ఈ ఆటలో ఆమే విజేత!
సంసారం సజావుగా సాగితే సంబరంలా ఉంటుంది. కానీ కలతలు వచ్చాయో కల్లోలమవుతుంది. చదరంగంలా గజిబిజిగా, గందరగోళంగా తయారవుతుంది. ఆ గందరగోళాన్ని తొలగించడం అంత సులభమైన పనేమీ కాదు. అయినా ఆ బాధ్యతని తలకెత్తుకున్నాయి కొన్ని టెలివిజన్ షోలు. వాటిలో ‘సంసారం ఒక చదరంగం’ ఒకటి. అయితే దీని సక్సెస్‌లో సగంపైన క్రెడిట్ హోస్ట్ సుమలతకే ఇవ్వాలి. గతంలో ‘బతుకు జట్కాబండి’ కార్యక్రమాన్ని నడిపారు సుమలత. ఆ తర్వాత ఈ షో బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ తన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వరిస్తున్నారు.
ఇరు వర్గాల వాదననూ ఓపికగా వినే విధానం, వారి వ్యక్తిత్వాలనూ ఆలోచనా విధానాలనూ అంచనా వేసే తీరు ఎంతో చక్కగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ మాట తీరు గురించి చెప్పుకోవాలి. తప్పు చేసినవారితో సైతం ఎంతో మర్యాదగా మాట్లాడటం, ఎంత కోపంగా మందలిస్తున్నా ఎక్కడా మాట తూలకపోవడం ఆవిడలోని స్పెషల్ క్వాలిటీస్. ఆవిడ విజ్ఞత చూస్తుంటే హోస్ట్‌గా ఆవిడ్ని సెలెక్ట్ చేయడం నూరు శాతం కరెక్ట్ అనిపిస్తోంది. సంసారపు చదరంగంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా... ఈ షో వరకూ మాత్రం ఆమే విజేత!