సి.పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు నందివర్ధన మహారాజుగా, కేఆర్ విజయ చిత్రలేఖగా, చిత్తూరు నాగయ్య గురువుగా, ఛాయాదేవి ఆనందంగా, పద్మనాభం, అల్లురామలింగయ్య, సారథి....శిష్యుల పాత్రలలో నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
ఎప్పుడూ కలిసికట్టుగా ఉండని, ఒక మాటమీద నిలబడని శిష్యులు ఆరోజు కలిసికట్టుగా, ఐకమత్యంగా భోరుమంటున్నారు. గురువుగారు ఆందోళనగా అక్కడికి వచ్చారు. ‘‘ఏం జరిగిందిరా?’’
ఏడుపు.....! ‘‘ఏం జరిగిందో చెప్పండ్రా!!’’ మళ్లీ ఏడుపు...!! గురువుగారి సహనం నశించింది. ‘‘ఏడ్చాకయినా చెప్పండి...చెప్పాకయినా ఏడవండి’’ అని గద్దించాడు. మళ్లీ ఏడుపు...!!! ‘‘ఒరేయ్ ఫణీ, నువ్వయినా చెప్పి తగలడరా’’ అడిగారు గురువుగారు కాస్త దీనంగా. ఫణి నోరు విప్పాడు: ‘‘మాలో ఒకరు ఏట్లో పడి కొట్టుకుపోయారు...’’ ‘‘కొట్టుకుపోవడం ఏమిటీ నీ బొందా!’’ తిట్టారు గురువుగారు. ఎందుకంటే తన ఏడుగురు శిష్యులూ నిక్షేపంలా కళ్లెదుటే కనిపిస్తున్నారు! ఫణి లెక్కించడం మొదలుపెట్టాడు... ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు....‘‘అయ్యో! ఆరు మందే ఉన్నారు. ఒకడు ఏట్లో కొట్టుకుపోయాడు’’ అని ఘొల్లుమన్నాడు ఫణి. అతనికి కోరస్ ఇచ్చారు మిగిలిన వాళ్లు. ‘‘ఒరేయ్ వాజమ్మా....మొదట నిన్ను నీవు లెక్కించు...ఆ తరువాత తక్కిన వారిని లెక్కించు’’ అని చెప్పారు గురువుగారు. ‘‘అలాగే గురువుగారు’’ అని మళ్లీ లెక్కించడం మొదలుపెట్టాడు.... ‘‘ఒక్కటీ....రెండూ....ఆరూ...ఏడూ....ఎనిమిది...అయ్యో....ఎనిమిది మంది ఉన్నారు’’ అని మళ్లీ ఏడ్వడం మొదలు పెట్టాడు శిష్యుడుగారు. ఈసారి ఫణి తన తోటి విద్యార్థులనే కాకుండా గురువుగారిని కూడా లెక్క వేశాడు!
‘‘ఇవ్వాళ భోజనం కాస్త బరువైందిరా విశ్రమిస్తాను’’ అన్నారు గురువుగారు. ‘‘అలాగే గురువుగారు, మీకు పరుపు వేస్తాం. కాళ్లు కూడా పడతాం’’ అన్నారు శిష్యులు. పరుపు వేశారు. గురువుగారు విశ్రమించి నిద్రలోకి జారుకున్నారు. గురువుగారి కాళ్లు పట్టడం దగ్గర ఇద్దరు శిష్యులకు తగాదా మొదలైంది. ‘‘ఈ కాలు నాది’’ ‘‘కాదు నాది’’ ‘‘నా కాలు బంగారు కాలు...నీ కాలు ఇత్తడి కాలు’’ ‘‘ఒరేయ్ నీ కాలే ఇత్తడి....నా కాలు బంగారం’’ ‘‘నా కాలు జోలికి వస్తే నీ కాలు మునక్కాయలా నరికేస్తా’’ ‘‘నా కాలు జోలికి వస్తే నీకు నరకం చూపిస్తా....పచ్చడి పచ్చడి చేస్తా’’గురువు గారి రెండు కాళ్లును చెరొకటి పంచుకున్న శిష్యులు ఒకరి మీద ఒకరు సవాలు విసురుకున్నారు. కారాలు మిరియాలు నూరారు. ఆ తరువాత.... ‘‘నా కాలు జోలికి వస్తావా? నీ కాలిని ఏం చేస్తానో చూడు’’ అంటూ ఒకడు పెద్ద సుత్తి పట్టుకొచ్చాడు. ‘‘నా కాలు జోలికి వస్తావా? నీ కాలిని ఏంచేస్తానో చూడు’’ అంటూ మరొకడు పెద్ద రాయి పట్టుకొచ్చాడు.అలికిడికి చప్పున మేల్కొన్నారు గురువుగారు.
