నోటోపోటు | sakshi funday special | Sakshi
Sakshi News home page

నోటోపోటు

Published Sat, Dec 24 2016 11:10 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

నోటోపోటు - Sakshi

నోటోపోటు

కథ

‘‘ఏంటిది?’’– గిన్నెలోని పసుపు పచ్చటి పదార్థం వైపు అనుమానంగా చూస్తూ అడిగాను.‘‘లెమన్‌ రైస్, అన్నా’’ అన్నాడు క్యాంటిన్‌ఓనర్‌.
గిన్నెలో పదార్థం తీరు చూస్తుంటే లెమన్‌రైస్‌ నిర్వచనంలో ఏదో తేడా ఉందనిపించింది.‘‘పిచ్చోడా, మనోడు అన్నంలో పసుపు వేస్తే అదే లెమన్‌రైస్, అదే కాస్త జీలకర్ర వేసాడనుకో అది జీరారైస్, లేదంటే కాసిని కూరగాయలు తరిగి వేసాడనుకో, అదే వెజ్‌ బిర్యానీ... పేర్లేదైనా మూల పదార్థం ఒకటే నాయనా’’ అని పక్కనే ఉన్న మా సీనియర్‌ కొలీగ్‌ నాకు హితబోధ చేసాడు.‘సరే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా’ అని ఆ లెమన్‌రైస్‌ అనే బ్రహ్మపదార్థాన్ని ఆర్డరు చేశా. వెంటనే ఒక ప్లేటు నిండా పొర్లిపోయేలా పెట్టి ఇచ్చాడు క్యాంటీన్‌వాలా. ‘‘ఇదేంటి ఇంత పెట్టావు’’ అన్నాను భయంగా.

‘‘రేపు ఆదివారం, సరుకు మిగలకూడదు, రెండు ప్లేట్లకు తక్కువ, ఒక్కప్లేటుకు ఎక్కువగా ఉంది కాబట్టి నీపై అకాల ప్రేమ కలిగింది మనోడికి’’ అని అందులోని ఆర్థిక సూత్రాన్ని పక్కన ఉన్న నా ఉపనిషత్‌ గురువు వెంటనే వివరించాడు. విరక్తితో ఆ ప్లేటు తీసుకొని తినడానికి తయారయ్యాను. కానీ లెమన్‌రైస్, నా జీర్ణవ్యవస్థ అయస్కాంతంలోని సజాతి ధ్రువాల్లా వికర్షించుకోవడం ప్రారంభించాయి. ఈ పోరాటాన్ని కొనసాగిస్తే ప్రాణాపాయం కలుగుతుందన్న భయంతో విరమించి నా సీట్లోకి వచ్చి కూలబడ్డాను.‘‘నీదగ్గర పెద్ద నోట్లున్నాయా?’’ అని అడిగాడు మా ఇన్‌చార్జి.

‘‘ఉన్నాయండీ, రెండు వెయ్యి రూపాయల నోట్లున్నాయి’’ అని చెప్పాను.‘‘జాగ్రత్త, 500, 1000 నోట్లను ఇప్పుడే ప్రభుత్వం రద్దు చేసింది’’ అని నింపాదిగా చెప్పారాయన.ఒక్క క్షణం అర్థం కాలేదు. నోట్ల రద్దంటే ఇప్పుడు నా దగ్గరున్న 10 వేలూ పనికి రాకుండా పోతాయా? వామ్మో ఈ నెలంతా ఎలా? లాంటి తింగరి ఊహలు వచ్చాయి. రేపట్నించి బ్యాంకుల్లో మార్చుకోవచ్చని మా బాస్‌ భరోసా ఇచ్చారు. హమ్మయ్య అనుకొని నెట్‌ ఓపెన్‌ చేసి చూస్తే అన్ని సైట్లలో ఇదే రచ్చ. మరోవైపు ఎందుకు రద్దు చేశారు? పాతనోట్లు ఎలా మార్చుకోవాలి? ఎప్పటివరకు గడువు? దీంతో ఏం జరుగుతుంది? విత్‌డ్రా, డిపాజిట్ల పరిమితి ఎంత? ఇలా ప్రశ్నలు, సమాధానాలు చానెళ్లలో హోరెత్తుతున్నాయి. చాలామంది ప్రభుత్వ నిర్ణయాన్ని భేష్‌ అంటున్నారు. కొంతమంది మాత్రం ఈ చర్యతో ప్రజలకు నానా ఇబ్బందులు తప్పవంటున్నారు. పక్కింటోడికి కూడా తెలీని ముఖాలు చర్చాకార్యక్రమాల్లో ఎగిరెగిరిపడుతూ చర్చిస్తున్నాయి. ‘ఏంటీ గోల, రద్దయితే ఏమైంది, ఆకాశం కూలిపోయిందా? రేపట్నించి బ్యాంకులో తీసుకోవచ్చన్నారుగా, ఎందుకీ హడావుడి’ అనిపించింది. ఆ రోజంతా పేపర్లో ఇదే మ్యాటర్, ప్రముఖుల అభిప్రాయాలు, విశ్లేషణలు... ఇలా వర్క్‌ పూర్తయ్యి ఇంటికి చేరేటప్పటికి అర్ధరాత్రి దాటింది.పడుకునేముందు ‘రేపు వెళ్లి నా రెండు నోట్లు మార్చుకోవాలా? ఒకటి మార్చుకొని రెండోది గుర్తుగా ఉంచుకోవాలా?’ అన్న శాస్త్ర సంబంధ తర్క మీమాంస మనసులో బిగినయింది. టీవి చర్చల్లాగా దానికి ముగింపు రాకముందే నిద్రలోకి జారుకున్నాను.

తెల్లారి లేవగానే నోట్ల విషయం గుర్తొచ్చింది. నెమ్మదిగా రెడీ అయి దగ్గర్లోని బ్యాంకుకు బయలు దేరాను. మధ్యలో టెస్టింగ్‌ కోసం కిరాణా కొట్టువాణ్ణి కదిలించా, ‘ఏమయ్యా పెద్దనోటుకు చిల్లరుందా?’ అని.‘‘ఉంది, కాకపోతే ఏమైనా కొంటేనే చిల్లరిసా’’్త అన్నాడు.ఇంకే పర్లేదు, అనుకొని బ్యాంకుకు వెళ్లాను. దారంతా తిరునాళ్ల సందడి. కలయో, వైష్ణవ మాయో అంటే అర్థం ఆ రోజే తెలిసింది.జీవితంలో ఏనాడూ తెల్లారి లేవడం అలవాటు లేని పలు జీవాలు బ్యాంకు ముందు మత్తుకళ్లతో నిల్చున్నాయి. నైట్‌డ్రస్సులు, పాచి కంపులు... నా జీవితంలో బ్యాంకు ముందు అంతమంది జనాలు  అంత పొద్దున్నే గుమిగూడడం ఫస్ట్‌టైమ్‌ చూసాను. వీళ్లకు టీ అమ్మి క్యాష్‌ చేసుకుందామని ఫ్లాస్కులతో అటూ ఇటూ తిరుగుతున్న బాల కార్మిక వీరులు. టీ తాగాలని ఉన్నా, చిల్లర లేని జేబును చూసి గుడ్లనీరు కుక్కుకుంటున్నవాళ్లు.. ఇలా ఎందరో... వీళ్లందరూ నోట్లు మార్చుకొని నా వంతు వచ్చేదెప్పుడు? అని ప్రశ్నించుకొని రేపు అనేది ఒకటి ఉంది అని గుర్తుచేసుకొని గిరుక్కున వెనక్కి తిరిగి కిరాణా కొట్టు దగ్గరకు పోయాను.

‘‘ఒక వక్కపొడి పొట్లం ఇవ్వవోయ్,’’ అని 500 నోటు ఇచ్చాను. ‘‘వేళాకోళం ఆడకండి సార్‌’’ అన్నాడు వాడు.‘‘సరే ఒక యాభైరూపాయలకు ఏవైనా సరుకులు కొంటా కానీ, చిల్లర ఇవ్వు’’ అన్నాను. ‘‘కనీసం 450 రూపాయలకు ఏమైనా కొంటే చిల్లర ఇస్తా’’ అని నా నోటు వెనక్కు ఇచ్చాడు.‘‘ఒంటికాయ శొంఠికొమ్ము గాడ్ని, 450 రూపాయలకు ఏం కొనాలి నా బొంద’’ అనుకొని నీరసంగా ఇంటికి వచ్చా. గుమ్మంలోనే మా ఓనరు ముసలమ్మ బోసినోటితో నవ్వుతూ పలకరించింది. ‘‘ఏంటి’’ అని కళ్లెగరేసా, ‘‘ఒకటో తారీకు ఇచ్చిన అద్దె పాతనోట్లతో ఇచ్చావు, కాస్త వాటిని మార్చి కొత్తవి తెచ్చివయ్యా,’’ అని బాంబేసింది.నో.. కుదరదు, నా రెండు నోట్లే మారక చస్తుంటే నీగోలేంటి అని తిట్టుకుంటూ, ‘‘మీరు మార్చుకోవచ్చుగా’’ అన్నాను. ‘‘పెద్దదాన్ని నేను పోలేను, నువ్వే తెచ్చివ్వు’’ అని అద్దె మొత్తం తెచ్చి నా చేతిలో పోసింది. పొద్దున్నే పనిపిల్ల మీద విరుచుకపడేటప్పుడు, ఎప్పుడైనా కొంచెం లేటుగా లైట్లు ఆర్పితే గొంతేసుకొని మీద పడిపోయేటప్పుడు ముసల్దానికి పెద్దరికం గుర్తురాదు, ఇప్పుడు మాత్రం పెద్దరికం గుర్తొచ్చింది దొంగముఖానికి.. అయినా తప్పదు, కాదని చెప్తే ఈ సౌమ్యరూపం పోయి పిశాచ రూపంలో ఎగబడ్తుంది. ఏంచేస్తాం, అదేదో సినిమాలో డబ్బులు ఖర్చు చెయ్యాలని పందెం ఉంటే, హీరో దగ్గరకు మరింత డబ్బులు వచ్చిపడుతుంటాయి, అలాగే ఉంది నా పరిస్థితి.

బ్యాంకులో మార్చడం తర్వాత, ముందు ఏటీఎంలో అయినా డ్రా చేసుకోకుంటే రోజు గడిచేలాలేదని దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాను. ‘నోక్యాష్‌’ అని బోర్డు కనిపించింది. పక్కన ఉన్న అతన్ని ‘‘ఇక్కడ ఇంకో ఏటీఎం ఎక్కడుందండీ’’ అనడిగా.‘‘కిలోమీటర్‌ దూరంలో ఉంది’’ అని బదులిచ్చాడు.సరే అని బండి స్టార్ట్‌ చేయబోతుంటే, నన్ను పిలిచి ‘డబ్బులు డ్రా చేయడానికైతే నా వెనక నిలబడు, నేనూ ఆ ఏటీఎం క్యూలోనే ఉన్నాను’ అని కేకేసాడాయన. అంటే క్యూ కిలోమీటర్‌ పొడవుందన్నమాట, దెబ్బకు మైండ్‌ తిరిగిపోయింది.రాత్రికి ఇంతమంది ఉండరు అప్పుడు డ్రాచేసుకుందాం అనుకొని ఆఫీసుకు పోయి, రాత్రి వచ్చేటప్పుడు చూస్తే ఎవరూ లేరు. హమ్మయ్య అని ఏటీఎం దగ్గరకు పోతే నో క్యాష్‌ బోర్డుంది. దీనమ్మ జీవితం అని తిట్టుకుంటుండగా, ఏదో వాట్సప్‌ మెసేజ్‌ వచ్చింది. దగ్గర్లో ఏ ఏటీఎంలో డబ్బులున్నాయో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అని ఉంది. సరే అని నేనున్న ఏరియా పిన్‌కోడ్‌ కొట్టాను. దగ్గర్లో మరో ఏటీఎం ఉందని చూపింది. అది చూపే అడ్రస్‌ నాకు తెలీదు. సరే అని అడ్రస్‌ను గూగుల్‌ మ్యాప్‌లో వెతుక్కుంటూ బయలుదేరా. సందులు, గొందులు తిరిగిన నా ప్రయాణం ఒక డెడ్‌ ఎండ్‌ దగ్గర ఆగింది. అది ఏటీఎం ఉందని చెప్పిన ప్రాంతంలో పెద్ద మురికికాలువ ఉంది. జీపీఎస్‌ను బండబూతులు తిట్టుకుంటూ ఇంటికివచ్చా. ఇలాంటప్పుడే మనం కాస్త గిరీశంలాగా థింక్‌ చేయాలి అనుకొని గదిలో అటూఇటూ తిరుగుతూ ఆలోచించాను. ఆఫీసులో ఒకపెద్దాయనకు ఇవ్వాల్సిన 10వేల రూపాయల బాకీ గుర్తొచ్చింది. మర్నాడు వెళ్లడంతోనే ఆయన దగ్గరకు వెళ్లి ‘‘సార్‌ ఇవిగో మీకివ్వాల్సిన 10వేలు’’ అని చేతులో పెట్టాను. గొంగళిపురుగు మీదపడ్డట్లు ఒక్కసారిగా ఆయన దులపరించుకొన్నాడు.


‘‘అబ్బాయ్‌ నీ వేషాలు నాదగ్గర కాదు. నాకు కొత్త నోట్లు ఇవ్వు’’ అన్నాడు.‘‘అదేంటండీ మీరిచ్చినప్పుడు ఇవే ఇచ్చారు కదా’’ అన్నా లాజిక్‌గా‘‘నీకు అప్పిచ్చినప్పుడు ఇవి చెల్లుబాటులో ఉన్నాయ్, ఇప్పుడు లేవు’’ అన్నాడాయన మరింత లాజిక్‌గా‘‘గురువుగారు, డిసెంబర్‌ 30 వరకు ఇవి చెల్లుతాయండీ, తీసుకోండి పర్లేదు’’ అన్నాను కన్నింగ్‌గా‘‘బాబూ, డిసెంబర్‌ 30 వరకు బ్యాంకుల్లో మార్పిడికి మాత్రమే చెల్లుతాయి, వ్యక్తుల మధ్య లావాదేవీలకు చెల్లవు, సో నువ్వు మార్చి తెచ్చివ్వు’’ అన్నాడు మరింత కన్నింగ్‌గా.ఛీ, ఐడియా పనిచేయలేదు అనుకొని నా సీటు దగ్గరకు వచ్చాను. ఇంతలో మా సారు పిలిచి నోట్ల రద్దుపై ఎవరికి వాళ్లు సొంత స్టోరీ తయారుచేయాలని హుకుం జారీ చేశారు. సరే అని నెట్‌ ఓపెన్‌ చేద్దును కదా ఒకటే గోల. ఎర్ర వీరులు, కాషాయ యోధులు ఆన్‌లైన్‌ వేదికగా హోరా హోరీగా మహా సంగ్రామం చేస్తున్నారు. దేశానికి మంచిదని కొందరు, కాదని కొందరు.

ప్రతి ఒక్కడూ ఆర్థికవేత్తే, ప్రతి ఒక్కడూ విశ్లేషకుడే, ప్రతి ఒక్కడూ విమర్శకుడే, ప్రతి ఒక్కడూ సలహాదారే.ఇందులో మళ్లీ బహిరంగ విమర్శక అంతర్గత సమర్థకులు, అంతర్గత విమర్శక బహిర్గత సమర్థకులు.. ఇలా ఎన్నో పక్షాలు, ఎన్నో వైరుధ్యాలు. ఇక జోకులు, కవితలు, పుకార్లు.. సరేసరి. అబ్బబ్బ దేశ ప్రజలకు కాలక్షేపానికి కొదవలేకుండా పోయింది ప్రభుత్వ నిర్ణయంతో అనిపించింది. వీళ్లతో మనకెందుకులే అని వ్యాపారాలంటూ తిరిగే కొంత మందికి ఫోన్‌ చేశా. తనకు నష్టం జరిగినా పక్కోడికి మరింత నష్టం జరిగిందని సంతోషించేవాళ్లు, తాను తినకపోతే ఎవరికీ దక్కకూడదని నోట్లను నాశనం చేసేవాళ్లు, ఇప్పుడు పోయి పన్ను కడతామంటే ఐటివాళ్లు ఏమంటారో అని భయపడేవాళ్లు, ఉద్యోగులు వద్దన్నా వడ్డీ లేకుండా అప్పులిస్తున్నవాళ్లు, పనోళ్లపేరు మీద అకౌంట్లు తీసి డిపాజిట్లు చేస్తున్నవాళ్ళు, హడావుడిగా చుట్టపక్కాలను పిలిచి వాళ్లొద్దన్నా చేబదుళ్లు ఇస్తున్నవాళ్లు .. ఇలా నోట్ల రద్దు విచిత్ర పర్యవసానాలను వివరించారు వాళ్లు.

సందట్లో సడేమియాలాగా కమీషన్‌పై నోట్ల వ్యాపారం జోరందుకుందంట అని ఒక మిత్రుడు చెప్పి వాడికి తెలిసిన ఒకతని నెంబరు ఇచ్చాడు. సరే చూద్దాం అని ఆ నెంబరుకు ఫోన్‌ చేసి ‘‘నా దగ్గర పాతవి పది ఉన్నాయి, మారుస్తారా’’ అని అడిగా నెమ్మదిగా. వాడు మాత్రం బర్రె గొంతేసుకొని ‘‘35 శాతం కట్‌ అయిద్ది, ఓకేనా’’ అన్నాడు. ఏమి కట్‌ అయిద్ది అనుకొని ‘‘మరోమాట లేదా’’ అన్నా మరింత నెమ్మదిగా. ‘‘ఏందయ్యా నువ్వు అంత భయపడతా మాట్లాడతావ్, మార్చేవాడ్ని నాకు లేని బాధ నీకేంది, సరే 32 శాతం మీద ఓకేనా’’ అన్నాడు. రౌండ్‌ ఫిగర్‌ 30 శాతం మీద చెయ్యమన్నాను. ‘‘సరే ఫలానా చోటికి డబ్బు తీసుకొని రా, అంతపెద్ద మొత్తం జాగ్రత్తగా రాగలవా’’ అని అడిగాడు.

పదివేలకు జాగ్రత్తేంటి అనుకొని మళ్లీ వెంటనే ‘‘నిజమేలే ఇప్పుడు పదివేలే పదికోట్లు’’ అన్నాను. వాడొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ‘‘ఇంతకూ నువ్వు చెప్పిన పది అంటే పదివేలా’’ అన్నాడు నెమ్మదిగా.‘‘అదేంటోయ్‌ అంత చిన్నగా మాట్లాడతావ్, మరేం పర్లేదన్నావ్‌గా, అవును పదివేలే, నువ్వేంటి పది లక్షలనుకున్నావా, కోట్లనుకున్నావా?’’ అన్నాను నోట్లు మారుతున్నాయన్న ఆనందంతో నవ్వుతూ.
అవతలపక్క దబ్‌ అని శబ్దం వచ్చింది.ఏంటి వీడు కొంపదీసి పదికోట్లనుకున్నాడా, ఏం? పదివేలు మాత్రం డబ్బులు కావా అని తిట్టుకొని ఫోన్‌ పెట్టేశా.మొత్తం మీద 30 శాతానికి నోట్లు మారుస్తున్నారన్నమాట. మరిన్ని వివరాలు కనుక్కుందాం అని ఇందాకటి మిత్రుడికి ఫోన్‌ చేసి ‘ఎవరైనా ఇలా మార్చిన వాళ్లు కానీ, మార్చబోతున్నవాళ్లు కానీ ఉన్నారా?’ అని అడిగా. వాడు రహస్యంగా ‘ఎవరో ఎందుకు, నేనే రాత్రికి కోటి రూపాయలు మార్చుకుంటున్నా, నువ్వు వస్తావా’ అని అడిగాడు. ఎగిరి గంతేసి ఒప్పుకున్నా. సాయంత్రం వాడి దగ్గరకు పోయేసరికి పాత 500, 1000 నోట్ల కట్టలు బ్యాగుల్లో పెట్టున్నాయి. ఇద్దరం కార్లో మార్పిడి ప్రాంతానికి పోయాం.‘‘అరేయ్‌ వాళ్లు ఇచ్చేవి మంచివో కాదో ఎలా తెలుస్తుంది, యూవీ లైట్‌ లాంటివి ఏమైనా ఉన్నాయా’’ అనడిగాను.‘‘అక్కర్లేదు నమ్మకమే జీవితం’’ అన్నాడు వాడు గంభీరంగా.

అక్కడ వాళ్లు మాకోసం వంద నోట్ల కట్టలతో ఎదురు చూస్తున్నారు. నాకైతే మాఫియా మూవీ చూస్తున్నంత ఉత్కంఠ. వీళ్లు మార్చుకొని బ్యాగులు తెరిచి చూడబోతుండగా పోలీసు విజిల్స్‌ వినిపించాయి. వెంటనే హడావుడిగా అందరం ఎవరి కార్లలో వాళ్లం అక్కడి నుంచి జంప్‌ అయ్యాం. ఇంటికి వచ్చి మావాడు వాళ్ల బ్యాగు తీసి ఒక్కో కట్ట పరిశీలిస్తుంటే వాడి ముఖంలో రంగులు మారుతున్నాయి.‘‘ఏమైందిరా’’ అని అడిగా. ‘‘మోసం, దగా ఇందులో 99 శాతం దొంగనోట్లే’’ అని అరిచాడు.నాకు షాక్‌ తగిలింది. వీడికి తగిలిన దెబ్బ మామూలిది కాదు, కోటి రూపాయలంటే మాటలా, ఎలా ఓదార్చాలో కూడా మాటలు రాలేదు నాకు. గొంతుపెగుల్చుకొని ‘‘ఊర్కోరా, పోలీసులకు జరిగింది చెప్పి వాళ్ల నెంబరు ఇచ్చి ట్రేస్‌ చేయమందాం, మనవి మనకు దక్కితే టాక్స్‌ కట్టి మార్చుకుందువు’’ అని సముదాయించాను. పోలీసులనగానే మావాడి ఏడుపుకు బ్రేక్‌ పడింది. ‘‘వద్దులేరా’’ అన్నాడు.

‘‘ఏంట్రా నువ్వు భయపడకు, ఏంకాదు, ప్రెస్‌వాణ్ణి కదా, నేను మాట్లాడతా పోలీసులతో’’ అని అభయమిచ్చాను.వాడు కంగారుగా లేచి, ‘‘పోతే పోనీలేరా, మనం 100 శాతం దొంగనోట్లిచ్చాం, వాళ్లతో పోలిస్తే మనకు లక్ష లాభమే’’ అన్నాడు.ఒక్కక్షణం అర్థం కాలేదు. అంటే ఆ పోలీసు విజిల్స్‌ అన్నీ... అవికూడా నా సెటప్పేరా అన్నాడు వాడు.ఇసుక తక్కెడ, పేడ తక్కెడ సామెత గుర్తొచ్చింది.వీళ్ల పాడుగాను, మనిషి ప్రతి సంక్షోభంలో స్వార్థమే చూసుకుంటాడు అనుకొని ఆ షాక్‌లోనే ఇంటికి పోయాను.మర్నాడు బ్యాంక్‌లో అష్టకష్టాలు పడి నా నోట్లు మార్చుకున్నాను. కొత్త 2 వేల రూపాయల నోట్లు పట్టుకోగానే ఏదో నిధిని గెల్చుకున్న సంబరం కలిగింది. సన్నగా విజిలేసుకుంటూ ఇంటికొచ్చి ఓనర్‌కు అద్దె ఇచ్చి నా రెండువేల రూపాయల నోటును జాగ్రత్తగా జేబులో పెట్టుకొన్నాను. ఇంక పాతనోట్ల బాధ తప్పింది అని సంతోషిస్తూ కిరాణా కొట్టుకు పోయా. కానీ కొత్త కష్టాలు అప్పుడే బిగినయ్యాయని అర్థమయింది.

ఎవరి దగ్గర చూసినా రెండువేల నోటే. 500 నోటు జాడే లేదు. వందలు ఎక్కడో బందీలయ్యాయి. 500 నోటుకు 450 కొంటే చిల్లరిస్తానన్న కొట్టువాడు 2000 నోటుకైతే 1950 రూపాయలకు సరుకులు కొనాలని తేల్చి చెప్పాడు. నోట్లు మార్చుకొని నేను సాధించేదేంటో నాకర్థం కాలేదు. పెద్దోళ్లు ఎలా మార్చుకుంటున్నారో తెలీదు, బక్కప్రాణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలీదు. చిల్లర శ్రీమహాలక్ష్మి అన్న నానుడికి అర్థం తెలుస్తోంది. ఇన్నాళ్లూ పొదుపంటే ఏంటో తెలీని జనాలంతా ఖర్చు విషయంలో మహా పీనాసులయ్యారు. చిన్నా, పెద్ద తేడాలేకుండా డబ్బు విలువ తెలిసివస్తోంది. మరోవైపు చిన్న చితకా వ్యాపారాలు, మధ్య తరగతి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. నిర్ణయాన్ని కొత్తల్లో సమర్థించిన వారిలో చాలామంది తిట్టుకోవడం బిగినయింది. నోట్ల మార్పిడి విషయంలో ఆర్బీఐ అంచనాలు ఎంతగా విఫలం అయ్యాయో కనిపిస్తోంది.

పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చిన్న నోట్లను మరిన్ని చలామణీలోకి వదలకుండా మరింత పెద్ద నోటు వదలడం వెనక మతలబేంటో నాకేమీ అర్థం కాలేదు. ఒక రకంగా ఈ నిర్ణయం ఎకానమీకి మంచిదే అయినా, ముందస్తుగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఏది ఏమైనా, ఈ దెబ్బకు సమాజం బాగుపడడమో, నాకి పోవడమో ఖాయం.రాత్రి ఇంటికి వచ్చి చొక్కాను హ్యాంగర్‌కు తగిలిస్తుంటే రంగంటినట్లు కనిపించింది. ఈ రంగెక్కడిది అనుకొని జేబులోంచి కొత్త నోటు తీసుకొని చూద్దును కదా, చెమటకు తడిసి రంగు వెలిసిపోయి కనిపించింది. ఖర్మరా బాబూ, మాములుగానే ఇవి మారడంలేదు, ఇప్పుడీ రంగువెలిసిన నోటును ఎవరు తీసుకుంటారన్న కొత్త భయం బిగినయింది. ఇంతలో వాట్సప్‌ మెసేజ్‌. కొత్తనోటులో చిప్‌ ఉందట, చిప్‌ సంగతి దేవుడెరుగు, నాణ్యత ఎంత చీప్‌గా ఉందో మెసేజ్‌ పంపిన దరిద్రుడికి తెలుసా అని పట్టరాని కోపమొచ్చింది. దాన్ని ఎక్కడో పెట్టి చూస్తే ఏదో కనపడుతుంది అని ఇంకో మెసేజ్‌. మీ బొంద కనిపిస్తుంది, నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. నా చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరవు కనీసం దేశానికి పట్టిన నల్లచీడైనా వదిల్తే బాగుండు, భారతమాతాకీ జై అనుకొని పడుకున్నాను.

బ్యాంకులో మార్చడం తర్వాత, ముందు ఏటీఎంలో అయినా డ్రా చేసుకోకుంటేరోజు గడిచేలాలేదని దగ్గర్లోని ఏటీఎంకి వెళ్లాను. ‘నోక్యాష్‌’ అని బోర్డు కనిపించింది.పక్కన ఉన్న అతన్ని ‘‘ఇక్కడ ఇంకో ఏటీఎం ఎక్కడుందండీ’’ అనడిగా.   

పదివేలకు జాగ్రత్తేంటి అనుకొని మళ్లీ వెంటనే ‘‘నిజమేలే ఇప్పుడు పదివేలే పదికోట్లు’’ అన్నాను. వాడొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ‘‘ఇంతకూ నువ్వు చెప్పిన పది అంటే పదివేలా’’ అన్నాడు నెమ్మదిగా.

∙డి. శాయి ప్రమోద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement