్ ధరల వివరాలు:
 భవానీద్వీపం సందర్శించి రావడానికి:
 పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30
 అమెరికన్ ప్యాంటూన్ బోట్ (కనీసం 20 మంది) - ఒకొక్కరికి రూ.50
 స్పీడ్ బోట్లు - ఆరు నిముషాలు (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు)- రూ.300
 జెట్ స్కీ బోటు (వాటర్ స్కూటర్) మూడు నిముషాలు ఒకొక్కరికి ఒక ట్రిప్పు- రూ. 250
 జెట్ స్కీ బోటు (వాటర్ స్కూటర్) ఇద్దరికి ఒక ట్రిప్పు- రూ. 350
 బోధిసిరి ఏసీ బోటు రెండున్నర గంటల పర్యటనకు (శని, ఆది) రూ.10వేలు, (సోమ నుంచి శుక్ర) రూ.8000 అదనంగా ఒక గంట ఉపయోగించుకుంటే రూ.4000 చొప్పున చెల్లించాలి. పర్యాటకుల కోరిక మేరకు బోట్లలోనూ, ద్వీపంలోనూ అధికారులే భోజన ఏర్పాట్లు చేస్తారు.

 
పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న సూర్యలంక బీచ్:
గుంటూరు జిల్లాలోని బాపట్లకు 8 కి.మీ దూరంలో సూర్యలంక బీచ్ ఉంది. అమరావతికి వచ్చేవారు సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్‌కు వెళుతూంటారు. బంగాళాఖాతంలోని మిగిలిన బీచ్‌లు లోతు ఎక్కువగా ఉండి ప్రమాదభరితంగా వుంటాయి. సూర్యలంక బీచ్‌లో లోతు తక్కువగా వుండి, పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.

3.5 కి మీ మేర బీచ్ విస్తరించి ఉన్నప్పటికీ ఒక కి.మీ మాత్రమే పర్యాటక సంస్థ అభివృద్ధి చేసింది. విజయవాడ, హైదరాబాద్‌ల నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. పర్యాటకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీచ్ ఒడ్డున 25 ఏసీ రూమ్‌లు, రెస్టారెంట్‌లు ఉన్నాయి. వాలీబాల్, కబడ్డీ వంటి బీచ్ గేమ్స్ ఉన్నాయి. జెట్‌స్కీ (వాటర్ స్కూటర్) బోట్లు ఇక్కడ ప్రత్యేకం. సముద్రంలో నాలుగు నిముషాల పర్యటన కోసం రూ.250 వసూలు చేస్తారు.
 
నాగార్జునసాగర్....
కృష్ణానదీ తీరంలో నాగార్జునసాగర్‌లో చక్కటి బోటింగ్ లాంచ్ స్టేషన్ ఉంది. సాగర్ డ్యామ్ దగ్గర లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున కొండకు పర్యాటకాభివృద్ధి సంస్థ బోట్లు నడుపుతోంది. లాంచ్ స్టేషన్ నుంచి 14 కి.మీ దూరంలోని నాగార్జున కొండకు వెళ్లేందుకు సుమారు 45 నిముషాలు బోట్లో హాయిగా విహారం చేయవచ్చు.
 
నాగార్జునసాగర్ అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులు నౌకా విహారం చేసి నాగార్జున కొండకు వెడతారు. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయటపడిన క్రీ.పూ 2వ శతాబ్దపు బౌద్ధ అవశేషాలను నాగార్జున కొండ ప్రదర్శనశాల (మ్యూజియం)లో భద్రపరిచారు.

నది మధ్యలో ఉన్న పురావస్తుశాఖ ప్రపంచంలోని మ్యూజియాలన్నింటిలోనూ అతిపెద్ద ఐలాండ్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. బుద్ధుని విగ్రహంతో పాటు బుద్ధుని దంతావశేషం, కర్ణాభరణం, ఆచార్య నాగార్జునుని యజ్ఞశాల ఇందులో దర్శనమిస్తాయి. బౌద్ధ మతగురువు దలైలామా 2003లో ఇక్కడ బోధివృక్షాన్ని నాటారు.
 
శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి నివసించిన ప్రదేశాన్ని సింహళ విహార్‌గా వ్యవహరిస్తారు. కాగా లాంచ్ స్టేషన్‌కు 8 కి.మీ. దూరంలో ‘అనుపు’లో రంగనాథస్వామి దేవాలయం ఉంది. పర్యాటకుల రద్దీని బట్టి అనుపు దేవాలయం నుంచి నాగార్జున కొండకు బోట్లు నడుపుతారు.

కేవలం 15 నిముషాల్లో అనుపు రంగనాథాలయం నుంచి నాగార్జున కొండకు వెళ్లవచ్చు. లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున కొండకు, నాగార్జున సాగర్‌లో 200 మంది కూర్చునే శాంతిశ్రీ, నాగసిరి బోట్లు, 150 మంది కూర్చునే అగస్త్య బోటు, 60 మంది కూర్చునే కృష్ణా బోటు... పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. 45 నిముషాలు నదిలో ప్రయాణించి నాగార్జున కొండకు వెళ్లడానికి రానుపోను పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.90 చెల్లించాల్సి ఉంటుంది.
 
 అమరావతిలో...
 అమరావతిలో అమరలింగేశ్వరుడి దర్శనానంతరం కృష్ణానదిలో పర్యాటకులు విహరిస్తూ ఉంటారు. అయితే అక్కడ ప్రత్యేకంగా బోటింగ్ పాయింట్ లేదు. జాలర్లే బోట్లు, నావలు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని కొద్దిసేపు నదిలోకి తీసుకువెళ్లి తీసుకు వస్తూంటారు.
 - శ్యామ్ ప్రకాష్
 సాక్షి, విజయవాడ
 
 శ్రీశైలం...
కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో కృష్ణానదీ తీరంలో బోటింగ్ పాయింట్ ఉంది. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న భక్తులు సరదాగా కొద్దిసేపు నౌకా విహారం చేస్తారు. 50 మంది కూర్చునే శబరి, మధుమతి బోట్లు, 25 మంది కూర్చునే భ్రమరాంబ బోటు ఉన్నాయి. ఔత్సాహికులైన పర్యాటకుల కోసం నలుగురు కూర్చునే స్పీడ్‌బోటును కూడా నడుపుతున్నారు. స్పీడు బోటులో ఐదు నిముషాల ప్రయాణానికి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన బోట్లలో నదిలో సుమారు 20 నిమిషాల సేపు విహరించవచ్చు. ఇందుకుగాను పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.25 ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement