గురుదేవోభవ | special on Dr. Sarvepalli Radhakrishnan | Sakshi
Sakshi News home page

గురుదేవోభవ

Published Sat, Sep 2 2017 11:29 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

గురుదేవోభవ

గురుదేవోభవ

గురుశిష్య పరంపర మన దేశంలో అనాదిగా ఉన్నదే. గురువుల మీద శిష్యులకు విపరీతమైన గురి ఉంటుంది. శిష్యుల మీద గురువులకు అవ్యాజ్యమైన వాత్సల్యం ఉంటుంది. చదువులు మాత్రమే కాదు, విద్యార్థులకు వినయ విధేయతలనూ నేర్పేవారే గురువులు. ఎలాంటి పేరాశ లేకుండా గురువులు జిజ్ఞాస గల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. అలాంటి గొప్ప గొప్ప గురువుల ప్రస్తావన మన పురాణాల్లోనూ, చరిత్రలోనూ అడుగడుగునా కనిపిస్తాయి.

మనిషి అనేవాడు అభివృద్ధిపథంలో నడుస్తున్న ప్రతిచోటా గురువులు అనేవాళ్లు ఉంటారు. వాళ్లు కేవలం సిలబస్‌లోని పాఠాలను చెప్పడంతోనే సరిపెట్టుకోరు. విద్యార్థులకు లోకరీతిని అవగతం చేస్తారు. వాళ్ల నడవడికను తీర్చిదిద్దుతారు. ఉన్నతమైన ఆశయాలను ఉద్బోధిస్తారు. ఆశయ సాధన దిశగా దిశా నిర్దేశం చేస్తారు. స్థూలంగా విద్యార్థుల జీవితాలనే ప్రభావితం చేస్తారు. వాళ్లు... విద్యార్థుల మనసుల్లో దేవుళ్లలా కొలువుండిపోతారు. అలాంటి గురుదేవుల గురించి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (సెప్టెంబర్‌ 5) సందర్భంగా...

విద్యార్థులు బ్రహ్మరథం పట్టిన గురువు
విద్యార్థులు బ్రహ్మరథం పట్టిన అరుదైన గురువు ఆయన. సనాతన కాలం నాటి సంగతేమో గాని, ఆధునిక కాలంలో అలాంటి ఘనతను దక్కించుకున్న ఏకైక గురువు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన ఆ పదవులకే వన్నెతెచ్చారు. రాజ్యాంగ పదవులు చేపట్టక ముందు ఆయన సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పాఠాలు చెప్పారు. పాఠాలు బోధించిన ప్రతి విద్యాసంస్థలోనూ విద్యార్థుల మనసులపై ఆయన చెరగని ముద్ర వేశారు.

 మద్రాసు ప్రావిన్సులోని తిరుత్తణి సమీపంలోని కుగ్రామంలో 1888 సెప్టెంబర్‌ 5న ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు రాధాకృష్ణన్‌. తండ్రి సర్వేపల్లి వీరాస్వామి స్థానిక జమీందారు వద్ద రెవెన్యూ ఉద్యోగి. తల్లి సీతమ్మ గృహిణి. రాధాకృష్ణన్‌ బాల్యం నుంచే తెలివైన విద్యార్థి. తిరుత్తణి, తిరుపతి, వలజపేట పాఠశాలల్లో చదువుకున్నారు. పాఠశాల విద్య తర్వాత తొలుత వెల్లూరులోని వూరీస్‌ కాలేజీలో చేరినా, కొద్దికాలానికే అక్కడి నుంచి మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీకి మారారు. అక్కడి నుంచే ఆయన తన ఇరవయ్యేళ్ల వయసులోనే ఫిలాసఫీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. రాధాకృష్ణన్‌ సోదరుడి వరుస అయ్యే ఒకరు అదే కాలేజీలో ఫిలాసఫీ చదువుకున్నారు. ఆయన చదువు పూర్తవడంతో తన పుస్తకాలను రాధాకృష్ణన్‌కు ఇచ్చారు. దాంతో రాధాకృష్ణన్‌ అసంకల్పితంగానే ఫిలాసఫీ కోర్సులో చేరారు. చేరడం అసంకల్పితంగానే చేరినా, ఆ తర్వాత ఆయన తత్వశాస్త్రాన్ని ఇష్టంగానే అధ్యయనం చేశారు. వేదాంత విలువలు, వాటి అధిభౌతికతపై పరిశోధన చేశారు.

చదువు పూర్తయిన ఏడాదిలోగానే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా అవకాశం దొరికింది. తొమ్మిదేళ్లు గడిచేలోగా మైసూరు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్‌గా ఆహ్వానం లభించింది. మైసూరు వర్సిటీ పరిధిలోని మహారాజా కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరారు. అనతి కాలంలోనే ఆయన తన బోధనా పటిమతో విద్యార్థులకు చేరువయ్యారు. మైసూరులో పనిచేస్తుండగానే రవీంద్రనాథ్‌ టాగోర్‌ సిద్ధాంతంపై తొలి పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి మేధావుల ప్రశంసలు లభించాయి. అంతేకాదు, కలకత్తా వర్సిటీ నుంచి ఆహ్వానం కూడా వచ్చింది. మైసూరు వర్సిటీని వదిలి కలకత్తా వర్సిటీలో చేరడానికి ఊరు వదిలి వెళుతున్నప్పుడు గుర్రబ్బగ్గీని పూలతో రథంలా అలంకరించి, విద్యార్థులే స్వయంగా దానిని మైసూరు రైల్వే స్టేషన్‌ వరకు లాక్కువెళ్లారంటే, ఏ స్థాయిలో ఆయన విద్యార్థుల మనసులకు చేరువయ్యారో అర్థం చేసుకోవాల్సిందే.

విద్యార్థుల అభిమానాన్ని అంతగా చూరగొన్న రాధాకృష్ణన్‌ తర్వాతి కాలంలో ఆంధ్రా యూనివర్సిటీకి, బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి వైస్‌ చాన్స్‌లర్‌గా కూడా సేవలందించారు. రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు, అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, తన పుట్టిన రోజుకు బదులుగా ఆ రోజు ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకొంటే తాను సంతోషిస్తానని ఆయన బదులిచ్చారు. ఆయన కోరిక మేరకు 1962 నుంచి సెప్టెంబర్‌ 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

మరికొందరు మహోపాధ్యాయులు
సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో పాటు ఆధునిక భారతదేశంలో విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మరికొందరు మహోపాధ్యాయులు కూడా ఉన్నారు. ఆధునిక విద్యారంగానికి పునాదులు వేసిన వారిలో అగ్రగణ్యులుగా వారు గుర్తింపు పొందారు. అలాంటి గురువులలో కొందరు ముఖ్యుల గురించి...

కవీంద్రుడు గురుదేవుడు
సాహిత్యంలో నోబెల్‌ బహుమతి సాధించిన కవీంద్రుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌ ‘గురుదేవుని’గా సుప్రసిద్ధుడు. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన ఆయన విద్యారంగంలో సంస్కరణల కోసం తనదైన శైలిలో అపారమైన కృషి చేశారు. నాలుగు గోడల మధ్య కాదు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది... ప్రకృతి ఒడిలో వారికి చదువు చెప్పాలి అన్నదే ఆయన సిద్ధాంతం. మన దేశంలోని సంప్రదాయ గురుకుల పద్ధతిపైనే ఆయనకు ఎక్కువ నమ్మకం ఉండేది. తన నమ్మకాలకు, ఆశయాలకు అనుగుణంగానే రవీంద్రనాథ్‌ టాగోర్‌ 1901లో కలకత్తా నగరానికి చేరువలో గురుకుల పద్ధతిలో శాంతినికేతన్‌ ఆశ్రమాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో అదే విశ్వభారతి విశ్వవిద్యాలయంగా ఎదిగింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుధీ రంజన్‌ దాస్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ వంటి ఉద్దండులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారే. రవీంద్రనాథ్‌ టాగోర్‌ తన జీవితకాలంలో దళితుల పట్ల వివక్ష తొలగించడానికి శాయశక్తులా కృషి చేశారు. గురువాయూర్‌ ఆలయంలో దళితులకు తొలిసారిగా ప్రవేశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

దళితుల పాలిట విద్యా‘జ్యోతి’
బ్రిటిష్‌ హయాంలో దేశంలోని దళితుల పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. అంటరానితనం కారణంగా దళితులు చదువులకు దూరంగా ఉండేవారు. అలాంటి రోజుల్లో జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి ఫూలే దళితుల్లో విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. దళితుల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగించారు. అస్పృశ్యత నివారణకు, దళితుల్లో విద్యా వ్యాప్తి, మహిళల స్వావలంబనకు ఫూలే దంపతులు అలుపెరుగని పోరాటం సాగించారు. బాలికల కోసం 1848లో దేశంలోనే తొలి పాఠశాలను నెలకొల్పిన భారతీయులు ఫూలే దంపతులే కావడం విశేషం. జ్యోతిరావు ఫూలే తొలుత తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పారు. తర్వాత పుణేలో బాలికల పాఠశాల ప్రారంభించారు. దీనిపై కుటుంబం నుంచి, సాటి కులస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో సొంత ఇంటినే విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఉస్మాన్‌ షేక్‌ అనే మిత్రుడు, ఆయన సోదరి ఫాతిమా షేక్‌... ఫూలే దంపతులకు తమ ఇంట ఆశ్రయం కల్పించారు. అక్కడే బాలికల పాఠశాల నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ పాఠశాల కొనసాగుతుండగానే ఫూలే దళితుల కోసం మరో మూడు పాఠశాలలను కూడా నెలకొల్పారు. దళితుల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలిగించిన తొలి గురువుగా జ్యోతిరావు ఫూలే చిరస్మరణీయమైన సేవలందించారు.

విద్యార్థులకు కలలు నేర్పిన ‘క్షిపణి వీరుడు’
దేశం గర్వించదగ్గ ‘క్షిపణి వీరుడు’, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం విద్యార్థులకు కలలు కనడం నేర్పిన గొప్ప గురువు. వృత్తిరీత్యా  శాస్త్రవేత్తే అయినా, ప్రవృత్తిరీత్యా ఆయన బోధననే ఎక్కువగా ఇష్టపడే వారు. ఏమాత్రం వీలు దొరికినా విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అని ఆయన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేవారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత సైతం ఆయన ఈ అలవాటును మానుకోలేదంటే, బోధనపై ఆయనకు ఎంతటి మక్కువ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

స్వాతంత్య్ర భారతదేశంలో రాధాకృష్ణన్‌ తర్వాత విద్యార్థుల మనసులను చూరగొన్నది రాష్ట్రపతి అబ్దుల్‌కలాం మాత్రమే! అణు శాస్త్రవేత్తగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా కలాం అపురూపమైన విజయాలను సాధించారు. మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)లోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో శాస్త్రవేత్తగా చేరారు. దేశం చేపట్టిన తొలి అణుపరీక్షలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రపతి పదవి నుంచి విరమణ పొందిన తర్వాత కూడా ఆయన పలు విద్యాసంస్థలను సందర్శించి, విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. చివరకు షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విద్యార్థులకు బోధిస్తుండగానే 2015 జూలై 27న తుదిశ్వాస విడిచారు.

మన ప్రాచీన గురువులు
క్రీస్తుపూర్వమే మన దేశంలో గొప్ప గొప్ప గురుకులాలు ఉండేవి. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. శాస్త్ర పారంగతులైన గురువులు వివిధ శాస్త్రాలలో విద్యార్థులను తీర్చిదిద్దేవారు. అలాంటి వారిలో కొందరు గురువులు దేశ చరిత్ర గమనాన్నే మార్చారు. శాస్త్రాల పురోగతిలో మైలురాళ్లుగా నిలిచారు. అలాంటి ప్రాచీన గురువులు కొందరి గురించి...

అర్థశాస్త్రాన్ని అందించిన ఆచార్యుడు    
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది వాడైన చాణక్యుడు ‘అర్థశాస్త్రం’ రచించాడు. ప్రజా పాలన, ఆర్థిక, న్యాయ, రాజనీతి శాస్త్రాలలో పారంగతుడైన చాణక్యుడు మౌర్యరాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. మౌర్యవంశ స్థాపకుడు చంద్రగుప్తుడికి గురువుగా పాఠాలు చెప్పాడు. చంద్రగుప్తుడు రాజైన తర్వాత మహామంత్రిగా సేవలందించాడు. చంద్రగుప్తుడి కొడుకు బిందుసారుడి వద్ద కూడా మహామంత్రిగా ఉంటూ రాజ్యపాలనలో కీలక పాత్ర పోషించాడు. మౌర్య రాజ్యస్థాపనకు ముందు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా విద్యార్థులకు వివిధ శాస్త్రాలను బోధించేవాడు.

లోకరీతిని నేర్పిన గురువు    
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన విష్ణుశర్మ రాజకుమారులకు పాఠాలు చెప్పేవాడు. లోకం తీరును సుబోధకంగా వారికి అవగతమయ్యేలా చెప్పేందుకు ఆయన ‘పంచతంత్రం’ రచించాడు. జంతువులను పాత్రలుగా సృష్టించి, వాటికి మానవ లక్షణాలను ఆపాదించి చెప్పిన ‘పంచతంత్ర’ కథలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని యుక్తితో అధిగమించే పద్ధతుల గురించి వివరించే ఈ కథలు పలు దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమై ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. కాలపరీక్షకు నిలిచిన ‘పంచతంత్ర’ కథలు ఆధునిక తరాలకు కూడా మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి.

తొలి ఖగోళ శాస్త్రాచార్యుడు
ఖగోళ శాస్త్రం ఆధునిక యుగంలో ఎంత పురోగతి సాధించినా, ఇంకా ఇదొక అంతు చిక్కని శాస్త్రమే. ఖగోళ శాస్త్రంలో తొలి పాఠాలు బోధించిన ఘనత ఆర్యభట్టుకే దక్కుతుంది. క్రీస్తుశకం ఐదో శతాబ్ది వాడైన ఆర్యభట్ట గణిత, ఖగోళ శాస్త్రాల్లో ఆనాడే గొప్ప గొప్ప పరిశోధనలు సాగించాడు. గ్రహ గమనాలను, గ్రహణ కాలాన్ని ముందుగానే లెక్కించగల పద్ధతులను కనుగొన్నాడు. ‘ఆర్య సిద్ధాంత’, ‘ఆర్య భట్టీయం’ వంటి గ్రంథాలను రాశాడు. నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు గణిత, ఖగోళ శాస్త్ర మర్మాలను బోధించేవాడు. ‘సున్నా’ను కనుగొన్న ఘనత ఆర్యభట్టకే దక్కుతుంది. భాస్కరాచార్యుల వంటి ఉద్దండ శిష్యులను తయారు చేసిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది.

విశ్వామిత్రుడు    
విశ్వామిత్రుడి గురించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. వశిష్ఠుడి తర్వాత రామలక్ష్మణులకు విద్యలు నేర్పిన గురువు విశ్వామిత్రుడు. రాక్షస సంహారం కోసం రామలక్ష్మణులను తనతో పంపాల్సిందిగా దశరథుడిని ఒప్పించిన విశ్వామిత్రుడు వారికి అస్త్రశస్త్ర విద్యలతో పాటు అత్యంత రహస్యమైన ‘బల అతిబల’ విద్యలను నేర్పించాడు. బల అతిబల విద్యలు ఎరిగిన వారు ఆకలి దప్పులను జయిస్తారు. ఈ విద్యలతోనే రామలక్ష్మణులు విజయవంతంగా రాక్షస సంహారం కావించగలిగారు.

సాందీపని మహాముని
అవతార పురుషులైన బలరామ కృష్ణులకు బాల్యంలో చదువు చెప్పిన గురువు సాందీపని మహాముని. భాగవతంలో సాందీపని మహాముని ప్రస్తావన కనిపిస్తుంది. బలరామ కృష్ణులతో పాటు కుచేలుడిగా పేరుపొందిన సుదాముడు కూడా సాందీపని మహాముని వద్దనే చదువుకున్నాడు. సాందీపని మహాముని కొడుకు చిన్నవయసులోనే మరణిస్తే, అతడిని బతికించి తెచ్చి గురుదక్షిణగా సమర్పిస్తారు బలరామకృష్ణులు.

వశిష్ట మహర్షి
అవతార పురుషుడైన శ్రీరాముడికి విద్యలు నేర్పిన గురువుగా మన పురాణాల్లో వశిష్టుడికి విశిష్ఠ స్థానం ఉంది. దశరథ నందనులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు చదువు చెప్పిన తొలి గురువు వశిష్ఠుడు సప్తరుషులలో ఒకరిగా పురాణాలలో ప్రఖ్యాతి పొందాడు. ఇక్ష్వాకు వంశానికి రాజగురువుగా వశిష్టుడి ప్రస్తావన రామాయణంలోను, ఇతర పురాణాల్లోనూ కనిపిస్తుంది. రుగ్వేదంలోని ఏడవ మండలాన్ని రచించినది వశిష్ఠుడేనని ప్రతీతి.

మన పురాణ గురువులు
మన పురాణాల్లో గురు శిష్యుల సంబంధాలపై బోలెడన్ని కథలు ఉన్నాయి. గొప్ప గొప్ప గురువుల గురించి, వారి విద్వత్తును గురించి, వారు పొందిన గౌరవం గురించి పురాణాల్లో చాలా ప్రస్తావనలే ఉన్నాయి. పురాణాల్లోని కథానాయకులకు, అవతార పురుషులకు విద్యలు నేర్పిన కొందరు గురువుల గురించి...

పరశురాముడు    
జమదగ్ని మహర్షి తనయుడైన పరశురాముడు సాక్షాత్తు అవతార పురుషుడు. సప్త చిరంజీవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. పలు పురాణాలలో పరశురాముడి ప్రస్తావన కనిపిస్తుంది. అంతేకాదు, అస్త్ర విద్యా పారంగతుడైన ఆచార్యుడిగా కూడా ఆయన సుప్రసిద్ధుడు. భీష్ముడికి, ద్రోణుడికి, కర్ణుడికి అస్త్ర శస్త్రవిద్యలు నేర్పించిన ఆచార్యుడు ఆయన.

ద్రోణాచార్యుడు    
భరద్వాజ పుత్రుడైన ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురువుగా ప్రసిద్ధుడు. ఆయన బావ కృపాచార్యుడు కూడా కౌరవ పాండవులకు విద్యలు నేర్పించినా, కృపాచార్యుడి తర్వాత వారికి విద్యలు బోధించిన ద్రోణుడే సుప్రసిద్ధి పొందాడు. ధనుర్విద్యా పారంగతుడైన ద్రోణుడు తన అభిమాన శిష్యుడైన అర్జునుడిని సాటిలేని మేటి వీరుడిగా తీర్చిదిద్దాడు.

మన ఆధ్యాత్మిక గురువులు
ఆధ్యాత్మిక రంగంలో మనకు చాలామంది గురువులు ఉన్నారు. వారిలో కొందరు జాతికి దిశానిర్దేశం చేసిన అరుదైన గురువులు ఉన్నారు. ధార్మిక జీవన పునరుద్ధరణ కోసం వారు నిరుపమానమైన కృషి సాగించారు. సమాజంలోని వివక్షలను తొలగించేందుకు, శాంతి సామరస్యాల వైపు జనాలను మళ్లించేందుకు వారి బోధనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అరుదైన కొందరు ఆధ్యాత్మిక గురువులు... వారి విశేషాలు...

రామానుజాచార్యులు    
విశిష్టాద్వైత మత వ్యవస్థాపకుడైన రామానుజాచార్యులు ఆధ్యాత్మిక సామ్యవాది. గురువు నుంచి పొందిన అష్టాక్షరీ మంత్రాన్ని గురువు ఆజ్ఞను ధిక్కరించి మరీ శ్రీరంగం గోపురమెక్కి జనాలకు వెల్లడి చేసిన సాహసి. గురువాజ్ఞ ఉల్లంఘించినందుకు తానొక్కడినే నరకానికి పోతే పోవచ్చు గాని, మిగిలిన వారంతా మోక్షం పొందుతారు కదా అని గురువుకు బదులిచ్చిన ఆధ్యాత్మికవేత్త ఆయన. గద్యత్రయాన్ని రచించి, భక్తితోనే జీవాత్మ పరమాత్మను చేరుకోగలదని బోధించిన గురువు రామానుజాచార్యులు.

శంకరాచార్యులు
అద్వైత మత వ్యవస్థాపకుడైన శంకరాచార్యులు ఆదిశంకరులుగా, శంకర భగవద్పాదులుగా సుప్రసిద్ధి పొందారు. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి చెందిన శంకరాచార్యులు జీవించినది కేవలం ముప్పయి రెండేళ్లు మాత్రమే అయినా, తరతరాలకు తరగని ఆధ్యాత్మిక సంపదను జాతికి అందించారు. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని బోధించారు. సౌందర్య లహరి సహా పలు స్తోత్రాలను విరచించారు. శిష్యులతో కలసి దేశం నలుచెరగులా విస్తృతంగా పర్యటించి, నలు దిశలలో నాలుగు పీఠాలను నెలకొల్పారు.

ఎందరో మరెందరో...
ఆధ్యాత్మిక రంగంలో మరెందరో గురువులు ప్రజలకు తమ తమ రీతుల్లో దిశా నిర్దేశం చేశారు. మధ్వాచార్యులు ద్వైతమతాన్ని స్థాపించారు. జీవాత్మ, పరమాత్మలు వేర్వేరని, విష్ణువొక్కడే దైవమని ఉద్బోధించారు. రామకృష్ణ పరమహంస దైవం ఒక్కటేనని, చేరుకునే మార్గాలే వేర్వేరని బోధించారు. భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విశిష్ఠతను ప్రపంచానికి చాటిన స్వామీ వివేకానంద వంటి శిష్యుడిని తీర్చిదిద్దారు. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో ఎదిగిన స్వామీ వివేకానంద భారతదేశంలో జాతీయ భావాలను జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పారు. పరమహంస యోగానంద భారతీయ యోగ విద్యను పాశ్చాత్య ప్రపంచానికి చేరువ చేశారు. మహావతార్‌ బాబా పరంపరకు చెందిన పరమహంస యోగానంద... యుక్తేశ్వర గిరి వద్ద యోగ విద్య నేర్చుకున్నారు. లాహిరి మహాశయుని వద్ద యుక్తేశ్వర గిరి యోగ విద్యాభ్యాసం చేశారు. యోగ విద్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో లాహిరి మహాశయుల శిష్య పరంపర కృషి నిరుపమానమైనది. నృత్య, సంగీత, సాహిత్యాది కళల్లోను, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఇంకా చాలామంది గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. అలాంటి గురుదేవులందరికీ ఆచార్య దేవోభవ!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement