ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే బంగాళ దుంపలనునిషేధించిన ఘనత బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్‌కు దక్కుతుంది. ఇంతకీ బంగాళదుంపలు ఏం పాపం చేశాయని వాటిపై రాణిగారు ఆగ్రహించారనుకుంటున్నారా..? ఆగ్రహం కాదు గానీ, బంగాళదుంపలను చూసి భయపడ్డారామె. భయపడటానికి అవేమైనా బాంబులా.. అనుకుంటున్నారా..? అప్పట్లో బ్రిటిష్ యాత్రికుడు, గూఢచారి, బహుముఖ ప్రజ్ఞశాలి అయిన సర్ వాల్టర్ రాలీ ప్రపంచాన్వేషణ కోసం తరచుగా నౌకాయానాలు చేసేవాడు. ఆయన యాత్రల ఖర్చులను రాణిగారే భరించేవారు.
ఒకసారి రాలీ దొరవారు దక్షిణ అమెరికా యాత్ర ముగించుకుని ఇంగ్లండ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి భారీ పరిమాణంలో బంగాళదుంపలను మోసుకొచ్చాడు. వాటిని రాణిగారికి కానుకగా సమర్పించుకున్నాడు. వాటితో రాచ బంధువులకు, రాజోద్యోగు లకు విందు చేసి ఘనత చాటుకోవాలని తలచిన రాణిగారు, బంగాళదుంపలతో రుచికరమైన వంటకాలను తయారు చేయాల్సిందిగా రాచప్రాసాదంలోని పాక నిపుణులను ఆదేశించారు. పాపం... ఆ పాక నిపుణులు బంగాళదుంపలను ఎప్పుడూ చూసి ఉండ లేదు.
మట్టిరంగులో ఉండే దుంపలను పారేసి, వాటిపై ఉన్న ఆకులతో, ఆకుపచ్చని కాండంతో తోచిన రీతిలో వింతైన వంటకాలను తయారు చేశారు. రాచ విందులో పాల్గొన్న వారంతా వాటినే తిన్నారు. బంగాళ దుంపల ఆకుల్లోను, కాండంలోను ఉండే విషపదార్థాల కారణంగా వాళ్లందరికీ విందు ఆరగించిన కొద్దిసేపటికే కడుపులో సుడిగుండాలు మొదలయ్యాయి. దాంతో బంగాళదుంపలంటేనే ఎలిజబెత్ రాణిగారే కాదు, యావత్ బ్రిటిష్ ప్రజానీకమూ హడలి చచ్చే పరిస్థితి తలెత్తింది. దెబ్బకు రాణిగారు బంగాళదుంపలపై నిషేధం ప్రకటించారు. ఈ సంఘటన 1598లో జరిగింది. ఆ తర్వాత వందేళ్ల పాటు బ్రిటన్‌లో బంగాళదుంపలపై నిషేధం కొనసాగింది.
వీటి దుంప తెగ
Published Sun, Apr 9 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
Advertisement
Advertisement