
జయహో సురభి!
ఛత్రపతి శివాజీ అస్తమించాడు.
మరాఠా సామ్రాజ్యం చెల్లాచెదురైపోయింది.
చెట్టుకొకరు... పుట్టకొకరు...
సైనికులకు పని లేదు.
వాళ్లకు బతుకుతెరువు కావాలి.
వలస వెళ్లిపోవాల్సిందే!
అలా ఓ ముఠా మరాఠీ సీమ నుంచి రాయలసీమకొచ్చింది.
ఇక్కడే కథ స్టార్ట్.
2
ముఠా పెద్ద... వనారస సంజీవరావు.
మంచివాడు, కానీ మహా కోపిష్ఠి.
వ్యవసాయం మొదలెట్టాడు. దానికి తోడు సారా వ్యాపారం.
పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు. బోలెడంత మంది బంధువులు.
మరాఠా నేల మీద ఆరెకాపులు అంటే గొప్ప. ఇక్కడ వీళ్లనెవరు పట్టించుకుంటారు!
ఆ ఏడాది వానల్లేవు. అమ్మవారికి ఎవరో ఒకరు బలి అయితేనే వానలు పడతాయట!
వనారస సంజీవరావు ముందూ వెనుకా ఆలోచించలేదు.
అమ్మవారికి తనే బలిపశువు. పాపం పిల్లలు బికారులైపోయారు.
ఇక్కడే కథకు టర్నింగ్.
3
వాళ్లకు దేవుడు కూసింత సంగీత జ్ఞానమిచ్చాడు. దాంతోపాటు ఇంగిత జ్ఞానమిచ్చాడు. ఇప్పుడు వాళ్లు తోలుబొమ్మలాడుతున్నారు. పొట్టకూటి కోసం పోరాటం చేయాలి కదా!
ఊరూరూ తిరుగుతున్నారు.
తోలుబొమ్మలాట బాగానే గిట్టుబాటు అవుతోంది.
కడప ఏరియాలో ఓ పల్లెటూరికెళ్లారు.
పకీరన్న అనే అనాథ తగిలాడు. పాపం కుర్రాడికి మశూచి. వీళ్లకు జాలేసింది.
తమతో పాటే తీసుకెళ్లిపోయారు. తమలోనే కలిపేసుకున్నారు.
ఆ పిల్లాడి బతుకు మారిపోయింది. పేరు కూడా మారిపోయింది. ఇప్పుడతని పేరు గోవిందప్ప. ఔ!
ఇతనే ఈ కథకు నాయకుడు... నావికుడు!
4
గోవిందప్ప మృదంగం నేర్చుకున్నాడు. వయొలిన్ కూడా వాయించగలడు. ఆ ట్రూప్‌లో అతనే చలాకీ. బొమ్మలాటయ్యాక ఇంటింటికీ తిరిగి ధాన్యం, బట్టలు అడుక్కోవడం నచ్చలేదు అతనికి!
ఇలా ఎదురు తిరిగినప్పుడల్లా ఓ మొట్టికాయ పడేది.
పాపం కుర్రాడు కదా... తట్టుకోలేకపోయాడు.
చూసి చూసి విసుగేసి నంద్యాల పారిపోయాడు.
అక్కడ జ్యోతి సుబ్బయ్య వీధి నాటకాల కంపెనీలో చేరాడు.
ఆరేడు నెలలు అక్కడే ఉండి, వేషాల గుట్టూ మట్టూ తెలుసుకోగలిగాడు.
చివరకు ఆచూకీ కనిపెట్టి, ఇంట్లోవాళ్లు తమతో పాటే లాక్కెళ్లిపోయారు.
ఇక్కడ పడింది కథకు అసలు ట్విస్టు!
5
ఆ ఊరి పేరు సురభి.
పూర్వకాలంలో ‘సొరుగు’ అనేవారంట.
అల్లపురెడ్డి చెన్నారెడ్డి ఆ ఊళ్లోనే పెద్ద రైతు. వాళ్లింట్లో పెళ్లి.
పెళ్లంటే తోలుబొమ్మలాట ఉండాల్సిందే! గోవిందప్ప ట్రూపు దిగింది.
చెన్నారెడ్డిని బతిమిలాడుకుని, ‘‘బాబ్బాబు... తోలు బొమ్మలాట కాదు. నాటకం వేస్తాం’’ అని ఒప్పించాడు.
నాటకం పేరు ‘కీచక వధ’.
ముహూర్తం అదిరిపోయింది.
దాంతో నాటకం కూడా అదిరిపోయింది.
చెన్నారెడ్డి ఫుల్ ఖుష్ అయిపోయి, వాళ్లకో బిల్డింగిచ్చేసి నాటక సమాజం పెట్టుకోమన్నాడు.
ఇది 1885 నాటి మాట.
‘శ్రీశారద మనో వినోదిని సంగీత నాటక సమాజం’ పేరుతో ‘సురభి’ నాటక ప్రస్థానం అలా మొదలైందన్న మాట.
ఇక అక్కడి నుంచీ ఈ కథకు తిరుగు లేకుండా పోయింది.
6
‘సురభి’ అంటే చెట్టు కాదు.
ఓ మహావృక్షం. కాదు కాదు... కల్పవృక్షం.
దీని పేరు చెప్పి ఎంతమంది ఎదిగారో! దీని నీడలో ఎంతమంది సేద తీరారో!
తెలుగు నేల నలు చెరగులా సురభి వీరవిహారం చేసేసింది.
తెలుగు నాట నాటకమంటే ‘సురభి’... సురభి అంటే నాటకం.
కుటుంబాలు పెరిగి పెద్దయ్యి, ఎవరికి వాళ్లు సొంతంగా సమాజాలు పెట్టుకున్నా, వీళ్లందర్నీ కలిపి ఉంచిన దారం మాత్రం ‘సురభి’.
ఏం రోజులవి?
ఏం నాటకాలవి?
‘సురభి’ నాటకం చూడకుండా ఆంధ్ర దేశం మేల్కోలేదంటే నమ్మండి!
7
వాళ్లు మనవాళ్లు కాదు.
కాదు కాదు... మనవాళ్లే!
అలా వాదిస్తే మనవాళ్లే కొడతారు కూడా!
పొట్టకూటి కోసం వచ్చినవాళ్లు ఒక కళను ఇన్నేళ్ల పాటు వారసత్వంగా నిలుపుకోవడమంటే మాటలు కాదు.
వాళ్లది మామూలు జన్మ కాదు. శాపవశాత్తూ ఇక్కడికొచ్చిన గంధర్వులేమో!
వాళ్లకు కులం లేదు. సురభి నాటకమే వాళ్ల కులం.
ఇది నిజంగా నిజం. వాళ్ల సర్టిఫికెట్లు ఒకసారి చూడండి.
వాళ్లది మన భాష కాదు. మన ప్రాంతం కాదు. కానీ నాటక కళతో వాళ్లు మన మూలాల్ని పట్టేసుకోగలిగారు. అదీ లెక్క.
వాళ్లు మనలో కలిసిపోయారు. మనల్ని వాళ్ల కళతో మమేకం చేసేసుకోగలిగారు.
‘రావు’ అనేది వాళ్ల పేరే!
ప్రతి పేరు చివరా ‘రావు’ అని ఉంటుంది. వాళ్లని చూసి మనమూ ‘రావు’ను తగిలించేసుకున్నాం.
మంచిదేగా!
8
ప్రపంచంలో ఎక్కడా లేని స్పెషాల్టీ ‘సురభి’ వాళ్ల దగ్గరుంది.
వాళ్లో నాటకం వేశారంటే - అందులో పాత్రధారులంతా కుటుంబ సభ్యులే! బయటోడు ఒక్కడుంటే ఒట్టు.
నూట పాతికేళ్ల నుంచి ఈ ఆనమా తప్పలేదు వాళ్లు.
ఎవడో నాలాంటివాడు చేస్తానన్నా కూడా బోలెడన్ని కండిషన్స్!
ఈ టైమ్‌లో నా ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పాలి. నాలుగేళ్ల క్రితం... హైదరాబాద్‌లో ‘సురభి’ నాటకం 125 సంవత్సరాల మహోత్సవం జరిగింది. నేను ‘పాతాళ భైరవి’ నాటకంలో మాయల ఫకీరు వేషం వేశా. పది రోజులు రిహార్సల్స్‌కు వెళ్లా. రోజూ షూటింగ్ అయిపోగానే, రాత్రిళ్లు వాళ్లతోటే గడిపేవాణ్ణి.
వాళ్లకు నా మీద నమ్మకం రావడం కోసం ‘మాయాబజార్’ నాటకంలో చిన్న కామెడీ వేషం కూడా వేశా. నాతో పాటు షఫీ కూడా చేశాడు. వాళ్లకప్పుడు నా మీద నమ్మకమొచ్చింది.
‘పాతాళ భైరవి’ నాటకాన్ని రవీంద్రభారతిలో వేసినప్పుడు టిక్కెట్లు పెట్టాం. జనం బాగానే వచ్చారు. ఆ డబ్బంతా వాళ్లకే ఇచ్చేశాం. ఆ ఒక్కసారే నేను వాళ్లతో కలిసి నటించింది.
ఆ ఒక్క నాటకంతోనే వాళ్లు పడే కష్టం తెలిసొచ్చింది.
అలాగని వాళ్లేమీ దాన్ని కష్టంగా ఫీలవ్వరు.
కలిసి - వంట వండుకుంటారు.
కలిసి - భోంచేస్తారు.
కలిసి - నాటకం వేస్తారు.
అంతా ఓ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. కాపురాలూ అక్కడే! పురుళ్లూ అక్కడే! చావులూ అక్కడే! వాళ్లకు రంగస్థలమే బడి, గుడి.
అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు, బామ్మర్ది... ఇలా అందరూ కలిసిపోయి నాటకం వేయడం ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా జరగలేదు!! జరగదు కూడా!! అది చాలా కష్టం కూడా! ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ఒక వృత్తినే నమ్ముకోవడమంటే చాలా కష్టం. అదీ ఈ రోజుల్లో. అందుకే చాలా నాటక సమాజాలు కనుమరుగైపోయాయి. మిగిలినవి చాలా కొన్నే. అయినా కూడా వాళ్లు ఎంత శ్రద్ధగా, దీక్షగా, భక్తితో పనిచేస్తారో! నాకు మళ్లీ మళ్లీ వాళ్లతో నటించాలని ఉంది. కానీ అన్ని పనులూ మానుకుని కాన్సన్‌ట్రేట్ చేయాలి.
9
అసలు విషయం చెప్పడం మరిచేపోయాను.
వాళ్ల సెట్టింగులు చూడాలి. ట్రిక్స్ చూడాలి. ఆ రోజుల్లోనే ఎన్ని వండర్స్ చేశారో! ఇవాళ గ్రాఫిక్కులూ, స్పెషల్ ఎఫెక్టులూ వచ్చాక అవి మనకు ఆనకపోవచ్చేమో కానీ, వాళ్ల టెక్నికల్ నాలెడ్జ్ సామాన్యమైనది కాదు. ఇంకో చిత్రం ఏంటంటే, ఓ నాటకంలో ఓసారి వాడిన టెక్నిక్‌ని మళ్లీ వాడరంతే! ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం అంటూ బాణాలు విసురుకోవడం, ఠకీమని మనుషులు మాయమైపోవడం, పక్షుల్లా ఎగరడం... ఇవన్నీ స్టేజ్ మీద చేసి చూపించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. చిత్రమేమిటంటే - వాళ్లే యాక్టర్సు, వాళ్లే టెక్నీషియన్స్ కూడా! ఉదాహరణకు శకుని పాత్ర చేసేవాడు ఈ సీన్‌లో లేడనుకోండి. వాడు తెర వెనుక వైర్ వర్క్ చేస్తుంటాడు. రాముడు లేడనుకోండి. వాడు వెనకాల మ్యూజిక్ కొడుతుంటాడు. అసలు వాళ్లు నాటకం వేసేటప్పుడు జరిగే ప్రాసెస్‌ని ఎవరైనా డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది.
తొలి తరం సినిమాలకు ‘సురభి’ వాళ్లే ఆధారం. ఎంతమంది ఆర్టిస్టులో ఇక్కడనుంచి అక్కడికెళ్లారు. మన తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’లో చేసినవాళ్లు ‘సురభి’ వాళ్లే.
10
‘సురభి’ అంటే పురాణాల్లో కామధేనువు. ఎప్పుడూ పాలధారలు కురిపిస్తూనే ఉంటుంది. ఈ సురభికీ ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ కామధేనువు వల్లే కదా... తెలుగు నాటకం ఇంతెత్తుకి ఎదిగింది! అలాంటి కామధేనువుకి ఇప్పుడు కష్టాలు ముంచుకొచ్చాయి. ప్రజలూ పట్టించుకోవడం లేదు. పాలకులు అంతకన్నానూ! హైదరాబాద్‌లో తెలుగు లలిత కళాతోరణం పక్కన వాళ్లు తాత్కాలికంగా ఉండడానికీ, రోజూ నాటకాలు వేయడానికీ జాగా ఇచ్చారు. అప్పట్లో నటి జమునగారు కొంతమందికి క్వార్టర్స్ ఇప్పించినట్టు గుర్తు. సురభి సంస్థకు ఇప్పుడో సైనాధ్యక్షుడున్నాడు. పేరు ‘సురభి’ నాగేశ్వరరావు. అందరూ ‘బాబ్జీ’ అంటుంటారు. ఆయన చేతిలో అయిదు సభ్య సమాజాలున్నాయి. ఆయనకి ఆ మధ్య ‘పద్మశ్రీ’ ఇచ్చారు. ఆ వార్త తెలియగానే గుండె నిండిపోయింది. వాళ్లు కూడా మనస్ఫూర్తిగా ప్రేక్షకులు కొట్టే చప్పట్లే తప్ప కోటానుకోట్లు కావాలనుకోరు.
11
‘సురభి’ మన తెలుగుజాతి సంపద!
దయచేసి దాన్ని మ్యూజియమ్‌లో పెట్టే పరిస్థితి రానీయొద్దు! ఈ కామధేనువుని వట్టి పోనివ్వద్దు!
సురభీ... నువ్వు నిండు నూరేళ్లు కాదు, వెయ్యేళ్లు వర్థిల్లాలి. జయహో సురభి!
ప్రజల ఆదరణే సురభి ఊపిరి...
1885లో చిన్న గ్రామంలో పుట్టింది సురభి నాటకం. దినదిన వర్ధమానం చెంది అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదిగింది. తొలుత దీన్ని డాక్టర్ గోవిందరావు, చిన్న రామయ్యలు ప్రారంభించారు. సురభి గ్రామ పెద్ద రామిరెడ్డి చెన్నారెడ్డి ద్వారా సురభి నాటకం ఆడించేవారు. క్రమక్రమంగా ఉమ్మడి ఏపీ అంతటా సురభి వ్యాపించింది. ప్రజల ఆదరణ అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఉంది. నేను 1969లో చదువుకునే వయసులోనే సురభి నాటక వేషాలు వేయటం ప్రారంభించాను. అప్పట్లో ఖర్చు తక్కువ. ఇప్పుడు ఆదాయం రెండు రేట్లు పెరిగితే ఖర్చులు వంద రెట్లు పెరిగాయి. ఆ ఖర్చులకు తట్టుకోలేక నాటక సమాజాలు కట్టేస్తున్నారు. ఐదు సమాజాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు శ్రీవేంకటేశ్వరనాట్య మండలి, శ్రీ శారద విజయ నాట్యమండలి, శ్రీ విజయభారతి నాట్యమండలి, శ్రీ వినాయక నాట్య మండలి, శ్రీ బీఎన్ మండలి ఆధ్వర్యంలో సురభి నాటకాలు ప్రదర్శితమవుతున్నాయి. సురభి నాటకం... కుటుంబ నాటకం. 60 నుంచి 70 మంది నాటకం వేస్తారు. చంటి బిడ్డ నుంచి 90 ఏళ్ల వయసు వృద్ధుడి వరకు వేసే నాటకం ఇది. 1991లో ప్రధాని పీవీ నరసింహరావు ఢిల్లీకి పిలిపించుకుని ఐదు నాటకాలు వేయించారు. ఢిల్లీ ప్రజలు నాటకం చూసి మురిసి పోయారు. నాటకం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. తెలుగు ప్రజలు నేటికీ టికెట్ కొని చూసే నాటకం ఏదైనా ఉందా అంటే అది సురభి ఒక్కటే. 2013లోఫ్రాన్స్‌లో కూడా 40 రోజుల పాటు సురభి నాటకాలు ప్రదర్శించాం. శ్రీ వేంకటేశ్వర నాట్య మండలికి ఈ ఏడాదితో 80 ఏళ్లు నిండనున్నాయి.
- పద్మశ్రీ సురభి బాబ్జీ (నాగేశ్వరరావు)
సురభికి ప్రోత్సాహం అందిస్తాం!
1991లో ఉమ్మడి ఏపీ కల్చరల్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వేంకటేశ్వర నాట్య మండలి వారిని హైదరాబాద్‌కు రప్పించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నాటకాలు ప్రదర్శించేలా చేశాను. దానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వెంట్లను ఆహ్వానించాను. దాంతో ఆ సమాజం దినదిన వర్థ మానం చెందింది. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్‌సలో వారికి స్థావరం కల్పించేం దుకు కృషి చేశాను. చందానగర్ సమీపంలో సురభి కాలనీ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతటా సురభి నాటకాలు ప్రదర్శితమయ్యేలా చూస్తున్నాను. ఇలాంటి సమాజాలు జీవించాలి. ఎప్పటికీ జీవించే ఉండాలి.
- డా॥కె.వి.రమణాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
తమదైన టెక్నిక్ సురభి సొంతం!
130 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న నాటక అకాడెమీ సురభి. మారుమూల పల్లె నుంచి విదేశాల వరకు నాటకాన్ని పాకేలా చేసింది. సురభి నాటకాన్ని ఓ సంప్రదాయ నాటకంగా ప్రజలు ఆదరిస్తున్నారు. సురభి నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ దైన టెక్నిక్‌తో ప్రత్యేకత సాధించుకుంది. తెలంగాణ ప్రభుత్వం సురభికి సంబంధించి ఐదు నాటక సమాజాలను ఎప్పటికప్పుడు ప్రొత్సహిస్తోంది. మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవలే సురభి నాటకాలను ప్రదర్శించారు. మిగతా జిల్లాల్లో కూడా ప్రదర్శనలు జరిగేలా చూస్తాం. రంగస్థలంపై అధ్యయనానికి, కొత్త ఆలోచనల కోసం వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం.
- మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు