అంగద రాయబారం...
వారధి మీదుగా వానర సైన్యంతో రాముడు లంకకు చేరుకున్న తర్వాత యుద్ధం లేకుండా ఉండేందుకు సీతను తనకు అప్పగించాలంటూ అంగదుడి ద్వారా రావణుడికి రాయబారం పంపుతాడు. రాముడి మాట మేరకు అతడు నానా విధాలుగా రావణుడికి నచ్చజెబుతాడు. రావణుడు యుద్ధంలో తలపడతానే తప్ప సీతను అప్పగించేది లేదని భీష్మిస్తాడు. స్వయంగా యుద్ధంచేసే శక్తిలేక కోతిమూకను వెంటేసుకొచ్చాడంటూ రాముడిని తూలనాడతాడు. రావణుడి వాచాలతకు తిక్క రేగిన అంగదుడు బలప్రదర్శను సిద్ధపడతాడు. రావణుడి వర్గంలో ఎవరైనా తన కాలు కదపగలిగితే చాలు, సీత లేకుండానే రామలక్ష్మణులు సహా వానర సైన్యం ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతుందని సవాలు చేస్తాడు.
రావణుడి కొడుకు ఇంద్రజిత్ సహా రాక్షస వీరులెవ్వరూ అంగదుడి కాలు కదపలేకపోతారు. ఇక ఉక్రోషం పట్టలేక రావణుడే అంగదుడి కాలు కదపడానికి దగ్గరకు వస్తాడు. అంగదుడు తటాలున కాలు వెనక్కు లాగేసుకొని, రావణుడి కిరీటాన్ని తన్ని గాల్లోకి ఎగురుతాడు. తన కాళ్లపై పడటం కంటే, రాముడి కాళ్లపై పడి శరణు కోరుకోమని హితవు చెబుతాడు. రాక్షస యోధులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసేలోగానే అక్కడి నుంచి ఎగిరిపోయి, రాముడి వద్దకు చేరుకుంటాడు. ప్రత్యర్థి వద్దకు రాయబారానికి వెళ్లిన దూత సందేశాన్ని మాత్రమే చెప్పి రాకుండా, బలం రుచి చూపించి, బెదిరించి మరీ రావడం అంగద రాయబారంగా వాడుకలో స్థిరపడింది.