‘‘అయ్యో...మీకేం వచ్చిందిరా....ఒరేయ్... నా కాళ్లు నరికేస్తార్రా...’’ భయపడిపోయారు గురువుగారు. ‘‘వాళ్ల కాళ్లు వాళ్లే నరికేసుకుంటే అనుభవిస్తారు’’ అన్నాడు ఒక శిష్యుడు పెద్దరికంగా! (వాళ్ల కాళ్లా పాడా! అవి గురువుగారి కాళ్లు అయితేనూ) ఈ హడావిడి అంతా చూసి గురువుగారి ధర్మపత్ని పరుగెత్తుకు వచ్చి...‘‘ఒరేయ్...ఒరేయ్...మీకేం వచ్చిందిరా పోయే కాలం....ఏమిట్రా ఈ ఘోరం’’ అంటూ గట్టిగా అరిచింది.‘‘గురుసేవ అండీ’’ అన్నాడు ఒకడు.‘‘మిమ్మల్ని తగలెయ్య...నిష్కారణంగా ఆయన ప్రాణాలు తీసేటట్టు ఉన్నారు’’ అన్నది గురుపత్ని.‘‘హమ్మయ్య బతికానురా బాబూ....నువ్వు రావడానికి ఒక క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్లు తీసేసి ఉండేవాళ్లు’’ అన్నారు గురువుగారు.‘‘వీళ్ల చేతులు విరిగిపోనూ.... ఎలా కొట్టేశారండీ’’ అన్నది భర్త కాళ్ల వైపు చూస్తూ.ఆ కోపంలోనే...‘‘ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో ఎందుకు...తరిమేయండి బయటికి’’ అని అరిచింది.గురువుగారి ముఖంలో మాత్రం మచ్చుకు కూడా కోపం కనిపించలేదు.అదే శాంతం!‘‘వాళ్లు బుద్ధిహీనులని నాకు తెలుసునే. అందుకే ఇంత ముద్ద పడేస్తున్నాం. లేకపోతే వాళ్లు ఎక్కడికి పోగలరు! ఎలా బతకగలరు చెప్పు!’’ అన్నారు గురువుగారు శాంతంగా.
‘‘చాల్లే ఊరుకుందురూ...మీ చాదస్తంగానీ ఈ మూర్ఖులకు చదువొస్తుందా!’’ అన్నది గురుపత్ని మూతి తిప్పుతూ.‘‘చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒకొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లెద్దూ. మనకు మటుకు ఎవరు ఉన్నారు చెప్పు! ఒక్క ఆడపిల్లే కదా. ఇలాంటి అమాయకులకు కాస్త అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా!’’ అన్నారు గురువుగారు.గురువుగారి మాటలతో కాస్త శాంతించింది ఆనందం.ఇంతలో... ఒక పాము సర్రుమని వెళుతుంది!‘‘పాము...పాము’’ అని అరిచింది గురుపత్ని.‘‘చూశావా....చూశావా...వాళ్లు కొడితే కొట్టారుగానీ ఈ వేళ నా ప్రాణం కాపాడారు ఆనందం. వాళ్ల గందరగోళానికి భయపడి ఆ పాము ఇంతవరకు బయటకు రాలేదుగానీ, లేకపోతే ఈపాటికి నీ గతేం కాను నా గతేం కాను చెప్పు!’’ అన్నారు గురువుగారు.‘‘అవునండీ, వాళ్ల తెలివి తక్కువపనితో ఒక విధంగా మనకు ఉపకారం చేశారు’’ అన్నది ఆనందం.
Comments
Please login to add a commentAdd a comment