
సాక్షి, అనంతపురం లీగల్: తహసీల్దారు నోటీసు అందుకొని వీఆర్వోను పంపడమేంటి..? వీళ్లకు ఏమీ తెలియదు. కోర్టుకు వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంటుతో వస్తారా. ఒక ఉద్యోగిలా ఉన్నారా? కక్షిదారుడిలా కనిపిస్తున్నారు.’’ అని అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పి.శ్రీనివాసులు మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరైనా వాళ్లకు చెప్పండి అని ప్రభుత్వ న్యాయవాదికి సూచన చేశారు. ఒక సివిల్ దావాలో నోటీసులు అందుకున్న తహసీల్దార్ గైర్హాజరు కావడమే కాకుండా ఆయన తరఫున వచ్చిన వీఆర్వో జీన్స్ వేసుకుని కోర్టుకు రావడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదరు తహసీల్దారు బదిలీ అయ్యారని, అందుకే హాజరు కాలేకపోయారని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఒకసారి నోటీసులు అందుకున్న తర్వాత ఆ విషయం తర్వాత బాధ్యతలు తీసుకున్న వారికి తెలపాలి కదా? బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి వాయిదాకు తహసీల్దారు హాజరు కావాలని, గౌరవప్రదమైన దుస్తుల్లోనే కోర్టుకు రావాలని చురకలంటించారు.