ఆజన్మం: హేతువు ‘జీన్సు’
ఉంటేగింటే, మనకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికే దేవుడుగానీ, దేవుడే ఒక సమస్య ఎందుక్కావడం?
జీన్సు ప్యాంటు వేసుకోగానే దేవుణ్ని తృణీకరించే శక్తి ఏదో వచ్చేస్తుందేమోనని నాకు కొన్నిసార్లు అనిపించేది. అందుకే ఫ్యాషన్‌తో కూడిన వేషధారణలో ఎవరైనా అమ్మాయో, అబ్బాయో దేవుడి ముందు మోకరిల్లగానే నాకు ఆశ్చర్యం వేసేది. బహుశా, ఆధునికతను నేను తర్కానికి ప్రాతినిధ్యంగా భావించానేమో!
నేనేమీ దేవుడి భావనను నిరాకరించట్లేదు. దేవుడికి ఆలంబనగా ఉన్న మతం ఉండటంలోని మౌఢ్యం, లేకపోవడంలోని శూన్యం రెండూ ఆందోళనకు గురిచేసేవే! ఇప్పటికిప్పుడు ఏదో ఒక పక్షం వహించేసి, దేవుడి ఉనికిని నిర్ధారించేసి, ఒక నివేదిక ఇచ్చేయడంలో నాకేమీ ఆసక్తి లేదు. అందుకే సంశయవాదిగానే ఉండిపోదలిచాను. దీనికిదే చేరుకోవాల్సిన తీరం ఏమీ కాదు. ఇప్పటికి ఇదొక మజిలీ.
నైతిక దారిలోకి జనాన్ని మళ్లించగలిగే శక్తి మతాలకు తప్ప చట్టాలకు లేదు, అనుకునేవాణ్ని. కానీ, కొట్టిన కొబ్బరి ముక్కను కళ్లకద్దుకుని నోట్లో వేసుకుంటున్న ఏ ప్రౌఢో తలారబోసుకున్నట్టు తెలిపే తడి వీపు కలిగించే రసానందాన్ని ఏ నైతికాదర్శం మాత్రం ఆపగలదు!
దేవుడంటే మనిషి తన అశక్తతను భావరూపంగానో, భౌతికరూపంగానో వెల్లడించుకోవడం కావొచ్చు. ‘ఇదిగో, దీని గురించి వంద కారణాలు ఆలోచించాను; నేను ఆలోచించని ఆ నూటా ఒకటవదాని వల్ల ఇబ్బంది వస్తే మాత్రం నేను చేయగలిగింది ఏమీ లే’దని ఒక వినయాన్ని, తన చేతిలో లేనితనాన్ని ప్రదర్శించుకోవడమే దైవభావన కావొచ్చు.
అయితే, ఈ దేవుడు, సృష్టి లాంటి చాలా పెద్ద ప్రశ్నల గురించి ఆలోచించకుండా కూడా ఉన్న జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం సాధ్యమేనని తలచిన సంజయ బేలట్టిపుత్తుడు లాంటివాళ్లు నడిచిన నేల ఇది. ఉన్నాడా? అని నువ్వు నన్నడిగితే ఉన్నాడనొచ్చు నేను; కానీ అలాచెప్పను; అలా అని లేడనికూడా చెప్పను, అంటాడు బౌద్ధానికి ప్రేరణ కాగలిగిన బేలట్టిపుత్తడు. ఏదో ఒక వర్గంలోకి చేరిపోయే ఒత్తిడి నుంచి, ఇలాంటి ఒక మహితోక్తి మనల్ని మరింత సౌకర్యంగా మనం ఉన్న నేలమీద నిలబడేలా చేస్తుంది. కాదా మరి! ఉంటేగింటే, మనకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికే దేవుడుగానీ, దేవుడే ఒక సమస్య ఎందుక్కావడం?
- పూడూరి రాజిరెడ్డి
చప్పుడు సంగీతం
కొన్నిసార్లు ఎవరూ పక్కన ఉండని ఒంటరితనంలోకి ‘రోజు’ మనల్ని జారవిడుస్తుంది. అన్నిసార్లూ ఒంటరితనం ఏకాంతపు వేడుక కాలేదు. గదిలో గోడలు తప్ప వాటేసుకోవడానికి ఇంకేమీ ఉండవు. ఒక పలకరింపు కోసం చెవులు వాచిపోయివుంటాయి.
ఇలాంటి తీవ్రమైన ఏకాకితనంలోకి కూరుకుపోయినప్పుడు, పక్కనెక్కడో వినబడే ట్రాక్టరు చప్పుడు కూడా ఒక ఆత్మీయమైన పూరింపు కాగలుగుతుంది. మామూలుగా కటువుగా ఉండే దాని శబ్దంలో ఒక లయ ఏదో గోచరిస్తుంది.
దాని వెనకే మరో బండి శబ్దం. ‘గుడ్‌గుడ్‌గుడ్‌గుడ్.’ ఎవరిదో గేటు తీసిన చప్పుడు. ‘క్కీచ్చ్‌చ్.’ ‘స్సపోటా’ ‘స్సపోటా’ పిలుపు ఎక్కడో.
ఒక శబ్దం చుట్టూ దేహం మొత్తం పరిభ్రమిస్తుంది. శబ్దమే ఒక రూపమై మనసును ఆక్రమిస్తుంది.
ట్రాక్టరు చప్పుడు క్రమంగా చిన్నదైపోయి అంతమవుతుంటుంది. అలా దూరమైపోయే శబ్దం కాసేపు హృదయంలో గడిపి వెళ్లిన అతిథిలాగా బాధపెడుతుంది. ఇప్పుడు, ఈ మోటార్‌బైక్ ఆ ట్రాక్టర్‌ను అందుకునివుంటుంది! ఆ రెంటికీ మధ్య ఏదో ఒక బంధం కలుపుకోవాలని మనసు ఆరాటపడుతుంది.
ఈ ప్రపంచం కూడా నిత్య అలికిడి, రొద, గందరగోళం. దీనికి శాశ్వతంగా దూరం జరిగి, ఒక్కరమై వెళ్లిపోయేప్పుడు మాత్రమే దీనంతటిలోనూ మొత్తంగా ప్రీతిపాత్రమయ్యేదేదో ఉంటుందేమో!