నా మనసు విరిచేసింది!
నా మనసు విరిచేసింది!
Published Sun, Nov 22 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM
జ్ఞాపకం
మా అన్నయ్య అంటే నాకు మొదట్నుంచీ గౌరవంతో కూడిన భయం. దాంతో తనకు కాస్త దూరంగానే ఉండేవాడిని. కానీ మా చెల్లి విషయంలో అలా కాదు. ఇద్దరం మంచి స్నేహితులం. తనంటే నాకెంత ప్రేమంటే, నా పాకెట్ మనీ కూడా దాచి తనకిచ్చేసేవాడిని. దాంతో చుట్టుపక్కల వాళ్లు... ‘‘మీ పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుందండీ. మా అమ్మాయి, అబ్బాయి ఎప్పుడు చూసినా తగాదా పడుతుంటారు’’ అని అమ్మానాన్నలతో అంటుండేవారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. అందుకేనేమో, నా చెల్లి కూడా మారింది. ఓ అబ్బాయిని ప్రేమించి మాకు మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసేసుకుంది. తన జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కోసం అందరినీ, చివరికి నన్ను కూడా వదిలి వెళ్లిపోయింది.
మనసు రాయి చేసుకున్నాను. తన ఇష్ట ప్రకారమే ఉండనీలే అనుకున్నాను. కానీ చెల్లి పెళ్లి చేసుకున్న వ్యక్తి పరమ నీఛుడు. చెడు అలవాట్లకు బానిస. నా చెల్లెల్ని చిత్ర హింసలు పెడుతున్నాడని తెలిసి తట్టుకోలేకపోయాను. ఫోన్ చేసి చెడా మడా తిట్టాను. నా చెల్లి కంట నీరు వస్తే ఊరుకోనని హెచ్చరించాను. ఇంకే సమస్యా ఉండదనుకున్నాను.
కానీ ఒక గంట తరువాత నా చెల్లెలు ఫోన్ చేసింది. ‘‘నీ పనేదో నువ్వు చూసుకో. మా కాపురంలో నీ జోక్యం ఏమిటి? ఎంతలో ఉండాలో అంతలో ఉండు’’ అంటూ ఏవేవో అనేసింది. నా తల గిర్రున తిరిగింది. అనుబంధాలు, ఆత్మీయత అంతా బూటకం అని ఓ కవి అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే ఫోన్ పెట్టేశాను. ఇప్పటికీ అది గుర్తొస్తే గుండెల్లో కలుక్కుమంటుంది. తను విరిచేసిన మనసు అతుక్కోనంటోంది.
- కేఎన్, ఆదిలాబాద్
Advertisement
Advertisement