సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు ముందే రైళ్లలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 180 నుంచి 250 వరకు చేరింది. ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి. గౌతమి, గోదావరి, విశాఖ, నర్సాపూర్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. దీంతో సంక్రాంతికి సొంత ఊరెళ్లేందుకు రిజర్వేషన్లు చేసుకోవాలనకునే వారికి నిరాశే మిగులుతోంది. సంక్రాంతి సందర్భంగా ఏటా లక్షలాది మంది సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. జనవరి మొదటి వారం నుంచే పిల్లలకు సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. కానీ ఇందుకు తగినవిధంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌నుంచి తరలి వెళ్లే లక్షలాది మంది అయ్యప్ప భక్తులు కూడా అదనపు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జంటనగరాల నుంచి శబరికి కొన్ని రైళ్లను ప్రకటించారు. కానీ అవి అరకొరగానే ఉన్నాయి.
డిమాండ్ తగ్గ రైళ్లేవీ....
సాధారణ రోజుల్లోనే హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే 1.93 లక్షల మంది పయనిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఈ రద్దీ అధికంగా ఉంటుంది. సంక్రాంతి సెలవుల్లో రోజుకు 50 వేల నుంచి లక్ష మంది ప్రయాణికులు అదనంగా రైళ్లపైన ఆధారపడి బయలుదేరుతారు. ప్రతి సంవత్సరం ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ డిమాండ్‌కు తగినవిధంగా రైళ్లు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. కనీసం 20 లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్తారు. కానీ దక్షిణమధ్య రైల్వే వేసే అదనపు రైళ్లు 50 దాటడడం లేదు. పైగా పండుగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ప్రకటించవలసి ఉండగా, అందుకు భిన్నంగా తీరా పండుగ సమీపించాక అదనపు రైళ్లు వేస్తున్నారు. దీంతో అప్పటికే ప్రయాణికులు బస్సులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించవలసి వస్తుంది. పైగా పండుగ ముందు అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ఎక్కువ శాతం సీట్లు దళారులే ఎగురేసుకు పోతున్నారు.
సాధారణంగా శబరిమల ప్రత్యేక రైళ్లలో ఏటా ఇలాగే దళారుల దందా కొనసాగుతుంది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడం వల్ల సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌లోనూ దళారులు పాగా వేసే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల కోసం అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. స్లీపర్, ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తేనే ఊరెళ్లడం సాధ్యం .
ఒక్క రైలే దిక్కు...
ఏటా కనీసం ఐదారు లక్షల మంది అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరి మాసంలో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. కానీ హైదరాబాద నుంచి శబరికి వెళ్లేందుకు మాత్రం శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇక ఏటా భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు వేస్తున్నారు. ఈసారి కూడా 80 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందించింది. కానీ హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య తక్కువగానే ఉంది. శబరి ఎక్స్‌ప్రెస్‌లో జనవరి నాటికి బెర్తులు బుక్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment