సీన్ మాది – టైటిల్ మీది
ఫ్యామిలీ డ్రామా జానర్‌లో తెలుగులో వచ్చిన సినిమాల్లో ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఈరోజుకీ సెంటిమెంట్ సినిమా అంటే ముందు గుర్తొచ్చే సినిమాల్లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...
ఆ కుటుంబం ఆకలితో చచ్చిపోతోంది. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది అందరికీ. తాము తినకున్నా పిల్లలకైనా అన్నం పెట్టాలని పెద్దవాళ్లంతా ఏదో ఒక పనిచేసుకుంటున్నారు. అయినా కూడా ఆ పిల్లల కడుపైతే నిండడం లేదు. రోజులు గడుస్తున్నాయి. పెద్దన్నకు ఏడుపొక్కటే తక్కువ. తనది చేతకానితనం అంటూ తనను తానే తిట్టేసుకుంటున్నాడు. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని బియ్యం పోగేసుకొచ్చి ఆరోజుకి పిల్లలిద్దరికీ అన్నం పెట్టింది తమ్ముడి భార్య. కనీసం పిల్లలైనా తింటున్నారు అనుకున్నాడు పెద్దన్న. తమ్ముడిని ఉద్యోగం నుంచి తప్పించారు. ఇంకో తమ్ముడు పెద్ద ఉద్యోగం సంపాదించి ఇంటిదిక్కు చూడకుండా వెళ్లిపోయాడు. చిన్న తమ్ముడు చదువుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం కళకళలాడిన ఆ ఇల్లు ఒక్కసారే కళతప్పినట్టుంది. ఆ ఇంట్లో అందరికంటే చిన్న ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు. తినీ తినక ఆ పిల్లాడు జబ్బుపడ్డాడు. మొదటిరోజు నీరసం అనుకున్నారు. రెండోరోజుకి జ్వరం అనుకున్నారు. ఆ పిల్లాడు లేవకుండా అలా పడుకొనే ఉంటున్నాడు. అది ఏం జ్వరమో ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ‘‘ఇదేం జ్వరమో అమ్మా! నిన్నట్నుంచీ బాబు మూసిన కన్ను తెరవకుండా పడివున్నాడు..’’ అన్నాడు పెద్దన్న.
‘‘ఏమో! వీడ్నిలా చూస్తూంటే మామూలు జ్వరంలా నాకూ అనిపించటం లేదు..’’ అంది తమ్ముడి భార్య. ఆమె భర్త ఉద్యోగం కోల్పోయిన నిరాశలో రోడ్లవెంట తిరుగుతున్నాడు. పెద్దన్న డాక్టర్‌ను తీసుకురావడానికి వెళ్లాడు. కొద్దిసేపట్లో తిరిగొస్తాడు. కానీ డాక్టరొచ్చి మందులు రాస్తే? ఏం పెట్టి కొనాలి? తమ్ముడి భార్య వీటన్నింటికీ భయపడుతూనే ఉంది. తమ్ముడి కూతురు శాంతి ఎవరిదగ్గరన్నా ఆ డబ్బులు తీసుకురావాలని బయలుదేరింది. తెలిసినవాళ్ల ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లూ తిరిగింది. ఎక్కడా ఎవరి దగ్గర్నుంచీ డబ్బు అందలేదు. శాంతి ఖాళీ చేతులతో ఇల్లు చేరింది. డాక్టర్.. బాబును పూర్తిగా చెక్ చేసి కొన్ని మందులు రాసిచ్చాడు. ఆ మందులు కొనడానికి డబ్బుల్లేవు. పెద్ద ఉద్యోగంలో ఉన్న తమ్ముడు కూడా బాబు జబ్బు పడితే సాయం చెయ్యలేదు. పెద్ద ఉద్యోగంలో ఉన్న తమ్ముడు, బాబుకు జబ్బు పడ్డ అదే రోజు ఓ ఊరెళ్తున్నాడు. స్టేషన్‌లో ఆయన లగేజీ మోసిన వ్యక్తిని వెనకనుంచి చూసి, ‘‘ఎవరో పెద్దమనిషిలా ఉన్నాడు’’ అంటూ డ్రైవర్ చేత రెండు రూపాయలు ఎక్కువిచ్చి పంపించాడు. ఆ పెద్దాయనే ఈ తమ్ముడికి పెద్దన్న. ఈరోజు కూలీగా మారిపోయి తన ముందు నిలబడింది అన్నే అని ఆ తమ్ముడికి తెలియదు. మరోపక్క చిన్నతమ్ముడు కూడా ఇల్లు గడవడానికి తన సాయంగా ట్యాక్సీ డ్రైవర్‌గా చేరిపోయాడు. పెద్ద ఉద్యోగంలో ఉన్న తమ్ముడు తనను చూడకుండా వెళ్లిపోయిన అదేరోజు, చిన్న తమ్ముడు పెద్దన్న కంటపడ్డాడు.
ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొని గట్టిగా ఏడ్చేశారు. ‘‘బాధపడకు అన్నయ్యా! నీ ఒక్కడి రెక్కలమీదే ఇల్లెలా గడుస్తుంది చెప్పూ..’’ చిన్నతమ్ముడు పెద్దన్నను గట్టిగా హత్తుకొని చెప్పాడు. కస్టమర్ ఆలస్యమవుతోందంటూ అరవడంతో చిన్న తమ్ముడు ట్యాక్సీ ఎక్కి బండిని ముందుకు పోనిచ్చాడు. తమ్ముడు ట్యాక్సీ వేసుకొని ముందుకెళ్లిపోయాక చాలాసేపు పెద్దన్న ఆ బండి వంకే చూస్తూ నిలబడ్డాడు. పెద్దన్న, చిన్నతమ్ముడు రాత్రింబవళ్లూ కష్టపడి సంపాదించిన డబ్బుతో పిల్లాడికి మందులు కొన్నారు. పెద్ద డాక్టర్ను తీసుకొచ్చి చూపించారు. ‘‘ఎలా ఉంది డాక్టర్? భయమేంలేదు కదా?’’ అడిగాడు పెద్దన్న డాక్టర్‌తో. ‘‘సారీ! ఇంక మన చేతుల్లో ఏం లేదు. అంతా భగవంతుడి మీద భారమే!’’ డాక్టర్ చెప్పిన మాటకు ఆ ఇంట్లో వాళ్లలో అప్పటివరకూ ఉన్న ఓపిక కూడా నశించింది. అందరూ మోయలేని భారాన్ని మోస్తున్నవారిలా ఉన్నచోటే కూలబడిపోయారు. పెద్దన్న బాధ వర్ణించలేనిది. ఆ ఇంటికి పెద్ద అయి ఉండి, ఇల్లు ఇలా కళతప్పిపోతే ఏమీ చేయలేకపోతున్నాననే అన్న బాధ ఆయనను మరింత కుంగదీస్తోంది. బాబుకు దగ్గరగా వెళ్లి, పక్కన కూర్చొని, ‘‘రాంబాబు! మంచినీళ్లు ఇమ్మంటావా?’’ అడిగాడు పెద్దన్న. ‘‘మనం తోటలోకి వెళ్దాం పెదనాన్నా!’’ అన్నాడు బాబు. ‘‘ఆ తోట ఇప్పుడు మనది కాదురా!!’’ ‘‘అయితే ఒక పాట పాడు పెదనాన్నా!’’ ‘‘ఏం పాట బాబూ?’’ ‘‘అదే! అన్నాదమ్ముల పాట..’’ అడిగాడు బాబు.
పెద్దన్న బాధనంతా దిగమింగుకొని ‘‘పాడతాను బాబూ! ఆ పాటే పాడతాను..’’ అంటూ పాట పాడటం మొదలుపెట్టాడు. ‘‘బాబూ.. వినరా.. అన్నాదమ్ముల కథ ఒకటి..’’. అప్పటికి చాలాసార్లు పాడిన పాటనే పెద్దన్న పాడుతూంటే, బాబు మంచంపై పడుకొని వింటూ ఉన్నాడు. పెద్దన్న ఏడుపు ఆపుకోలేకపోతున్నాడు. పాట పాడుతున్నంతసేపూ ఏడుస్తూనే ఉన్నాడు. పెద్ద తమ్ముడు, పెద్ద తమ్ముడి భార్య, చిన్న తమ్ముడు.. అందరి పరిస్థితీ అలాగే ఉంది. పెద్దన్న పాట పూర్తవుతూంటే బాబు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంట్లో ఉన్న అందరూ బాబు చుట్టూ చేరారు. ఆ బాబు ఒక్కసారి కళ్లు తెరిచి అందరివైపూ చూస్తూ, మెల్లిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.‘‘నాకు నిండాల్సిన నూరేళ్లు.. ముందు నీకే నిండిపోయాయా నాయనా?’’ అంటూ పెద్దన్న గట్టిగా ఏడ్చాడు. ఆ ఇల్లంతా ఏడుపులే వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లలో ఆ ఇల్లు ఇంతలా ఏడ్చింది ఈరోజే.
Comments
Please login to add a commentAdd a comment