సంక్రాంతి సందడి మొదలైంది. పండగ సందర్భంగా ప్రత్యేకబస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు జనవరి 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం ఆర్టీసీ 4,960 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజూ నడిపే 3,557 రెగ్యులర్ బస్సులకు ఇవి అదనం. 10వ తేదీన 1,725 బస్సులు, 11న 1,545 బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరిలో 4,088 ప్రత్యేక బస్సులు నడుపగా, గతేడాది జనవరిలో 2,620 ప్రత్యేక బస్సులు నడిపారు.
ఈసారి పాలెం బస్సు దగ్ధం సంఘటన అనంతరం రవాణాశాఖ దాడులు జరిపి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ బస్సులను సీజ్ చేసింది. దీంతో ఆర్టీసీలో 15-20 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచింది. ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాలను రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎప్పటిలాగానే 50% అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌లతోపాటు ప్రయాణికుల రద్దీ ఉండే అన్నిచోట్లా భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి వస్తువును క్షుణ్నంగా తనిఖీ చేస్తామని అధికారులు చెప్పారు.
జంటనగరాలలోని శివారు ప్రాంతాల్లో టికెట్ బుకింగ్ కేంద్రాల నుంచే బస్సులు బయల్దేరతాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి వెళ్లనున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలవైపు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి బయల్దేరతాయి. యాదగిరిగుట్ట, జనగాం, హన్మకొండ, వరంగల్, పరకాల, మహబూబాబాద్, నర్సంపేటవైపు వెళ్లే బస్సులు ఉప్పల్ చౌరస్తా, ఉప్పల్ బస్‌స్టేషన్ల నుంచి నడుస్తాయి. కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ వైపు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్‌ల మీదుగా నడుపుతారు. మిగతా బస్సులు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ప్రయాణికులు ఉప్పల్, జేబీఎస్, ఎల్‌బీనగర్ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఎంజీబీఎస్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక సిటీ బస్సును నడుపుతారు.
సంక్రాంతికి ఆర్టీసీ నుంచి 4,960 ప్రత్యేక బస్సులు
Published Wed, Dec 25 2013 10:46 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement