కథ: పీచుమిఠాయి రంగు రిబ్బను పిల్ల | Rama Sundari batthulu writes story of Sweet maize | Sakshi
Sakshi News home page

కథ: పీచుమిఠాయి రంగు రిబ్బను పిల్ల

Published Sun, May 11 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

కథ: పీచుమిఠాయి రంగు రిబ్బను పిల్ల

కథ: పీచుమిఠాయి రంగు రిబ్బను పిల్ల

ఒంగోలు నుండి చీరాలకు వెళ్లే రోడ్డు కారుకి గాయం చేయని మెత్తటి తివాచీలాగా పోయేకొద్దీ సాగుతూ ఉంది. రెండు వైపులా లేత ఆకుపచ్చ రంగు నేలకు పూసినట్లు సెనగ మొక్కలు. చూపు సాగినంత దూరం పరుచుకొని ఉన్న ఈ ప్రాబల్యం కోల్పోయిన పచ్చదనం, మిన్ను నీలాన్ని దిగులుగా చూస్తున్నట్లు వ్యాపించి ఉంది. వాటి మధ్య తలలకు తెల్లగుడ్డలు కట్టుకొని ఆడజనం కదం తొక్కుతున్నట్లు కూర్చొని కదులుతున్నారు. మనిషి కంటే ఎత్తు పెరిగిన జొన్న చేలో ఎవరో మాసిన గుడ్డల మనిషి ఏదో దేవుళ్లాడుకొంటున్నాడు. దారిలో వస్తున్న ‘ఎస్’ ఆకారపు మలుపులో ఊళ్లు నిరుత్సాహంగా చప్పుళ్లు చేస్తున్నాయి.
 
 పొద్దున్నే బయలుదేరాను. ఎనిమిది అవగానే ఆకలి అలవాటుగా వచ్చేసింది. రోడ్ సైడ్ హోటళ్లు చూసుకొంటూ మెల్లిగా వెళుతుంటే కడవ కుదురు దాటాక, ఒక చిన్న బడ్డీ కొట్టు కనిపించింది. కారు పార్క్ చేసి రోడ్ దాటి వెళ్లాను. ఊరి చివర రెండు పెద్ద రావిచెట్లు రోడ్డు కిరువైపుల నుండి ఆకాశంలో కలుసుకొన్న నీడలో ప్రశాంతంగా ఉంది ఆ హోటల్. బడ్డీ కొట్టు యజమానురాలు వయసు చిన్నదే. వత్తయిన జుట్టు అదుపులో పెట్టటానికి పైన చిన్న పాయలు తీసి కలిపింది. అప్పుడే పూజ చేసుకొని వచ్చినట్లు ముఖాన రెండు బొట్లు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కనబడుతున్నాయి.
 
 వాళ్లాయన అయి ఉండాలి. చొక్కా మోచేతుల దాకా మడిచి మౌనంగా పనిచేసుకుపోతున్నాడు. చెట్టు కింద కొన్ని స్టూల్స్, కుర్చీలు వేసి ఉన్నాయి. అప్పుడే తిరగమోత పెట్టిన చట్నీతో వేడి వేడి ఇడ్లీలు అరటి ఆకు వేసిన ప్లేట్లో వేసి తెచ్చిపెట్టింది. ఆయన చిన్న సీసాతో బబుల్ నుండి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. నా దృష్టిలో ఇడ్లీ కంటే కమ్మనైన వంటకం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఆస్వాదిస్తూ తింటున్నాను.
 ఇంతలో ఒక నల్లటి పిల్ల గునగునా వచ్చింది. ఆ పిల్ల జడలు వేసి వారం అయినట్లు ఉంది. పైన జుట్టంతా చెదిరినా, పొట్టి జడలు గట్టిగా పైకి దిగకట్టి ఉన్నాయి. ఒక జడకు వేసిన కుచ్చులు ఊడిపోయి, పీచు మిఠాయి రంగు రిబ్బన్ వేలాడుతూ ఉంది. ‘రెండు ఇడ్లీలు కట్టు ఉమక్క’ అనడిగింది. ‘డబ్బులేవీ?’ అడిగింది ఉమక్క. ఆ పిల్ల రెండు రూపాయి బిళ్లలను అపురూపంగా తీసి ఇచ్చింది. ‘రెండిడ్లీ ఐదు రూపాయలమ్మాయి’ డబ్బులు వెనక్కి ఇస్తూ అంది ఉమక్క. ఆ పిల్లేమీ మాట్లాడలేదు. అభావంగా మొహం పెట్టి అక్కడక్కడే తచ్చాడుతూ ఉంది. వెనక్కి వెళ్లలేదు.
 
 ‘దోసె వేసుకుంటారా?’ అడిగింది ఉమ. పెనం మీద ఎర్రగా వేగుతోంది దోసె. నోరూరింది.‘వెయ్యి’ చెప్పాను.దోసెకు ఒకవైపు కారం రాసి పొయ్యి నుండి నా ప్లేట్‌కు బదలాయించాడు వాళ్లాయన. చెయ్యి కడుక్కోవటానికి వేరే గ్లాసులో నీళ్లు తెచ్చాడు. కారం తిన్న నాలుక వేడి టీతో చురుక్కుమంటుంటే ఊదుకొంటూ తాగాను. మెల్లగా లేచి డబ్బులు ఇద్దామని పర్సు తెరిచాను. చళ్లున కొట్టినట్లు వెయ్యి రూపాయల నోటు లోపల ఒంటరిగా నవ్వింది. పొద్దున్నే చిల్లరంతా వెదికి, జేబులో వేసుకొన్న కొడుకు గుర్తుకు వచ్చాడు. అపరాధభావంతో భార్యాభర్తల వైపు ఆ నోటుని చాచాను. ‘చిల్లర లేదు’ ఆయన మొహంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు.‘ఫర్వాలేదు. ఈసారి వచ్చినప్పుడు ఇద్దురు గాని’ ఆమె అంతకన్నా ప్రసన్నంగా నవ్వుతూ అంది.‘పోనీ, నేను వాపసులో ఇటే వస్తాను. అప్పుడు ఇస్తాను’ అన్నాను జంకుతూ.‘అప్పుడు మేము ఉండము మేడమ్. ఇంటికి వెళ్లిపోతాము. ఫర్వాలేదు. తరువాత ఇద్దరు కానీ.’ ‘మీ ఇల్లు ఎక్కడ?’ ఆశ చావక అడిగాను.ఉమ వేలు దూరంగా చూపించింది. అక్కడ పొలాలు, వాటి మధ్య తాడిచెట్లు కనిపించాయి. ఇళ్లు కనబడలేదు.ఉమ నవ్వి, ‘మొన్న మీలాగే ఒకరు కారులో వచ్చి టిఫిన్ చేశాక చూస్తే పర్సు మరిచిపోయి వచ్చారు. వాళ్ల అమ్మాయి పరీక్ష అని కంగారు పడుతున్నారు. ముందు అమ్మాయి పరీక్ష సంగతి చూడండని చెప్పాను. డబ్బులదేముంది? మీ బోటివాళ్లు ఈ డబ్బులు కావాలని ఎగ్గొట్టరు కదా. ఈసారి వచ్చినప్పుడు ఇస్తారు.’
 
 ‘నేను ఇటు ఇప్పుడల్లా రాను’ ఏమి చేయాలో తోచక చెప్పాను.‘మీరు వచ్చినప్పుడే ఇవ్వండి. మా డబ్బులు ఎక్కడకు పోవు. ఒకవేళ పోయినా పద్దెనిమిది రూపాయలతో మేము పెద్దవాళ్లం అవములెండి. మీరు గొప్పవాళ్లూ కారు. ఎవరి దగ్గర ఉన్నా ఒకటే.’ చేసేది ఏమీలేక కారు దగ్గరకు నడిచాను. కారు తలుపు తీస్తూ వెనక్కి తిరిగి చూశాను. పీచు మిఠాయి రంగు రిబ్బను పిల్ల అప్పుడు వాళ్లతో ఏదో మాట్లాడుతూ ఉంది. రావిచెట్టు ఆకుల మధ్య నుండి సూర్య కిరణాలు ఆ పిల్ల మొహం మీద సూటిగా పడుతున్నాయి. ఆ వెలుగులో అభద్రత తాలూకు దేవిరింపు ఆ పిల్ల మొహంలో కాఠిన్యంగా కనబడింది.
 
    
 చీరాల్లో పని చూసుకొని తొందరగానే బయలుదేరాను. కారు ఉప్పుగుండూరు దగ్గరకు రాగానే, బస్టాండ్‌లో నిలబడి ఉంది పద్మ. ఆమె అక్కడ టీచరు. మా ప్రహరీని ఆనుకొని వాళ్ల వంటిళ్లు ఉంటుంది. ఆమెకు నాకు ఉన్న అనుబంధం విచిత్రంగా ఉంటుంది. తెల్లవారుఝామున వంటగదిలో ఆమె చేసే శబ్దాలు నా కలల్లో వినవచ్చి మెలకువ వస్తుంటుంది. ఇక రాత్రుళ్లు పొద్దుపోయాక కూడా అక్కడ నుండే వచ్చే సర్దుళ్లు నాకు జోల పాడుతాయి. ‘నువ్వు నా నిద్రకు కాపలా కాస్తున్నావు’ అంటాను. నవ్వుతుంది. ఏడున్నరకంతా మొగుడు పెళ్లాలు ఇద్దరూ క్యారియర్లు కట్టుకొని పరుగులు పెడతారు. వాళ్లాయనకు సింగరాయకొండ దగ్గర ఏదో ప్రైవేట్ కంపెనీలో రాత పని.
 
 కారు పక్కనే ఆపగానే కొద్దిగా బిత్తరపోయి తరువాత నవ్వింది పద్మ. గొప్ప ఉపశమనపు మొహంతో కారెక్కింది. ముదురు కాఫీ రంగు బ్యాగు డాష్ బోర్డు మీద పెట్టింది. బ్యాగు స్ట్రాప్స్ చివికిపోయి లోపలి నాసిరకం తెల్లగుడ్డ బయటకు తొంగి చూస్తూ ఉంది. మెత్తటి సీటు మీద మట్టి ముద్దలాగా ఉంది పద్మ. చామన ఛాయ మొహంలో జిడ్డు వలన వచ్చిన మొటాలు దుమ్ముతో నల్లబడి కొక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. గోధుమ రంగు పెదాలు అంచుల్లో పగిలి నిర్జీవమైన చర్మం సన్నగా వేలాడుతోంది. ‘బండి కొనుక్కోరాదూ పద్మ. ఈ మధ్య బాగా చిక్కిపోయావు నువ్వు’ అన్నాను.
 
 ‘ఎక్కడక్కా. రమ, సుమ కాలేజీకి వచ్చారు. ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందోనని నేను, ఆయన అన్నిటికి కాళ్లు ముడుచుకొని ఉన్నాము. పొద్దున్నే ఇంత అన్నం బాక్స్‌లో పెట్టుకొని వెళతాడీయన. సాయంకాలం ఇంటికి వచ్చాకగానీ టీ చుక్క ఐనా చప్పరించడు’ చెప్పింది పద్మ. ‘ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. ఇప్పటినుంచే చెయ్యి, కాలు కూడదీసుకోవాలి మేము. ఈయన ఒక డజను అరటిపండ్లు తెచ్చి ఇంట్లో పెట్టినా ఒక్కటి కూడా నేను నోట్లో వేసుకోను. పిల్లలు ఏ వేళ ఆకలి అంటారేమోనని. పెరిగే పిల్లలు కదక్కా.’‘మొన్న మీ తమ్ముడు అమెరికా నుండి వచ్చినట్లు ఉన్నాడు?’‘అవునక్కా. మా పెద్దక్క ఒక స్థలం వాడి పేరున రిజిస్టర్ చేయటానికి పిలిపించింది. ఆమె ఇంకా సర్వీసులోనే ఉంది కదా. పిల్లలు కూడా లేరు. ఏదో టాక్స్ గొడవలు వస్తాయని, వాడి పేరుమీద కొన్నది. తనకు కావాల్సినప్పుడు తిరిగి ఇవ్వాలనే షరతు మీద.’
 
 ‘ఇవ్వకపోతే?’ నవ్వాను.పద్మ కూడా నవ్వింది. ‘వాడికి కోట్ల ఆస్తి ఉంది. తన స్థలానికి పాలుమాలడని ఆమెకు ధైర్యం ఉంది. ఒకవేళ వాడు ఇవ్వకపోయినా ఆమెకు పెద్ద కొరవయ్యేది కూడా ఏమీ లేదు. ఆమె ఆస్తిని వాడు అమ్మి పాడు చెయ్యడు కదా. ఆ స్థలం పోవటం వలన ఆమెకు పోయేదేమీ లేదు. వాడు కొత్తగా గొప్పవాడు అయ్యేదేమీ లేదు. ఆ స్థలం ఎవరి దగ్గర ఉన్నా ఒకటే’ పద్మ గొంతు ఎందుకో కొరుకుడు పడ్డట్లు అనిపించింది.‘మీ అక్క ఆ స్థలం నీకిస్తే నీకు ఒక కూతురైనా గట్టెక్కుద్దిగా?’ వదలకుండా రెట్టించి అడిగాను.
 ‘అయ్యో రామా!
 
 మొన్న అవసరానికి ఒక పదివేలు కావాల్సి ఆమెను అడిగితే, పదిసార్లు అడిగించుకొని ఇచ్చింది.’ వెనుకకు తలవాల్చి కళ్లు మూసుకొన్నది పద్మ. మూసుకొన్న కళ్ల లోపల నుండి గుడ్లు అస్థిమితంగా కదులుతున్నాయి. ముందు బతుకు తాలూకూ బెంగ, చింత చిక్కిపోయిన ఆమె బిక్క మొహంలో కనబడుతున్నాయి. పెదాలు బిగబట్టి ముఖాన్ని రిలాక్స్ చేయటానికి చేస్తున్న ప్రయత్నంలో ఆమె ముఖంలో అదో రకం కాఠిన్యం కనబడింది. పీచు మిఠాయి రంగు రిబ్బను పిల్లలో కనిపించిన లాంటి కాఠిన్యం అది.
 ఒంగోలు చేరాము. కలెక్టరాఫీసు ముందు కారు పోతుంటే పెచ్చులు పెచ్చులుగా అక్కడక్కడ కనిపిస్తున్న గుంపుల్లో ఏదో ఆశాభంగం జావకారుతున్నట్లుగా ఉంది.
 
 రోడ్డుని దాటుతూ ఒక సందోహం ముందుకు వెళుతోంది. కారు స్లో చేశాను. వాళ్ల చేతుల్లో ఏవో తెల్ల కాగితాలు... శ్రద్ధగా పట్టుకొని నిస్సత్తువగా అడుగులు వేస్తున్నారు. నల్లని చెక్క ముఖాలవాళ్లు, రంగు పోయిన లుంగీలవాళ్లు, మాసిన తలలవాళ్లు, పగుళ్లు బారిన పాదాలవాళ్లు... మొరటు చేతులు తిప్పుతూ ఏదో మాట్లాడుతున్నారు. గుంటలు బడ్డ కళ్లల్లో నిరాసక్తి... తమ చుట్టూ ప్రపంచం గ్రహింపు లేని నిర్వేదంతో... తలలు వేలాడేసి ఎక్కడో చూపులు నిలిపి చూస్తున్నారు. విరిగిపోయిన జెండాలు రోడ్డుమీద అక్కడక్కడ పడి ఉన్నాయి. సప్లై కంపెనీవాడు టెంట్ విప్పుకొని పోతున్నాడు. ఏదో ధర్నా జరిగినట్లుంది. ఇంట్లో అడుగుపెట్టగానే సోఫా మీద కూర్చొని చుట్ట చుట్టుకొంటున్న చిన్నాన కనబడ్డాడు. ‘‘నాకు తెలవక అడుగుతాను అమ్మాయ్. లక్ష రూపాయల  అప్పు పుట్టక వాడు చావటం ఏమిటి? మనం ఎంపీ కుప్పుస్వామి  చౌదరి మూడొందల కోట్ల అప్పు బాంకీలో తీసుకొని దరిజాగా తిరగటం ఏమిటి?’’
 
 ‘ఎప్పుడొచ్చావ్?’
 ‘కాసేపయ్యిందమ్మాయ్. నువ్వు చీరాల పోయావంటగా. ముందు కాపీ తాగు’ అన్నాడు నిదానంగా. ‘కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చానమ్మాయ్. అదే మన వీరాసామి సంగతి మాట్లాడటానికి అందరం కలిసి వచ్చాము. పోతా పోతా నిన్ను చూసి పోదామని ఆగాను.’మా నాన్నకు తమ్ముడు వరసైన ఈ చిన్నాన పొలం మీదే చానా కాలం బతికాడు. ఇప్పుడు కొడుకు సాఫ్ట్‌వేర్‌లో సంపాదించినాకా కాస్త స్థిమితపడ్డాడు. పొగాకు వేసి, రెండొందల రూపాయల పెట్టుబడి కోసం మా ఇంటికి వచ్చి ఉద్యోగస్తుడైన నాన్నను గోజారటం గుర్తుంది.
 
 ‘కలెక్టర్‌గారు ఏమన్నారు వీరస్వామి సంగతి?’ అడిగాను.‘ఏమంటాడు? పూర్వకాలంలో బురద తిని అయినా బతికేవాళ్లు. తిండి లేక మనుషులు చచ్చిపోయేవారేమో కానీ ఆత్మహత్యలు చేసుకొనేవాళ్లు కాదు. ఇప్పుడు పల్లెటూర్లు దర్జాలకు మరిగాయి. ఖర్చులు పెంచుకొని తల తాకట్టు పెట్టి అప్పులు చేయటం వలన ఆత్మహత్యలు జరుగుతున్నాయి’ అంటాడు.‘నాకు తెలిసి వీరాసామి ఏ రోజు ఇంటి కాడ పన్ని ఎరగడు. నైదిబ్బలు పొలానికి వేసుకొని, ఇత్తులు ఒకరికొకరం పంచుకొని బతికిన రోజులు పోయాయి. ఎగసాయం కనాకష్టమైయ్యింది. లక్ష రూపాయల అప్పు కోసం మన ఊరు బాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో. బయట తెచ్చిన అప్పులు మోపయ్యాయి. బాంకు అప్పు వస్తే గట్టెక్కుతాననుకొన్నాడు. చచ్చే ముందు రోజు నాతో, ‘ఒరే. ఆ బాంకాఫీసరు ఇంటికెళితే ఇంట్లో ఉండి వాళ్లావిడ చేత లేదనిపించాడు. ఎంత ఎదవ బతుకయ్యింది రా’ అని మనేదపడ్డాడు.
 
  నాకు తెలవక అడుగుతాను అమ్మాయ్. లక్ష రూపాయల అప్పు పుట్టక వాడు చావటం ఏమిటి? మనం ఎంపీ కుప్పుస్వామి చౌదరి మూడొందల కోట్ల అప్పు బాంకీలో తీసుకొని దరిజాగా తిరగటం ఏమిటి? ఆయన తీర్చకపోతే వీళ్లేమి చేయగలరు?’‘కుప్పుస్వామి చౌదరి ఏమన్నా ఆ డబ్బుని పాడు చేస్తాడా ఏమిటి? ఆ డబ్బు గవర్మెంట్ దగ్గర ఉన్నా, ఆయన దగ్గర ఉన్నా ఒకటే’ పెద్దగా ఆలోచించకుండానే అన్నాను.‘నాకర్థంకాలా’ అన్నాడు చిన్నాన.నిజానికి నాకూ అర్థం కాలా. అయితే కోట్ల మంది పీచు మిఠాయి రంగు రిబ్బను పిల్లలు ఎక్కడ నుండి పుడుతున్నారో అర్థం అయ్యింది.
 - .రమాసుందరి బత్తుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement