సిస్టర్‌హుడ్‌.. అత్యంత అవసరమైన బంధం | Sisterhood: A Path to Relationships, Bonds and Empowerment | Sakshi
Sakshi News home page

సిస్టర్‌హుడ్‌.. అత్యంత అవసరమైన బంధం

Published Sun, Dec 18 2022 8:17 AM | Last Updated on Sun, Dec 18 2022 10:40 AM

Sisterhood: A Path to Relationships, Bonds and Empowerment - Sakshi

అదొక ఇల్లు.. గర్భిణీ స్త్రీలకు ప్రసవం గురించిన భయాలను పోగొట్టి.. అమ్మతనాన్ని హాయిగా ఆస్వాదించేలా సలహాలు, సూచనలు, భరోసానిచ్చే సాంత్వన సదనం! అక్కడికి భిన్నమైన నేపథ్యాలు, సంస్కృతీ సంప్రదాయాలు, విభిన్నమైన మనస్తత్వాలతో అంతే వైరుధ్యమైన పరిస్థితుల్లోంచి ఆరుగురు గర్భిణీలు వస్తారు. ఒకరికి భాష అభ్యంతరమయితే.. ఒకరికి భావం తప్పుగా  తోస్తుంది.

ఇంకొకరికి ప్రవర్తన నచ్చదు. మరొకరికి కట్టుబొట్టు తీవ్రమనిస్తుంది. వేరొకరికి మాట పెడసరంగా వినిపిస్తుంది. ఒకరికి తోటివాళ్ల వ్యవహారమే చిరాకు తెప్పిస్తుంది. ఇలా ఎవరికివారే ముందస్తు అభిప్రాయాలు, తీర్పరి తీరుతోనే అక్కడికి చేరుతారు. వారి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా ఒక్కోరిది ఒక్కో నేపథ్యం.

వారికి సలహాలు, సూచనలిచ్చే మహిళదీ ఒక నేపథ్యం. చిరాకులుపరాకులు, కోపాలు, హేళనలు, స్పర్థలతో మొదలైన వారి ప్రయాణం.. రానురాను ఒకరినొకరు అర్థం చేసుకునే దిశగా మళ్లుతుంది. ఒకరికొకరం అన్నంత దగ్గరగా  బంధం బలపడుతుంది. ఆ అనుబంధాన్ని చూసేవాళ్లు  ‘వావ్‌..వండర్‌ విమెన్‌..!’ అని అనుకోకమానరు!

ఇది నిజ జీవితంలోని దృశ్యం కాదు.. వెబ్‌ స్క్రీన్‌ మీది చిత్రం! పేరు.. వండర్‌ విమెన్‌! సిస్టర్‌హుడ్‌ అవసరాన్ని గుర్తించేలా చేస్తున్న సినిమా! దాని మీద చర్చద్వారా ఆ అవసరాన్ని మరచిపోనివ్వకుండా మహిళలను కార్యోన్ముఖులగా ఉత్సాహపరుస్తున్న ఆలోచన!! ఏ భాష అనే ప్రశ్నకు తావివ్వని అన్ని భాషల ప్రాతినిధ్యాన్ని ఇంకా చెప్పాలంటే అసలు భాషే అవసరం లేని ఒక నిజాన్ని మహిళలు చూసి .. గ్రహించి పెంపొందించుకోవాల్సిన భావం!! దర్శకురాలు.. అంజలీ మీనన్‌. ప్రతి మహిళకూ ఒక బ్యాగేజ్‌ ఉంటుంది. దాన్ని పక్కనపెట్టి అవతలి మహిళ బరువును దృష్టిలో పెట్టుకుని సాయం చేయాలి. అదే సిస్టర్‌హుడ్‌. ఆ చిత్రం ద్వారా మనం గుర్తించాల్సిన అవసరం! 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఎక్కడ ఏ మూల ఏ ట్రోలింగ్‌ జరిగినా తెలిసిపోతుంది. వియర్డ్‌ థింగ్స్‌ వైరల్‌ అయినంతగా నార్మల్‌ థింగ్స్‌ వైరల్‌ కావు కదా! ముక్కుసూటి నిజాల పోస్టింగ్స్‌ కన్నా దాని ఈకలు పీకే ట్రోలింగ్సే నలుమూలలకూ చేరిపోతాయి లిప్తపాటులోనే! అలాగే మొన్నామధ్య.. ప్రేమ, ఎమోషనల్‌ బాండింగ్‌ పేరుతో లైంగిక దోపిడీకి .. తద్వారా అనారోగ్యానికి గురికాకుండా అమ్మాయిలను అప్రమత్తం చేస్తూ ఓ మహిళా జర్నలిస్ట్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.

అందులోని అంశాన్ని పక్కదోవ పట్టించి సంస్కృతీసంప్రదాయాలను తెరమీదకు తీసుకొచ్చి ఆ జర్నలిస్ట్‌నూ.. ఆ పోస్ట్‌ను సమర్థించిన మిగిలిన మహిళలనూ అసభ్యకరంగా ట్రోల్‌ చేశారు. విషాదమేంటంటే అలా ట్రోలింగ్‌ చేస్తున్న పురుషులకు.. మహిళలూ సపోర్ట్‌గా నిలవడమే కాక తమవంతుగా వీళ్లూ ట్రోలింగ్‌కి పాల్పడడం! 

వండర్‌ విమెన్‌కి.. ఈ ట్రోలింగ్‌కి లింక్‌ ఏంటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. ఆ సినిమా చెప్పిన సిస్టర్‌హుడ్‌ భావన నిజంగానే మనకు ఉండుంటే స్త్రీలే స్త్రీలపై ట్రోలింగ్‌కి పాల్పడకపోగా ఆ దుశ్చర్యకు దిగిన పురుషులను నిలువరించేవారు. ప్రాక్టికల్‌గా అది జరగడం లేదని తెలుస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో ఇలాంటి ధోరణినే చూస్తున్నాం.. దానికి సాక్ష్యం అందరి జీవితాల్లో ముఖ్య భూమికయిన సోషల్‌మీడియా వేదికే! అందుకే సిస్టర్‌హుడ్‌ భావనను పెంపొందించుకునే ఆవశ్యకత ఏర్పడింది.
శత్రువులం కాదు.. 

సామెతలు రొదపెడ్తున్నట్టుగా ఆడవాళ్లు ఆడవాళ్లకు శత్రువులు కారు. అలా శత్రువుల్లా చూపించి.. మభ్యపెడుతున్నది పురుషాధిపత్య లోకం. సిస్టర్‌హుడ్‌కు విరుద్ధమైన ఈ పురుషాధిపత్య భావజాలన్ని స్త్రీ మెదడులో నింపిందీ సమాజం. అలా కండిషనింగ్‌ అయిన మైండ్‌ ఆ భావజాలాన్ని తరతరాలకూ మోసుకెళ్తోంది పెంపకం ద్వారా! అందుకే పురుషాధిపత్య భాజాలానికి భిన్నంగా.. విరుద్ధంగా ఏ చిన్న అభిప్రాయం వినిపించినా.. కనిపించినా ముందు స్త్రీలే ఒప్పుకోరు.. విరుచుకుపడతారు. సఖ్యత కోల్పోతారు.. ఐక్యత చెడి విడిపోతారు. ఆ అధిపత్యానికి కావల్సింది ఇదే! తద్వారా స్త్రీ ఎప్పటికీ సెకండ్‌ సిటిజన్‌గానే ఉంటుంది. 

ఇది కూతురు, కొడుకు అనే వివక్ష నుంచి మొదలై అత్త – కోడళ్ల గొడవలు, వదిన– మరదళ్ల ఆరళ్లు, తోడికోడళ్ల మధ్య చిచ్చులుగా కొనసాగుతూ బయటి ప్రపంచంలోకి వెళ్లి.. ఉద్యోగినుల మధ్య పోటీలు, క్యారెక్టర్‌ అసాసినేషన్లు, బాడీషేమింగ్‌ ఎట్‌సెట్రా దాకా వెళ్తాయి. ఒకవేళ కొండకచో.. పురుషాధిపత్య జిత్తులను స్త్రీలే నిర్లక్ష్యం చేస్తే అప్పుడు పురుషులు ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగుతారు. ఒక స్త్రీ ముందు ఇంకో స్త్రీని కామెంట్‌ చేస్తుంటారు! తన ముందున్న స్త్రీని పొగడ్తల్లో ముంచేస్తారు.

దేవలోకంలో కూర్చోబెడ్తారు.. అక్కడ లేని స్త్రీని పాతాళంలోకి తోసేస్తారు. ఇలా ఆడవాళ్ల మధ్య అభద్రతను క్రియేట్‌ చేస్తారు. అసూయాద్వేషాలను రగిలిస్తారు. ఒకరితో ఒకరు పోటీ పడేలా చేస్తారు. మహిళల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టేలా చూస్తారు. తెలియకుండానే ఆడవాళ్లు ఆ కుట్రలో భాగస్వాములవుతారు. ‘చూశారా.. మూడు కొప్పులు ఒక్కచోట చేరలేవు..’, ‘అందుకే అన్నారు పెద్దలు స్త్రీకి స్త్రీయే శత్రువు అని’ అంటూ చోద్యం చూస్తుంటారు. 


భావోద్వేగాలకు పురుషుడు అతీతమా?
మగవాళ్లకు మగవాళ్లు కూడా శత్రువులే! అసలు భావోద్వేగాలు, తమోరజో గుణాలకు స్త్రీ, పురుషులనే తేడా ఏంటి? పరిస్థితులను బట్టి మనుషులందరూ భావోద్వేగాలకు లోనవుతారు. వాళ్ల వాళ్ల తీరును బట్టి ప్రతిస్పందిస్తారు. అంతేకానీ కొన్ని గుణగణాలు ప్రత్యేకించి స్త్రీలకే ఉండవు. ఈ విషయాన్ని మహిళలు దృష్టిలో పెట్టుకోవాలి.

పెట్టుకోనందువల్లే రాజకీయాల్లో కూడా పురుషాధిపత్య ఆటలు కొనసాగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకు.. ఏ పార్టీలోనైనా మహిళా సభ్యురాలు జనరల్‌ పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ నుంచి జెండర్‌ పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ ఏది ఇచ్చినా.. ఎదుటి పార్టీనాయకత్వం ప్రతిస్పందించకుండా ఆ పార్టీలోని మహిళా సభ్యులను ఉసిగొల్పుతుంది. మాటలతో వాళ్లు యుద్ధం చేసుకుంటుంటే చిద్విలాసంగా తమాషా చూస్తుంది. 
ఎరుకపడాలి.. 

ఈ కుట్రలు, పన్నాగలు, గిమ్మిక్కులు, జిత్తులు అన్నీ కూడా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసమే చేస్తుంది పురుష సమాజం. అసలు సమాజం అంటేనే మేల్‌ అనే సింగిల్‌ వర్డ్‌ మాట. అదలా వాళ్ల ప్రపంచంగా మనుగడ సాగించాలంటే స్త్రీలు కిందమెట్టు మీదే ఉండాలి. కులం, మతం అనే సామాజిక హోదాల నుంచి ఒంటి రంగు, ఒడ్డుపొడుగు అనే వ్యక్తిగత అంశాలు, ఉద్యోగహోదా వంటి విషయాల దాకా స్త్రీలను విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. మహిళల ఎమోషనల్‌ కొషెంట్‌నూ వాడుకుంటుంది.

ఏ గడబిడ లేకుండా ఈ విభజన సాఫీగా సాగిపోవడానికి సంస్కృతీసంప్రదాయాలను కాపాడే బృహత్తర బాధ్యతను స్త్రీల భుజాల మీద పెడుతుంది. ఇది సక్రమంగా సాగేలా అమ్మను పురమాయిస్తుంది. ఎందుకంటే పెంపకం ఆమె చేతుల్లో ఉంటుంది కనుక. అలా ఈ సంస్క్రృతీసంప్రదాయాల పరిరక్షణ అనే పురుషాధిపత్య భావజాలానికి కండిషనింగ్‌ అయిన అమ్మ .. పెంపకం ద్వారా వాటిని చక్కగా పంపకం చేస్తుంది. ఆ చైన్‌ అలా కొనసాగి ఇల్లు దాటి బయటి ప్రపంచానికి చేరుతుంది.

దాంతో మహిళ.. అడుగడుగునా తన స్థానాన్ని ఆక్రమించడానికే ఇంకోమహిళ పుట్టిందేమో అన్న అభద్రతతో బతికేస్తుంటుంది. కాబట్టి వీటన్నింటి పట్ల ఎరుకపడి.. నిజాలను తెలుసుకుని పురుషాధిపత్య భావజాల బరువును దించేసుకోవాలి. అప్పుడే తోటి ఆడవాళ్ల పట్ల సోదరిభావన.. అదే సిస్టర్‌హుడ్‌ భావన కలుగుతుంది.

సాహిత్యంలో దొరకదు..
సోదరిభావన.. అంటే కొత్తగా అనిపిస్తుంది కదూ! అవును మరి.. ఏ పదాలైనా ఆ భావాలు అనుభవంలోకి వస్తేనే పుడతాయి కదా! స్త్రీని స్త్రికి శత్రువును చేసిన లోకం అనుభవంలోకి రాని సిస్టర్‌హుడ్‌కు సమానార్థకాలను ఎలా క్రియేట్‌ చేస్తుంది? బ్రదర్‌హుడ్‌ ప్రాక్టికాలిటీలోకి వచ్చింది కాబట్టి ఆంధ్రీకరించిన సౌభ్రాతృత్వం అనే సంస్కృత పదం వచ్చింది.

ఏ భావాలనైనా వాటి తాలూకు పదాలనైనా జనసామాన్యంలోకి తెచ్చేది సాహిత్యమే. సిస్టర్‌హుడ్‌ గురించి వివరించిన పురాణాలు.. కథలు, నవలలు మన దగ్గర లేవనే చెపాలి. అభ్యుదయ రచయిత్రులు కొందరు ఈ సిస్టర్‌హుడ్‌ మీద కొన్ని కథలు రాశారు. ఇంగ్లిష్‌లో చిత్ర బెనర్జీ దివారకుని రాసిన ‘సిస్టర్‌ ఆఫ్‌ మై హార్ట్‌’ను సిస్టర్‌హుడ్‌ను అక్షరీకరించిన నవలగా పరిగణిస్తారు. అయినా  దీని మీద చెప్పుకోదగినంత సాహిత్య కృషి జరగలేదనే చెప్పాలి.

ఆ మాటకొస్తే మొత్తం భారతీయ నవలా సాహిత్యంలో కథానాయకులకు ఉన్నట్లుగా కథానాయికలకు ప్రధానమైన అంటే వాళ్ల జీవితాల్లో ముఖ్యపాత్రను పోషించే స్నేహితులు ఉండరు. మహిళలకు మహిళలను హితులుగా.. సన్నిహితులుగా చూపించే ఒక్క అంశమూ.. సన్నివేశమూ కానరాదు. కాబట్టి సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవడానికి సాహిత్యం మనకు పెద్దగా సాయపడుతుందని అనుకోలేం. 

మరి సినిమాలు? 
సమస్యే లేదు. ‘ఇది కథ కాదు’, ‘కల్కి’ వంటి సినిమాలతో 80, 90ల్లో బాలచందర్‌ అనే దర్శకుడు సిస్టర్‌హుడ్‌ ప్రమోషన్‌కు ఓ ఆశా కిరణంలా కనపడ్డాడు. సింగీతం శ్రీనివాసరావునూ బాలచందర్‌ సరసన చేర్చుకోవచ్చు ఆయన తీసిన ‘ఆడవాళ్లకు మాత్రమే’ సినిమాతో. అలాంటివి అతి కొన్ని తప్ప సినిమాల పరంగానూ పెద్దగా ప్రయత్నం జరిగినట్టు ఏ రీలూ చూపించడం లేదు. అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో అలాంటి ఫోకస్‌ ఒకటి కనిపిస్తోంది. దానికి ఉదాహరణగా ‘క్వీన్‌’ను చూపించొచ్చు. సో ఈ విషయంలో వెండితెర మీదా మనకు వెలుగు లేదు. ఇక సీరియల్స్‌.. ప్రస్తావించుకోకపోవడమే మంచిది.

కొత్తదేం కాదు.. 
నిజానికి సిస్టర్‌హుడ్‌ మాట కొత్తదేం కాదు. అది సాధించిన విజయాలూ తక్కువేం కాదు. పురుషులతో సమానంగా వేతలనాల కోసం నాడు జరిగిన ఉద్యమం నుంచి చదువుల్లో, కొలువుల్లో, బస్సుల్లో, స్థానిక పరిపాలనా సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్‌లు సాధించుకునే  వరకు సాగిన.. సాగుతున్న అన్నిరకాల స్త్రీవాద ఉద్యమాలకూ ఊపిరి ఈ సిస్టర్‌హుడే. వరకట్న నిషేధం, గృహ హింస, విశాఖ గైడ్‌లైన్స్, నిర్భయ, దిశ వంటి చట్టాల ఏర్పాటుకూ వెనుకున్నది సిస్టర్‌హుడే. అంటే ఎంత కడిషనింగ్‌ అయినా తోటి వాళ్ల పట్ల సహానుభూతి ప్రదర్శించే మన సహజ గుణం సజీవంగా ఉన్నట్టే కదా. దానికి కండిషనింగ్‌ అవుదాం.

ఒకే రక్తం పంచుకుని పుట్టిన, ఒకే నేపథ్యంలో పెరిగిన అక్కాచెల్లెళ్ల మధ్యే సవాలక్ష అభిప్రాయ భేదాలుంటాయి. కానీ ఏ కష్టం వచ్చినా.. ఆపద తలెత్తినా అక్కకు చెల్లి తోడు.. చెల్లికి అక్క అండ ఉంటుంది కదా జీవితకాలం! అలా సోదరిభావానికి కట్టుబడి ఉందాం. పురుషాధిపత్యం నేర్పిన తీర్పరి వైఖరిని, విక్టిమ్‌ బ్లేమింగ్‌ స్వభావానికి ఫుల్‌స్టాప్‌ పెడదాం. అర్థంచేసుకునే నైజాన్ని అలవర్చుకుందాం. కులం, మతం, రంగు, భాష, చదువు, కొలువు, డబ్బు..వంటి ఎన్ని భేదాలున్నా ఫిమేల్‌ జెండర్‌ అనే ఒకేఒక్క ఐడెంటిటీతో ఒక్కటికావాలి.

ఆ జెండర్‌కున్న వల్నరబులిటీనే ఐకమత్యంతో బలంగా మలచుకోవాలి. అప్పుడే అది రక్తసంబంధం కన్నా గొప్ప అనుబంధంగా.. ఎప్పటికీ వెన్నంటే ఉండే బంధంగా బలపడుతుంది. ఆ యూనిటీతో సాధించలేని విజయాలు ఉండవు. ఆ భావన వల్ల తోటి వాళ్లను వినడం మొదలుపెడతాం. ముందస్తుగా ఏర్పరచుకున్న మన అభిప్రాయాల్లోని తప్పుని గ్రహించగలుగుతాం. తప్పు పట్టడాన్ని మానుకుంటాం. షేరింగ్‌ను అలర్చుకుంటాం.

ధైర్యాన్ని ప్రదర్శించగలుగుతాం. ఆలోచనాపరిధిని పెంచుకుంటాం. ఇవన్నీ మహిళలను సాధికారత వైపు నడిపిస్తాయి. ‘డియర్‌ సిస్టర్‌..’ అనే ఒకే ఒక్క మాట తోటి మహిళలకిచ్చే నైతిక బలం అలాంటిది మరి. సిస్టర్‌హుడ్‌ మ్యాజిక్‌ అది. ఈ భావనవల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికస్వావలంబనకు దాన్ని మించిన టూల్‌ ఇంకేం ఉంటుంది! ఆర్థికస్వావలంబన సాధించామంటే నిర్ణయాధికారాన్ని సాధించినట్టే.. పాలనలో భాగస్వామ్యానికి సిద్ధమైనట్టే. ఇన్ని విజయాలకు ఒకే ఒక్క మంత్రం.. సిస్టర్‌హుడ్‌! ఇక చేతులు కలపడమే! 

ఆ ధోరణులను, పోకడలను వదిలించుకోవాలి..
నాకు సంబంధించి, సిస్టర్‌ హుడ్‌ అంటే ఒక అమ్మాయిగా నేను పడ్డ కష్టం ఇంకో అమ్మాయి పడకూడదన్న ఆలోచన..అది నచ్చని మనిషైనా సరే. ప్రతి అమ్మాయికీ సొంత గుర్తింపు ఎందుకు లేదన్న ప్రశ్న.. ఆ గుర్తింపు ఏర్పరచుకోడానికి, సాధికారత సాధించడానికి ‘నా’తో మొదలై, ‘మనం’ దాకా అమ్మాయిలందరూ చేయాల్సిన ప్రయాణమే సిస్టర్‌హుడ్‌. ఇదంతా సాధ్యపడాలంటే.. తెలిసో, తెలియకో మనందరం పాటిస్తున్న ఈ మనువాద ధోరణులు, పితృస్వామ్యపు పోకడలను వదిలించుకోవాలి. ఒకరి కోసం ఒకరు నిలబడాలి. బేషరతుగా అని చెప్పను కానీ ఒక మార్పు.. నిర్ణయం సరైనది అని తెలిసినప్పుడు మాత్రం కచ్చితంగా సహాయసహకారాలు అందించాలి. 
వై. కృష్ణజ్యోతి, జర్నలిస్ట్‌

ఉమన్‌ నీడ్స్‌ ఉమన్‌
ఏ సమస్యనయినా ఒంటరిగా ఎదుర్కోలేం.. సమూహంగా ఉంటేనే పరిష్కరించుకోగలుగుతాం. ఆ యూనిటీయే సిస్టర్‌హుడ్‌. ఈ మధ్య నేనొక అధ్యయనం చదివాను. ఒక విమెన్‌ గ్రూప్‌లో బ్రెస్ట్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలు తమ ఆరోగ్య సమస్యలు.. వాటితో ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ.. ఓదార్చుకుంటూ.. మోరల్‌గా సపోర్ట్‌ చేసుకుంటూ.. చిన్న చిన్న ఆనందాలను పంచుకుంటూ.. ఒకరికొకరు తోడుగా, అండగా ఉన్నారట.

దీనివల్ల వాళ్లు క్యాన్సర్‌ను జయించే అవకాశాలు పెరిగాయని ఆ అధ్యయనం చెప్పింది. అదీ సిస్టర్‌హుడ్‌ ఇచ్చే స్ట్రెంత్‌! ‘‘నిన్ను విభేదించినా సరే నీ హక్కుల కోసం నిలబడతా నా ప్రాణం పోయినా ’’ అని వోల్టేర్‌ చెప్పినట్టుగా మనలో మనకు ఎన్నో విభేదాలున్నా సరే తోటి మహిళ అవసరాన్ని గుర్తించి ఆమెకు అండగా నిలబడాలి. ఆ భావనను డెవలప్‌ చేసుకోవాలి.

దానికోసం ముందు మన మీద మగవాళ్లు క్రియేట్‌ చేసిన స్త్రీకి స్త్రీయే శత్రువు, మహిళలకు ఈర్షా్యసూయలు ఎక్కువ వంటి ఇమేజెస్‌ను తుడిచేయాలి. వాళ్లు మనల్ని తొక్కిపెట్టడానికి సంధించిన ఆ అస్త్రాలను విరిచేయాలి. ఉమన్‌ నీడ్స్‌ ఉమన్‌ అంతే! ఎక్కడికెళ్లినా.. ఏ స్పేస్‌లో ఉన్నా తన చుట్టూ ఉన్న మహిళలు తనకు సపోర్ట్‌గా ఉన్నారు అన్న భరోసాను తోటి మహిళకు ఇవ్వాలి. మనం ఉన్న చోటునుంచే దీన్ని మొదలుపెట్టాలి.  
– ఆలమూరు సౌమ్య
జర్నలిస్ట్‌  

  
అత్యంత అవసరమైన బంధం
ఆడవారు కలవాలన్నా ఆలోచనలు కలబోసుకోవాలన్నా పెద్దగా లెక్కలుండవు. వాష్రూమ్‌లో తెలియనివారితో చీర పిన్నీసు నుంచి లిప్‌స్టిక్‌ దాకా పంచుకోగలరు. ఇక ఆత్మీయతనూ ఆర్ద్రతను పంచుకునే లక్షణం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? నా జీవితంలో అంతకంతకూ ఈ అనుభూతి నాలో జీవనలాలసను పెంచుతోంది. నా కథలు తీవ్ర విమర్శలకు గురైనా ఎందరో ఆడవారు ఆ కథల్లోని పాత్రలతో తమ జీవితంలోని అనేక పార్శా్వలతో గుర్తించి ప్రేమించారు. ఇలాంటి షేరింగ్, కంపాషన్, ఎంపథీ.. మహిళల సహజ లక్షణాలు.

ఇవి చాలు సిస్టర్‌హుడ్‌ డెవలప్‌చేసుకోవడానికి! ఈ భావన మనకు భరోసాను, భద్రతను ఇస్తుంది. ఒకసారి నా కొడుకు పుట్టిన రోజు. ఎవరూ చుట్టూలేని సందర్భం. ఒంటరిగా ఫీల్‌ అవలేదు కాని ఉన్నట్లుండి స్నేహితురాళ్లంతా కలసి వాళ్లే  మావాడి పుట్టినరోజు జరిపారు. ఆ రోజు నాకు దొరికిన భరోసా మాటల్లో చెప్పలేనిది.

ఈ సిస్టర్‌హుడ్‌ వల్ల జీవితంలో తిరిగి నిలబడ్డవాళ్లున్నారు. ఇదే స్ఫూర్తిని వాళ్లూ కంటిన్యూ చేయాలి. ఒక చైన్‌ లా పెరుగుతూ పోవాలి. అయితే ఈ బాండింగ్‌  ఏకాభిప్రాయమున్న వాళ్లతోనే కాదు మన ఆలోచనలు, అభిప్రాయాలు కలవని వాళ్లతోనూ క్రియేట్‌ చేసుకోవాలి. మనలో మనకు ఎన్ని వైరుధ్యాలున్నా సరే కలసే నడవాలి.. కలసికట్టుగా ఉండాలి. అదిప్పుడు అత్యంత అవసరమైన బంధం. 
– అపర్ణ తోట, భూమిక విమెన్స్‌ కలెక్టివ్, 
రచయిత్రి కూడా.

 

ఈ ప్రయాణం ఆగిపోకూడదు

‘నేను శాండియాగాలో ఉండి.. నువ్వు బర్మాలో ఉన్నా.. నేనొక జెలస్‌ పర్సన్‌ని పెళ్లిచేసుకున్నా.. నువ్వొక ఓవర్‌పొజెసివ్‌ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నా.. ఏ అర్ధరాత్రో నీకు నా అవసరం పడింది అంటే నేను నీ దగ్గరకి రావల్సిందే! దటిజ్‌ సిస్టర్‌హుడ్‌ అన్న మాయా ఏంజిలో కోట్‌ నాకెప్పుడూ గుర్తొస్తుంటుంది. నిజమే!తోటి మహిళలందరినీ అక్కాచెల్లెళ్లుగా భావించి వాళ్ల బాధను పంచుకోవడం, వాళ్లకోసం నిలబడ్డం కావాలిప్పుడు! ఒక్కోసారి చిన్న మాట సాయం కూడా అవతలి వాళ్లను నిలబెడుతుంది.

అలాంటివి చేయడంలో ఎప్పుడైతే ఫ్యామిలీ ఫెయిల్‌ అవుతుందో అప్పుడు మనం ఈ సిస్టర్‌హుడ్‌ కన్‌సర్న్‌ చూపించాలి. జడ్జ్‌ చేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనమున్నామనే భరోసానివ్వాలి.  పట్టుకున్న చేతులను వదిలిపెట్టకుండా తప్పొప్పులను సవరించుకుంటూ ఒకరికొకరం తోడుగా, ఒకరికొకరం అండగా నడవడాలి.

ఈ ప్రయాణం ఆగిపోకూడదు. సమాజం కులం పేరుతో  మనుషులను, మనుషుల్లో మళ్లీ ఆడవాళ్ల మ«ధ్యా విభజన గీత గీసింది. దాని ప్రభావంతో ఒకప్పుడు దళిత మహిళల మీద లైంగికదాడి జరిగితే ఇతర స్త్రీలెవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ మహిళలే బాధిత మహిళల పక్షాన నిలబడుతున్నారు. అంటే పురుషాధిపత్యం క్రియేట్‌ చేసిన కుల మత భేదాల అడ్డంకులన్నిటినీ దాటుకొని సిస్టర్‌హుడ్‌ ఇవాల్వ్‌ అవుతోందన్నట్టే కదా!   మంచి పరిణామమే.

అయినా ఇంకో వైపు భయమేస్తోంది కూడా మళ్లీ వెనక్కి వెళ్లిపోతామేమోనని.. కుల మత భేదాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే! దీనివల్ల సిస్టర్‌హుడ్‌ కూడా కచ్చితంగా ఎఫెక్ట్‌ అవుతది. కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. మరింత స్ట్రాంగ్‌ బాండ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. ఆ దిశగా మహిళలను మోటివేట్‌ చేస్తూ బాండింగ్‌ గ్రూప్స్‌ ఏర్పాటులో సహాయపడుతూ సిస్టర్‌హుడ్‌ను డెవలప్‌ చేయాల్సిన అవసరం ఫెమినిస్ట్‌లకు కూడా ఉంది.  
– దీప్తి సిర్లా, సామాజిక కార్యకర్త, 
దళిత్‌ ఫెమినిస్ట్‌ 

బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ 
చాన్నాళ్ల కిందట.. సిమీ గరేవాల్‌ చాట్‌ షోలో..
‘మిస్‌ ఇండియా పోటీలో నాతోపాటు లారా దత్తా కూడా కంటెస్టెంట్‌ అయ్యుండి కూడా తను నాకు మేకప్‌ వేసుకోవడం నేర్పించింది, ఎలా నడవాలో చూపించింది’ అని చెప్పింది ప్రియాంక చోప్రా. 

తర్వాత కొన్నాళ్లకు అదే చాట్‌ షోకి వచ్చిన లారా దత్తాతో ‘మిస్‌ ఇండియా బ్యూటీ కంటెస్ట్‌ టైమ్‌లో నువ్వు ప్రియాంక చోప్రాకు చాలా హెల్ప్‌ చేశావట కదా.. ఒకసారి ఈ షోలోనే ప్రియాంక చెప్పింది. తను నీకు పోటీ కదా? అలా ఎలా సాయం చేయగలిగావ్‌?’ అని అడిగింది సిమీ గరేవాల్‌. బదులుగా లారా  ‘పోటీలో గెలుపు కన్నా తోటి అమ్మాయికి సాయం చేశానన్న ఫీలే నాకు సంతృప్తినిస్తుంది. ఎదుటివాళ్ల ఇబ్బందిని అడ్వాంటేజ్‌గా తీసుకుని సాధించే గెలుపును ఆస్వాదించలేను. ఆ గిల్ట్‌ను మోయలేను’ అని చెప్పింది.  స్త్రీకి స్త్రీ శత్రువు కానేకాదు అని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఏం ఉంటుంది?!
చదవండి: FIFA World Cup Qatar 2022 Second Final : మెస్సీ VS ఫ్రాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement