క్రైస్తవులకు బైబిల్ పవిత్ర గ్రంథం. కాని సాహిత్య ప్రేమికులకు అది కథల కాణాచి. అప్పట్లో సెన్సార్లు వుంటే కొన్నింటిని నిషేధించేవాళ్లేమో కూడా! ఆధ్యాత్మికము, ఆముష్మికమెంతవుందో ఐహిక విషయాల ప్రస్తావన కూడా అంత వుంది బైబిల్లో. మత ప్రాధాన్యత కోసం కాకుండా, సాహిత్యపరంగా దీని గురించి మాట్లాడుకుంటే, బైబిల్‌కు కింగ్ జేమ్స్ ఇంగ్లిష్ అనువాదం ఒక మాస్టర్‌పీస్ అన్నది నిర్వివాదాంశం. అనుకరణీయం ఆ శైలి. సాల్మ్స్ లేదా సాంగ్ ఆఫ్ సాంగ్స్ అద్భుతమైన సాహిత్యం కాదనగలరా ఎవరైనా? మనసును ఆకట్టుకునే ఉపమానాలు, కథా కథన నైపుణ్యం దీన్ని క్రైస్తవేతరులకు కూడా అత్యంత ప్రియమైన సాహిత్య గ్రంథంగా మార్చాయి. గాంధీకి ‘సెర్మన్ ఆన్ ది మౌంట్’ చాలా ఇష్టమైన సాల్మ్.
క్రైస్తవ సాహిత్యం ‘అపోస్టోలిక్ ఫాదర్స్’తో ప్రారంభమైంది. వీళ్ల ఏకైక లక్ష్యం ‘క్రైస్తవ జీవితం, నడవడి ఎలా వుండాలి’ అని బోధించడమే! అపాలజిస్ట్‌లు మూడో శతాబ్దంలోనే మత విశ్వాసాలను ప్రచారం చేస్తూ రచనలు కొనసాగించారు. అలా ప్రారంభమైంది మతపరమైన సాహిత్యసృష్టి. చక్రవర్తి కాన్‌స్టంటైన్ మత స్వేచ్ఛను ప్రసాదించారు. క్రూసేడ్స్‌లో తర్వాతి రోజుల్లో అనేకమంది ప్రాణత్యాగాలు చేశారు. సెయింట్ జస్టిన్ (సి. 165), సెయింట్ సిప్రిమన్ ఆఫ్ కార్తేజ్ (సి. 258)ల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యక్ష సాక్షులు గ్రంథాలు రచించారు. క్రైస్తవులు మానవ జాతి ద్రోహులనీ, పాపులనీ, యూదులు దాడి చేసినప్పుడు అపాలజిస్ట్‌లు వీళ్ల వాదనలను తిప్పికొడుతూ పలు రచనలు చేశారు. వీటిలో ముఖ్యమైనవి ‘లెటర్స్ టు డయాగ్నెటస్’, ‘సెల్సస్’, ‘ఒరిజెన్’. అంతే కాదు, క్రైస్తవ బోధనలు, గ్రీకు తత్వశాస్త్రం కన్నా ఉత్కృష్టమైనవని వాదించారు వీరు. ఇక, బైబిల్, ఎన్ని పుస్తకాలకు ప్రేరణగా నిల్చిందో ఊహించడం కష్టం. సరదాగా కొన్నింటిని గురించి చెప్పుకుందాం.
ఎ క్రిస్మస్ కెరోల్.
రచయిత : చార్లెస్ డికెన్స్
నూనూగు మీసల నూతన యవ్వనంలో రాసిన ‘స్కెచెస్ బై బాజ్’ నుంచి బెస్ట్ సెల్లింగ్ రచయిత చార్లెస్ డికెన్స్ (1812–1870). రచయితగానే కాదు, పత్రికా సంపాదకుడిగా, తన నవలల్లోని నాటకీయమైన భాగాలను రంగస్థలం మీద హావభావ యుక్తంగా నటించి అశేష ప్రేక్షకులను అలరించాడు. ఇంగ్లిష్ సాహిత్య చరిత్రలో అత్యంత జనరంజకమైన రచయిత డికెన్స్. ఇప్పటికీ ఆయనను చదవని పాఠకులుండరు. రావిశాస్త్రి గారికి అభిమాన రచయిత. పేదల పక్షపాతి. ‘ఎ క్రిస్మస్ కెరోల్’ పూర్తి పేరు ‘ఎ క్రిస్మస్ కెరోల్ ఇన్ ప్రోస్, బీయింగ్ ఎ ఘోస్ట్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్’. 1843లో తొలిసారి అచ్చయిందిది. కెరోల్స్, క్రిస్మస్ ట్రీస్ వంటి సంప్రదాయాలలో మార్పులను గురించి బ్రిటిష్ వాళ్లు ఆలోచించుకుంటున్న కాలమది. అప్పటికే వాషింగ్టన్ ఇర్వింగ్, డగ్లస్ జెరాల్డ్‌ల క్రిస్మస్ కథలను చదివిన డికెన్స్ కొత్తగా ఏదో రాయాలనుకున్నాడు. (అప్పటికే మూడు క్రిస్మస్ కథలు రాశాడు.) నిరుపేదలు, అన్నార్తులుగా ఉన్న వీధి బాలల కోసం నడుపుతున్న ఫీల్డ్ లేన్ రాగ్‌డ్ స్కూల్‌ను సందర్శించినప్పుడు ఐడియా తట్టింది. అక్కడ పిల్లల పరిస్థితి జంతువులకన్నా హీనం. వాళ్ల కోసం వచ్చిన నిధుల్ని కాజేసే వారే అందరూ. ఇలాంటి స్వార్థపరులలో మార్పు వస్తే ఎలా ఉంటుంది? పాపులు నిష్కృతి పొందగలిగిన పద్ధతి ఇదే కదా! అవును. ఇదే క్రిస్మస్ సందేశం.
ఎబెనెజర్ స్క్రూజ్ ఒక లోభి. జేకబ్ మార్లీతో కలిసి వ్యాపారం చేస్తుంటాడు. జేకబ్ మార్లీ మరణించిన ఏడేళ్ల తర్వాత, తెల్లవారి క్రిస్మస్ అనగా, గడ్డకట్టుకు పోయే ఒక చలి రాత్రి లండన్‌లో ప్రారంభమవుతుంది కథ. స్క్రూజ్‌కు క్రిస్మస్ అంటే అసహ్యం. ఎవరికీ చిల్లిగవ్వ సాయం చెయ్యడు. ఆ రాత్రి, స్క్రూజ్‌కు మార్లీ ప్రేతాత్మ కనిపిస్తుంది. బరువైన ఇనుప గొలుసులతో బంధించబడి, డబ్బు నింపిన భోషాణాలతో భూమ్మీదకు వచ్చాడు మార్లీ. దురాశ, పిసినారితనం కలిసి ఒక జీవిత కాలంలో పోగు చేసిన డబ్బు అది. డబ్బు బాగానే ఉంటుందేమో గానీ అది తనకు గుదిబండగా మారితే ఏం సుఖం! ఈ దురదృష్టం తనకు పట్టకుండా ఉండాలంటే ఒక పద్ధతుందని స్క్రూజ్‌కు సలహా ఇస్తాడు మార్లీ. అతడి వద్దకు మూడు ఆత్మలు వచ్చి, ఎలా చెయ్యమని చెబితే అలా చెయ్యాలి. లేదా తనకూ ఈ గొలుసులు, భోషాణాల బరువు మోయక తప్పదు. మొదటి ఆత్మ – ఘోస్ట్ ఆఫ్ క్రిస్మస్ పాస్ట్ – వచ్చి స్క్రూజ్‌కు అతడు బాల్యంలో తిరుగాడిన ప్రదేశాలను చూపిస్తుంది. ఆ అమాయకత్వం, నిర్మల మనస్తత్వం. అవే గదా మనిషి జీవితాంతం పదిలపరచుకోవాల్సినవి! చెల్లెలు ఫ్యాన్ అంటే తనకు ప్రాణం ఆ రోజుల్లో. ఉద్యోగం ఇచ్చిన తొలి యజమాని తనను సొంత కొడుకులా ఆదరించాడు. తొలిప్రేయసి బెల్లె కూడా కనిపిస్తుంది. అతడి మనస్తత్వం తెలిసి, అతడు డబ్బును తప్ప మనుషుల్ని ప్రేమించడని గ్రహిస్తుంది.
ఇక రెండవ ఆత్మ – ఘోస్ట్ ఆఫ్ ది క్రిస్మస్ ప్రెజెంట్ – అందరూ ఆనందంగా క్రిస్మస్ డిన్నర్ ఆరగిస్తున్న ప్రదేశాలకు తీసుకెళుతుంది. ఒక పేద కుటుంబంలో, ఓ కుర్రాడు టినీ టిమ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటాడు. అతడికి వైద్య సాయం అందకపోతే, మరణించడం తథ్యమని స్క్రూజ్‌కు చెబుతుంది ఆత్మ. ఇగ్నోరెన్స్, వాంట్ అనబడే ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. వాళ్లిద్దరూ తిండిలేక అల్లాడుతున్నారు.
మూడవ ఆత్మ – ఘోస్ట్ ఆఫ్ ది క్రిస్మస్ యెట్ టు కమ్ – భవిష్యత్తులో క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటారో చూపిస్తుంది. ఊళ్లో వాళ్లంతా అసహ్యించుకునే ఒక వ్యక్తి మరణిస్తే ఏమవుతుందో కళ్లారా చూస్తాడు. భోజనం పెడతామంటే తప్ప ఎవరూ అతడి అంతిమ యాత్రలో పాల్గొనటానికి కూడా నిరాకరిస్తారు. ఇంటి పనివాళ్లు అతడి వస్తువులు దొంగిలిస్తారు. అతడి మరణానికి వారూ బాధపడరు సరికదా, అతడికి బాకీ ఉన్న ఒక పేద దంపతులు, భారం వదిలినందుకు సంతోషిస్తారు. మరోచోట టినీ టిమ్ మరణానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరికి అతడికో సమాధి చూపిస్తుంది ఆత్మ. దానిమీద స్క్రూజ్ పేరు రాసి ఉంటుంది. పాడుబడిన ఆ సమాధి చూసి స్క్రూజ్‌లో పరివర్తన వస్తుంది. క్రిస్మస్ ఉదయం. నిద్రలేచిన స్క్రూజ్ పూర్తిగా మారిపోతాడు. ఉన్న సంపదతో సత్కార్యాలు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ జీవితశేషం గడుపుతాడు. ఇంగ్లిష్‌లో పరమలోభికి పర్యాయ పదం స్క్రూజ్. 19 డిసెంబర్ 1843 నాడు ప్రచురితమైన ఈ కథ, క్రిస్మస్ నాటికి మొదటి ఎడిషన్ పూర్తిగా అమ్ముడుపోయింది. 1844 నాటికి పదమూడు ఎడిషన్లు అచ్చయింది. నిజానికి, ఆనాటి నుండి ఈనాటి దాకా, ఇది ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్‌లో లేదు. ఇంచుమించు ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువాదమైంది. ఇది ఎన్నిసార్లు రంగస్థలం మీద ప్రదర్శించబడిందో, మరెన్నిసార్లు సినిమాగా వచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇటీవల, 2009లో, క్రిస్మస్ కారోల్ కథతో సినిమా వచ్చింది. హాస్యనటుడు జిమ్ క్యారీ స్క్రూజ్‌గా కనిపించి అలరించాడు. ఇదిగాక, డికెన్స్ రాసిన ది చైమ్స్ (1844), ది క్రికెట్ ఆన్ ది హార్త్ (1845), ది బ్యాటిల్ ఆఫ్ లైఫ్ (1846) కూడా క్రిస్మస్ సందర్భంగా రాసిన పుస్తకాలే!
ది ఇన్‌ఫెర్నో
రచయిత : దాంతె అలిగెరి
ఇటాలియన్ మహాకవి దాంతె అలిగెరి (1265–1325) రాసిన డివైన్ కామెడీ సమకాలీన అధికార వర్గాల అవినీతిని ఎండగట్టటానికి సంధించిన వజ్రాయుధం. సెవెన్ డెడ్లీ సిన్స్ (ఏడు మహా పాపాలు) గురించీ, ఈ పాపాలు చేసిన ఆనాటి వ్యాపార, రాజకీయ, ప్రముఖుల గురించీ ఇందులో ప్రస్తావిస్తాడు దాంతె. నరకం, పాప ప్రక్షాళన జరిగే లోకం, స్వర్గం అనబడే మూడు లోకాలలో వర్జిల్ మహాకవి తోడుగా ప్రయాణిస్తాడు. పాపులు నరకంలో అనుభవిస్తున్న శిక్షల్ని కళ్లారా చూస్తాడు. జీవితకాలంలో వీళ్లందరూ అష్టయిశ్వర్యాలనూ అనుభవించినవాళ్లే.
‘‘ఇప్పుడేమయింది వీళ్ల పరిస్థితి?’’ అని ప్రశ్నిస్తాడు.
పారడైజ్ లాస్ట్
రచయిత : జాన్ మిల్టన్
ఇంగ్లిష్ భాషలోని మహా కావ్యాలలో ఒకటి జాన్‌మిల్టన్ (1608–1674) రాసిన పారడైజ్ లాస్ట్. ఈడెన్ ఉద్యానవనంలో ఆడం, ఈవ్‌లు నిషేధింపబడిన ఫలం ఆపిల్‌ను తమ తమ అమరత్వాన్ని కోల్పోయిన వైనాన్ని చిత్రిస్తుందిది. సి.ఎస్.లూయీ మాటల్లో.. ‘‘ఇందులోని నీతి సార్వజనీనమైనది. భగవదాజ్ఞను శిరసావహించిన మనిషి ఆనందంగా జీవించగలడు. ఉల్లంఘిస్తే దు:ఖమూ, పతనమూ అతని కోసం నిరీక్షిస్తుంటాయి.’’
ది బ్రదర్స్ కరమజోవ్
రచయిత : దొస్తాయేవ్‌స్కీ (1821–81)
రష్యన్ రచయిత దొస్తా్తయెవ్‌స్కీ తొలిరోజుల్లో ప్రగతిశీల, రాడికల్ మేధావుల సాహచర్యంలో గడిపాడు. ఇరవై ఏడో ఏట ఈయన రాసిన పూర్ ఫోక్ (పేద జనం – 1846) నవలిక పాఠకులను విశేషంగా ఆకర్షించటమే గాక, విమర్శకుల మెప్పు కూడా పొందింది. రాడికల్స్‌తో కలిసి ఆయన ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్టుగా ఆధారాలు లేవు. ఆరోజుల్లో మన మేధావులు ఎక్కువగా సుధీర్ఘమైన చర్చలతోనే కాలక్షేపం చేసేవారు. మొత్తం మీద ఒకనాడు వీళ్లంతా ఒక గదిలో సమావేశమైనప్పుడు జార్ సైనికులు వీరిని చుట్టుముట్టి, రాజద్రోహం నేరం మోపి, విచారణ జరిపారు. సోషలిస్టులతో పరిచయాలు పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. పైగా, ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర చేశారని అభియోగం. మరణశిక్ష విధించారు. కుట్రదారులందర్నీ ఫైమిగ్ స్క్వాడ్ కాల్చి చంపుతుంది. చివరిరోజు రానే వచ్చింది. నిందితులందరూ వరుసగా నిల్చున్నారు. సైనికులు తుపాకులు గురి చూశారు. జార్ గారికి అదేమి వినోదమో, దొస్తాయేవ్‌స్కీకి చివరి క్షణంలో క్షమాభిక్ష ప్రసాదించాడు. ఇప్పుడు ఈ తుంటరి, సైబీరియా మంచు ఖండంలో కఠిన కారాగారవాస శిక్ష అనుభవించాలి. ఆ దుర్భర నరకమే మన రచయితను అంతర్ముఖుణ్ని చేసింది. బైబిల్ తప్ప మరో పుస్తకం చదివే అవకాశం లేదక్కడ. తన అహంభావం, విచ్చలవిడితనం, సుఖలాలసతల పర్యవసానమది. ఇవన్నీ బైబిల్ నిబంధనలను అతిక్రమించటమే. పశ్చాత్తాపానికి మించిన శిక్షలేదు. బాధలను అనుభవించటం ద్వారానే మనిషి నిష్కృతిని పొందగలడు. పవిత్రతకు నిర్వచనం జీసస్‌లాగా జీవించడమే. విప్లవభావాలు ఆవిరైనాయి. జార్ చక్రవర్తికి విధేయత ప్రకటించి జైలుగోడలు దాటాడు. (అప్పటికే అతణ్ని మూర్ఛరోగం పట్టుకుంది.) ఆ తర్వాత ఆయన రాసిన నవలలన్నింటిలోనూ ఏదో ఒక పాత్రో, లేదా ప్రధానపాత్రో – జీసస్‌కు ప్రతిరూపంలా కనిపిస్తాడు. అన్ని కష్టాలూ పడతాడు. అన్ని అవమానాలూ ఎదుర్కొంటాడు. దొస్తా్తయేవ్‌స్కీ రాసిన చివరి నవల బ్రదర్స్ కరమజోవ్. (షేక్‌స్పియర్, సెర్వాంటెస్, గోతె, దాంతెలతో సరితూగగల నలుగురు రష్యన్‌లలో ఒకడు దొస్తొయేవ్‌స్కీ. మిగతా ముగ్గురు గొగోల్, టుర్గెనీవ్, టాల్‌స్టాయ్.)
బ్రదర్స్ కరమజోవ్‌లో, థ్రిల్లర్ ప్రక్రియలో తాత్విక, ఆధ్యాత్మిక విషయాలను చర్చించిన తొలి రచయిత దొస్తొయేవ్‌స్కీ. సామాజిక విషయాలతోనే కథ నడిపినా, క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా ఆధ్యాత్మికాన్వేషణ దీని ప్రధానోద్దేశం. కథలోని ప్రధాన పాత్ర జీవిత పరమార్థాన్ని అన్వేషించిన క్రమం పాఠకుల్లో కొత్త వెలుగులు నింపుతుంది. ఇందులోని గ్రాండ్ లిక్విజిషన్ అధ్యాయం ప్రపంచ సాహిత్యంలోని అత్యద్భుతమైన తాత్విక చర్చల్లో ఒకటిగా గుర్తింపబడింది. యూరోప్‌లోని మధ్య యుగాలలో చర్చి అధికారాన్ని ధిక్కరించిన వాళ్లను అవిశ్వాసులుగా ప్రకటించి వారికి మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు విధించేవారు. ఒకనాడు క్రీస్తు సెవిల్ నగరంలో బైబిల్‌లో చెప్పినట్టుగా పలు మిరాకిల్స్ కూడా చేసి చూపుతాడు. జనం ఆయన్ను ఆరాధిస్తారు. కాని ఇంక్విజిషన్ నామకులు ఆయన్ను అరెస్టు చేసి, మరుసటిరోజు సజీవ దహనం చెయ్యాలని ఆదేశిస్తారు. ఆ రాత్రి జైలు గదిలో గ్రాండ్ ఇంక్విజిటర్ ఆయన్ను సందర్శించి చర్చికి ఆయన అవసరం లేదని స్పష్టం చేస్తాడు. పైగా, ఆయన రాకవల్ల చర్చి అధికారానికి, కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. అధ్యాయం చివర, అప్పటిదాకా గ్రాండ్ ఇంక్విజిటర్ను నిశ్శబ్దంగా విన్న జీసస్, అతణ్ని ముద్దు పెట్టుకుంటాడు. గ్రాండ్ ఇంక్విజిటర్, ‘‘వెళ్లిపో! మళ్లీ ఈ చుట్టుపక్కల కనిపించకు..’’ అని జీసస్‌ను ఆదేశిస్తాడు. ఆ తర్వాత నగరంలోని చీకటి సందుల్లో ఎక్కడో అదృశ్యమయ్యాడు జీసస్.నవల ముగింపులో, ప్రధానపాత్ర ఇవాన్, ‘‘మత విశ్వాసాలతో డెవిల్‌కు స్థానముందిగానీ, కోర్టులు డెవిల్ ఉన్నట్లు అంగీకరించవు గదా, అతడు ఇక్కడే ఎక్కడో దాగున్నాడని నా విశ్వాసం..’’ అంటూ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించటానికి సిద్ధపyì, జీసస్‌లా, ‘‘సోదరులారా! ఈమెను క్షమించండి.’’ అంటూ తప్పు సాక్ష్యం చెప్పిన స్త్రీని క్షమిస్తాడు.
సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్
రచయిత : విలియమ్ బ్లేక్
ఇంగ్లిష్ కవి, చిత్రకారుడు, ఎంగ్రేవర్ విలియం బ్లేక్ (1757 –1827)జీవితమంతా పేదరికంలో, అనామకంగానే గడిపాడు. అయినా, సంతోషంగా తృప్తితో బతకటం ముఖ్యం. ‘పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది?’ అనుకున్నాడు. కిరాణా కొట్టు యజమాని ఇంట్లో పుట్టి, స్కూలుకు వెళ్లే అవకాశం లేక, స్వంతంగా, స్వయంకృషితో, చదువు నేర్చుకున్నాడు. తరువాత, ఒక ఎంగ్రేవర్ వద్ద అసిస్టెంటుగా చేరి ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించాడు. బ్లేక్ తన కాలంనాటి హేతువాద దృక్పథాన్ని, భౌతికవాదాన్ని నిరసించాడు. మనుషులందర్నీ – మానవజాతిని – ఈవిల్ పట్టి పీడిస్తున్నదని నమ్మాడు. అయినా మనిషి ‘లో వెలుగు’, ‘ఆధ్యాత్మికత’ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడూ మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడని బ్లేక్ ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ సరేగానీ, బ్లేక్ తన కవిత్వాన్ని అచ్చేసుకున్న పద్ధతి మాత్రం సాహిత్య చరిత్రలో అపూర్వం. రాగిరేకులను చిత్రాలతో, కవితలతో అలంకరించాడు. స్వయంగా వాటికి రంగులు అద్దాడు. సమకాలీనులకు బ్లేక్ ‘తిక్క మనిషి’, ‘ఉన్మాది’గా కనిపించినా, ఇప్పుడు ఆ రాగిరేకులు కలెక్టర్స్ ఐటమ్స్. ఆయన కవిత్వంలో మార్మికత ధ్వనిస్తుంది. హేతువాద యుగంలో హేతుబద్ధతను నిరసించిన తాత్విక, మార్మిక కవి బ్లేక్.
ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా
రచయిత : సి.ఎస్.లూయీ
ఇంగ్లిష్ నవలా రచయిత, కవి, విద్యావేత్త, మధ్యయుగాల చరిత్ర మీద పరిశోధన చేసినవాడు, విమర్శకుడు, మతశాస్త్రంలో దిట్ట, క్రైస్తవ మత సమర్థకుడు క్లైవ్ స్టేపుల్స్ లూయీ (1898–1963) ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత పదవుల్లో పనిచేశాడు. ఈయన.. మరో ప్రముఖ నవలా రచయిత టోల్కీన్‌కు మంచి మిత్రుడు. లూయీ మొదట చర్చ్ ఆఫ్ ఐర్లాండ్‌లో బాప్టిజం తీసుకున్నప్పటికీ, తరువాత మత విషయాలకు దూరంగా జరిగాడు. మళ్లీ ముప్ఫై రెండో ఏట, టోల్కీన్, ఇతర మిత్రుల ప్రోద్బలంతో ఆంగ్లికనిజమ్‌కు తిరిగొచ్చాడు. ఈయన రచనల మీద మత విశ్వాసాల ప్రభావం అధికంగా ఉంటుంది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో, ఈయన క్రైస్తవ విలువల గురించి చేసిన రేడియో ప్రసంగాలతో ఈయనకు కీర్తి ఇనుమడించింది. లూయీ అనేక రచనలు చేసినప్పటికీ, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా అత్యధికంగా అమ్ముడుపోయింది. టీవీ, రేడియో, సినిమా మాధ్యమాల్లో కూడా ఇది శ్రోతలు, ప్రేక్షకులను అలరించింది. ఈ క్రానికల్స్ ఏడు ఫాంటసీ నవలల బాలసాహిత్యం. 10 కోట్ల ప్రతులు అమ్ముడయ్యాయి. 47 భాషల్లోకి అనువాదమైంది. ఒక ఊహాలోకం నార్నియాలో జరుగుతుంది కథ. మంత్రాలు, మాయలు, మాట్లాడే జంతువులూ, వాటిమధ్య పిల్లల సాహసకృత్యాలూ పాఠకుల్ని కట్టిపడేస్తాయి. క్రైస్తవ సిద్ధాంతాలు, బైబిల్ నిబంధనలు, గ్రీకు, రోమన్ పురాణగా«థలు, సాంప్రదాయక బ్రిటిష్ ఫెయిరీ టేల్స్ కలిసిన రంగుల లోకం నార్నియా. సాధారణంగా బాలసాహిత్యంలో మతభావనలకు పెద్దపీట వెయ్యరు. తొలిసారిగా, లూయీ, ఆ పనిచేసి కృతకృత్యుడయ్యాడు.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్
రచయిత : జె.ఆర్.ఆర్. టోల్కీన్
కొందరి దృష్టిలో ఇరవయ్యవ శతాబ్దంలో వచ్చిన అత్యుత్తమ సాహిత్యమిది. ‘బైబిల్ ప్రేరణతో ఇది రాయబడింది అనే బదులు, బైబిల్ సారాన్నే కథగా మలిచాడు టోల్కీన్’ అన్నారు.
ఇంగ్లిష్ రచయిత, కవి, భాషా శాస్త్రవేత్త, యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ రొనాల్డ్ ర్యూల్ టోల్కీన్ (1892–1973), ది హోబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది సిల్మరిలియన్‌ల రచయితగా జగద్విఖ్యాతి సంపాదించాడు. టోల్కీన్‌కు ముందు కూడా అనేకమంది ఫాంటసీలు ప్రచురించినప్పటికీ, ది హోబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌తో ఫాంటసీ ప్రక్రియ పునర్జన్మ ఎత్తినట్లైంది. చాలామంది కొత్త పాఠకులు టోల్కీన్‌నే ఫాదర్ ఆఫ్ ఫాంటసీగా బ్రహ్మర«థం పట్టారు. 2008లో ది టైమ్స్ పత్రిక, ఈయన్ను 1945 నుంచి రాస్తున్న 50మంది గొప్ప రచయితల్లో ఒకడిగా గుర్తించింది.
టోల్కీన్ పూర్వీకులు 18వ శతాబ్దంలో జర్మనీ నుంచి వలస వచ్చి అతిత్వరగా ఇంగ్లిష్ సంస్కృతీ సంప్రదాయాలకు అలవాటు పడ్డారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన టోల్కీన్ 1920లో లీడ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ రీడర్‌గా చేసి అతిత్వరగా ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ తర్వాత, విద్యారంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పటికీ, ది హోబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పుస్తకాలు రాయగలిగాడు టోల్కీన్. కేవలం మత విశ్వాసాల కోసమే కాదు, కథా కథన నైపుణ్యం కోసం ఈ పుస్తకాలను చదువుతారు.
మిథోఫియా
రచయిత : జె.ఆర్.ఆర్. టోల్కీన్
కేవలం తన నవలల్లో అక్కడక్కడా వాడటానికి మాత్రమే కవిత్వం రాయలేదు టోల్కీన్. మితోఫియా ఒక కవిత. 1931లో తన మిత్రులు లూయీ, హ్యూగో డైసన్‌లతో సాహితీచర్చ తర్వాత, టోల్కీన్ ఇది రాశాడు. టోల్కీన్ మిత్‌లను సమర్థించాడు. మైథాలజీ ఒక సృజనాత్మక కళ. అత్యంత మౌలిక విషయాలను స్పృశిస్తుందిది.
మిత్స్ అంటే ఇష్టం లేదని చెప్పిన లూయీని ఉద్దేశించి (మిత్స్ అన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అన్నాడు లూయీ) రాసిన కవిత ఇది.
‘‘మిత్ అంటే సృష్టికి పునసృష్టి చేయటమే. అంటే సృష్టికర్తను చేరుకోవడమే’’ అని తన వాదనకు క్రైస్తవ మత విశ్వాసాలతో సమర్థిస్తాడు టోల్కీన్.
మర్డర్ ఇన్ ద కేథడ్రల్
రచయిత : టి.ఎస్.ఎలియట్
చర్చి, మత విశ్వాసాల పరిరక్షణ కోసం ప్రాణాలిచ్చిన వాడు సెయింట్ థామస్ బెకెట్. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ కవి టి.ఎస్. ఎలియట్ (1888–1965) రాసిన పద్యనాటకమిది. లండన్‌లోని క్యాంటర్‌బరీ కేథడ్రల్‌లో 1170లో జరిగిన ఆర్చి బిషప్ థామస్ బెకెట్ హత్య ఇందులో ఇతివృత్తం. (1935లో తొలిసారి దీన్ని ప్రదర్శించారు.)ఒక వ్యక్తి – ఆర్చి బిషప్ – రాజ్యాధికారాన్ని ధిక్కరించడం, తర్వాతి పరిణామాలు చిత్రిస్తుంది. యూరోప్‌లో ఫాసిజం బలం పుంజుకుంటున్నప్పుడు ప్రదర్శితమైన ఈ నాటకం, ఆనాటి మేధా లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 1126 నుండి 1170 దాకా ఆర్చి బిషప్ ఆఫ్ క్యాంటర్‌బరీగా పనిచేసిన థామస్ బెకెట్‌ను కాథలిక్ చర్చి, ఆంగ్లికల్ కమ్యూనియన్, ఒక సెయింట్‌గా ఆరాధిస్తుంది. పోప్ అలెగ్జాండర్ 3, ఈయన్ను 1173లో సెయింట్‌గా ప్రకటించాడు.
పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్
రచయిత : జాన్ బన్యన్
ఇంగ్లిష్ రచయిత, పర్షియన్ ప్రీచ్, జాన్ బన్యన్(1628–1688)ను మనం ఇంకా గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆయన రాసిన పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఇదిగాక, ఆయన మరో 60 రచనలు కూడా చేశారు కానీ, అవన్నీ ఒకరకంగా సెర్మన్స్ మాత్రమే. ఆదర్శ క్రైస్తవ జీవితాన్ని కథగా చెప్పాడు బన్యన్. సచ్ఛీలత, సన్మార్గం సృష్టికర్తను చేరటానికి దగ్గరదారులు. గాంధీకి ఇష్టమైన పుస్తకం ప్రిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్.
1938 నాటికి పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ 1300 ఎడిషన్లలో అచ్చయింది. ఈ పుస్తకం పూర్తిపేరు ‘ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఫ్రం దిస్ వరల్డ్, టు దట్ విచ్ ఈజ్ టు కమ్’. మత ప్రచార గ్రంథాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు 200 భాషల్లోకి అనువాదమైంది. ఇంతవరకు ఔట్ ఆఫ్ ప్రింట్‌లో లేదు. ఇవన్నీ గాక, ఇంగ్లిష్‌లో రాయబడిన తొలినవలగా కూడా దీన్ని గుర్తిస్తారు.
ఇందులోని కథంతా ఒక స్వప్నంలా సాగుతుంది. కథానాయకుని పేరు క్రిస్టియన్. అతడు, తన నగరం (సిటీ ఆఫ్ డెస్ట్రక్షన్) నుండి సెలెస్టియల్ సిటీ దాకా ప్రయాణిస్తాడు. అతడు మోస్తున్న బరువు, అతడు చేసిన పాపాలు, అతని చేతిలోని పుస్తకం బైబిల్. దాన్ని చదవడం వల్ల జ్ఞాననేత్రం తెరుచుకుంది.
నిత్యనూతనంగా ఇప్పటికీ పాఠకులను అలరిస్తూనే ఉంది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్.
ది ఫాదర్ బ్రౌన్ స్టోరీస్
రచయిత : జి.కె.చెస్టర్‌టన్
ఇంగ్లిష్ రచయిత, కవి, తత్వవేత్త, నాటకకర్త, జర్నలిస్టు, వక్త, మతశాస్త్ర ప్రచారకుడు, విమర్శకుడు గిల్బర్ట్ కీచ్ చెస్టర్‌టన్ (1874–1934). ఈయన ఇన్ని ప్రక్రియల్లో ఎంత గణనీయమైన కృషి చేసినా, అశేష పాఠకులకు మాత్రం ఈయన ఫాదర్ బ్రౌన్ మిస్టరీ డిటెక్టివ్ కథల రచయితగానే సుపరిచితుడు. ఫాదర్ బ్రౌన్ ఒక కల్పిత పాత్ర. రోమన్ కాథలిక్ ప్రీస్ట్. ఔత్సాహిక డిటెక్టివ్. 1910–1936 మధ్య చెస్టర్‌టన్ ఫాదర్ బ్రౌన్ చేధించిన 53 కథలు ప్రచురించాడు. (ఇవి రాస్తున్న క్రమంలోనే 1922లో చెస్టర్‌టన్ కాథలిక్‌గా తీర్థం పుచ్చుకున్నాడు.) షెర్లాక్ హోమ్స్ లాగా మేధస్సుతో గాక, తన ఇన్‌ట్యూషన్‌తో మిస్టరీని సాల్వ్ చేస్తాడు బ్రౌన్. మానవ ప్రవృత్తిని లోతుగా అర్థం చేసుకొని, వాళ్ల లోపాలను సహానుభూతితో చూడగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. బ్రౌన్ కాథలిక్ విశ్వాసం అతనికా సిక్స్త్‌సెన్స్ కలిగించింది. వ్యక్తిలోని ఆధ్యాత్మిక, తాత్విక కోణాలకు ప్రాధాన్యతనిస్తాడు బ్రౌన్. ఈలోకంలోని ప్రతి వ్యక్తి ఒక కన్ఫెషన్ బాక్స్‌లో నిల్చున్నట్టే చూస్తాడు. టీవీ సీరియల్స్‌గా, సినిమాగా కూడా ఫాదర్ బ్రౌన్ కథలు బాగా ప్రాచుర్యం పొందాయి.
డ్రాక్యులా
రచయిత : బ్రాం స్ట్రోకర్
స్ట్రోకర్ సృష్టించిన ‘డ్రాక్యులా’.. మనుషుల రక్తం తాగి బలిసే పిశాచి. బైబిల్‌లో చెప్పిన ఈవిల్‌కు ప్రతిరూపమే డ్రాక్యులా. ఈ పిశాచాల నుండి రక్షించుకోవాలంటే క్రిస్టియన్ ప్రార్థన, శిలువ వంటివి మాత్రమే ఉపయోగపడతాయి. డ్రాక్యులా సినిమాగా ఎన్నిసార్లు వచ్చిందో, ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది.
జేన్ ఐర్
రచయిత : చార్లెట్ బ్రాంటీ
బ్రాంటీ క్లాసిక్ నవలలోని హీరోయిన్ జేన్. ప్రియుడు, కాబోయే భర్త రోచెస్టర్ ఎంత కోరుకున్నా, ఆమె, వివాహం దాకా తన పవిత్రతను కాపాడుకుంటుంది. ఇది బైబిల్‌లో చెప్పిన సెక్సువల్ మోరాలిటీ అండ్ మ్యారేజ్‌కు సంబంధించిన నిబంధనలలో ఒకటి.
పీర్స్ ప్లోమాన్
రచయిత : విలియమ్ లాంగ్‌లాండ్
మధ్యయుగాల నాటి కావ్యమిది. క్రైస్తవ జీవన ఔన్నత్యం, సచ్ఛీలతను శ్లాఘించడం రచయిత ఉద్దేశం.
ది శాక్రిఫైజ్
రచయిత : జార్జ్ హెర్బర్ట్
ఇంగ్లిష్ భక్తి కవుల్లో ప్రముఖుడు జార్జ్ హెర్బర్ట్ (1593–1633). క్రీస్తు శిలువనెక్కిన సంఘటన శాక్రిఫైజ్‌లోని ఇతివృత్తం.
ది డార్క్‌నైట్ ఆఫ్ ది సోల్
రచయిత : జాన్ ఆఫ్ ద క్రాస్
ఇదొక మార్మిక కావ్యం. సృష్టికర్తను చేరుకోవటానికి ఆత్మ చేసే ప్రయాణాన్ని చిత్రిస్తుంది.
హోలీ సానెట్ 11, 12
రచయిత : జాన్ డాన్
ఆధ్యాత్మిక కవిత్వం రాసిన మరో బ్రిటిష్ కవి జాన్ డాన్ (1572 – 1631). ఈయన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో క్లెరిక్‌గా పనిచేశాడు. సానెట్ 11, 12 క్రైస్తవ జీవితంలో సువార్త ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఈయన కలం నుండి వెలువడిన సానెట్స్ అన్నింటిలోనూ ఇవే ఉత్తమమైనవంటారు.బైబిల్‌తో ప్రభావితమైన ఈ క్లాసిక్ పుస్తకాలే కాదు, బైబిల్‌తో ప్రేరణ పొంది లేదా దాన్ని వ్యాఖ్యానిస్తూ (కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తూ..) అనేకమంది నవలలు ప్రచురించారు. ఈ శతాబ్దపు తొలి రోజుల్లో హెవెన్, ఈడెన్, ఫ్లడ్‌ల గురించి మార్క్‌ట్వేన్ రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలన్నీ కలిపి, ‘ది బైబిల్ అకార్డింగ్ టు మార్క్‌ట్వేన్’ పేరుతో వచ్చినప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. డి.హెచ్.లారెన్స్ (ది మ్యాన్ హూ డైడ్), జోస్ సరమగో (ది గోస్పెల్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్), నార్మన్ మెయిలర్ (ది గోస్పెల్ అకార్డింగ్ టు ది సన్)లు వివాదాస్పద రచయితలే. ఇంకా, పలు పాపులర్ నవలలు, బెస్ట్ సెల్లర్ కూడా బైబిల్ ప్రేరణతో వెలువడ్డాయి. ఉదాహరణకు హ్యారీ పాటర్ చివరి పుస్తకంలో కథానాయకుడు లోక కళ్యాణం కోసం ఆత్మత్యాగం చేసి పునరుద్ధానం పొందుతాడు. జోనెస్టర్ సృష్టించిన సూపర్‌మ్యాన్ ఏకైక లక్ష్యం దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ. డాన్ బ్రౌన్ రాసిన ‘దావించీ కోడ్’కు మూలాలు బైబిల్‌లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మతగ్రం«థాలు ఇష్టపడని వాళ్ల కోసం బైబిల్‌ను ‘బుక్ ఆఫ్ గాడ్’ పేరుతో వాల్టర్ వాంగరిన్ ఒక నవలగా ప్రచురించాడు. ఇదో బెస్ట్ సెల్లర్.
– ముక్తవరం పార్థసారథి ప్రముఖ రచయిత, అనువాదకులు
సైన్స్‌ఫిక్షన్‌లో బైబిల్..!
ఇటీవలే, బైబిల్ ప్రేరణతో కనీసం ఆరు సైన్స్ ఫిక్షన్/ఫాంటసీ సినిమాలు వచ్చాయి.
1. డెస్పరేషన్
2. హ్యారీపాటర్ అండ్ ది డెత్లీ హాలోస్
3. ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్‌రోబ్
4. నోవా
5. అవతార్
6. లెఫ్ట్ బిహైండ్
క్రిస్మస్... హాలీవుడ్...
హాలీవుడ్ చరిత్రలో, క్రిస్మస్ సమయంలో, బైబిల్‌లోని ఏదో ఒక అంశం ఆధారంగా వచ్చిన సినిమాలకు లెక్కేలేదు. మచ్చుకు కొన్నింటిని మాత్రం ఇక్కడ చెప్పుకుందాం..
ఎ క్రిస్మస్ కెరోల్ (1938)
ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్ (1946)
మిరాకిల్ ఆన్ థర్టీ ఫోర్త్ స్ట్రీట్ (1947)
వైట్ క్రిస్మస్ (1954)
ఎ చార్లీ బ్రౌన్ క్రిస్మస్ (1965)
బ్లాక్ క్రిస్మస్ (1974)
క్రిస్మస్ ఈవిల్ (1980)
ది స్నోమ్యాన్ (1982)
మిక్కీస్ క్రిస్మస్ కెరోల్ (1983)
గ్రెమ్లిన్స్ (1984)
డై హార్డ్ (1988)
హోమ్ ఎలోన్ (1990)
ఎడ్వార్డ్ సిసర్‌హ్యాండ్స్ (1990)
ది మప్పెట్ క్రిస్మస్ కెరోల్ (1992)
ది నైట్‌మేర్ బిఫోర్ క్రిస్మస్ (1993)
ఎల్ఫ్ (2003)
బ్యాడ్ సాంతా (2003)
ఆర్థర్ క్రిస్మస్ (2011) – వగైరా వగైరా..
షేక్‌స్పియర్ నాటకాలు
మన జాబితాలో షేక్‌స్పియర్ నాటకాలకూ, సానెట్స్‌కూ చోటు కల్పించారు పండితులు.
మర్చెంట్ ఆఫ్ వెనీస్
ఇందులోని రెండు ప్రధాన పాత్రలు షైలాక్, ఆంటోనియో పాత, కొత్త కన్వీనెంట్స్‌ను ప్రతిబింబిస్తాయి. ‘‘రాతపూర్వక ఒప్పందం ప్రాణం కావాలంటుంది. సహృదయత నవ జీవనాన్ని ప్రసాదిస్తుంది.’’
మెజర్స్ ఫర్ మెజర్
బైబిల్ సందేశాన్ని అన్యాపదేశంగా చెప్పిన నాటకమిది. ఇందులోని ప్రధాన పాత్రలు మనిషికీ, భగవంతునికీ ఉన్న సంబంధాన్ని చిత్రిస్తాయి.
సానెట్ 129
కామప్రవృత్తి.. శరీరం, బుద్ధి మీద ఎలాంటి దుష్ఫలితాలు చూపిస్తుందో కవితాత్మకంగా చిత్రిస్తుంది సానెట్ 129.
మక్‌బేత్
మంత్రాలు, మాయలు ఉన్నాయి గనక, ఈ నాటకాన్ని నిషిద్ధ సాహిత్యంగా పరిగణిస్తారు కొందరు సాంప్రదాయక క్రైస్తవులు. కాని డెవిల్ మనల్ని పాపాలకు ఎలా ప్రేరేపిస్తుందో అద్భుతంగా చిత్రించాడు షేక్‌స్పియర్. మక్‌బేత్ ఆంబిషన్ అతని పతనానికి దారితీసింది. విచ్‌క్రాఫ్ట్ అంటే పడిచచ్చే కింగ్ జేమ్స్ ముందు ప్రదర్శించటం కోసం షేక్‌స్పియర్ ఈ నాటకం రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment