‘బంగారు పాప’ చిత్రంలోని ఆ... ఆ.... ఆ... ఉళళళళళళళళళళ ఆయీ/ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయీ/తాథిమి తకథిమి తోల్బొమ్మా దీని తమాష చూడవే కీల్బొమ్మా/దీని తమాషా చూడవే మాయబొమ్మా/ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా /తళాంగు తకథిమి తోల్బొమ్మా తోం తకతై తకతై మాయబొమ్మా/ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయీ... పాట సమయానికి నేను పుట్టానో లేదో తెలియదు. ఈ పాట సందర్భం మనిషి హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. అంతవరకు రౌడీ జీవితాన్ని గడుపుతూ, మొరటుగా ఉండే ఒక మనిషిని చిన్న పాప పూర్తిగా మారుస్తుంది. తండ్రి స్థానం వచ్చాక, తన పిల్ల కాకపోయినా, తను చూపే వాత్సల్యం మనసును హత్తుకునేలా తీశారు ఈ చిత్రంలో. ఈ పాటను మా నాన్నగారు మనసు ద్రవించేలా ఆర్ద్రత నిండిన గొంతుతో పాడారు. ఆ పాట చూస్తుంటే రంగారావుగారే పాడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక చిన్న తోలుబొమ్మను చేతిలో పట్టుకుని, దానిని ఆడిస్తూ పాడతారు ఈ పాటను. చాలా చిన్న పాట. కేవలం నాలుగు లైన్ల పాట. కాని ఆ పాటలో ఎంతో అర్థం నిండి ఉంటుంది. ఆ పిల్లకు తండ్రి ఎవరో తెలియదు. కాని రంగారావుగారినే తన తండ్రిగా భావిస్తుంది. కన్న తండ్రి కాకపోయినా, కన్న తండ్రి కంటె ఎక్కువగా చూస్తారు రంగారావుగారు ఆ పాత్రంలో. ఎంతటి వాడైనా తండ్రి తండ్రే. తండ్రీకూతుళ్ల అనుబంధం చాలా బాగా చూపించారు ఈ చిత్రంలో. నాన్నగారికి నచ్చిన పాటలలో ఇది ఒకటనీ, తన మనసుకు నచ్చి, భావంతో పాడిన పాటలలో కూడా ఇది ఒకటనీ ఆయన చెబుతుండేవారు.
నాన్నగారికి వివాహం అయిన చాలా కాలానికి మా పెద్దక్క పుట్టింది. అక్కని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కుటుంబంలో అందరూ రాకుమార్తెలా చూసేవారు. అక్క మీద ఈగ వాలకూడదు, దోమ కుట్టకూడదు. అంత ప్రేమ. ఆ ప్రేమ ప్రభావం అంతా ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటలో నాన్నగారు తన గొంతులో జీవించారు. లాలి పాటకు పాడుతున్నట్లు నోటితో ఉచ్చరించే ‘ఉళళళళళళళళళ’ వింటుంటే, ఇంత కంటె జోల పాట ఎవరు బాగా పాడగలరు అనిపిస్తుంది. నాన్నగారికి ఎస్‌వి. రంగారావుగారితో విడదీయరాని అనుబంధం ఉండేది. ఒకసారి నన్ను రంగారావుగారి ఇంటికి తీసుకువెళ్లారు. ‘మాధవపెద్ది సత్యం గారు వచ్చారు’ అని ఆయనకు కబురు వెళ్లగానే, ఆయన వెంటనే పైకి రమ్మని ఆప్యాయంగా పిలిచారని, నన్ను ఆయన ఒళ్లో కూర్చోపెట్టారని నాన్న చెప్పేవారు. రంగారావుగారితో నాన్నకు అంత సాన్నిహిత్యం ఉంది.
ఇద్దరూ ఏరా అంటే ఏరా అని పిలుచుకునేవారు. రంగారావుగారి మీద అభిమానంతో, నాన్నగారు ఎంతో అనుభూతి చెంది పాడి ఉంటారా అనిపిస్తుంది. తన గళం దానం చేసి, జీవం పోశారు. రంగారావుగారి వంటి ప్రఖ్యాత నటుడికి పాడటం కంటె అదృష్టం ఏముంటుంది. నాన్నగారి గొంతు గంభీరంగా ఉంటుంది. ఆయన పాడిన పాటలు కూడా చాలావరకు గంభీరమైనవే. కాని ఈ పాటను నాన్నగారు పాడిన విధానం చూస్తే, ఎంతో సున్నితంగా, స్వయంగా తన కూతురికే లాలి పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పాట చాలా బావుంటుందని, తనకు చాలా ఇష్టం అని చెప్పేవారు. నాన్నగారికి తత్త్వాలు, పద్యాలు కూడా చాలా ఇష్టం.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment