
యాభై ఏళ్ల తర్వాత...
సాక్షి ‘ఫన్‌డే’ జూన్ 22వ తేదీ సంచిక తిరగేస్తున్నాను. ‘తపాలా’ ఫీచర్ కింద ‘అయ్యో పాప’ శీర్షికన ఓ జ్ఞాపక శకలం... కింద పాలపర్తి ధనరాజ్ అన్న పేరు చూసి, ఉలిక్కిపడ్డాను. విషయం చదివాక, ‘వాడే వీడు’ అని నిర్ధారణైంది. యాభై ఏళ్ల క్రితం కలిసి హైస్కూల్లో చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. మాట్లాడదామంటే కాంటాక్ట్ నంబర్ లేదు. వెంటనే సాక్షి మిత్రుడు లక్ష్మణ్ గుర్తొచ్చాడు. ఎలాగైనా వాడి నంబర్ తెలుసుకుని చెప్పమన్నాను. కాసేపటికి ఎస్సెమ్మెస్ చేశాడు. అరక్షణం ఆలస్యం చేయకుండా ధనరాజ్‌తో అరగంటపైగా మాట్లాడాను. పాలకొల్లులో వాడి ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెళ్లు, వాళ్లమ్మ, నాన్నగార్లతో నాకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాను.
క్షీరారామం, పాలకొలను, పాలకొల్లు... యాభయ్యవ దశకం చివరి వత్సరాలు... రెండు గోపురాలు- పెద్ద గోపురం చిన్నగోపురం- శైవం, వైష్ణవం... రెండే థియేటర్లు... రత్నం టాకీసు, లీలామహల్ (ఇప్పుడు దాసరి పిక్చర్ ప్యాలెస్)... ఎం.ఎం.కె.ఎన్.ఎమ్. హైస్కూలు... బాల్యమిత్రులు దాసరోడు, పినిశెట్టోడు, బండారోడు, గాదిరాజోడు, ఉలిసేవోడు, వంగావోడు పద్మశ్రీలు, భారతరత్నాలకంటే గొప్ప పిలుపులు... చదువుల్లో, కళల్లో పోటీ!
స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక, అర్ధ శతాబ్ది పాటు ఒకళ్ల గురించి మరొకళ్లకి తెలీదు. కాలచక్రం ముందుకు దూసుకుపోతూ ఒక్కసారి మాకోసం వెనక్కి తిరిగిందనిపించింది. మా స్నేహానికి ఇంకో ఎడబాటు కలగకూడదని ఒట్టేసుకున్నాం. తెగిపోయిన మా స్నేహ బంధాన్ని మళ్లీ కలిపిన ‘సాక్షి’కి మనసారా కృతజ్ఞతలు.
- బండారు సత్యనారాయణ, హైదరాబాద్