
హ్యూమరం: రాజకీయ పాఠాలు
ఎన్టీయార్ భవన్‌లో పొలిటికల్ క్లాస్. చేతిలో ఒక పిల్లిని పట్టుకుని చంద్రబాబు వేదిక ఎక్కాడు.
‘‘తమ్ముళ్లూ, ఇదేమిటి?’’ అని అడిగాడు. ‘‘పిల్లి’’ అని అరిచారు తమ్ముళ్లు.
‘‘ఇది పిల్లి కాదు కుక్క. రాజకీయాల్లో పిల్లిని చూసి కుక్క, కుక్కని చూసి నక్క అనాలి. దీన్ని దృష్టికోణం అంటారు. లంబకోణం, త్రికోణం, కుంభకోణం అన్ని ఒక్కలా కనిపించినా దేని కోణం దానిదే. ఇప్పుడు ఇంకో ప్రశ్న. మన రాష్ట్రంలో ప్రముఖ వ్యవసాయవేత్త ఎవరు?’’
అందరూ బుర్రలు గోక్కున్నారు.
రేవంత్‌రెడ్డి లేచి, ‘‘రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప వ్యవసాయవేత్త చంద్రబాబు. ఆయన రెండెకరాల పొలాన్ని దున్ని, చెమటోడ్చి నీళ్లు లేని చిత్తూరు జిల్లాలో బంగారం పండించి, రెండు వేల ఎకరాలను కొన్నాడు. ఆయన వడ్లు నాటితే దుడ్లు పండుతాయి’’ అని అప్పజెప్పాడు.
‘‘చక్కటి సమాధానం. ఇప్పుడింకో ప్రశ్న? హైదరాబాద్ ఎవరు నిర్మించారు?’’
‘‘చంద్రబాబు నిర్మించెను’’ అని చెప్పారు తమ్ముళ్లు.
‘‘వెరీ గుడ్. ఎలా నిర్మించాడో విడమరిచి చెప్పండి?’’
ముద్దు కృష్ణమనాయుడు లేచి, ‘‘నగరంలో ఆయన రోడ్లు నిర్మించెను. రోడ్డుకు అడ్డమని ఇరువైపులా ఉన్న చెట్లు కొట్టించెను. గోల్కొండ కోటకు సున్నం కొట్టించెను. చివరగా ప్రజలకు గుండు కొట్టించెను’’ అని చెప్పాడు.
‘‘వెరీగుడ్. ఇప్పుడు గణితంలో ఓ ప్రశ్న? సున్నా అనగా ఏమి?’’ అడిగాడు బాబు.
‘‘సున్న అనగా శూన్యం. ప్రజల్ని శూన్య స్థితిలో తీసుకెళ్లడమే మన లక్ష్యం. కోట్లలో ఉన్న మన ఆస్తిని లక్షల్లో చూపాలనుకున్నప్పుడు కొన్ని శూన్యాలు తీసివేయాలి. మన హయాంలో సాధించిన అభివృద్ధిని చెప్పాలనుకున్నప్పుడు నాలుగు సున్నాలు కలపాలి’’ చెప్పాడో తమ్ముడు.
‘‘ప్రజలకు మనమిచ్చే సందేశం?’’
‘‘ఓడించండి; కానీ డిపాజిట్లు దక్కించండి.’’
‘‘మీరు నా నుంచి ఏం కోరుతున్నారు?’’
‘‘పుట్టి మునుగుతోంది. లైఫ్ బోట్లు పంపించండి.’’
‘‘మన విజన్?’’
‘‘జీరో విజన్.’’
‘‘బుల్లెట్లు లేకపోయినా మా గన్ పేలుతుంది.’’
‘‘మంచిది. పాఠాలు మనం నేర్చుకుంటే గుణపాఠాలు ప్రజలే నేర్పుతారు.’’
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
పేషెంట్‌ని పోస్ట్ మార్టంకి పంపి ఆపరేషన్ సక్సెస్ అని పత్రికా ప్రకటనలివ్వడమే
రాజకీయం.
ప్రజల కలలు కూడా మేమే కంటాం
- రాహుల్
కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?
కాంగ్రెస్ నాయకుల స్థితి ఢిల్లీలో పెనం, రాష్ట్రంలో పొయ్యి.
నల్లారి ఏం చేస్తున్నారు? ఫిడేలు సాధనలో ఉన్నారు.
త్వరలోనే రాష్ట్ర, కేంద్రాల్లో చక్రం తిప్పుతాం - చంద్రబాబు
సైకిల్ చక్రమే సరిగా తిరగడం లేదు చక్రబాబుగారూ!
మన నాయకులూ డెంటిస్ట్‌లూ ఒకటే ప్రజల పళ్లు
రాలగొట్టి ఫీజు అడుగుతారు.
షిండే ఇంట్లో కీలక సమావేశం. కాంగ్రెస్ నాయకులు ఏదో గొణుక్కుంటూ కనిపించారు.
‘‘గొణగాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పండి’’ అన్నాడు షిండే.
‘‘గొణిగే ధైర్యం మాకెక్కడిది సార్. వక్కపొడి నములుతున్నాం అంతే’’ అని చెప్పారు నాయకులు.