జోరుగా హుషారుగా షికారు చేద్దామా..! | Special Story On World Tourism Day | Sakshi
Sakshi News home page

టూరు.. హుషారు

Published Sun, Sep 22 2019 9:44 AM | Last Updated on Sun, Sep 22 2019 11:45 AM

Special Story On World Tourism Day - Sakshi

• కవర్‌ స్టోరీ
విహారం కొందరికి వినోదం. మరికొందరికి విజ్ఞానం. ఇంకొందరికి విలాసం. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా విహారం ఒక అనుభవసారం. ఆధునిక వాహనాలు లేని కాలంలో విహారం వ్యయప్రయాసలతో కూడుకుని ఉండేది. ఎంతో అవసరమైతే తప్ప యాత్రలకు, పర్యటనలకు బయలుదేరే జనాలు అరుదుగా ఉండేవారు. మోటారు వాహనాలు, రైలుబళ్లు, ఓడలు, విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ప్రయోజనాల కోసం మనుషులు పర్యటనలు చేయడం పెరిగింది. క్రమంగా పర్యాటకం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది. చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు స్థాయికి ఎదిగింది. కొన్ని దేశాలైతే కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, కొండలు కోనలతో చూడచక్కని ప్రకృతి పరిసరాలు, అద్భుతమైన సముద్ర తీరాలు వంటి ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.

ఆదిమ దశలో మనుషులు సంచార జీవులు. వ్యవసాయం నేర్చుకున్న తర్వాత తమకు అనుకూలమైన ప్రదేశాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం ప్రారంభించారు. స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత మనుషుల సంచారం బొత్తిగా పరిమితమైపోయింది. తమ నివాస ప్రాంతాల పరిధిని దాటి సుదూర ప్రయాణాలు చేయవలసి అవసరం లేకుండా పోవడమే దీనికి కారణం. సుదీర్ఘకాలం మనుషులు స్థిర నివాసాలు ఉన్న ప్రాంతాల్లో నాగరికతలు ఏర్పడ్డాయి. ప్రాచీన నాగరికతలు కొనసాగుతున్న కాలంలోనూ మనుషులు పర్యటనలు చేసేవారు. అప్పట్లో అవి సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేవి. పుట్టి పెరిగిన పరిసరాలకు సుదూరంగా వెళ్లి రావడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. ప్రాచీన రోమన్‌ సామ్రాజ్యంలో సంపన్నులు నీటిబుగ్గలు, సముద్రతీరాలు ఉన్న ప్రాంతాలకు విలాసయాత్రలకు వెళ్లేవారు.

వారి సౌకర్యాల కోసం అక్కడ విడిది కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకునేవారు. ప్రాచీన ఈజిప్టు, చైనా నాగరికతల్లో కూడా సంపన్నులు, కులీనులు వినోదం కోసం యాత్రలు చేసేవారు. మతపరమైన నమ్మకాలు ఉన్నవారు మతగ్రంథాలలో వర్ణించిన ప్రదేశాలకు వెళ్లేవారు. చైనా పురాణాల్లో వర్ణించిన ‘ఐదు పవిత్ర పర్వతాల’ను ప్రాచీన చైనీస్‌ సంపన్నులు సందర్శించుకునేవారు. కొత్త కొత్త భాషలు తెలుసుకోవడానికి, కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త రుచుల వంటకాలను ఆస్వాదించడానికి, కొత్త సంస్కృతులతో పరిచయం పెంచుకోవడానికి– ఇలా వేర్వేరు కారణాలతో ప్రాచీనులు పర్యటనలపై ఆసక్తి చూపేవారు. సుదూర ప్రయాణాలు చేసే యాత్రికుల సౌకర్యం కోసం నాటి రాజులు రహదారులను, రహదారులకు చేరువలో విడిది గృహాలను కూడా నిర్మించేవారు. మధ్యయుగాల నాటికి మతాల ప్రాబల్యం పెరిగింది.

వివిధ మతాలకు చెందినవారు తమ తమ మతాలకు చెందిన పవిత్రక్షేత్రాలకు యాత్రలు చేసే పద్ధతి మొదలైంది. మన దేశంలోనైతే జనాలు ఎక్కువగా కాశీయాత్ర చేసేవారు. పురాణాల్లో వర్ణించిన పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునేవారు. పాస్‌పోర్టులు, వీసాల బెడద లేని ఆ కాలంలో కొందరు సాహసులు దేశ దేశాలను కూడా దాటి సుదూర ప్రయాణాలు చేసేవారు. దేశాంతర ప్రయాణాలకు అప్పట్లో నౌకలు అందుబాటులో ఉండేవి. అలాంటి ప్రయాణాలు చేసేవారిలో రచనా సామర్థ్యం ఉన్న కొందరు తమ ప్రయాణానుభవాలను, తాము చూసిన ప్రదేశాల వివరాలను కూడా తాము రచించిన గ్రంథాల్లో వివరంగా నమోదు చేశారు. నాటి చరిత్రకు, అప్పటి పరిస్థితులకు వారి రచనలు ఆధారంగా నిలుస్తాయి. యాత్రలు వినోద విలాసాల పరిధిని దాటి విజ్ఞాన సాధనాలుగా, అనుభవ సారాలుగా ఎదగడం మధ్యయుగాల్లోనే మొదలైంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట యూరోపియన్‌ దేశాలకు చెందిన సంపన్న విద్యార్థులు జర్మన్, ఇటలీ సహా దాదాపు యూరోప్‌ అంతటా విస్తృతంగా పర్యటించేవారు.

కళలు, సంస్కృతులు, సాంస్కృతిక పునరుజ్జీవనం వంటి అంశాలపై అధ్యయనం కోసం చేపట్టే ఈ యాత్రకు ‘గ్రాండ్‌ టూర్‌’ అనేవారు. ‘గ్రాండ్‌ టూర్‌’ అనేది అప్పటి యూరోపియన్‌ సంపన్న విద్యార్థులకు హోదా చిహ్నంగా ఉండేది. పంతొమ్మిదో శతాబ్ది వరకు కూడా యూరోపియన్‌ విద్యార్థులు ఇలా ‘గ్రాండ్‌ టూర్‌’ చేసేవారు. జేమ్స్‌ వాట్‌ ఆవిరి యంత్రం కనుగొన్న తర్వాత ఆవిరిశక్తితో నడిచే మోటారుబళ్లు వచ్చాయి. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లకు ఆవిరి ఇంజన్లతో నడిచే రైలుబళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి పర్యటనల్లో వేగం పుంజుకోవడం మొదలైంది. బ్రిటిష్‌ రవాణాసంస్థ థామస్‌ కుక్‌ అండ్‌ సన్‌ 1842లో ఏర్పాటైన తర్వాత పర్యాటకరంగం పరిశ్రమగా మారింది.

తాజ్‌మహల్‌, ఆగ్రా

పర్యాటక రంగంలో మనది వెనుకబాటే!
అత్యధిక జనాభా గల దేశాల్లో మనది రెండోస్థానం. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో మనది ఐదో స్థానం. పర్యాటక రంగంలో మాత్రం మన దేశం మొదటి పదిస్థానాల్లో ఎక్కడా చోటు దక్కించుకోలేదు. ఏటా వచ్చిపోయే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన చూసుకుంటే 2018 నాటికి భారత్‌ 34వ స్థానంలో ఉంది. అంతకు ముందు ఏడాది 40వ స్థానంలో ఉండేది. ఏడాది వ్యవధిలో కొంత మెరుగుదల సాధించినా, పర్యాటక రంగంలో భారత్‌ మరింత మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉంది. పర్యాటక రంగంలో మొదటి పది స్థానల్లో ఉన్న దేశాలు, ఆ దేశాలను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వివరాలు...

పర్యాటకంలో టాప్‌–10 దేశాలు అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య
ఫ్రాన్స్‌  8.9 కోట్లు
స్పెయిన్‌ 8.3 కోట్లు
అమెరికా 8.0 కోట్లు
చైనా 6.3 కోట్లు
ఇటలీ 6.2 కోట్లు
టర్కీ 4.6 కోట్లు
మెక్సికో 4.1 కోట్లు
జర్మనీ 3.9 కోట్లు
థాయ్‌లాండ్‌ 3.8 కోట్లు
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 3.6 కోట్లు

(వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌–2018 నివేదిక)

ఉపాధికి ఊతమిస్తున్న పర్యాటకం
పర్యాటక రంగం దేశ ఆర్థికరంగాన్ని పరిపుష్టం చేయడమే కాకుండా, చాలామంది ఉపాధికి ఊతమిస్తోంది. మన దేశంలో గత ఏడాది నాటి లెక్కల ప్రకారం పర్యాటక రంగం 4.26 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.2 శాతం మొత్తం పర్యాటక రంగం ద్వారానే సమకూరుతోంది. గత ఏడాది నాటికి భారత పర్యాటక రంగం ద్వారా రూ. 16 లక్షల కోట్ల ఆదాయం లభించింది. మరో పదేళ్లలో– అంటే, 2029 నాటికి పర్యాటక రంగం ఆదాయం రూ.35 లక్షల కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ‘స్వదేశ్‌ దర్శన్‌’, ‘ప్రసాద్‌’ పథకాలతో పాటు స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి ‘ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌’ (ఉడాన్‌) పథకాన్ని ప్రారంభించింది. భారత పర్యాటక రంగం ప్రస్తుతం 6.9 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది. గత ఏడాది దాదాపు కోటి మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చి వెళ్లారు.

ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు సందర్శించుకునే ప్రదేశాలు ఏవంటే..
ఆగ్రా:
భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువమంది ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను తప్పనిసరిగా సందర్శించుకుంటున్నారు. ప్రపంచంలోని ఏడువింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను చూడటమే లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు కూడా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. తాజ్‌మహల్‌ చూడటానికి వచ్చే పర్యాటకులు ఆగ్రాలోను, చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించుకుని వెళుతున్నారు. ఆగ్రాలోను, ఆగ్రా పరిసరాల్లోని ఆగ్రా కోట, మొఘల్‌ గార్డెన్స్, జమా మసీదు, మోతీ మసీదు, సికింద్రా కోట, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ప్రదేశాలకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.

ఢిల్లీ: ఆగ్రా తర్వాత భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల తాకిడి ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీని చూడటానికి విదేశీయులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడి చారిత్రక కట్టడాలైన ఇండియా గేట్, ఎర్రకోట, కుతుబ్‌ మీనార్, లోటస్‌ టెంపుల్, అక్షర్‌ధామ్, రాష్ట్రపతి భవన్, పురానా ఖిల్లా వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ ఎన్నికలను తిలకించడానికి ప్రత్యేకంగా వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య గడచిన పదేళ్లలో బాగా పెరిగింది. ఎన్నికల సమయంలో భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు ముఖ్యంగా ఢిల్లీలోనే మకాం వేసి, ఇక్కడి ఎన్నికల తతంగాన్ని పరిశీలించడానికి ఆసక్తి చూపుతుంటారు.

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని అయిన జైపూర్‌ నగరానికి కూడా విదేశీ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. ‘పింక్‌ సిటీ’గా పేరు పొందిన జైపూర్‌ నగరంలో రాజపుత్రుల గత వైభవానికి నిదర్శనంగా నిలిచే చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు అమితంగా ఆసక్తిని చూపుతుంటారు. ఇక్కడి హవా మహల్, అంబర్‌ కోట, జంతర్‌ మంతర్‌ వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.

హంపి: దక్షిణాదిని సందర్శించుకునే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు కర్ణాటకలోని హంపిని తప్పనిసరిగా సందర్శించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడి పురాతన చారిత్రక శిథిల నిర్మాణాలు, విరూపాక్ష ఆలయం వంటి ప్రాచీన ఆలయాలతో పాటు ఆర్కియలాజికల్‌ మ్యూజియం, పాత రాజప్రాసాదం వంటి ప్రదేశాలను సందర్శించుకుని వెళుతుంటారు.

గోవా: భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో సముద్రతీరంలో విలాసంగా సేదదీరాలనుకునే వారు ఎక్కువగా గోవాకు వస్తుంటారు. విందు వినోదాలకు కొదువలేని గోవా ‘పార్టీ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందింది. ఇక్కడ దొరికే సంప్రదాయ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, క్యాసినోల్లో పార్టీలు చేసుకోవడానికి ఇక్కడకు వచ్చే విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. పోర్చుగీసుల కాలం నాటి చర్చిలు, పురాతన నిర్మాణాలను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను తిలకించడానికి కూడా ఆసక్తి చూపుతారు.

ముంబై: భారత్‌ వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపే ప్రదేశాల్లో ముంబై కూడా ఒకటి. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై హిందీ సినీ పరిశ్రమకు కూడా కేంద్రం. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు విక్టోరియా టెర్మినస్, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, హజీ అలీ దర్గా, ఫిలింసిటీ వంటి ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించడానికి ఇష్టపడతారు. జనసమ్మర్దంతో కిక్కిరిసి ఉండే ధారవి వంటి ముంబై మురికివాడల్లో సంచరించడానికి కూడా కొందరు విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు.

మైసూరు: దక్షిణాది వచ్చే పర్యాటకుల్లో విదేశీయులను అమితంగా ఆకట్టుకునే నగరం మైసూరు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అద్భుతమైన చారిత్రక కట్టడాలను విదేశీ పర్యాటకులు అమితంగా ఇష్టపడతారు. మైసూరు ప్యాలెస్, బృందావన్‌ గార్డెన్స్, మైసూర్‌ సాండ్‌ స్కల్ప్చర్‌ మ్యూజియం, కరంజి సరోవరం వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ ఏటా వైభవోపేతంగా జరిగే దసరా వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు.

వారణాసి: ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసి ‘భారత ఆధ్యాత్మిక రాజధాని’గా పేరుపొందింది. గంగాతీరంలో వెలసిన కాశీ క్షేత్రం నిరంతరం తీర్థయాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భారత ఆధ్యాత్మిక జీవనశైలిపై ఆసక్తి గల విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది తప్పనిసరిగా వారణాసిని సందర్శిస్తుంటారు. ఇక్కడి విశ్వేశర ఆలయం, అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలను, గంగాతీరంలోని స్నానఘట్టాల వద్ద భక్తుల కోలాహలాన్ని తిలకించడాన్ని ఇష్టపడతారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌: ఈశాన్య భారత్‌లో విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించుకునే రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌. దేశంలోనే అతిపెద్ద బౌద్ధారామమైన ‘త్వాంగ్‌’ బౌద్ధారామాన్ని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే బౌద్ధులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి కొండలు, కోనలతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించిపోతుంటారు. అరుణాచల్‌ రాజధాని ఇటానగర్‌లోని పురాతనమైన ఇటా కోట, మ్యూజియం, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంటి ప్రదేశాల్లో విదేశీయుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.

కేరళ:  ‘దేవుడి స్వదేశం’గా ప్రాచుర్యం పొందిన కేరళకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువే. దక్షిణాదిలో విదేశీయులను అత్యధికంగా ఆకట్టుకునే రాష్ట్రంగా కేరళనే చెప్పుకోవచ్చు. తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో పురాతన కట్టడాలు, ఆలయాలను సందర్శించుకోవడానికి, వాయనాడ్‌లోని కొండ కోనల్లోను, కొల్లాం వంటి సముద్ర తీరాల్లో సేదదీరడానికి మాత్రమే కాదు, ఆయుర్వేద చికిత్సల కోసం కూడా పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు కేరళకు వస్తుంటారు. కేరళలోని పచ్చని పరిసరాలతో పాటు ఇక్కడ అందుబాటులో ఉండే సంప్రదాయక పంచకర్మ ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement