‘బంగారు చెల్లెలు’ చిత్రంలోని ‘అన్నయ్య హృదయం దేవాలయం/ చెల్లెలే ఆ గుడి మణి దీపం/ అనురాగమే కొలువున్న దైవం/అనుబంధమే గోపురం/మా అనుబంధమే గోపురం’ పాటలో శోభన్‌బాబు, శ్రీదేవి అన్నచెల్లెళ్లుగా నటించారు. ఆ చిత్రంలో నాది చిన్న పాత్ర. శ్రీదేవి భర్తగా నటించాను. అప్పటికే నేను టి. త్రివిక్రమరావుగారి పొట్టేలు పున్నమ్మతో పాటు మరిన్ని సినిమాలలో నటించాను. పొట్టేలు పున్నమ్మ తరవాత ఆయన నన్ను ‘మా హీరో’ అనేవారు. ఆయనకి నేనంటే అభిమానం. నాకు కూడా ఆయనంటే స్నేహభావం. జీతాలు కచ్చితంగా ఇచ్చేవారు. మాకు చాలా సంతోషం వేసేది మాకు. ఒక మంచి సంస్థలో పనిచేసిన అనుభూతి మిగిలింది. బంగారు చెల్లెలు చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తావా అని ఆయన ఫోన్ చేయగానే, ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన మీద ఉన్న గౌరవం కారణంగా చిన్న పాత్ర అయినా, అంగీకరించాను. శోభన్‌బాబుగారు నాకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. ఆయన నటిస్తున్న చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావించాను. ఈ చిత్రంలో పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
‘మా బంగారక్క’ చిత్రం తరవాత శ్రీదేవి బంగారు చెల్లెలు చిత్రంలో నటించారు. మంచి పరిణతి వచ్చి, ఈ చిత్రంలో చాలా బాగా నటించారు ఆవిడ. ఈ సినిమా అంగీకరించే సమయానికి నటుడిగా నేను చాలా బిజీగా ఉన్నాను. కాని త్రివిక్రమరావుగారి మాట కాదనలేక, అంగీకరించాను. ఈ పాట ఊటీలో తియ్యాలి రమ్మన్నారు. అలాగే వెళ్లాను. చిన్న పాత్ర అయినా గుర్తుండిపోయిన పాత్ర. అప్పటికే శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించారు. చెల్లెలిగా ఆమెను అంగీకరిస్తారా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అటువంటివేమీ ఉండదు అన్నారు ఆయన.
‘పంచుకున్నది ఒకటే రక్తం/పెంచుకున్నది ఒకటే పాశం/బ్రతుకుతున్నది ఆ పాశం కోసం/కోరుకునేది ఇద్దరి క్షేమం’ చరణంలో వారి నటన చూస్తే ఈ చిత్రంలో వారిద్దరూ నిజమైన అన్నచెల్లెళ్లుగా ఎంతో చక్కగా నటించారనిపిస్తుంది. శోభన్‌బాబుగారిని అన్నయ్య పాత్రలో ప్రేక్షకులు బాగా ఆదరించారు.
‘జ్యోతి’ సినిమా తరవాత చాలా చిత్రాలలో నేను జయసుధగారు ఇద్దరం జంటగా నటించాం. కాని నాకు జయసుధ గారంటే నాకు సోదరి భావం. అన్నచెల్లెళ్ల బంధం ఎంతో పవిత్రమైనది. ఒక పేగు తెంచుకుని, రక్తం పంచుకుని పుట్టినవారి మధ్య ఆ అనుబంధం ఎల్లకాలం నిలబడాలి. ఈ బంధమే కాకుండా, కొందరిని మనకు మనంగా సోదరిగా భావిస్తాం. జయసుధగారంటే నాకు అదే భావం. జయసుధ నాకు దేవుడు ఇచ్చిన సోదరి వంటిది. షూటింగ్‌లో మేమిద్దరం జంటగా క్లోజ్‌గా నటించినా, నటన అయిపోయాక మాత్రం ఇద్దరం ఎంతో పద్ధతిగా అన్నచెల్లెళ్లుగా ఉంటాం. ఆ బం«ధం అంత పవిత్రమైనది.
‘ఊయలలూపి జోలలలు పాడే తల్లినెరగను/మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను/కళ్లు తెరిచి నే చూచినది ఈ కరుణామూర్తిని/మాట నేర్చి నే పిలిచినది అన్నా అన్ననీ’ చరణంలో శ్రీదేవి కనపరిచిన హావభావాలు చూస్తుంటే, ఆమెను అందరూ తమ సొంత సోదరిగా భావించేంత సహజంగా నటించారు. ‘కృష్ణుడు పలికిన గీతా వాక్కు వేదం అయినా ఎందుకు నాకు/నా పాలి వేదం అన్నయ్య పలుకు అన్నయ్య నవ్వే నా దారి వెలుగు’ చరణం వింటుంటే అన్నచెల్లెళ్ల బంధాన్ని ఇంతకు మించి అందంగా ఎవరు రాయగలరు అనిపిస్తుంది. చెల్లెలికి అన్నయ్య మీద ఉన్న అనురాగాన్ని ఎంతో హృద్యంగా చూపారు రచయిత ఈ చరణంలో.
– వైజయంతి పురాణపండ
సవరణ: జూలై 28వ తేదీ ఫన్‌డే పాటతత్త్వం శీర్షికలో చిన్న పొరపాటు దొర్లింది. దేవులపల్లివారు చరణాలు రాసి ఇచ్చారు అని వచ్చింది. అది మైలవరపు గోపి గారు రాశారు. దేవులపల్లి వారు ‘పాడనా తెనుగు పాట’ రాసి ఇచ్చారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment