తత్త్వదర్శనమే జిజ్ఞాసకు పరమావధి..!
నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉత్తమ గురుశిష్యులుగా గణతికెక్కిన శ్రీరామకృష్ణ పరమహంస, భారతీయ ఆధ్యాత్మిక వాణిగా వాసికెక్కిన స్వామివివేకానందలు ఒకరితో ఒకరు ఎలా మెలిగేవారో చూద్దాం.
ధ్యానసమయంలో నరేంద్రుడి మనస్సు సమీపంలోని యంత్రధ్వని చేత చెదిరిపోసాగింది. శ్రీరామకృష్ణులకు ఈ విషయం చెప్పగా... ఆయన ఆ ధ్వని మీదనే మనస్సును లగ్నం చేయమని చెప్పారు. నరేంద్రుడు (వివేకానందుడు) అలా చేయగానే ఆ విఘ్నం తొలగిపోయింది. మరో సమయంలో ధ్యానకాలంలో తనకు పూర్ణ విస్మృతి కలగటం లేదని తెలుపగా శ్రీరామకృష్ణుడు అతడి నొసట గోటితో నొక్కిపట్టి తదనుభవం మీదనే మనస్సును లగ్నం చేయమని చెప్పాడు. అలా చేశాక నరేంద్రుడు నిశ్చలసమాధి నిమగ్నమయ్యాడు.
‘‘భగవంతుడు సగుణుడా? నిర్గుణుడా? అవతారాలు యదార్థాలా? కల్పితాలా?’’ అని శ్రీరామకృష్ణ శిష్యబృందం మధ్య తీవ్ర వాదాలు చెలరేగుతుండేవి. శిష్యులు ఎంతటి తీవ్రవాదాల్లో దిగినా శ్రీరామకృష్ణులు మందలించేవారు కాదు. చర్చ సత్యకాంక్షాజనితమైతే జ్ఞానోపలబ్ధికి తోడ్పడుతుందనేది ఆయన అభిమతం. సాధన సంపత్తు లేకుంటే ఎంతటి తర్కశాస్త్ర ప్రావీణ్యమైనా నిరర్థకమని వక్కాణించేవారు.
నరేంద్రుడు ఒకప్పుడు విశ్వాసం మోక్షసాధనం కాదని నిరసిస్తూ, గుడ్డినమ్మకం గురించి చర్చించసాగాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ‘‘నరేన్! గుడ్డినమ్మకం అంటే ఏమిటి? నమ్మకానికి కళ్లు ఉంటాయా? నమ్మకమనేదే గుడ్డిది. నమ్మకమని కాని, జ్ఞానమని కాని చెప్పు. అంతేకాని, గుడ్డినమ్మకమనటం అర్థరహితం’’ అని బోధించారు. ‘‘సమస్త తత్త్వశాస్త్రాలూ, సమస్త విజ్ఞానమూ అనుభవలేశంతో పోల్చి చూస్తే గుడ్డినమ్మకమే! జిజ్ఞాసకు పరమావధి తత్త్వదర్శనం. అదే మన విధి. అందుకు ఎంతోకాలం తీవ్రసాధనచేయాలి’’ అని శ్రీరామకృష్ణుల అభిప్రాయం.
శ్రీరామకృష్ణుల బోధనలలోని ఘనత అంతా అతడి సాధనానుభవాలతో, పవిత్రప్రవర్తనలో ఇమిడి ఉంది. శ్రీరామకృష్ణుల దివ్యజీవన ప్రభావమే అతడి ఉపదేశసౌరభం. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆయన బోధించాడంటే... తాను అలా జీవించి చూపాడు. జాతి ఔన్నత్యం, కులనైచ్యాలను మరవటానికై అత్యంత నిమ్నజాతులవారు సైతం చేయజాలని సేవక కృత్యాలను మనస్ఫూర్తిగా చేశాడు. ఆయన... వినమ్రుడు, విశుద్ధ హృదయుడు, విశ్వాతీత ప్రేమపూరితుడు. నరేంద్రుడికి అలాంటి మహనీయుడి పావనపద సేవాభాగ్యం లభించటం చేతనే లోకకల్యాణహేతువులైన గురువాక్యాలను నరేంద్రుడు ఆచరణలో పెట్టాడు. వివేకానందుడై, పాశ్చాత్యంలో దిగ్విజయోపేతుడై వేదాంత ప్రచారం గావిస్తూ శ్రీరామకృష్ణమఠ సేవాసంఘాలను కాలక్రమాన ప్రాక్పశ్చిమ ఖండాలంతటా నెలకొల్పగలిగాడు. అటువంటి గురుశిష్యులు అత్యంత అరుదు.