
చితకబాదండి తాగండి
ఎండలు మండిపోతున్నాయి. దాహంతో నోళ్లు పిడచకట్టుకపోతున్నాయి. కానీ వేడికి భయపడి ఇంట్లో కూర్చోగలమా? ఏ పనీ చేయకుండా ఉండిపోగలమా? వీల్లేదు కదా! అందుకే ఒక పని చేయండి. ఇక్కడ మేం మీకోసం ఇచ్చిన సమ్మర్ డ్రింక్స్‌ను సేవించండి. ఎండను చితకబాదేయండి!
రాగి-ఆల్మండ్ షేక్
కావలసినవి: రాగిపిండి - 4 చెంచాలు, పాలు - 1 కప్పు, బాదంపప్పు - అరకప్పు, చక్కెర - పావుకప్పు, లవంగాల పొడి - చిటికెడు
తయారీ: రాగిపిండిని అరకప్పు నీళ్లలో కలిపి స్టౌమీద పెట్టాలి. కొంచెం మరిగే వరకూ ఉంచి దించేయాలి. పాలను కాచి చల్లార్చాలి. బాదంపప్పును కాసేపు నీటిలో నానబెట్టి, తొక్క ఒలిచెయ్యాలి. ఇప్పుడు వీటన్నిటితో పాటు చక్కెరను కూడా కలిపి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. చివరగా గ్లాసుల్లో పోసి, లవంగాల పొడి చల్లి దించేయాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయ్యాక తరిగిన బాదం పప్పులను పైన చల్లి సర్వ్ చేయాలి.
కుకుంబర్ కూలర్
కావలసినవి: కీరా దోసకాయ - 1, నీళ్లు - ఒకటిన్నర కప్పు, చక్కెర - నాలుగైదు చెంచాలు, ఉప్పు - చిటికెడు, మిరియాల పొడి - అర చెంచా, పుదీనా రసం - అర చెంచా, ఐస్ క్యూబ్స్ - కాలసినన్ని
తయారీ: కీరా దోసకాయ చెక్కు తీసేసి, ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలు, చక్కెర, ఉప్పు, పుదీనా రసం, ఐస్‌క్యూబ్స్ కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. తర్వాత నీళ్లు పోసి మళ్లీ బ్లెండ్ చేయాలి. దీన్ని గ్లాసుల్లో పోసి నిమ్మరసం పిండాలి. చివరగా మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి.
వాటర్‌మెలన్ మార్గరీటా
కావలసినవి: పుచ్చకాయ ముక్కలు - 2 కప్పులు, నీళ్లు - 1 కప్పు, చక్కెర - పావుకప్పు, సోడా - 1 గ్లాసు, మిరియాల పొడి - 1 చెంచా, ఐస్ క్యూబ్స్ - కావలసినన్ని
తయారీ: పుచ్చకాయ ముక్కల్లో గింజలు లేకుండా చూసుకోవాలి. వీటిని చక్కెరతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. తర్వాత నీళ్లు, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి బాగా బ్లెండ్ చేయాలి. తర్వాత గ్లాసుల్లో సగం వరకూ పోయాలి. మిగతా సగం సోడా వేసి సర్వ్ చేయాలి. ఇష్టం ఉంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు.
కోకోనట్ కూలర్
కావలసినవి: కొబ్బరిపాలు - 1 గ్లాసు, నీళ్లు - 1 గ్లాసు, చక్కెర - పావుకప్పు, పైనాపిల్ ముక్కలు - పావుకప్పు, దాల్చినచెక్క పొడి - చిటికెడు, ఐస్‌క్యూబ్స్ - కావలసినన్ని
తయారీ: కొబ్బరిపాలు, నీళ్లు, చక్కెర మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి. పైనాపిల్ ముక్కలను ఓ గిన్నెలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. బాగా ఉడికిపోయి నీళ్లు రంగు మారిపోయిన తర్వాత ముక్కల్ని తీసి పారేయాలి. మిగిలిన నీటిని చిక్కగా అయ్యేవరకూ మరిగించాలి. తర్వాత దించి చల్లార్చాలి. ఈ జ్యూస్‌ని కొబ్బరిపాల మిశ్రమంలో కలిపి, ఐస్‌ముక్కలు కూడా వేసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. చివరగా దాల్చినచెక్క పొడి కలిపి సర్వ్ చేయాలి. సర్వ్ చేసేటప్పుడు బాగా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, పైనాపిల్ ముక్కలు కూడా వేస్తే బాగుంటుంది.
క్యారెట్ డిలైట్
కావలసినవి: క్యారెట్లు - 2, పాలు - 1 కప్పు, నీళ్లు - అరకప్పు, చక్కెర - 4 చెంచాలు, క్రీమ్ - 2 చెంచాలు
తయారీ: క్యారెట్ల పై చెక్కు తీసేయాలి. తర్వాత ముక్కలుగా కోసి, నీళ్లతో కలిపి బ్లెండ్ చేయాలి. మెత్తగా అయ్యిన తర్వాత చక్కెర, పాలు కూడా వేసి బాగా మిక్సీ పట్టాలి. తర్వాత తీసి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. చల్లగా అయ్యిన తర్వాత క్రీమ్‌ను కలిపి, గ్లాసుల్లో పోసి సర్వ్ చేయాలి.
స్పైసీ లస్సీ
కావలసినవి: మజ్జిగ - 2 గ్లాసులు, సన్నగా తరిగిన పుదీనా - 2 చెంచాలు, సన్నగా తరిగిన కరివేపాకు - 1 చెంచా, సన్నగా తరిగిన కొత్తిమీర - 1 చెంచా, లవంగాల పొడి - చిటికెడు, మిరియాల పొడి - చిటికెడు, దాల్చినచెక్క పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత
తయారీ: ఓ గిన్నెలో మజ్జిగ, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. దీన్ని ఓసారి మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి. తర్వాత లవంగాల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. ఆపైన ఫ్రిజ్‌లో పెట్టి, చివరగా గ్లాసుల్లో పోసి, పైన పుదీనా ఆకులు వేసి సర్వ్ చేయాలి.
షికంజీ
కావలసినవి: నీళ్లు - 2 కప్పులు, నిమ్మరసం - 2 చెంచాలు, చక్కెర - 3 చెంచాలు, జీలకర్ర పొడి - 1 చెంచా, నల్ల ఉప్పు - అర చెంచా, మిరియాల పొడి - చిటికెడు, ఐస్‌క్యూబ్స్ - కావలసినన్ని, పుదీనా ఆకులు - కొద్దిగా
తయారీ: ఓ బౌల్‌లో నీళ్లు తీసుకుని, అందులో నిమ్మరసం, చక్కెర, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిపోయేంత వరకూ కలపాలి. తర్వాత ఐస్‌క్యూబ్స్‌తో పాటు మిక్సీలో వేసి ఓసారి బ్లెండ్ చేయాలి. తర్వాత గ్లాసుల్లో పోసి, పుదీనా వేసి సర్వ్ చేయాలి.
సబ్జా లెమనేడ్
కావలసినవి: సబ్జా గింజలు - పావుకప్పు, నీళ్లు - 1 గ్లాసు, చక్కెర - 4 చెంచాలు, నిమ్మకాయ - 1, మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత
తయారీ: ముందుగా ఓ గిన్నెలో నీళ్లు, సబ్జా గింజలు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతుండగా చక్కెర వేయాలి. గింజలు ఉడికిపోయి, ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాక దించేసి చల్లారబెట్టాలి. దీనిలో నిమ్మరసం పిండి, మిరియాల పొడి, ఉప్పు చల్లి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తర్వాత సర్వ్ చేయాలి.