తపాలా
సంక్రాంతికి ఊరెళ్లాలి. ఒకవైపు ప్రైవేట్ బస్సులపై రవాణా అధికారుల పంజా, మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో బుకింగ్స్ కంప్లీట్. కాస్తంత పరపతి ఉపయోగిస్తే ఆర్టీసీ బస్సులో ఎంపీ, ఎమ్మెల్యే కోటా కింద ఉంచే సీట్లలో ఒకటి దక్కింది. రిజర్వేషన్ అవసరమేమీ లేదని, సీట్ కన్ఫర్మ్ అని, బస్సెక్కి టికెట్ తీసుకోవచ్చని స్నేహితుడి నుంచి హామీ వచ్చాక మనసు కుదుట పడింది. ఒకవేళ సీటు కన్ఫర్మ్ కాకపోతే.. ఎవరైనా వేరే వాళ్లు ఆ సీట్లో కూర్చొని ఉంటే.. రిజర్వేషన్ చేసుకోవడానికి బద్దకంతో కదా ఇన్ని భయాలూ అని నన్ను నేనే తిట్టుకొన్నాను.
అసలైన సమయం రానే వచ్చింది. కానీ జరుగుతుందనుకొన్న ప్రమాదం జరగనే జరిగింది. బస్ నంబర్ 6644, సీటు నంబర్ 14. అమీర్‌పేట స్టేజ్‌లో బస్సెక్కే సమయానికి వేరే వ్యక్తి ఆ సీట్లో కూర్చొని ఉన్నాడు! ఆ సీటు నాది అని దబాయించడానికి నాకేమీ రిజర్వేషన్ లేదు. నాకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పిన స్నేహితుడికి ఫోన్ చేశాను. ‘వెనక్కు తగ్గొద్దు, సీటు నీదే ...’ అంటూ వాడు ధైర్యం చెప్పాడు. కండక్టర్‌తో మాట్లాడాకా తేలింది ఏమిటంటే ఆ సీట్ ఇద్దరికీ కేటాయించారని! అనఫీషియల్ రిజర్వేషన్ కాబట్టి నేనేం చేయలేను, మీరే తేల్చుకోండి అని తన పని తాను చూసుకోసాగాడు.
ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బస్సు ఎమ్‌జీబీఎస్‌కు చేరేసరికి కండక్టర్ స్వీట్ న్యూస్ చెప్పాడు. ‘అనఫీషియల్ రిజర్వేషన్ కోటాలోనే రిజర్వ్ అయిన 13 నంబర్ సీటులోని ప్రయాణికుడు రావడం లేదని, బస్సు లేట్ అవుతోందని ముందు బస్సుకే వెళ్లిపోయా’డని. ‘మీ టైమ్ బావుం’దని టికెట్ కన్ఫర్మ్ చేశాడు! బస్సు రెండు గంటల సేపు లేట్ కావడమే నా పది గంటల ప్రయాణం సుఖంగా జరిగేలా చేసింది!
- రామిరెడ్డి, అనంతపురం
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, భీతిగొల్పిన సందర్భాలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు, వారు రాసే చిట్టిపొట్టి కవితలు, వేసే రంగురంగుల చిత్రాలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు పంపడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. funday.sakshi@gmail.com
సీటు నంబర్ 14
Published Sat, Jan 25 2014 11:22 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement