మిగిలిందెవరు? | Special story on funday | Sakshi
Sakshi News home page

మిగిలిందెవరు?

Published Sun, Mar 4 2018 8:48 AM | Last Updated on Sun, Mar 4 2018 8:48 AM

Special story on funday - Sakshi

ఇంకో గంటలో తెల్లారుతుంది. బయటంతా చీకటి. ఆ ఇంటి హాల్లో మాత్రం ట్యూబ్‌లైట్‌ వెలుగుతోంది.  నాన్న మొబైల్లో అలారం సెట్‌ చేసుకుని, నాలుగ్గంటలకే లేచి కూర్చొని, ఇద్దరు పిల్లలు రేపటి పరీక్షకి  తయారవుతున్నారు. నిమిషానికోసారి తలపైకెత్తి చూస్తున్నారు. అప్పుడు కూడా ఇద్దరి పెదాలు, నిశ్శబ్దంగా కదుల్తూనే ఉన్నాయి, చదువుతున్నదాన్ని మననం చేసుకుంటున్నట్లు. అక్కకి ఎనిమిదేళ్లు. తమ్ముడికి ఆరేళ్లు. రాత్రి పదింటిదాకా వాళ్లతో పాటు కూచున్న వాళ్ల అమ్మానాన్నా ఇంకో గదిలో నిద్రపోతున్నారు. కాసేపట్లో వాళ్లూ నిద్ర లేస్తారు. ఇంట్లో ఉరుకులు పరుగులు మొదలవుతాయి.  ఈ ఒక్క పరీక్షా అయిపోతే ఎల్లుండినుంచి వేసవి సెలవులు. సుమారు రెణ్ణెల్లపాటు స్కూలుండదు. పిల్లలిద్దరి మనసూ రాబోయే ఆట విడుపు మీద లేదు. రాయబోయే ఆఖరి పరీక్ష మీద ఉంది. పిల్లలూ! బాగున్నారా?ఓ పరిచయం లేని గొంతు వాళ్లిద్దరినీ పలకరించింది.

 అది విని పిల్లలిద్దరూ ఉలిక్కిపడి తలెత్తి చూశారు. సోఫాలో ఇద్దరు కొత్త వ్యక్తులు కూర్చొని ఉన్నారు. పిల్లలకి ఇంతకు ముందెప్పుడూ వాళ్లని చూసిన గుర్తు లేదు. తమకి తెలీకుండా సోఫాలోకి వాళ్లెప్పుడు వచ్చారో తెలీదు. చడీ చప్పుడు లేదు.   ఉన్నట్లుండి తమ ముందు ప్రత్యక్షమైన వాళ్లని చూసి ఇద్దరు పిల్లల గుండెలూ అవిసిపోయాయి. ముందు తలుపు వంక అనుమానంగా చూశారు. అది వేసింది వేసినట్లే ఉంది.  అయినా వీళ్లు లోపలకి ఎలా వచ్చారు? ఏదో అనుమానం. జరగగూడనిదేదో జరిగినట్లు పిల్లలిద్దరికీ అర్థమైంది. ఒక్క క్షణం అటూ ఇటూ చూశారు. అమ్మానాన్నా  పడుకున్న గదిలోకి పరిగెత్తబోయారు. నేలకి అతుక్కుపోయినట్లు లేవలేకపోయారు. గట్టిగా అరవబోయారు. గొంతు పెగల్లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక అలానే వచ్చిన వాళ్లిద్దరివంకా భయంభయంగా చూస్తూ కూర్చున్నారు. పిల్లలిద్దరి కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి.

వచ్చింది దొంగలా? దొంగలూ మనుషులే అని ఇంతకుముందు నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది. కాని, వచ్చిన వాళ్లు మనుషుల్లా లేరు. రాజుల సినిమాల్లో కనపడే సైనికుల్లా ఉన్నారు. కనుక దొంగలు కాదు. సోఫాలో కూర్చున్న వాళ్లిద్దరి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతలో ఒకతను తన చేతిలో ఉన్న పెట్టెలాంటిది తెరిచాడు. నెమ్మదిగా అందులో ఉన్న వస్తువులని సరిచూసుకోవటం ఆరంభించాడు. రెండో అతను తలపైన ఉన్న కిరీటం తీసి కుడిచేత్తో పట్టుకున్నాడు. ఎడంచేత్తో చెదిరిన జుట్టు సరిచేసుకున్నాడు. కిరీటం మళ్లీ తలమీద పెట్టుకుని, ఒకసారి మీసాలు దువ్వుకుని నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మీ అమ్మానాన్నా లోపల నిద్రపోతున్నారు కదూ?’’ అడిగాడు. అతని గొంతు వాళ్లకి చిత్రంగా అనిపించింది. మాట విచిత్రంగా వినిపించింది. క్లాసులో పాఠాలు చెప్పే టీచర్ల గొంతుకీ దానికీ ఏదో తేడా కనిపించింది.  

అంతకు ముందు తమకు గొంతు పెగలని విషయం పిల్లలిద్దరికీ గుర్తొచ్చింది. మాట నోట్లోంచి రాకుండా ఎలా జవాబు చెప్పాలో తెలియలేదు. ప్రశ్న అడిగిన వ్యక్తివేపు మౌనంగా చూశారు. తమకు మాటలు రావడం లేదన్నట్లు చేతుల్తో సైగ చేశారు. ‘‘ఇందాక మీ గొంతు పనిచేయని మాట నిజమే. అది మీరు వేరే వాళ్లతో మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే. మాతో మాట్లాడాలనుకుంటే అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించండి..’’ అనునయంగా అన్నాడు రెండో అతను.‘‘అవును! అమ్మానాన్నా నిద్రలేచే టైమయింది. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే వాళ్లతోనే మాట్లాడండి..’’ పోయిన ధైర్యం కూడకట్టుకుని అక్క జవాబు చెప్పింది. ‘‘వాళ్లలో ఒక్కళ్లు మాత్రమే నిద్ర లేస్తారు..’’ మొదటతను తన పెట్టెలాంటిది మూసేస్తూ జవాబు చెప్పాడు.

అతడి మొఖంలో అదో రకమైన చిరునవ్వు.
మరి రెండోవాళ్లు..?అక్క అడక్కముందే తమ్ముడు ఆత్రంగా అడిగాడు.
మా వెంట వస్తారు..
మీరెవరు?అక్క అడిగింది.
యమభటులం..రెండో అతను చెప్పక తప్పదన్నట్లు సాధ్యమైనంత మామూలుగా చెప్పాడు.
అంటే ఏమిటి?అన్నట్లు తమ్ముడు అక్క వైపు చూశాడు.  
మనుషుల్ని చంపి తమ వెంట తీసుకుపోయేవాళ్లు. అవునా? అక్క భయంభయంగా కంగారుగా అడిగింది. వచ్చిన వాళ్లిద్దరూ అవునన్నట్లు తల ఊపారు.
ఎందుకు ఒకళ్లని తీసుకు వెళ్లటం?అక్క ఏడుస్తూ గద్గదస్వరంతో అడిగింది. ఏం జరగబోతోందో ఆ అమ్మాయికి అప్పటికే అర్థమయింది.
నీకు తెలియదా? ఆయుష్షు తీరిపోయినవాళ్లను మా లోకం తీసుకువెళతాం. అప్పటినుంచీ వాళ్లు చచ్చిపోయినట్లు లెక్క..మొదటతను నిర్వికారంగా సమాధానమిచ్చాడు.

ఆయుష్షు అంటే పిల్లలిద్దరికీ అర్థం కాలేదు. చచ్చిపోవటం అంటే మన కళ్ల ముందు అప్పటిదాకా  తిరిగిన వాళ్లు చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోవటం. వాళ్లు తిరిగి రారు. మిగిలిన వాళ్లు మాత్రం ఏడుస్తుంటారు.  మేం ఇంకా చిన్న పిల్లలం. మాకు అమ్మానాన్నా అవసరం చాలా ఉంది. వాళ్లు లేకుండా మేం బతకలేం. ఇంకొన్ని రోజులు వాళ్లిద్దరినీ మా దగ్గరనే ఉండనివ్వకూడదా?అక్క బతిమాలుతున్నట్లు అడిగింది. ఆ అమ్మాయి అడిగిన విధానం గుండెని కలచేసేలా ఉంది. కాని వచ్చిన వాళ్లకి గుండె ఉన్నట్లు లేదు. కుదరదమ్మా! అసలు మీ అమ్మానాన్నా ఇద్దర్నీ తీసుకెళ్లాలి. కాని, మా దగ్గరే ఉన్న మీ తాతగారికి ఈ విషయం ముందే తెలిసింది. ఎలా తెలిసిందో ఏమో! మా రాజు గారిని కలిసి బతిమలాడుకున్నాడు. ఆయన కాళ్ల మీద పడి వేడుకున్నాడు. పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. పెద్దవాళ్లు అయేంతవరకూ మీ అమ్మానాన్నని మీతోనే ఉంచమన్నాడు. మా రాజుగారు కుదరదంటే కుదరదన్నారు. కనీసం ఒక్కళ్లనన్నా ఉంచమని మీ తాతగారు ప్రాధేయపడ్డారు. దానికి మా రాజుగారు ఒప్పుకున్నారు. అదీ అతికష్టం మీద..

ఇంతకుముందు యమధర్మరాజుకు ఆ అధికారం లేదు. ఈ మధ్యనే బ్రహ్మదేవుడు ఆయనకా అధికారం ఇచ్చాడు ఒక షరతు మీద. అందరి విషయంలో ఆ అధికారం ఉపయోగించకూడదు. చిన్నపిల్లలున్న తల్లిదండ్రుల విషయంలోనే దాన్ని వాడాలి. కాని ఎవర్ని ఉంచాలో, ఎవర్ని  తీసుకెళ్లాలో నిర్ణయించే అధికారం రాజుగారికి లేదు. అది నిర్ణయించుకోవాల్సింది ఆ తల్లిదండ్రుల పిల్లలే.ఆ ఒక్కళ్లూ ఎవరు?’’ కొంచెం తేరుకుని తమ్ముడు ప్రశ్నించాడు. మాకూ తెలీదు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని, మీకెవరు కావాలో మాకు చెప్పాలి. చెప్పకపోతే, చెప్పలేకపోతే?

మా ఇష్టం వచ్చిన ఒకళ్లని తీసుకు వెళతాం..ఆ తర్వాతేం మాట్లాడాలో తమ్ముడికి అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. పోనీ మా ఇద్దర్లో ఒకళ్లని తీసుకెళ్లి అమ్మానాన్నా ఇద్దర్నీ ఉంచొచ్చుగా! కనీసం ఒకళ్లకైనా అమ్మానాన్నా ఇద్దరూ ఉండేవాళ్లు..అక్క అడిగింది. ఊహించని ప్రశ్న ఇది. జవాబు ఏం చెప్పాలో వచ్చిన వాళ్లకి వెంటనే తెలీలేదు. కాని ఏదో ఒకటి చెప్పాలి.  అలా అని మీ తాతగారు ముందే అడిగి ఉండాల్సింది. ఆయనకి ఆ ఆలోచన వచ్చినట్లు లేదు. ఇప్పుడిక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.తాతగారు పెద్ద పొరపాటు చేసినట్లు పిల్లలిద్దరికీ అనిపించింది. ఏం చెయ్యాలో తెలీక పిల్లలిద్దరూ ఏడ్వటం మొదలుపెట్టారు. చిత్రంగా వాళ్ల ఏడుపు వాళ్లకే  వినపడటం లేదు. ఎటన్నా కదుల్దామంటే కుదరదు. పిలుద్దామంటే గొంతు పనిచేయదు.

 ఏం చెయ్యాలో తెలీక ఉన్నచోట్లోనే కూర్చుండిపోయారు. మొహాల్లో విషాదం. కళ్లలో భయం. రేపటి పరీక్ష మర్చిపోయారు. కొద్ది నిమిషాలు అలాగే గడిచాయి. అమ్మానాన్నా లేస్తే బాగుండు. హాల్లోకి వస్తే బాగుండు అని పిల్లలిద్దరి మనసులోనూ ఉంది. కాలం జరుగుతోంది. వాళ్లు అనుకున్నది జరగటం లేదు.మీరు అనుకునేది మాకు తెలుసు. మా పని పూర్తయ్యేదాకా మీ అమ్మానాన్నకి మెలకువ రాదు. వాళ్లు పడుకున్న గది తలుపులూ తెరుచుకోవు..’’మొదటతను పిల్లలిద్దరితో చెప్పాడు. దాంతో జరగబోయేదేమిటో, చేయాల్సిందేమిటో పిల్లలకు కొంచెం కొంచెం అర్థం కావటం మొదలుపెట్టింది. నెమ్మదిగా గుండె దిటవు చేసుకుని ధైర్యం తెచ్చుకున్నారు.

మేమిద్దరం కాసేపు మాట్లాడుకోవచ్చా? ఓ! అలాగే.  మీ మాటలు మీ ఇద్దరికే కాక మాక్కూడా వినపడతాయి. స్వేచ్ఛగా  మాట్లాడుకోండి. మేం వింటూ ఉంటాం..వచ్చిన వాళ్లు సానుభూతిగా చూస్తూ అనుమతి ఇచ్చారు. సరే కానీ, మాకేదన్నా అనుమానం వస్తే అడగొచ్చా?’’ పిల్లలు బ్రతిమిలాడుతున్నట్లు అడిగారు. వాళ్లకి స్కూల్లో పరీక్షకన్నా ఇది పెద్ద పరీక్షగా అనిపిస్తోంది. అడగొచ్చు.. మొదటతను చెప్పాడు.

కళ్లలోంచి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లని చేతుల్తో తుడుచుకుని పిల్లలిద్దరూ వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవటం మొదలు పెట్టారు.
చెప్పక్కా! ఎవర్ని ఉంచమని అడుగుదాం. అమ్మనా? నాన్ననా?’’ తమ్ముడు అక్క మొహంలోకి చూస్తూ అడిగాడు. అక్క తెలివితేటల మీద అతడికి ఎక్కళ్లేని నమ్మకం. అదే అర్థం కావటం లేదురా!అక్కా! నాకో చిన్న అనుమానం. నాన్న రోజూ పొద్దున్నే బయటికెళ్లి రాత్రి ఎప్పుడో కానీ ఇంటికి రాడుగా. పగలంతా ఎక్కడుంటాడు? ఏం చేస్తాడు? కంపెనీలో పని చేస్తాడు. దానికొచ్చిన జీతంతోనే కదా మనకు అన్నమూ, బట్టలూ, చదువూ..’’ సాలోచనగా జవాబిచ్చింది అక్క. ఐతే నాన్న లేకపోతే అవన్నీ ఉండవా?నిస్పృహగా అడిగాడు తమ్ముడు.

అనే అనుకుంటాను. నాన్న లేకపోతే మనం ఏమైపోయేవాళ్లమో! అమ్మ నాతో ఆ మాట చాలాసార్లు అంది..’’ దిగులుగా అంది అక్క. వచ్చినవాళ్లు ఈ నాన్నను తీసుకెళ్లిపోతే అమ్మ, కొత్త నాన్నను తెచ్చుకోకూడదా?’’ అనుమానంగా అడిగాడు తమ్ముడు.కుదరదనుకుంటాను. పక్కింటి అంకుల్‌ చనిపోతే ఆంటీ ఒక్కతే అలా ఉండిపోయింది. ఇంకో అంకుల్ని తెచ్చుకోలేదుగా..’’ ఈ మధ్య జరిగింది గుర్తు తెచ్చుకుంటూ అంది అక్క. అక్కా! నాన్న ఎన్నాళ్లనుంచో వాళ్ల దగ్గర చేస్తున్నాడుగా. నాన్నకేమన్నా ఐతే వాళ్లేమీ పట్టించుకోరా? నాన్న చేసే పని అమ్మ చేయకూడదా?’’ మరిచిపోయిన విషయమేదో గుర్తొచ్చినట్లు ప్రశ్నించాడు తమ్ముడు. చేయొచ్చు. కాని అమ్మకి ఆ పని చేతకావాలి. కంపెనీ వాళ్లు ఒప్పుకోవాలి. ఇంట్లో పనీ, కంపెనీలో పనీ రెండూ అంటే అమ్మకి కుదరొద్దూ? మనని  స్కూలుకు కూడా పంపాలిగా..

ఐతే అమ్మ ఇంట్లో ఉండటం చాలా అవసరం.అందుకనేగా నా క్లాస్‌మేట్‌ రామూ అమ్మ చనిపోతే, వాళ్ల నాన్న ఇంకో అమ్మను తెచ్చింది..కానీ ఆ అమ్మ రామూని  రోజూ కొడుతుందనీ నువ్వేగా చెప్పావు..చాలా మంది కొత్త అమ్మలు అలానే ఉంటారట..సరే కానీ అక్కా! మన దగ్గర బోలెడన్ని డబ్బులుంటే బాగుండేది కదా?కానీ లేవుగా. అమ్మ కూడా ‘మన దగ్గర బోలెడంత డబ్బులేదు కదా! కావాల్సినవన్నీ తెచ్చుకోవటానికి అంటుంది అప్పుడప్పుడు..ఐతే ఏం చెప్పుదాం వాళ్లకి?అయోమయంగా అడిగాడు తమ్ముడు. అదే అర్థం కావడం లేదు..’’ నిస్సహాయంగా అంది అక్క.    అక్కకే అర్థం కాకపోతే తనకేం అర్థమవుతుంది. తమ్ముడు బిక్క మొహం వేశాడు. చెప్పండి పిల్లలూ! ఏం చెయ్యమంటారు?’’ మొదటతను అడిగాడు.

మాకేం అర్థం కావటం లేదు..’’ పిల్లలిద్దరూ ఒకేసారి జవాబు చెప్పారు. వచ్చినవాళ్లిద్దరూ ఇలాంటి సమస్యని ఇంతకుముందు చాలాసార్లు ఎదుర్కొన్నారు. వాళ్ల అనుభవం ఏ పరిస్థితిలో ఎవర్ని ఉంచొచ్చో వాళ్లకి తెలిసేలా చేసింది. కానీ, వాళ్లంతట వాళ్లు ఒక నిర్ణయం తీసుకోకూడదు. అమలుపర్చకూడదు. అలా చేస్తే రాజుగారు వీళ్లకి శిక్ష వేస్తారు. అంకుల్‌ ! మీరిలాంటి పనులు ఇంతకుముందూ చేసి ఉంటారుగా. మేమేం చెయ్యాలో మీరే చెప్పొచ్చుగా..’’ తమ్ముడు తన తెలివితేటలని ఎలాగైతేనేం దారికి తెచ్చుకోగలిగాడు. చెప్పొచ్చు. కానీ తర్వాత మీకేదన్నా కష్టం వస్తే అది మా వల్లనే అని మీరనకూడదు..లేదంకుల్‌! అలా అనం..’’ గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలిద్దరూ హామీ ఇచ్చారు. ఐతే సరే! కాని మా సలహా ఎవరూ వినకూడదు. మీ ఇద్దరి చెవుల్లో రహస్యంగా చెపుతాం..’’ అంటూ ఇద్దరు యమభటులూ పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ల చెవుల్లో తమ అభిప్రాయం చెప్పారు.

యమభటులిచ్చిన సలహా పాటించటం తప్ప వేరే మార్గం ఏమీ వాళ్లకు కనపడలేదు.  సరే అంకుల్‌! అలాగే చేయండి..’’ అని పిల్లలిద్దరూ అన్నారు. వాళ్ల గొంతుల్లో భరించలేని విషాదం.  ఇప్పుడేం జరుగుతుంది? పిల్లలిద్దరూ ఆందోళనగా, ఆత్రుతగా బెడ్‌రూమ్‌ తలుపుల వంక చూస్తూ కూర్చున్నారు. తలుపులు తెరుచుకోలేదు. అయినా, వాట్లోంచి యమభటులిద్దరూ లోపలికి వెళ్లారు. ఒక్క నిమిషం తర్వాత బయటికి వచ్చారు. ఉన్నట్లుండి మాయమయ్యారు.వాళ్లు వెళ్లింతర్వాత బెడ్‌రూమ్‌ తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. చిత్రంగా పిల్లలిద్దరి శరీరాలూ వాళ్ల స్వాధీనంలోకి వచ్చాయి.పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్లారు.మరో నిమిషం తర్వాత ఆ ఇంట్లోనుంచి ముగ్గురి ఏడుపులు పెద్దగా వినపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement