మిలియనీర్ల గ్రామం! | story of ideal village of Hiware Bazar (Maharashtra) | Sakshi
Sakshi News home page

మిలియనీర్ల గ్రామం!

Published Sun, Sep 21 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

మిలియనీర్ల గ్రామం!

మిలియనీర్ల గ్రామం!

ఆదర్శం: కరవు తాండమాడిన చోట కనకపు పళ్లేలలో భోజనం చేస్తున్నారు. చెంబు నీరు దొరకని చోట స్విమ్మింగ్ ఫూల్స్ వెలిశాయి. ఆకలి ఏడుపులు వినిపించిన చోట విందులు దినచర్య అయిపోయాయి. ఇది ఒక ప్రైవేటు ప్రాజెక్టు కాదు, ప్రభుత్వ చొరవ కూడా కాదు... ఒక వ్యక్తి తలంపు, ఒక ఊరి అభివృద్ధి.
 
ఏ గ్రామానికి అయినా ఉనికి... నీరు, పాడి, పంట. ఈ మూడు లేకుంటే ఆ ఊరిలో తిండి దొరకదు. తొలుత జనం, ఆ తర్వాత ఊరు ఉనికిలేకుండా పోతాయి. ఇలాంటి పరిస్థితికి దగ్గరగా వెళ్లివచ్చిన గ్రామం హివ్రే బజార్(మహారాష్ట్ర). 1972లో తీవ్ర కరవు ఛాయలు మొదలైన ఆ ఊరు ఉపాధి లేక ఆకలికేకలతో అల్లాడింది. పంట లేదు, పని లేదు. జనంలో అసమానతలు భేదాభిప్రాయాలు పెరిగిపోయాయి. దొంగతనాలు, అల్లర్లు, మద్యపానం వంటివి పెచ్చరిల్లాయి. 1980ల చివరకు ఊరు దాదాపు ఖాళీ అయ్యింది. 90 శాతం మంది బతుకు తెరువును వెదుక్కుంటూ ఊరు వదిలేశారు. అప్పటికున్న ఊరి సర్పంచి వయసులో పెద్దాయన. పేరుకు సర్పంచి కానీ ఉపయోగం లేదు.
 
అలాంటి సమయంలో ఆ ఊరిలో పీజీ చదువుకున్న ఏకైక వ్యక్తి పొపట్రావు పవార్‌కు మిత్రులు అందరూ నువ్వు సర్పంచిగా పోటీ చేయమని సలహా ఇచ్చారు. చేతనైన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. పవార్‌కు ఆసక్తి లేదు. వాళ్లింట్లో వారికి ఇష్టం లేదు. నగరానికి పోయి ఉద్యోగం చేయాలని ఇంట్లోవాళ్లు, క్రికెటర్ కావాలని పవార్ ఆలోచించేవాడు. కానీ మిత్రులు నిరంతరం పోరే సరికి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. తనకిష్టం లేకున్నా పోటీ చేసి గెలిచాడు. కానీ గెలిచాక మాత్రం అదొక అద్భుతమైన అవకాశంగా అనిపించింది. పేదరికానికి నిలయమైన ఆ ఊరిలో 22 బెల్టుషాపులు, సారా దుకాణాలుండేవి. అసలు గొడవలన్నీ వాటివల్లే. వాటిని తొలగించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ర్టతో మాట్లాడి గ్రామంలో ఉపాధి కోసం స్వల్పకాలిక రుణాలు మంజూరుకు చర్చలు జరిపి విజయం సాధించాడు.
 
తీవ్ర కరవుతో అల్లాడిన ఆ గ్రామంలో పొపట్రావు మొదలుపెట్టిన మొదటి అభివృద్ధి పని వర్షపు నీటి యాజమాన్యం. ఊరి పొలిమేరలో కురిసిన ఒక్క చుక్క కూడా వృథా కాకుండా ఆ ఊరిలో ఎక్కడ పల్లముంటే అక్కడ వర్షపు నీటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించాడు. అలాంటివి 52 భారీ ఇంకుడు గుంతలు తవ్వించాడు. గుట్టల నుంచి వచ్చే నీరు వృథా కాకుండా రాతి గట్లు నిర్మించాడు. వర్షాకాలపు కాలువలు పారే చోట తొమ్మిది చెక్‌డ్యాములు కట్టించాడు. వీటికి అవసరమైన డబ్బును ప్రభుత్వం వెంటపడి మరీ  సంపాదించాడు సర్పంచ్ పొపట్రావు. ఇవన్నీ నిర్మించడం పూర్తయ్యాక ఏడాది కాలంలోనే సాగు పొలం 20 హెక్టార్ల నుంచి 70 హెక్టార్లకు పెరిగింది. నీటి నిల్వ కారణంగా భూగర్భజలాలు విపరీతంగా పెరగడంతో బోర్లలో నీరు పైకి వచ్చాయి. దానివల్ల అనేకరకాల పంటలు పెట్టే అవకాశం వచ్చింది. ఇపుడు 40 అడుగుల లోపే కావల్సినన్ని నీళ్లు. హివ్రే బజార్ ఇపుడు అహ్మద్‌నగర్ జిల్లాలోనే సస్యశ్యామలంగా ఉండే గ్రామం.
 
నీటితో పాటు సిరులు
90 శాతం స్థానికులు ఖాళీ అయిన హివ్రేబజార్‌లో నీళ్లు వచ్చాక వలసపోయిన జనం సొంతూరికి తిరిగి రావడం మొదలుపెట్టారు. 1995లో ఆ ఊరి తలసరి ఆదాయం 830 రూపాయలు. ఇపుడు అది 30,000 రూపాయలు. 1995లో ఆ ఊరిలో 170 పేద కుటుంబాలుంటే వాటిలో 165 కుటుంబాలు బీపీఎల్ కిందున్నవే. ఇపుడు 255 కుటుంబాలుంటే కేవలం 3 కుటుంబాలే పేదవి. మిగతా వారిలో 60 మంది మిలియనీర్లు. దేశంలో అత్యధిక  మిలియనీర్లున్న ఏకైక గ్రామమిది. జనాభా ప్రాతిపదికన అత్యధిక కార్లున్న గ్రామం కూడా ఇదే. దీనికంతటికీ కారణం ఆ గ్రామం చేసుకున్న వర్షపు నీటి నిర్వహణ.

ఆ ఊరిలో పడిన ప్రతి చుక్క వాననీరు భూమిలోకైనా ఇంకాలి, పొలంలో అయినా పారాలి. వరితో నీరు వృథా చేయకుండా మొక్కజొన్న, జొన్న, సజ్జలు, ఉల్లిగడ్డలు, పొటాటోలు వంటి వేర్వేరు పంటలు శాస్త్రీయంగా, తక్కువ మందులతో పండించారు. అలా సస్యశ్యామలమైన ఈ ఊరు ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటర్‌షెడ్ ఇన్‌స్టిట్యూషన్‌ను పెట్టింది. ఇలా ఆ ఊరిలో ప్రతిఒక్కరికి తమ స్థాయికి ఉపాధి, ఉద్యోగం లభించాయి. ఊరి నుంచి ప్రతిరోజు 4000 లీటర్ల పాలు ఎగుమతి చేస్తున్నారు. ఇలా క్రమం తప్పని వ్యవసాయం, ఉపాధి పనులతో మిలయనీర్లయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement