
నెమలీక... దేనికి ప్రతీక?
నమ్మకం
నెమలీకను అశుభంగా భావించేవాళ్లు కూడా కొందరు ఉన్నారు. మధ్య ఐరోపా ప్రాంతాల వారికి నెమలీకను చూస్తే టై. నెమలీకల మీద ఉండే కన్నుల్ని చూస్తే... దురదృష్టం వేయి కళ్లతో తమనే చూస్తోందన్నట్టుగా ఫీలవుతారు వారు. నిద్రపోయేటప్పుడు తలవైపున గానీ నెమలీక ఉందో... ఆ మనిషి చచ్చిపోతాడని అంటారు. అందుకే పొరపాటున కూడా వాటిని ఇంట్లో పెట్టుకోరు.
ఓ సినిమాలో హీరోయిన్‌ని హీరోగ్యాంగ్ ర్యాగింగ్ చేయాలనుకుంటుంది. ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని వారు లాక్కుంటారు. దాన్ని తెరిచి చూస్తే నెమలీక కనిపిస్తుంది. ‘ఇది ఎందుకు?’ అంటే... ‘పిల్లల్ని పెడుతుంది’ అంటూ అమాయకంగా చెబుతుందా అమ్మాయి. ఆమె మాట విని కుర్రాళ్లంతా నవ్వుతారు.
సినిమాలో కాబట్టి నవ్వి ఉంటారు. కానీ ఇప్పటికీ నెమలీకను పుస్తకంలో పెడితే పిల్లల్ని పెడుతుందని నమ్మేవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వాటిని పుస్తకంలో పెట్టడమే కాదు... కొబ్బరి చెట్టుకు ఉండే తెల్లని పిండిలాంటి పదార్థాన్ని తెచ్చి, ఆ నెమలీకకు మేత కూడా వేస్తుంటారు. అసలీ నమ్మకం ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు దీన్ని ఏర్పరిచారు అని అడిగితే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే, ఎవరికీ తెలియదు కాబట్టి.
ప్రపంచంలోని పలు దేశాల్లో నెమలీకలను దాచుకోవడం కనిపిస్తుంది. వాళ్ల పురాణాలు, చరిత్రలో నెమలికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. అందుకే వాళ్ల జీవితాల్లోకి నెమలీక వచ్చి చేరింది.
గ్రీకు పురాణాల్లో హెరా అనే దేవత ఉంది. అసలు నెమలిని సృష్టించింది ఆవిడేనంటారు వాళ్లు. ఆర్గస్ అనే దేవుడికి ప్రతీకగా ఆమె నెమలిని సృష్టించిందట. ఆర్గస్‌కి వంద కన్నులు ఉంటాయట. ఆ కన్నులకు ప్రతీకలుగా నెమలి పింఛంలో ఇన్ని కన్నులను పెట్టిందని అంటారు. ఆర్గస్ జ్ఞానదేవుడు కాబట్టి నెమలి కూడా జ్ఞానానికి ప్రతీక అని వారు నమ్ముతారు. నెమలి ఈకలను దాచుకుంటే, జ్ఞానసంపద వారిని వదిలిపోదని విశ్వసిస్తారు. అదే రోమన్లు అయితే నెమళ్లను రాజపక్షులుగా భావించేవారు. రాణుల దగ్గర ఇవి ఉండేవట. అందుకే నెమలి రాజసానికి గుర్తు అంటారు వారు.
పలు ఆసియా దేశాలవారు నెమలిని క్వాన్-యిన్ అనే దేవతకు ప్రతీకగా పేర్కొంటారు. క్వాన్-యిన్ ప్రేమకి, దయకి, నమ్మకానికి గుర్తు. అందుకే ఆ దేవుడిని విశ్వసించేవారు నెమలి ఈకను తమతో ఉంచుకుంటే, తమ ప్రేమ ఫలిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, క్వాన్-యిన్ మరణించలేదని, కేవలం అంతర్థానమయ్యిందని, తన భక్తులను కాపాడుతూ తమ మధ్యనే తిరుగుతూ ఉంటుందని కూడా అనుకుంటారు. అందుకే నెమలి ఈకను దగ్గర ఉంచుకుంటే, ఆ దేవత తమతో ఉన్నట్టేనంటారు. మంగోలు యుద్ధవీరులైతే సమరానికి వెళ్లేటప్పుడు నెమలీకలను ధరించేవారు. అలా చేస్తే తప్పక విజయం వరిస్తుందని వారి నమ్మకం!
భారత దేశంలో కూడా నెమలికి ప్రాముఖ్యం ఉంది. కుమారస్వామికి నెమలి వాహనం అని హిందూ పురాణాల్లో ఉంది. అందుకే నెమలిని పవిత్రంగానే చూస్తారు మన దేశంలో. అలాగే మరికొన్ని మతాల్లో నెమలిని పారదర్శకతకు, నిష్కాపట్యానికి చిహ్నంగా భావిస్తారు. మరికొన్ని మతాల్లో నెమలిని ధైర్యానికి, నిజాయతీకి, వినయ విధేయతలకు, క్రమశిక్షణకు కూడా ప్రతీకగా భావించడం జరుగుతోంది. నెమలీకను తమ దగ్గర ఉంచుకుంటే ఆ లక్షణాలు తమకూ అబ్బుతాయని బలంగా విశ్వసించేవారు కోకొల్లలు.
అయితే పురాణాల్లో ఆధారాలు ఉన్నవాటి సంగతి వదిలేస్తే... మిగతావారికి ఆ నమ్మకం కలగడానికి కారణం వేరే ఉంది. నెమళ్లు చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటాయి. అంటే తమతో జతకట్టిన వాటిని, తమకు పుట్టిన పిల్లలను ఎంతో ప్రేమగా చూస్తాయి. ఏ ఆపదా రాకుండా కాపాడుకోవాలని తపన పడుతుంటాయి. అలాగే వాటి జీవన విధానం కూడా ఓ క్రమ పద్ధతిలో ఉంటుంది. ఆహార సేకరణ నుంచి... ప్రతి విషయంలోనూ అవి ఓ చక్కని క్రమశిక్షణను కలిగివుంటాయి. బహుశా ఆ లక్షణాల వల్లే వాటిని ప్రేమాభిమానాలకు, క్రమశిక్షణకు ప్రతీకలుగా భావించడం మొదలుపెట్టి ఉంటారనే వాదన ఉంది. ఇలా వాదనలు, అభిప్రాయాలు తప్ప... ఇలాంటి కొన్ని నమ్మకాలకు కచ్చితమైన ఆధారాలను చూపించడం కాస్త కష్టమే!