ఆ సీన్- ఈ సీన్
‘అవర్ హాస్పిటాలిటీ’ అనే సినిమా గురించి మామూలుగా అయితే గొప్ప సినీ ప్రేమికులకు తప్ప ఎవరికీ తెలియకపోవచ్చు. అద్భుతమైన హాలీవుడ్ సినిమాలను వెదికి వెదికి చూసే వారికి తప్ప ఈ సినిమా గురించి మరొకరికి అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే అది దాదాపు 90 సంవత్సరాల కిందట వచ్చిన ఒక అమెరికన్ సెలైంట్ సినిమా అది! యూట్యూబ్‌లో నిక్షిప్తం అయినప్పటికీ ఈ సినిమా గురించి తెలుగు వారికి తెలిసే తక్కువ.
అయితే ఎప్పుడైతే ‘మర్యాదరామన్న’ సినిమా వచ్చిందో అప్పటినుంచి ‘అవర్ హాస్పిటాలిటీ’ సినిమా తెలుగువారికి బాగా పరిచయం అయింది. సునీల్ హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాదరామన్న’ సినిమాలో హాలీవుడ్ సెలైంట్ సినిమా మూలాలున్నాయనే ప్రచారం ‘అవర్ హస్పిటాలిటీ’ సినిమాను చూడాలనే ఆకాంక్షను చాలా మందిలో పెంచింది. మరి ఇలా చూసిన వారు స్టన్ అయ్యేలా ఉంటుంది రాజమౌళి అండ్ కో చేసిన అనుకరణ.
బస్టర్ కీటన్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘అవర్‌హాస్పిటాలిటీ’ సినిమాకు రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన ‘మర్యాదరామన్న’కు తేడాలు చెప్పాలంటే... మొదటి మూకీ, రెండోది టాకీ! బాగా ఆలోచించి మరోటి చెప్పమంటే... హాలీవుడ్ సినిమా బ్లాక్‌అండ్ వైట్, టాలీవుడ్ సినిమా కలర్. కథ, కథనాల్లో పెద్ద తేడాలు లేవు. రెండు సినిమాలనూ చూస్తే తెలుగు వెర్షన్‌లో కొత్త మలుపులేవీ కనిపించవు.
‘అవర్‌హాస్పిటాలిటీ’ కథ చెప్పాలంటే... అమెరికా దక్షిణప్రాంతం నుంచి న్యూయార్క్‌కు వలస వచ్చిన కుటుంబానికి చెందిన హీరో తమ పూర్వీకుల ఆస్తుల కోసం స్వగ్రామానికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో రైల్లో హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరో వెళ్లాల్సిన ఊరికే చెందిన ఆమె అతడిని తనింటికి తీసుకెళ్లడం, హీరో నేపథ్యం తెలియక హీరోయిన్ తండ్రి అతడికి ఆశ్రయం ఇవ్వడం... తర్వాత శత్రువు అని గుర్తించాక చంపేయాలని నిర్ణయించుకోవడం...
ఆ హత్య ఇంట్లో మాత్రం జరగకూడదు, ఎందుకంటే అతిథిని హత్య చేయడం ‘మర్యాద’ కాదని ఇంటి బయట గడపదాటి అడుగుపెట్టాకే చంపడానికి నిర్ణయించుకోవడం... ఈ విషయం తెలిసి హీరో వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం... చివరకు కథ సుఖాంతం కావడం... అంతా ఏ మలుపు లేకుండా మొత్తంగా ‘మర్యాదరామన్న’లో కనిపించేదే!
మూలకథను తీసుకొని ఆ పాయింట్‌ను డెవలప్ చేసుకోవడం ఒక ఎత్తు. అయితే ‘మర్యాదరామన్న’ రూపకర్తలు మాత్రం ఎక్కడా మొహమాటపడలేదు.
మర్యాదరామన్న... ఆ చిత్రానికి మూలమైన ఇంగ్లిష్ సినిమా ‘అవర్ హాస్పిటాలిటీ’
గడప దాటితే తనను చంపేస్తారని అర్థం చేసుకొన్న హీరో... ఇంట్లోనే మకాం పెట్టడానికి వేసే ఎత్తులన్నీ ‘అవర్‌హాస్పిటాలిటీ’ మూకీ సినిమాలోనివే! కొత్త ఐడియాలు రాలేదో ఏమో కానీ... దేన్నీ వదలకుండా అన్నింటినీ వాడేసుకొన్నారు. అయితేనేం... ‘మర్యాద రామన్న’ పెద్ద హిట్. తెలుగు వరకూ ఈ సినిమా ఒక సంచలనం. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందించినదనే ప్రచారం ఈ సినిమా స్థాయిని ఏమీ తగ్గించదు. రాజమౌళి దర్శకత్వ శైలి అసలు కథను చక్కటి సినిమాగా మార్చింది.
తెలుగులో ఈ సినిమా హిట్ అయిన తర్వాత కన్నడ మొదలు తమిళ, హిందీ, బెంగాళీ, మలయాళ భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. హిందీలో తప్ప అన్ని చోట్లా హిట్ అయింది. అయితే ఎక్కడకు వెళ్లినా ‘ఈ సినిమా కాపీ అనీ, హాలీవుడ్ మూకీ సినిమాను కాపీ కొట్టి ఈ సినిమాను రూపొందించారని’ విమర్శకుల కామెంట్ కామన్‌గానే వినిపించింది.
పీఎస్: ‘మర్యాదరామన్న’ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ఇది ఒక ‘మారుమూల’ కథ అని వేస్తారు. మరి ఆ మారుమూల కథ క్రెడిట్‌ను దాన్ని రాసిన వారికే ఇచ్చేస్తే మరింత గౌరవంగా ఉండేదేమో!
- బి.జీవన్ రెడ్డి
ఈ టాకీకి మూలం... ఆ మూకీ!
Published Sun, Jun 28 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement