అందంగా... ఆకర్షణీయంగా... పేపర్ బ్యాగ్ | Paper bag: Paper bag pretty ... impressive ... | Sakshi
Sakshi News home page

అందంగా... ఆకర్షణీయంగా... పేపర్ బ్యాగ్

Published Sun, Mar 29 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

Paper bag: Paper bag pretty ... impressive ...

మీరే పారిశ్రామికవేత్త
పాత వార్తాపత్రికలను కత్తిరించి చక్కగా మడతపెట్టి జిగురుతో అతికిస్తే చక్కటి సంచి తయారవుతుంది. పాతికేళ్ల కిందట మందుల దుకాణాలతోపాటు చిన్న చిన్న కిరాణా దుకాణాలు విరివిగా ఉపయోగించిన కవర్లు ఇవే. అప్పట్లో అనేక కుటుంబాల్లో మహిళలు, పిల్లలు ఈ పని చేసుకుంటూ దుకాణాల్లో అమ్మి చేతి ఖర్చులకు డబ్బు సంపాదించుకునే వారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వచ్చిందో ఈ ఉపాధి అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అది పరిశ్రమ రూపు సంతరించుకుని మార్కెట్‌లో విహరిస్తోంది. ఈ పరిశ్రమ స్థాపించాలంటే...
 
యాభై నుంచి ఎనభై లక్షల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్రారంభించవచ్చు. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉత్పత్తికి చేత్తోనే చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఒకటి - రెండు గదులు సరిపోతాయి. లక్షా- రెండు లక్షల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు. ముడి సరుకు సర్దుకోవడానికి, తయారైన వస్తువులను పెట్టుకోవడానికి ర్యాక్‌లు - రెండు (ఒక్కొక్కటి 2,500), అల్మైరా - ఒకటి (ఆరేడు వేలు), ఫోల్డింగ్ మెషీన్ (చేతితో పని చేసే చిన్న మెషీన్) - పది వేల లోపు. ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - 2, కత్తెర - 1, పెద్ద స్కేలు - 1, టేపు - 1 ఐదొందల్లో వస్తాయి.
 
 ముడిసరుకు... కనీసంగా కావల్సినవి పేపర్, ఐలెట్స్, త్రెడ్, ఫెవికాల్. ఆకర్షణీయంగా తయారు చేయడానికి అలంకరణలు పెంచుకోవచ్చు. అలాగే వినియోగదారుల అవసరాన్ని, వారి బడ్జెట్‌కి అనుగుణంగా సంచి తయారు చేసివ్వడం కోసం రకరకాల పేపర్లు అందుబాటులో ఉంచుకోవాలి. క్రాఫ్ట్ పేపర్, ఆర్ట్‌బోర్డు పేపర్, ఆర్ట్ కార్డ్ పేపర్, హ్యాండ్‌మేడ్ పేపర్... ఇలా చాలా రకాలుంటాయి. అలాగే కాగితం మందం కూడా ముఖ్యమే.
 
 శిక్షణ గురించి...
 భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘వందేమాతరం’ పథకం ద్వారా ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తోంది. ఎలీప్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ శిక్షణ కార్యక్రమాలకు కనీస విద్యార్హత ఐదవ తరగతి ఉన్న 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు హాజరుకావచ్చు.
 
 నేర్చుకున్న తర్వాత...
 స్వయంగా పరిశ్రమ స్థాపించవచ్చు. ఇతర పరిశ్రమల్లో ఉద్యోగం పొందవచ్చు లేదా పరిశ్రమల నిర్వాహకుల నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి దగ్గరే తయారు చేసుకుని ఒక్కొక్క సంచి తయారీకి తగిన వేతనాన్ని (పీస్ లెక్కన) పొందవచ్చు. ఈ విధానంలో మార్కెట్ ఒత్తిడి ఉండదు. పరిశ్రమ స్థాపించి ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఎలీప్ సంస్థ ‘విపణి’ అనే కార్యక్రమం ద్వారా మార్కెట్ కల్పిస్తోంది.
 
 పని నేర్చుకుంటున్నాం... పని చేస్తున్నాం...
 మాది నల్గొండ జిల్లా హుజూర్‌నగర్. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసి ఫార్మా రంగంలో ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఎలీప్‌లో శిక్షణ తీసుకుని స్నేహితురాలితో కలిసి పరిశ్రమ ప్రారంభించాను.
 - వాసిరెడ్డి శిరీష, 9494428686
 
 మార్కెట్ మీద పట్టు...
 మాది వరంగల్. శిరీష బాబు, మా పాప ఒకే క్లాస్ కావడంతో మాకు పరిచయమైంది. అప్పటికే శిరీష జైపూర్, మహారాష్ట్రలు తిరిగి పరిశ్రమ నిర్వహణ, ముడిసరుకు దొరికే ప్రదేశాలను తెలుసుకుంది
 - మడిశెట్టి అర్చన, 9642444450
 
 శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ ఇలా... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో ఉదయం 11 గంటల నుంచి - సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చు.
 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement