రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
తణుకు: సంక్రాంతి వచ్చేస్తోంది... మిగిలిన పండుగలు ఎలా ఉన్నా సంక్రాంతి వచ్చిందంటే మాత్రం సొంతూరు రావాలని అనుకునే వారికి మాత్రం చుక్కలు చూస్తున్నారు. సంక్రాంతికి ఊరు వెళదామనుకున్నా.. యాత్రలకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ చేయించుకునేందుకు వెళ్లే వారికి మాత్రం చుక్కెదురవుతోంది. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ పూర్తయిపోయింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తికావడంతో తర్వాత ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ భర్తీ అవుతున్నాయి. మరోవైపు వెయిటింగ్ లిస్టు సైతం నిండిపోవడంతో ఒక్కో రైలులో నో రూం అని వస్తోంది. జనవరి 25 వరకు ప్రధాన రైళ్లు అన్నింటిలో బెర్తులు నిండిపోయాయి.
వేలాది మందిపై ప్రభావం
జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా సుమారు 25 వరకు ప్రధాన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఉద్యోగులు ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, ముంబై, చెన్నై వంటి నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాధారణ రోజుల్లోనే రెండు, మూడ్రోజుల పాటు వరుస సెలవులు వస్తే సొంతూరుకు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే సంక్రాంతికి ఈసారి విద్యాసంస్థలకు పది రోజులపాటు సెలవులు రావడంతో స్వస్థలాలకు చేరుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, నిడదవోలు పట్టణాల మీదుగా నిత్యం ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పండుగ సమయాల్లో అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో పరిస్థితి రిగ్రీట్ స్థాయికి చేరుకోవడంతో కనీసం టికెట్ తీసుకునే స్థితి లేకుండాపోయింది. దీంతో తాత్కాల్‌పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు.
బస్సులదీ అదే దారి..
రైళ్లన్నీ నిండుకోవడంతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బస్సు ఆపరేటర్లు టికెట్లు బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ పేరు చెప్పి ప్రయాణికులపై అదనపు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించేవారు ఎక్కువగా ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి ఉంది. దీనిని ముందుగా గుర్తించిన ప్రైవేట్ ఆపరేటర్లు సెలవురోజుల్లో టికెట్ల అమ్మకాలు నిలిపివేశారు. బ్లాక్ చేయడం ద్వారా సీజన్‌లో రద్దీని బట్టి టికెట్ ధర రెండు, మూడు రెట్లు పెంచి అమ్మాలని నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో హైదరాబాదు నుంచి జిల్లాకు వచ్చే బస్సుల్లో యాభై శాతం చార్జీలు పెంచగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో నలభై శాతం రాయితీ కల్పిస్తున్నారు. రైళ్లల్లో సైతం ప్రీమియం చార్జీల పేరుతో ప్రయాణికులపై బాదేస్తున్నారు.
అదనంగా సర్వీసులు
పండుగ రద్దీకు అనుగుణంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జిల్లా నుంచి అదనంగా సర్వీసులు పెంచాం. హైదరాబాద్ నుంచి జిల్లాకు 245, జిల్లా నుంచి హైదరాబాద్‌కు 270 సర్వీసులు చొప్పున అదనంగా నడుపుతున్నాం. ఈనెల 10 నుంచి 13 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే బస్సుల్లో చార్జీలు పెంచగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో మాత్రం రాయితీ కల్పిస్తున్నాం.–ఎ.వీరయ్యచౌదరి, ఆర్టీసీ ఆర్‌ఎం, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment