ముక్కోటి  దేవతలకు ఆహ్వానమే  | Srivari dwajarohanam special | Sakshi
Sakshi News home page

ముక్కోటి  దేవతలకు ఆహ్వానమే 

Published Sun, Oct 7 2018 1:13 AM | Last Updated on Sun, Oct 7 2018 1:13 AM

Srivari dwajarohanam special - Sakshi

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు... తిరుమల సప్తగిరులపై వెలసి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న  కలియుగ దైవం వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే ధ్వజారోహణ ప్రక్రియ పవిత్రమైనది, విశిష్టమైనది, విశేషమైనది. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉత్సవ ఆరంభంలో అంకురార్పణ జరుగుతుంది. ఆ మరుసటిరోజున సాయంకాల శుభ ముహూర్తాన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణ వైభవాన్ని శ్రీవైఖానస భగవత్‌ శాస్త్ర పురాణాలలో  విపులంగా వివరించారు.

ధ్వజారోహణం ఎందుకు చేస్తారంటే...
‘‘జయం కరోతి దేవానం ధ్వం సయిత్యా సురానా ధ్వం సనాశ్చ జయౖశ్చైవ «ధ్వజమిత్యభిధీయతే’’సకల దేవతలకు జయం కలిగించి అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలందరినీ ఆహ్వానించే నేపథ్యంలో కార్పాసం (నూలు)తో చేసి, 14, 15, 16 హస్తాల పొడవు, 3, 4, 5 జానల వెడల్పుతో లేదా  స్వామివారి పాదాలు, గర్భాలయ ద్వారానికి సమంగా 5, 3 హస్తాల వెడల్పుతో ఉండేటట్లు  ఒక వస్త్రాన్ని తీసుకుని నీటితో శుభ్రం చేస్తారు. ఈ వస్త్రంలో గరుత్మంతుడు ఆకాశానికి ఎగురుతున్నట్లు చిత్రిస్తారు. అనంతరం అగ్నిగుండం ముందు వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణ ఆచరిస్తారు.  అంగ హోమం చేసి పంచద్రవ్యం, క్షీరం, జలంతో ప్రోక్షణ చేసి గరుత్మంతుడున్న వస్త్రధ్వజాన్ని మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు. స్వామివారికి, అమ్మవార్లకు వస్త్రంపై లిఖించిన గరుత్మంతునికి కంకణధారణ గావించి గరుడ, విష్వక్సేన చక్రాలను అర్చిస్తారు. ఆ తరువాత డోలు వాద్యకారుని భేరీపూజతో భేరీ తాడనం చేయిస్తారు. స్వామివారిని ఉభయ దేవేరులతో నవసంధి బలిప్రకరణం కోసం ఉత్సవం చేసేందుకు తిరుచ్చిపై ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేన, చక్రసహితంగా గరుడ పటాన్ని ఊరేగింపునకు స్వామివారికి, అభిముఖంగా ఉండేలా ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆచార్యులు, రుత్వికులు  బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక పాత్రలో బలిని(అన్నమును) సంగ్రహించి స్వామివారి గర్భాలయం మొదలుకొని మొదటి సంపంగి ప్రాకరణం, రెండవ ప్రాకరణలలో బలిహరణ గావిస్తారు.మహా ద్వారం నుండి బయటకు వచ్చి ప్రాకరణములలో ఉన్న బ్రహ్మాది అష్ట దిక్పాలకులను గద్య, పద్య, వాద్య, తాళ, గీతాలతో ఆవాహన గావించి బలిహరణ సమర్పిస్తారు. తర్వాత కొలతలు ధ్వజస్తంభానికి రెండింతలు ఉండేలా నూలు పగ్గాన్ని తీసుకుని వస్త్రంపై లిఖించిన గరుడ పటాన్ని స్వామివారి శేషమాలతో బంధిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి దగ్గరగా ధ్వజ పటాన్ని ఉంచుతారు. ముందుగా ధ్వజస్తంభాన్ని జయ, అత్యుచ్ఛ్రిత, ధన్య, ధ్వజ అనే నాలుగు నామాలతో ఆవాహన చేసి అర్చిస్తారు. తదనంతరం పటలిఖిత గరుత్మంతునిలో ‘గరుడ పక్షిరాజ సువర్ణపక్ష ఖగాధిప’ అనే నాలుగు నామాలతో మంత్రోచ్చారణ మధ్య అర్చిస్తారు. ముద్గాన్నం (కట్టె పొంగలి) నివేదన చేసి యజమానిచే సంకల్పం ఆచరించి ఆచార్యులు యాత్రాదానం స్వీకరిస్తారు. ఆ సుముహూర్తాన స్వామివారి బ్రహ్మోత్సవ సంబరాలకు ముక్కోటి దేవతలందరినీ ఆహ్వానించేందుకు జయజయధ్వానాలు, మంగళవాద్య, వేదఘోషలు పఠిస్తూ గరుత్మంతుని ధ్వజస్తంభం పైకి ఎగురవేస్తారు. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.

ధ్వజారోహణ దర్శనం  సంతానప్రాప్తికి మార్గం 
సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతాన యోగం కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమై తొమ్మిదవ రోజు చేపట్టే ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అనేక వాహనాల్లో స్వామివారు విహరిస్తూ భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో   చివరగా చక్రస్నానం ఆచరిస్తారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఎవరైతే వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని వీక్షిస్తారో వారికి పునర్జన్మ ఉండదని వైఖానస ఆగమ శాస్త్రాలలో  చెప్పబడింది.  ‘‘వైఖానసార్య దివ్యాజ్ఞావర్థతా మభివర్థతాం’’
– డాక్టర్‌ తూమాటి బ్రహ్మాచార్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement