best tourist destination
-
‘గాజుల పూసల పల్లి’... గాజుల పోచంపల్లి.. ఇప్పుడేమో!
Pochampally: Best Tourism Village India Silk City Interesting Facts Old Name Etc: ఊరంటే.. చెట్టు, చేమ.. పుట్ట, గుట్ట.. మళ్లు, మడుగులు..చెరువులు, చెలకలు.. పాడి, పశువులు.. బడి, గుడి.. వాటితో పెనవేసుకున్న మనుషులు! విషయం ఇంతే అయితే ఆ ఊరు ఉనికి పొలిమేరతోనే ఆగిపోతుంది! ఆ పల్లె ఓ ఆదర్శాన్ని ఆచరణలో పెడితే.. అరుదైన కళను పడుగు – పేకల్లో పేర్చుతుంటే ఆ ప్రత్యేకతే అస్తిత్వమై అవధులు దాటుతుంది.. ప్రపంచ పటంలో రంగులీనుతుంది!! ఆ ఆదర్శం.. భూదానం.. ఆ కళ.. ఇక్కత్.. కలిస్తే భూదాన్ పోచంపల్లి.. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా!! ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్చే ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా గౌరవం దక్కించుకుంది!! ఇక్కడ పోచంపల్లి ప్రస్తావనకు ప్రాసంగిత అదే!! హైదరాబాద్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోచంపల్లి. వస్త్రనేతకు ఆలవాలం కాకముందు గాజులు, పూసల తయారీకి ప్రసిద్ధీ పల్లే. అందుకే ‘గాజుల పూసల పల్లి’గా పేరు. రానూరానూ పలకడంలో గాజుల పోచంపల్లి అయింది. పేరునిచ్చిన భూదానం ఇది 1951 నాటి ముచ్చట. గాంధీజీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయం. సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్ ఆహ్వానం మేరకు ఆ ఏడు ఏప్రిల్15న హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. అప్పుడే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి కాలినడకన బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం దళితవాడంతా తిరిగి ఆ రాత్రి పీర్లకొట్టం (ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు (ఏప్రిల్ 18న) చెరువు సమీపంలోనున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే వినోబాభావే స్పందిస్తూ ‘మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా?’ అని అడిగారు. ఆ తక్షణమే..అక్కడే ఉన్న పోచంపల్లి వాసి వెదిరె రామచంద్రారెడ్డి లేచి ‘నా తండ్రి జ్ఞాపకార్థం వంద ఎకరాల భూమిని దానం చేస్తా’నని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి అదే సభలో వినోబాభావేకు అందించారు. దానరూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి దేశవ్యాప్తమైంది. గాజుల పోచంపల్లిని ‘భూదాన్ పోచంపల్లి’గా మార్చింది..1993లో గెజిట్ ద్వారా ఆ పేరు స్థిరమైంది. పోచంపల్లిని వినోబాభావే 1956లోనూ సందర్శించారు. భూదానోద్యమానికి తనను కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని ఆయన ‘భూదాన గంగోత్రి’గా అభివర్ణిస్తూ ఆ ఊరిని తన రెండో జన్మస్థలంగా పేర్కొన్నారు. నేతను కట్టుకుంది.. అసఫ్‌జాహీల పాలనా కాలం నాటికే లడీల హల్‌చల్‌ని కంటూ మగ్గాల సవ్వడిని వింటూ ఉంది పోచంపల్లి. అద్భుతమైన వస్త్రనేత కళాకారులకు పీటవేసింది. 1910 నాటికే ఇక్కడ చిటికి పరిశ్రమ ఏర్పడింది. ఇరవై నంబరు నూలుతో ‘తేలియా రుమాళ్ల’ను నేసేవారు. వ్యాపార నిమిత్తం హైదారాబాద్‌కు వచ్చిపోయే అరబ్బులు వీటిని చూసి ఇష్టపడి కొనుగోలు చేసేవారు. ఆ డిమాండ్‌తో తేలియా రుమాళ్లను అరబ్బు దేశాలకు ఎగుమతి చేయడమూ ప్రారంభించారు. పట్టునూ పట్టుకుంది తొలుత తేలియా రుమాళ్లు, కాటన్ వస్త్రాలు మాత్రమే పోచంపల్లి పేటెంట్గా ఉండేవి. తర్వాత ఈ ఊరికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరి అనే చేనేత కళాకారులు 60 నెంబరు నూలుతో పడుగు, పేకలతో సహజరంగుల్లో చీరలనూ నేశారు. 1956లో పోచంపల్లిని సందర్శించిన ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డ్ ప్రెసిడెంట్ కమలాబాయి ఛటోపాధ్యాయ, చిన్నతరహా పరిశ్రమల డైరక్టర్ దయారాం కాటన్ చీరల మాదిరిగానే పట్టు చీరలను తయారు చేయమని కోరారు. వారి కోరిక మేరకు అనంతరాములు, పెద్దయాదగిరి ఇద్దరూ బనారస్‌కు వెళ్లి అక్కడ ఏడాది పాటు శిక్షణ తీసుకొన్నారు. అనంతరం అనంతరాములుతో పాటు భిక్షపతి, కర్నాటి వాసుదేవ్ కుంభకోణం వెళ్లి రంగుల అద్దకంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత పోచంపల్లికి తిరిగి వచ్చి.. మొట్టమొదటిసారిగా 1958లో మగ్గంపై పట్టు చీరను నేశాడు అనంతరాములు. దాంతో పట్టు పరిశ్రమకూ పోగును సవరించుకుంది పోచంపల్లి. ఇక్కత్‌ను బ్రాండ్ వాల్యూగా మార్చుకుంది. ఈ నేత కళకు ప్రభుత్వం 2004లో పెటెంట్ హక్కునూ (జియోగ్రాఫికల్ ఆఫ్ గూడ్స్) కల్పించింది. చేతివృత్తుల ఎంపోరియం ప్రతినిధి నాయుడమ్మ.. పోచంపల్లిలో తయారైన ఇక్కత్ వస్త్రాల మార్కెటింగ్‌కు అవకాశాలను కల్పించాడు. అలా పట్టు చీరల తయారీలో తమదైన నేత, అద్దకంతో 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. కాలానికనుగుణంగా పోచంపల్లిలో నేత కార్మికులు.. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. మల్లేశం కనిపెట్టిన ఆసుయంత్రం ఇక్కడ పెద్ద విప్లవమనే చెప్పొచ్చు. దాని రాకతో నేత విషయంలో మహిళలకు పనిభారం చాలా తగ్గింది. ఒక్క ఆసుయంత్రం రోజుకు అయిదారు చీరలకు సరిపోను చిటికి పోస్తుంది. యంత్రం లేకపోతే రెండు చీరల కంటే ఎక్కువ పోయలేరు. అలాగే కండెలు చుట్టే యంత్రాలూ వచ్చాయి. వీటన్నిటి వల్ల వస్త్రోత్పత్తి గణనీయంగా పెరిగింది. విస్తృతమైన మార్కెట్ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరిగింది. దాంతో అన్నివర్గాల ప్రజలూ పర్యావరణ హితమైన చేనేత వస్త్రాలను ధరించడానికే మక్కువ కనబరుస్తున్నారు. బహుళజాతి కంపెనీలైన అమెజాన్, వీవ్‌మార్ట్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి చేనేత వస్త్రాలకు ఆన్లైన్లో అంతర్జాతీయ మార్కెట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా పేటీఎం, సొంత వెబ్సైట్ల ద్వారా పోచంపల్లి చేనేత సహకార సంఘమూ ఈ–మార్కెటింగ్‌ను మొదలుపెట్టింది. అలాగే ఔత్సాహిక యువతా వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను చేనేత వస్త్రాల మార్కెట్‌కు వేదికగా మలచింది. ఈ నూతన ఒరవడితో నెలలో ఒక్క పోచంపల్లిలోనే రూ. 3కోట్ల మేర టర్నోవర్ అవుతుందని అంచనా. వైట్ హౌస్‌లో పోచంపల్లి రెపరెపలు చీరలతో పాటు ఇక్కడ ఉత్పత్తి అయ్యే డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజాయ్లు, స్టోల్స్, స్కార్ఫ్స్, దుపట్టాలు, కర్టెన్స్, బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, దివాన్సెట్స్, సోఫా కవర్స్, హ్యాండ్ బ్యాగులు, క్యారీ బ్యాగ్స్ తదితర వెరైటీలకు స్వదేశంలోను, విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. ముఖ్యంగా సూడాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, దుబాయ్ వంటి దేశాల్లో మహిళలు ధరించే స్కార్ఫ్స్ను ఇక్కడే ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడి అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరోప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. విదేశాల్లో జరిగే వస్త్ర ప్రదర్శనల్లో పోచంపల్లి ఇక్కత్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలోని వైట్‌హౌస్, జపాన్, రష్యా అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్లనే వినియోగిస్తున్నారంటే ఇక్కడి చేనేత కళానైపుణ్యం ఎంతటిదో అర్థంచేసుకోవచ్చు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇక్కడి చేనేత చీరలను ధరించినవారే. పర్యాటకానికీ రంగులు అద్దింది.. పాఠ్యాంశంగా అచ్చయింది తనకే ప్రత్యేకమైన నేత ఈ ప్రాంతానికి ఓ నేపథ్యాన్ని అద్దితే.. వినోభాబావే సందర్శన ఆయన మాటతో వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం ఈ ఊరికి చారిత్రక ప్రాశస్త్యాన్ని కల్పించింది. ఈ రెండిటి ఘనత నాటి నుంచే పోచంపల్లిని సహజంగానే ఓ పర్యాటక పల్లెగా మలచింది. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం వచ్చిపోయే వ్యాపారులు, కొనుగోలుదారులతోపాటు ఆచార్య వినోబాభావే నడియాడిన నేల, ఆయన కూర్చున్న జువ్విచెట్టు, ఆయన బస (వినోబాభావే మందిరం) చేసిన చోటు, సంతానప్రాప్తికోసం నిర్మించిన 101 దర్వాజాల భవనాన్ని సందర్శించడానికీ దూరదూరాల నుంచి జనం వస్తూండడంతో పర్యాటక ప్రాంతంగా కిటకిటలాడుతుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే 2007లో రూ.3.75 కోట్ల వ్యయంతో ఇక్కడ గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అప్పటి కేంద్ర పర్యాటక శాఖామంత్రి అంబికా సోని, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి దీనిని ప్రారంభించారు. ఇందులో ఆంఫి థియేటర్, చేనేత హస్తకళల మ్యూజియం, షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్, గెస్ట్‌హౌస్, బోటింగ్ సౌకర్యాలను కల్పించారు. అమెరికా, రష్యా, చైనా, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సూడాన్, నైజీరియా, ఈజిప్ట్, ఇటలీ, ఉగాండా, ఘనా, మలేషియా మొదలు వందకు పైగా దేశాలకు చెందిన ఎంతోమంది విదేశీయులు, విదేశీ అధికారులు పోచంపల్లి సందర్శనకు వచ్చారు.. వస్తున్నారు. ట్రైనీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులూ ఈ చేనేత పల్లెలో పర్యటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఫ్యాషన్ డిజైనర్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులూ స్టడీటూర్‌లో భాగంగా సందర్శనకు వస్తుంటారు. మన పాఠ్యపుస్తకాలలో పోచంపల్లి ఇక్కత్‌ను పాఠ్యాంశంగా చేర్చడంతో ప్రత్యక్షంగా ఈ ఊరిని చూడ్డానికి వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులూ ఇక్కడికి వస్తుంటారు. మనకే కాదు పోచంపల్లి విదేశీయులకూ ఓ అధ్యయన కేంద్రంగా మారింది. ముఖ్యంగా వారు భూదానోద్యమ చరిత్ర, చేనేత, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, మహిళా సంఘాల నిర్వహణ, వ్యవసాయం, ఇక్కడి ప్రజల సంస్కృతీసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలను అధ్యయనం చేయడానికి తరచుగా వస్తుంటారిక్కడికి. పోచంపల్లి హైద్రాబాద్‌కు చేరువలో ఉండటం కూడా పర్యటనకు ఈజీ అయింది.. పర్యాటకులకు అనుకూలంగా మారింది. మేళాలతో ఉత్సాహం... గతంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచంపల్లి టూరిజం పార్కులో మూడు రోజుల పాటు మేళాను ఏర్పాటు చేశారు. ఇందులో చేనేత వస్త్రాల ప్రదర్శన, హ్యాండిక్రాప్ట్ ప్రదర్శన, గ్రామీణ వంటకాల రుచులు, గ్రామీణ కళలో భాగంగా గంగిరెద్దుల ఆట, డప్పుకళాకారుల ఆటాపాటా, ఒగ్గు కళారూపాలను ప్రదర్శించారు. ఈ మేళా ప్రతి ఏటా కొనసాగితే బాగుంటుందని పర్యాటకుల అభిప్రాయం. ఆకట్టుకున్న ఫ్యాషన్‌షోలు... పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పిండంతో పాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి స్థానిక టూరిజం పార్కులో 2008లో ఫ్యాషన్‌షోను నిర్వహించారు. ప్రముఖ నటి శోభనతో పాటు పలువురు మోడల్స్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించి పర్యాటకులను ఆకట్టుకొన్నారు. 2018లో కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యాషన్‌షో నిర్వహించారు. ఇందులో మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రశ్మి ఠాకూర్‌తో పాటు ప్రముఖ ప్యాషన్ డిజైనర్లు తాము రూపొందించిన ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించారు. అభివృద్ధిని మరచింది డిసెంబర్ 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే 24వ మహాసభల సమావేశంలో ‘బెస్ట్ టూరిజం విలేజ్’ పురస్కారాన్ని అందుకోనుంది పోచంపల్లి. ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కించుకున్న ఈ ఊరికి పర్యాటక కేంద్రంగా గొప్ప వైభవం వస్తుందనే ఆశతో ఉన్నారు స్థానికులు. ఇప్పటి వరకు పర్యాటక శాఖ ఆదాయాలపైనే శ్రద్ధ పెట్టి.. అభివృద్ధిని మరచింది. దాంతో ప్రస్తుతం గ్రామీణ పర్యాటక కేంద్రం వెలవెల బోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దీన్నో సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం.. సినిమా షూటింగ్‌లకూ.. ఎటూ చూసినా పచ్చని పంట పొలాలు, చెరువులు, గుట్టలతో అందమైన లోకేషన్లు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో సినిమా షూటింగ్‌లకూ కేరాఫ్‌గా మారింది పోచంపల్లి. ఆ షూటింగ్‌లకు మొదట క్లాప్ కొట్టి.. యాక్షన్ చెప్పింది ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్.. 1986లో.. ఆ సినిమా పేరు సుస్మాన్. షూటింగ్ కోసం దర్శకుడు శ్యామ్ బెనెగల్ సరే.. హీరోయిన్ షబానా ఆజ్మీ సహా ఆ యూనిట్ మొత్తం పోచంపల్లిలోనే బస చేశారట.. నెలరోజులకు పైనే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ సినిమా షూటింగ్ అయిపోయేలోపు షబానా ఆజ్మీ, హీరో ఓంపురి ఇద్దరూ బట్టలు నేయడం నేర్చుకోవడం. ఓంపురి ఓ కుర్తా గుడ్డ నేసి షబానాకు ప్రెజెంట్ కూడా చేశాడట. అలా సుస్మాన్ మొదలు నేటి వరకు ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాలు, పలు సీరియల్, డాక్యుమెంటరీల షూటింగ్‌లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. హీరో మహేశ్‌బాబు నటించిన ‘అతిథి’, పవన్‌కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’, వెంకటేశ్ నటించిన ‘వెంకీమామ’, అల్లుఅర్జున్ ‘వేదం’, ‘వరుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, ‘సాంబ’, విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’, నితిన్ ‘అ,ఆ’, శర్వానంద్ ‘మహానుభావుడు’, వరుణ్‌తేజ్ నటించిన ‘లోఫర్’, సాయిధరమ్ తేజ ‘ప్రతిరోజు పండగే’, మమ్ముట్టి ‘యాత్ర’, శ్రీకాంత్ నటించిన ‘రంగా ది దొంగ’, ఎన్. శంకర్ ‘ జై బోలో తెలంగాణ’, సునీల్ ‘భీమవరం బుల్లోడు’, ‘ఉంగరాల రాంబాబు’, ఇటీవల విడుదలైన నాని ‘టక్ జగదీశ్’, ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమాల షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. -ఎమ్ఏ షరీఫ్ చదవండి: Matilda Kullu: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..? -
జోరుగా హుషారుగా షికారు చేద్దామా..!
• కవర్ స్టోరీ విహారం కొందరికి వినోదం. మరికొందరికి విజ్ఞానం. ఇంకొందరికి విలాసం. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా విహారం ఒక అనుభవసారం. ఆధునిక వాహనాలు లేని కాలంలో విహారం వ్యయప్రయాసలతో కూడుకుని ఉండేది. ఎంతో అవసరమైతే తప్ప యాత్రలకు, పర్యటనలకు బయలుదేరే జనాలు అరుదుగా ఉండేవారు. మోటారు వాహనాలు, రైలుబళ్లు, ఓడలు, విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ప్రయోజనాల కోసం మనుషులు పర్యటనలు చేయడం పెరిగింది. క్రమంగా పర్యాటకం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది. చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరు స్థాయికి ఎదిగింది. కొన్ని దేశాలైతే కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, కొండలు కోనలతో చూడచక్కని ప్రకృతి పరిసరాలు, అద్భుతమైన సముద్ర తీరాలు వంటి ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఆదిమ దశలో మనుషులు సంచార జీవులు. వ్యవసాయం నేర్చుకున్న తర్వాత తమకు అనుకూలమైన ప్రదేశాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం ప్రారంభించారు. స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత మనుషుల సంచారం బొత్తిగా పరిమితమైపోయింది. తమ నివాస ప్రాంతాల పరిధిని దాటి సుదూర ప్రయాణాలు చేయవలసి అవసరం లేకుండా పోవడమే దీనికి కారణం. సుదీర్ఘకాలం మనుషులు స్థిర నివాసాలు ఉన్న ప్రాంతాల్లో నాగరికతలు ఏర్పడ్డాయి. ప్రాచీన నాగరికతలు కొనసాగుతున్న కాలంలోనూ మనుషులు పర్యటనలు చేసేవారు. అప్పట్లో అవి సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేవి. పుట్టి పెరిగిన పరిసరాలకు సుదూరంగా వెళ్లి రావడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో సంపన్నులు నీటిబుగ్గలు, సముద్రతీరాలు ఉన్న ప్రాంతాలకు విలాసయాత్రలకు వెళ్లేవారు. వారి సౌకర్యాల కోసం అక్కడ విడిది కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకునేవారు. ప్రాచీన ఈజిప్టు, చైనా నాగరికతల్లో కూడా సంపన్నులు, కులీనులు వినోదం కోసం యాత్రలు చేసేవారు. మతపరమైన నమ్మకాలు ఉన్నవారు మతగ్రంథాలలో వర్ణించిన ప్రదేశాలకు వెళ్లేవారు. చైనా పురాణాల్లో వర్ణించిన ‘ఐదు పవిత్ర పర్వతాల’ను ప్రాచీన చైనీస్ సంపన్నులు సందర్శించుకునేవారు. కొత్త కొత్త భాషలు తెలుసుకోవడానికి, కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త రుచుల వంటకాలను ఆస్వాదించడానికి, కొత్త సంస్కృతులతో పరిచయం పెంచుకోవడానికి– ఇలా వేర్వేరు కారణాలతో ప్రాచీనులు పర్యటనలపై ఆసక్తి చూపేవారు. సుదూర ప్రయాణాలు చేసే యాత్రికుల సౌకర్యం కోసం నాటి రాజులు రహదారులను, రహదారులకు చేరువలో విడిది గృహాలను కూడా నిర్మించేవారు. మధ్యయుగాల నాటికి మతాల ప్రాబల్యం పెరిగింది. వివిధ మతాలకు చెందినవారు తమ తమ మతాలకు చెందిన పవిత్రక్షేత్రాలకు యాత్రలు చేసే పద్ధతి మొదలైంది. మన దేశంలోనైతే జనాలు ఎక్కువగా కాశీయాత్ర చేసేవారు. పురాణాల్లో వర్ణించిన పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకునేవారు. పాస్‌పోర్టులు, వీసాల బెడద లేని ఆ కాలంలో కొందరు సాహసులు దేశ దేశాలను కూడా దాటి సుదూర ప్రయాణాలు చేసేవారు. దేశాంతర ప్రయాణాలకు అప్పట్లో నౌకలు అందుబాటులో ఉండేవి. అలాంటి ప్రయాణాలు చేసేవారిలో రచనా సామర్థ్యం ఉన్న కొందరు తమ ప్రయాణానుభవాలను, తాము చూసిన ప్రదేశాల వివరాలను కూడా తాము రచించిన గ్రంథాల్లో వివరంగా నమోదు చేశారు. నాటి చరిత్రకు, అప్పటి పరిస్థితులకు వారి రచనలు ఆధారంగా నిలుస్తాయి. యాత్రలు వినోద విలాసాల పరిధిని దాటి విజ్ఞాన సాధనాలుగా, అనుభవ సారాలుగా ఎదగడం మధ్యయుగాల్లోనే మొదలైంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట యూరోపియన్ దేశాలకు చెందిన సంపన్న విద్యార్థులు జర్మన్, ఇటలీ సహా దాదాపు యూరోప్ అంతటా విస్తృతంగా పర్యటించేవారు. కళలు, సంస్కృతులు, సాంస్కృతిక పునరుజ్జీవనం వంటి అంశాలపై అధ్యయనం కోసం చేపట్టే ఈ యాత్రకు ‘గ్రాండ్ టూర్’ అనేవారు. ‘గ్రాండ్ టూర్’ అనేది అప్పటి యూరోపియన్ సంపన్న విద్యార్థులకు హోదా చిహ్నంగా ఉండేది. పంతొమ్మిదో శతాబ్ది వరకు కూడా యూరోపియన్ విద్యార్థులు ఇలా ‘గ్రాండ్ టూర్’ చేసేవారు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం కనుగొన్న తర్వాత ఆవిరిశక్తితో నడిచే మోటారుబళ్లు వచ్చాయి. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లకు ఆవిరి ఇంజన్లతో నడిచే రైలుబళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి పర్యటనల్లో వేగం పుంజుకోవడం మొదలైంది. బ్రిటిష్ రవాణాసంస్థ థామస్ కుక్ అండ్ సన్ 1842లో ఏర్పాటైన తర్వాత పర్యాటకరంగం పరిశ్రమగా మారింది. తాజ్‌మహల్, ఆగ్రా పర్యాటక రంగంలో మనది వెనుకబాటే! అత్యధిక జనాభా గల దేశాల్లో మనది రెండోస్థానం. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో మనది ఐదో స్థానం. పర్యాటక రంగంలో మాత్రం మన దేశం మొదటి పదిస్థానాల్లో ఎక్కడా చోటు దక్కించుకోలేదు. ఏటా వచ్చిపోయే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన చూసుకుంటే 2018 నాటికి భారత్ 34వ స్థానంలో ఉంది. అంతకు ముందు ఏడాది 40వ స్థానంలో ఉండేది. ఏడాది వ్యవధిలో కొంత మెరుగుదల సాధించినా, పర్యాటక రంగంలో భారత్ మరింత మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉంది. పర్యాటక రంగంలో మొదటి పది స్థానల్లో ఉన్న దేశాలు, ఆ దేశాలను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వివరాలు... పర్యాటకంలో టాప్–10 దేశాలు అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఫ్రాన్స్ 8.9 కోట్లు స్పెయిన్ 8.3 కోట్లు అమెరికా 8.0 కోట్లు చైనా 6.3 కోట్లు ఇటలీ 6.2 కోట్లు టర్కీ 4.6 కోట్లు మెక్సికో 4.1 కోట్లు జర్మనీ 3.9 కోట్లు థాయ్‌లాండ్ 3.8 కోట్లు యునైటెడ్ కింగ్డమ్ 3.6 కోట్లు (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్–2018 నివేదిక) ఉపాధికి ఊతమిస్తున్న పర్యాటకం పర్యాటక రంగం దేశ ఆర్థికరంగాన్ని పరిపుష్టం చేయడమే కాకుండా, చాలామంది ఉపాధికి ఊతమిస్తోంది. మన దేశంలో గత ఏడాది నాటి లెక్కల ప్రకారం పర్యాటక రంగం 4.26 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.2 శాతం మొత్తం పర్యాటక రంగం ద్వారానే సమకూరుతోంది. గత ఏడాది నాటికి భారత పర్యాటక రంగం ద్వారా రూ. 16 లక్షల కోట్ల ఆదాయం లభించింది. మరో పదేళ్లలో– అంటే, 2029 నాటికి పర్యాటక రంగం ఆదాయం రూ.35 లక్షల కోట్లకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ‘స్వదేశ్ దర్శన్’, ‘ప్రసాద్’ పథకాలతో పాటు స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ (ఉడాన్) పథకాన్ని ప్రారంభించింది. భారత పర్యాటక రంగం ప్రస్తుతం 6.9 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది. గత ఏడాది దాదాపు కోటి మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చి వెళ్లారు. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు సందర్శించుకునే ప్రదేశాలు ఏవంటే.. ఆగ్రా: భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువమంది ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను తప్పనిసరిగా సందర్శించుకుంటున్నారు. ప్రపంచంలోని ఏడువింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను చూడటమే లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు కూడా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. తాజ్‌మహల్ చూడటానికి వచ్చే పర్యాటకులు ఆగ్రాలోను, చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించుకుని వెళుతున్నారు. ఆగ్రాలోను, ఆగ్రా పరిసరాల్లోని ఆగ్రా కోట, మొఘల్ గార్డెన్స్, జమా మసీదు, మోతీ మసీదు, సికింద్రా కోట, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ప్రదేశాలకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఢిల్లీ: ఆగ్రా తర్వాత భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల తాకిడి ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీని చూడటానికి విదేశీయులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడి చారిత్రక కట్టడాలైన ఇండియా గేట్, ఎర్రకోట, కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, అక్షర్ధామ్, రాష్ట్రపతి భవన్, పురానా ఖిల్లా వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ ఎన్నికలను తిలకించడానికి ప్రత్యేకంగా వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య గడచిన పదేళ్లలో బాగా పెరిగింది. ఎన్నికల సమయంలో భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు ముఖ్యంగా ఢిల్లీలోనే మకాం వేసి, ఇక్కడి ఎన్నికల తతంగాన్ని పరిశీలించడానికి ఆసక్తి చూపుతుంటారు. జైపూర్: రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నగరానికి కూడా విదేశీ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. ‘పింక్ సిటీ’గా పేరు పొందిన జైపూర్ నగరంలో రాజపుత్రుల గత వైభవానికి నిదర్శనంగా నిలిచే చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు అమితంగా ఆసక్తిని చూపుతుంటారు. ఇక్కడి హవా మహల్, అంబర్ కోట, జంతర్ మంతర్ వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. హంపి: దక్షిణాదిని సందర్శించుకునే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు కర్ణాటకలోని హంపిని తప్పనిసరిగా సందర్శించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడి పురాతన చారిత్రక శిథిల నిర్మాణాలు, విరూపాక్ష ఆలయం వంటి ప్రాచీన ఆలయాలతో పాటు ఆర్కియలాజికల్ మ్యూజియం, పాత రాజప్రాసాదం వంటి ప్రదేశాలను సందర్శించుకుని వెళుతుంటారు. గోవా: భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో సముద్రతీరంలో విలాసంగా సేదదీరాలనుకునే వారు ఎక్కువగా గోవాకు వస్తుంటారు. విందు వినోదాలకు కొదువలేని గోవా ‘పార్టీ కేపిటల్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందింది. ఇక్కడ దొరికే సంప్రదాయ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, క్యాసినోల్లో పార్టీలు చేసుకోవడానికి ఇక్కడకు వచ్చే విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. పోర్చుగీసుల కాలం నాటి చర్చిలు, పురాతన నిర్మాణాలను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను తిలకించడానికి కూడా ఆసక్తి చూపుతారు. ముంబై: భారత్ వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపే ప్రదేశాల్లో ముంబై కూడా ఒకటి. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై హిందీ సినీ పరిశ్రమకు కూడా కేంద్రం. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు విక్టోరియా టెర్మినస్, గేట్ వే ఆఫ్ ఇండియా, హజీ అలీ దర్గా, ఫిలింసిటీ వంటి ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించడానికి ఇష్టపడతారు. జనసమ్మర్దంతో కిక్కిరిసి ఉండే ధారవి వంటి ముంబై మురికివాడల్లో సంచరించడానికి కూడా కొందరు విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతారు. మైసూరు: దక్షిణాది వచ్చే పర్యాటకుల్లో విదేశీయులను అమితంగా ఆకట్టుకునే నగరం మైసూరు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అద్భుతమైన చారిత్రక కట్టడాలను విదేశీ పర్యాటకులు అమితంగా ఇష్టపడతారు. మైసూరు ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, మైసూర్ సాండ్ స్కల్ప్చర్ మ్యూజియం, కరంజి సరోవరం వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ ఏటా వైభవోపేతంగా జరిగే దసరా వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు. వారణాసి: ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసి ‘భారత ఆధ్యాత్మిక రాజధాని’గా పేరుపొందింది. గంగాతీరంలో వెలసిన కాశీ క్షేత్రం నిరంతరం తీర్థయాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భారత ఆధ్యాత్మిక జీవనశైలిపై ఆసక్తి గల విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది తప్పనిసరిగా వారణాసిని సందర్శిస్తుంటారు. ఇక్కడి విశ్వేశర ఆలయం, అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలను, గంగాతీరంలోని స్నానఘట్టాల వద్ద భక్తుల కోలాహలాన్ని తిలకించడాన్ని ఇష్టపడతారు. అరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారత్‌లో విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. దేశంలోనే అతిపెద్ద బౌద్ధారామమైన ‘త్వాంగ్’ బౌద్ధారామాన్ని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే బౌద్ధులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి కొండలు, కోనలతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించిపోతుంటారు. అరుణాచల్ రాజధాని ఇటానగర్‌లోని పురాతనమైన ఇటా కోట, మ్యూజియం, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంటి ప్రదేశాల్లో విదేశీయుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. కేరళ: ‘దేవుడి స్వదేశం’గా ప్రాచుర్యం పొందిన కేరళకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువే. దక్షిణాదిలో విదేశీయులను అత్యధికంగా ఆకట్టుకునే రాష్ట్రంగా కేరళనే చెప్పుకోవచ్చు. తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో పురాతన కట్టడాలు, ఆలయాలను సందర్శించుకోవడానికి, వాయనాడ్‌లోని కొండ కోనల్లోను, కొల్లాం వంటి సముద్ర తీరాల్లో సేదదీరడానికి మాత్రమే కాదు, ఆయుర్వేద చికిత్సల కోసం కూడా పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు కేరళకు వస్తుంటారు. కేరళలోని పచ్చని పరిసరాలతో పాటు ఇక్కడ అందుబాటులో ఉండే సంప్రదాయక పంచకర్మ ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
సెయింట్ పీటర్స్ బర్గ్ కు వరల్డ్ ట్రావెల్ అవార్డ్
యూరప్ లోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా ఎంపికైన సెయింట్ పీటర్స్ బర్గ్ వరల్డ్ ట్రావెల్ అవార్డును గెలుచుకుంది. ఈ రష్యన్ పోర్ట్ నగరం గత సంవత్సరం కూడా ప్రపంచ రికార్డును సాధిచింది. నేవా నది ఒడ్డుపై, ఫిన్లాండ్ బాల్టిక్ సముద్రం ఒడ్డున ఉన్న సెయింట్ పీటర్స్ బర్గ్ ను 1703 లో పీటర్ ది గ్రేట్ నిర్మించాడు. యూరప్ లోనే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా సెయింట్ పీటర్స్ బర్గ్ వరుసగా రెండోసారి అవార్డును సంపాదించినట్లు వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. 2016 లో సుమారు పది లక్షలమంది యాత్రికులు, టూరిస్ట్ ఎక్స్ పర్ట్ లు సెయింట్ పీటర్స్ బర్గ్ ను బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ఓటు వేసి ఎన్నుకున్నారు. పీటర్స్ బర్గ్ ప్రముఖ సందర్శనా స్థలంగా ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందడానికి యాత్రికులకు ఇక్కడ కల్పించే మౌలిక సదుపాయాలు, భద్రత, హోటల్స్ కారణమని గ్జిన్హువా న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది. మొట్టమొదటిసారి వరల్డ్ ట్రావెల్ అవార్డును 1993 లో ప్రారంభించగా 2015 నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ ను భారీగా విదేశీ యాత్రికులు సందర్శిస్తుండటంతో వరుసగా రెండోసారి కూడా ఈ నగరం ట్రావెల్ అవార్డును కైవసం చేసుకుంది.