Jeans Pants
-
ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..
This 25 year old Woman wore tight jeans for 8 hours then had to be admitted in ICU: ఈ రోజుల్లో టైట్ జీన్సే.. ఫ్యాషన్ ఐకాన్! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్ గర్ల్స్ నుంచి ముసలమ్మలదాకా క్యాజువల్ డ్రెస్సింగ్‌లో జీన్స్ భాగమైపోయింది. ఐతే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించినందుకు ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. మరుసటి రోజు డాక్టర్ని సంప్రదించడంతో సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది (ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది). చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు. మరి కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకుంది కూడా. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు మృత్యు కుహరం నుంచి బయటికి వచ్చానని తెల్పింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని టిక్ టాక్ ద్వారా తాజాగా పంచుకుంది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది. అందుకే ఇన్ఫెక్షన్లు వస్తాయి.. నిజానికి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం (అనోరెక్టల్ అబ్సెస్) పేరుకుపోతుంది. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. జీన్స్‌తో జర జాగ్రత్త!! చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?
డిస్పూర్: ఉద్యోగ, ప్రవేశ ఏవైనా పరీక్షలకు అడ్డమైన నిబంధనలు విధిస్తున్నారు. రోజుకు పరీక్ష నిర్వాహకులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో పరీక్ష రాసేందుకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, బాలికలకు అయితే తలలో పిన్ను, బొట్టు మొదలుకుని కాలి మెట్టెల వరకు.. అబ్బాయిలకైతే బెల్ట్, షూస్, ఫుల్ షర్ట్స్ వేసుకోరాదు వంటి వాటితోపాటు చివరకు జీన్స్ ప్యాంట్లకు ఉండే బటన్లు కూడా ఉండొద్దనే నిర్ణయాలు పరీక్షలకు వచ్చేవారికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి విధానంతోనే ఓ విద్యార్థి ఘోర అవమానం ఎదుర్కొంది. చదవండి: నిర్మల్ సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్: చప్పట్లు మోగించిన అమిత్ షా అసోంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరీక్షలు మొదలయ్యాయి. సోనిత్పూర్ జిల్లా తేజ్‌పూర్‌లో ఉన్న గిరిజానంద చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (జీసీఐఎంటీ)లో జరిగిన పరీక్ష రాసేందుకు విద్యార్థిని జూబ్లీ తములి (19) వచ్చింది. తనిఖీలు చేసిన అనంతరం ఆమెను లోపలికి అనుమతిచ్చారు. అయితే పరీక్ష హాల్లోకి వెళ్తుండగా పర్యవేక్షకులు తములిని ఆపివేశారు. పరీక్షకు అందరినీ పంపించినా తనను ఆపడంపై తములి ప్రశ్నించింది. నువ్వు షార్ట్ వేసుకురావడంతో పరీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ అమ్మాయి షాక్‌కు గురయ్యింది. వస్త్రధారణ గురించి ఎక్కడా పేర్కొనలేదు.. పాలన డ్రెస్ వేసుకురావాలని ఎవరూ చెప్పలేదని తములి తెలిపింది. అడ్మిట్, ఆధార్ కార్డు తదితర అన్నీ ఉన్నా కేవలం వస్త్రధారణ సరిగ్గా లేదని అనుమతించకపోవడంపై విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. కంగారుపడుతూ తండ్రి ఒక డ్రెస్ తీసుకువచ్చేందుకు మార్కెట్‌కు పరుగెత్తాడు. పరీక్షకు ఆలస్యమవుతుండడంతో ఇదంతా గమనిస్తున్న తోటి విద్యార్థినులు కళాశాలలోని ఓ కర్టెన్ తీసుకొచ్చారు. హాల్లోకి వెళ్లిన విద్యార్థిని కర్టెన్ కప్పుకునే పరీక్ష రాసింది. బయటకు వచ్చిన అనంతరం తములి కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి ఘోర అవమాన ఘటన నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొలేదు’ అని ఆవేదన చెందింది. ‘షార్ట్స్ వేసుకోవడం ఏమైనా నేరమా?’ అని నిలదీసింది. ‘కళాశాల ఒకవేళ పొట్టి దుస్తులు అనుమతించిందని అనుకుంటే ముందే హాల్ టికెట్లలో పేర్కొనాలి’ అని పేర్కొంది. -
జీన్స్ వేసుకుంటానంటే బాలికను కొట్టి చంపేశారు
డియోరియా: జీన్స్ ప్యాంట్ వేసుకుంటానని పట్టుబట్టిన ఓ బాలికను ఆమె కుటుంబీకులే కొట్టి చంపారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా సవ్రేజీ ఖర్గ్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నేహా పాశ్వాన్ (17) జీన్స్, టాప్ ధరిస్తానంటూ మొండికేయగా కుటుంబసభ్యులు సోమవారం ఆమెను తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డియోరియా–కస్య మార్గంలోని పటన్వా వంతెనపై నుంచి విసిరేశారు. అయితే, ఆ మృతదేహం రైలింగ్‌కు చిక్కుకుని అక్కడే ఉండిపోయింది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అమ్మమ్మ, తాత సహా 10 మంది కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, బాలికను జీన్స్ వేసుకుంటానని చెప్పినందుకే కోపంతో కొట్టి చంపామంటున్న మృతురాలి కుటుంబసభ్యుల మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెనుక వేరే కారణాలు ఉండి ఉండొచ్చుననీ, అవేంటో దర్యాప్తులో వెలుగులో చూస్తాయని చెబుతున్నారు. -
కోర్టుకు జీన్స్ ప్యాంటుతో వస్తారా?
సాక్షి, అనంతపురం లీగల్: తహసీల్దారు నోటీసు అందుకొని వీఆర్వోను పంపడమేంటి..? వీళ్లకు ఏమీ తెలియదు. కోర్టుకు వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంటుతో వస్తారా. ఒక ఉద్యోగిలా ఉన్నారా? కక్షిదారుడిలా కనిపిస్తున్నారు.’’ అని అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పి.శ్రీనివాసులు మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరైనా వాళ్లకు చెప్పండి అని ప్రభుత్వ న్యాయవాదికి సూచన చేశారు. ఒక సివిల్ దావాలో నోటీసులు అందుకున్న తహసీల్దార్ గైర్హాజరు కావడమే కాకుండా ఆయన తరఫున వచ్చిన వీఆర్వో జీన్స్ వేసుకుని కోర్టుకు రావడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు తహసీల్దారు బదిలీ అయ్యారని, అందుకే హాజరు కాలేకపోయారని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఒకసారి నోటీసులు అందుకున్న తర్వాత ఆ విషయం తర్వాత బాధ్యతలు తీసుకున్న వారికి తెలపాలి కదా? బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి వాయిదాకు తహసీల్దారు హాజరు కావాలని, గౌరవప్రదమైన దుస్తుల్లోనే కోర్టుకు రావాలని చురకలంటించారు. -
ప్యాంట్ కోసం కొట్లాట.. తమ్ముడి హత్య!
అలహాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జీన్స్ ప్యాంట్స్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. అలహాబాద్ బెహ్‌మాల్పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర, సురేంద్రలు అన్నదమ్ములు. ఇటీవల సురేంద్ర స్థానిక మార్కెట్లో రెండు జీన్స్ ప్యాంట్స్ కొనుక్కున్నాడు. ఈ ప్యాంట్ల విషయంలో అన్న రాజేంద్రతో చోటుచేసుకున్న చిన్న గొడవ సురేంద్ర ప్రాణాలను తీసింది. ఆగ్రహంతో రాజేంద్ర కత్తితో తమ్మునిపై దాడి చేసి పరారయ్యాడు. త్రీవ్రంగా గాయపడ్డ సురేంద్రను ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రకు నేర చరిత్ర ఉందని, కొద్ది రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. -
జీన్స్ప్యాంట్తో అదేపనిగా కింద కూర్చోకండి!
జీన్స్‌ప్యాంట్ పొందినంత ప్రాచుర్యం ఫ్యాషన్ ప్రపంచంలో మరే ప్యాంట్కూ లేదు. ఇప్పటికీ జీన్స్ ఒక ఫ్యాషన్ సింబల్‌గా రాజ్యమేలుతోంది. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతో దాని ఆధిపత్యం అలా కొనసాగుతోంది. అయితే జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేసి (సక్లముక్లం వేసి) కూర్చోవడం ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ ఎంతమాత్రమూ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు. -
రెండు జీన్స్ కొంటే.. ఒక బొచ్చె ఫ్రీ!
ముంబై : తొంగ్ జీన్స్.. ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న నయా ట్రెండ్. టోక్యో ఫ్యాషన్ వీక్‌లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ వింత మోడల్ జీన్స్‌పై దేశదేశాల సెలబ్రిటీలు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు బిపాషా బసూ, మలైకా అరోరా, సీనియర్ నటుడు రిషీ కపూర్లు తమదైన శైలిలో చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. నేకెడ్ జీన్స్ : డెనిమ్ అంటే తనకెంతో ఇష్టమన్న బిపాషా.. ఫ్యాషన్ పేరుతో జీన్స్ పరువు తీయకండంటూ డిజైనర్లను వేడుకున్నారు. ‘ఇది చాలా బాధాకరం. అసలక్కడ ఏముంది? నెకెడ్ జీన్స్ కాకుంటే!’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు. మరో నటి మలైకా అరోరా.. బిప్స్ కామెంట్లను సమర్థించారు. రెండు కొంటే ఒక బొచ్చె ఫ్రీ : సెటైరికల్ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే సీనియర్ యాక్టర్ రిషీ కపూర్‌ను సైతం తొంగ్ జీన్స్ స్పందించేలా చేశాయి. ‘‘ఇలాంటివి రెండు జీన్స్ కొంటే అడుక్కుతినడానికి ఒక బొచ్చె ఫ్రీ.. త్వరపడండి!’ అంటూ రిషీ చేసిన ట్వీట్ వేల సార్లు రీట్వీట్ అయింది. తొంగ్ జీన్స్ పేరుతో డిజైనర్ మెయికో బాన్ రూపొందించిన ఈ దుస్తులను ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్ పుట్టించిన తొంగ్ జీన్స్.. అప్పటి నుంచీ వార్తల్లో ఉంటూవస్తోంది.. -
గోడకు జేబులుంటాయ్..!
ఇంటికి - ఒంటికి పాత వస్తువులను పడేయకుండా... వాటిని రీసైకిల్ చేసి రీయూజబుల్గా మార్చుకోవడాన్ని చాలామంది పెద్ద ప్రాసెస్‌గా భావిస్తుంటారు. కానీ ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే అదెంత సులువో మీకే అర్థమవుతుంది. చిరిగి పోయిన జీన్స్ ప్యాంట్లు అందరింట్లో తప్పకుండా ఉంటాయి. మరి వాటిని పడేయకుండా జాగ్రత్తగా దాచి... వాటికున్న పాకెట్లను కత్తిరించి పక్కన పెట్టుకోవాలి. అలా ఓ అయిదారు పాకెట్లు పోగయ్యాక మీ రీసైక్లింగ్ ప్రారంభించండి.. ఎలా అంటారా? ముందుగా పెద్ద సైజు జీన్స్ క్లాత్‌ను (అదీ పాత జీన్స్ ప్యాంట్ లేదా జీన్స్ కోట్ తీసుకొని... వాటి కుట్లన్నీ విప్పి వెడల్పాటి క్లాత్‌లా చేసుకోవాలి) తీసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాకెట్లను ఆ క్లాత్‌పై పెట్టి, చుట్టూ కుట్లేస్తే సరి. ఇప్పుడు వాటిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. స్టడీ టేబుల్ దగ్గరున్న గోడకు ఈ ‘పాకెట్ హ్యాంగర్’ను తగిలించి, పెన్స్, స్కేల్స్. సిజర్స్ మొదలైనవెన్నో పెట్టుకోవచ్చు. అలాగే ఈ హ్యాంగర్‌ను హాల్లో తగిలించి, అందులో గాగుల్స్, కీ చెయిన్స్, దువ్వెనలు, మనీ పర్సులు పెట్టుకోవచ్చు. అంతేనా... ఈ హ్యాంగర్‌లో ట్యాబెట్లు పెట్టుకొని మెడికల్ కిట్గానూ మార్చుకోవచ్చు. అలాగే సింగిల్ పాకెట్‌కు జీన్స్ క్లాత్ హ్యాండిల్‌ను తగిలించి.. మొబైల్ చార్జింగ్ పౌచ్‌గా వాడుకోవచ్చు. భలేగా ఉన్నాయి కదూ... ఇక మీరూ ట్రై చేయండి. సేకరణ: నిఖిత నెల్లుట్ల -
నిక్షేపంగా జీన్స్ వేసుకోవచ్చు!
పాఠశాలల్లో టీచర్లు జీన్స్ వేసుకోకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, ఎవరైనా అలా చెప్పి ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటామని... అలా జరగనే జరగదని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రాథమిక విద్య డైరెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లేటపుడు గానీ, విద్యాశాఖ కార్యాలయానికి వచ్చేటపుడు గానీ జీన్స్ ధరించకూడదని చెప్పారు. జీన్స్ వేసుకోవడం అంత బాగోదని, అందువల్ల ఫార్మల్స్ మాత్రమే వేసుకోవాలని ఆ నాలుగు లైన్ల ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేతప్ప అందుకు కారణాలు కూడా ఏమీ ప్రస్తావించలేదు. అయితే, సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి టీచర్లు ఇక నిక్షేపంగా జీన్సు వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చన్న మాట. -
జూ జీన్స్..
పులులు.. ఎలుగుబంట్లు.. జీన్స్ ప్యాంట్లను చింపేస్తున్నాయేంటి అనుకుంటున్నారా.. అది చింపటం కాదు.. జీన్స్‌ను డిజైన్ చేయడం. దీని పేరే ‘జూ జీన్స్’. అర్థం కాలేదా.. అయితే మనం జపాన్‌లోని హిటాచీ నగరంలోని కమినే జూకు వెళ్లాల్సిందే. ఇక్కడే ఈ జూ జీన్స్‌ను జంతువులు డిజైన్ చేస్తాయి. ఇప్పుడు జపాన్‌లో జూ జీన్స్ ఓ కొత్త ట్రెండ్. ఇంతకీ జూ జీన్స్ అంటే ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. సాధారణంగా జీన్స్ అంటే డిజైనర్ల సృష్టి. కానీ ఈ జూ జిన్స్కు జంతువులే డిజైనర్లు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు.. ఈ జీన్స్‌ను డిజైన్ చేస్తాయి. అదెలా అనుకుంటున్నారా సింపుల్.. కొంత డెనీమ్ క్లాత్‌ను తీసుకుని వాటిని జూలో జంతువుల మందు పడేస్తారు. అవి వాటిని తమ పళ్లు, గోర్లతో ఇష్టానుసారం చింపేస్తాయి. అలా చింపిన క్లాత్‌ను తీసుకుని జీన్స్ ఫ్యాంట్లను డిజైన్ చేస్తారన్నమాట. ఇంతకీ ఈ జీన్స్ ఖరీదు ఎంతనుకుంటున్నారు జస్ట్ 1,200 డాలర్లే. అంటే మన కరెన్సీలో రూ.72 వేలు. -
ఆజన్మం: హేతువు ‘జీన్సు’
ఉంటేగింటే, మనకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికే దేవుడుగానీ, దేవుడే ఒక సమస్య ఎందుక్కావడం? జీన్సు ప్యాంటు వేసుకోగానే దేవుణ్ని తృణీకరించే శక్తి ఏదో వచ్చేస్తుందేమోనని నాకు కొన్నిసార్లు అనిపించేది. అందుకే ఫ్యాషన్‌తో కూడిన వేషధారణలో ఎవరైనా అమ్మాయో, అబ్బాయో దేవుడి ముందు మోకరిల్లగానే నాకు ఆశ్చర్యం వేసేది. బహుశా, ఆధునికతను నేను తర్కానికి ప్రాతినిధ్యంగా భావించానేమో! నేనేమీ దేవుడి భావనను నిరాకరించట్లేదు. దేవుడికి ఆలంబనగా ఉన్న మతం ఉండటంలోని మౌఢ్యం, లేకపోవడంలోని శూన్యం రెండూ ఆందోళనకు గురిచేసేవే! ఇప్పటికిప్పుడు ఏదో ఒక పక్షం వహించేసి, దేవుడి ఉనికిని నిర్ధారించేసి, ఒక నివేదిక ఇచ్చేయడంలో నాకేమీ ఆసక్తి లేదు. అందుకే సంశయవాదిగానే ఉండిపోదలిచాను. దీనికిదే చేరుకోవాల్సిన తీరం ఏమీ కాదు. ఇప్పటికి ఇదొక మజిలీ. నైతిక దారిలోకి జనాన్ని మళ్లించగలిగే శక్తి మతాలకు తప్ప చట్టాలకు లేదు, అనుకునేవాణ్ని. కానీ, కొట్టిన కొబ్బరి ముక్కను కళ్లకద్దుకుని నోట్లో వేసుకుంటున్న ఏ ప్రౌఢో తలారబోసుకున్నట్టు తెలిపే తడి వీపు కలిగించే రసానందాన్ని ఏ నైతికాదర్శం మాత్రం ఆపగలదు! దేవుడంటే మనిషి తన అశక్తతను భావరూపంగానో, భౌతికరూపంగానో వెల్లడించుకోవడం కావొచ్చు. ‘ఇదిగో, దీని గురించి వంద కారణాలు ఆలోచించాను; నేను ఆలోచించని ఆ నూటా ఒకటవదాని వల్ల ఇబ్బంది వస్తే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లే’దని ఒక వినయాన్ని, తన చేతిలో లేనితనాన్ని ప్రదర్శించుకోవడమే దైవభావన కావొచ్చు. అయితే, ఈ దేవుడు, సృష్టి లాంటి చాలా పెద్ద ప్రశ్నల గురించి ఆలోచించకుండా కూడా ఉన్న జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం సాధ్యమేనని తలచిన సంజయ బేలట్టిపుత్తుడు లాంటివాళ్లు నడిచిన నేల ఇది. ఉన్నాడా? అని నువ్వు నన్నడిగితే ఉన్నాడనొచ్చు నేను; కానీ అలాచెప్పను; అలా అని లేడనికూడా చెప్పను, అంటాడు బౌద్ధానికి ప్రేరణ కాగలిగిన బేలట్టిపుత్తడు. ఏదో ఒక వర్గంలోకి చేరిపోయే ఒత్తిడి నుంచి, ఇలాంటి ఒక మహితోక్తి మనల్ని మరింత సౌకర్యంగా మనం ఉన్న నేలమీద నిలబడేలా చేస్తుంది. కాదా మరి! ఉంటేగింటే, మనకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికే దేవుడుగానీ, దేవుడే ఒక సమస్య ఎందుక్కావడం? - పూడూరి రాజిరెడ్డి చప్పుడు సంగీతం కొన్నిసార్లు ఎవరూ పక్కన ఉండని ఒంటరితనంలోకి ‘రోజు’ మనల్ని జారవిడుస్తుంది. అన్నిసార్లూ ఒంటరితనం ఏకాంతపు వేడుక కాలేదు. గదిలో గోడలు తప్ప వాటేసుకోవడానికి ఇంకేమీ ఉండవు. ఒక పలకరింపు కోసం చెవులు వాచిపోయివుంటాయి. ఇలాంటి తీవ్రమైన ఏకాకితనంలోకి కూరుకుపోయినప్పుడు, పక్కనెక్కడో వినబడే ట్రాక్టరు చప్పుడు కూడా ఒక ఆత్మీయమైన పూరింపు కాగలుగుతుంది. మామూలుగా కటువుగా ఉండే దాని శబ్దంలో ఒక లయ ఏదో గోచరిస్తుంది. దాని వెనకే మరో బండి శబ్దం. ‘గుడ్గుడ్గుడ్గుడ్.’ ఎవరిదో గేటు తీసిన చప్పుడు. ‘క్కీచ్చ్చ్.’ ‘స్సపోటా’ ‘స్సపోటా’ పిలుపు ఎక్కడో. ఒక శబ్దం చుట్టూ దేహం మొత్తం పరిభ్రమిస్తుంది. శబ్దమే ఒక రూపమై మనసును ఆక్రమిస్తుంది. ట్రాక్టరు చప్పుడు క్రమంగా చిన్నదైపోయి అంతమవుతుంటుంది. అలా దూరమైపోయే శబ్దం కాసేపు హృదయంలో గడిపి వెళ్లిన అతిథిలాగా బాధపెడుతుంది. ఇప్పుడు, ఈ మోటార్‌బైక్ ఆ ట్రాక్టర్‌ను అందుకునివుంటుంది! ఆ రెంటికీ మధ్య ఏదో ఒక బంధం కలుపుకోవాలని మనసు ఆరాటపడుతుంది. ఈ ప్రపంచం కూడా నిత్య అలికిడి, రొద, గందరగోళం. దీనికి శాశ్వతంగా దూరం జరిగి, ఒక్కరమై వెళ్లిపోయేప్పుడు మాత్రమే దీనంతటిలోనూ మొత్తంగా ప్రీతిపాత్రమయ్యేదేదో ఉంటుందేమో!