గోడకు జేబులుంటాయ్..!
ఇంటికి - ఒంటికి
పాత వస్తువులను పడేయకుండా... వాటిని రీసైకిల్ చేసి రీయూజబుల్‌గా మార్చుకోవడాన్ని చాలామంది పెద్ద ప్రాసెస్‌గా భావిస్తుంటారు. కానీ ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే అదెంత సులువో మీకే అర్థమవుతుంది. చిరిగి పోయిన జీన్స్ ప్యాంట్లు అందరింట్లో తప్పకుండా ఉంటాయి. మరి వాటిని పడేయకుండా జాగ్రత్తగా దాచి... వాటికున్న పాకెట్లను కత్తిరించి పక్కన పెట్టుకోవాలి. అలా ఓ అయిదారు పాకెట్లు పోగయ్యాక మీ రీసైక్లింగ్ ప్రారంభించండి.. ఎలా అంటారా?
ముందుగా పెద్ద సైజు జీన్స్ క్లాత్‌ను (అదీ పాత జీన్స్ ప్యాంట్ లేదా జీన్స్ కోట్ తీసుకొని... వాటి కుట్లన్నీ విప్పి వెడల్పాటి క్లాత్‌లా చేసుకోవాలి) తీసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాకెట్లను ఆ క్లాత్‌పై పెట్టి, చుట్టూ కుట్లేస్తే సరి. ఇప్పుడు వాటిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. స్టడీ టేబుల్ దగ్గరున్న గోడకు ఈ ‘పాకెట్ హ్యాంగర్’ను తగిలించి, పెన్స్, స్కేల్స్. సిజర్స్ మొదలైనవెన్నో పెట్టుకోవచ్చు. అలాగే ఈ హ్యాంగర్‌ను హాల్లో తగిలించి, అందులో గాగుల్స్, కీ చెయిన్స్, దువ్వెనలు, మనీ పర్సులు పెట్టుకోవచ్చు. అంతేనా... ఈ హ్యాంగర్‌లో ట్యాబెట్లు పెట్టుకొని మెడికల్ కిట్‌గానూ మార్చుకోవచ్చు. అలాగే సింగిల్ పాకెట్‌కు జీన్స్ క్లాత్ హ్యాండిల్‌ను తగిలించి.. మొబైల్ చార్జింగ్ పౌచ్‌గా వాడుకోవచ్చు. భలేగా ఉన్నాయి కదూ... ఇక మీరూ ట్రై చేయండి.
సేకరణ: నిఖిత నెల్లుట్ల