
తిరుమల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు
తిరుమల: శ్రీవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి. జనవరి 1న రూ.7.68 కోట్లు కానుకల ద్వారా లభించినట్లు టీటీడీ తెలిపింది. జనవరి 1న భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం రాత్రి వరకు లెక్కించారు.
శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 5 నుంచి 6 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని చేపట్టారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
త్వరితగతిన శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నా నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్ స్లాట్ టికెట్లు పొందిన భక్తులకు త్వరితగతిన దర్శనం లభిస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని అన్ని సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, శ్రీవారిని మంగళవారం టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకుడు దేవినేని అవినాష్ దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment